Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 13


    "ఊరుకోక____వాళ్ళ గురించి మన ఉనికినీ, జీవితాన్ని  పాడుచేసుకోవటం అంతకన్నా సబబుకాదు. పిల్లలగురించి అనుక్షణం పట్టించుకుంటూ వుంటే వాళ్ళు చెడిపోరన్న నమ్మకమేదయినా వున్నదా? తమ పిల్లలకేమీ తెలియదని అనుకునే ఎంతోమంది తల్లిదండ్రుల పిల్లలు ఎలాంటి అనుభవాలు కలిగి వుంటారో, వాళ్ళెంత దారుణంగా ఆలోచిస్తూ వుంటారో నాకు తెలుసు."
    "అయితే డిసిప్లిన్ అనేమాటకు అర్ధంలేదా?"
    "ఉంది. అది మొదట్నుంచీ ఓ పద్దతిలో వుండాలి. అతి ప్రేమలనుంచీ, మితిమీరిన గారాబాలనుంచీ అది పుట్టుకురాదు. ఆ డిసిప్లిన్ అనేది చెయ్యి జారిపోయినప్పుడు దాన్ని గురించి వున్మాదంగా ఆరాటపడటం నష్టాలని కొనితెచ్చుకోవటమే. అయినా పరిస్థితులని బట్టి కొన్ని కొన్నిటిని స్వల్పమైన వాటిగా భావించి వొదిలెయ్యటం మంచిది."
    "ఇది నేను స్వల్పమైనదిగా భావించటం లేదు."
    మూర్తి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా సిగరెట్టు  రాలుస్తూకూర్చున్నాడు.
    "అయితే నన్నేం చెయ్యమంటావు?" అన్నాడు రాఘవ చివరకు పిరికిగా.
    "దానివల్ల కలిగే నష్టాలు మంచిగా చెప్పి చూడు. వినకపోతే ఒకటికి రెండుసార్లు చెప్పు. అప్పటికీ వినకపోతే దాన్ని గురించి మనసు పాడుచేసుకోకు. ఇహ వాడ్ని ఆపటం కష్టమని అర్ధంచేసుకో."
    "సరే" నంటూ రాఘవ లేచి వెళ్ళిపోయాడు, కాని అతను స్నేహితుడు చెప్పినట్లు నిగ్రహం ప్రదర్శించలేకపోయాడు. ఇంటికి వెళ్ళగానే కొడుకు కంటపడేసరికి కోపం పెల్లుబికింది.
    "ఒరేయ్! యిటురారా" అని అరిచాడు.
    అతని కేకకు పిల్లలే గాక లక్ష్మి కూడా అదిరిపడింది.
    కొడుకు ముందుకు వచ్చి నిల్చున్నాడు.
    "నువ్వు.... నువ్వు.... సిగరెట్టు కాల్చావా లేదా?"
    రామం మాట్లాడ లేదు.
    "జవాబు చెప్పవేం?"
    రామం గుడ్లప్పగించి చూడటం మినహా జవాబేం చెప్పలేదు.
    "మాట్లాడవేం రా?"
    అప్పటికీ జవాబు లేదు.
    రాఘవకు కోపం, బాధ, ఉక్రోషం, ఆవేశం ఒక్క సారిగా ముప్పిరిగొనగా వళ్ళు మరిచిపోయాడు. ఉద్రేకంతో బెల్టు తీసుకుని కొడుకుని చావచితకకొట్టాడు.
    "అమ్మో! నా కొడుకుని చంపేస్తున్నాడమ్మో" అంటూ లక్ష్మి  బావురుమని మొగుడ్ని ప్రక్కకి తోసేసి రామాన్ని వాటేసుకుంది.
    పిల్లలు చుట్టూచేరి గొల్లుమంటున్నారు.
    ఆ సంఘటన అంతటితో ఆగలేదు. ఆ సాయంత్రం బయటకు వెళ్ళిన రామం యింటికి రాలేదు.
    ఆఫీసు నుంచి రాఘవ యింటికి వచ్చేసరికి లక్ష్మి ఒక ప్రక్క దీర్ఘాలు తీసి ఏడుస్తూనే మరోప్రక్క నుండి అతని మీదకి రయ్యిమని లేచింది.
    "మీరు వాడిని చిత్రవధ చేశారు. నానాహింసా పెట్టి చంపేశారు. ఈ భీభత్సం భరించలేక వాడు ఏనుయ్యో గొయ్యో చూసుకున్నాడు. ఇంతవరకూ యింటికి రాలేదు. వాడిని పొట్టన పెట్టుకున్నారు బాబోయ్. నిష్కారణంగా చంపేశారు."
    రాఘవకు మతిపోయినట్లయింది. తనేనా తన కొడుకుని అలా చావబాదింది? చేతులవంక చూసుకున్నాడు తాను మనిషా? రాక్షసుడా?    
    గబగబ వెతకటానికి  వెళ్ళాడు. వాడి స్నేహితులందరి యిళ్ళకూ వెళ్ళాడు. సందులూ గొందులన్నీ గాలించాడు. పిచ్చేత్తిన వాడిలా తిరిగాడు ఎక్కడా కనబడలేదు. తల బాదుకుంటూ యింటికొచ్చి ఏడుపులూ, పెడబొబ్బలూ సాగించాడు.
    రెండురోజులయినా కొడుకు జాడలేదు. ఇంటిలో అతని దుఃఖంతో బాటు భార్య విజ్రుంభణ తట్టుకోవటం కష్టంగా వుంది.
    విషయం తెలిసిమూర్తి అతన్ని చూడటానికి వెళ్ళాడు రాఘవ నెలమీదపడి రాగాలు తీస్తున్నాడు. మూర్తిని చూసి అతన్ని పట్టుకుని ఏడ్చాడు.
    "వాడెక్కడ వున్నాడో ఏం తిప్పలు పడుతున్నాడో మూర్తీ. ఒక్క పావుగంట లేటయితే ఆకలికి వుండలేకపోయేవాడు. జేబులో చిల్లిగవ్వ లేకుండా వెళ్ళాడు. ఏం తింటున్నాడో ఏమో ఎంత వేసవిలోనయినా సరే దుప్పటి కప్పుకోకుండా పడుకోవటం వాడికి అలవాటులేదు. ఏకటికనేల మీద ఎట్లా పడుకుంటున్నాడో.
    మూర్తి తనకు చేతనయిన భాషలో అతన్ని ఓదార్చాడు.
    ఇంకో రెండు రోజులు చూసి ఇహ వుండలేక రాఘవ వందలు ధారపోసి దినపత్రిక లన్నిట్లోనూ ప్రకటన వేయించాడు.
    "బాబూ రామం! నువ్వు వెళ్ళిపోయిన దగ్గర్నుంచి మీ అమ్మా, నేనూ, అన్నం, నీళ్ళు లేకుండా దిగులుతో కృంగిపోతున్నాం. ముఖ్యంగా మీఅమ్మ దిగులుతో మంచాన పడింది. నువ్వు ఎక్కడవున్నా వెంటనే తిరిగిరా, నిన్ను ఏమీ అనము. ఇహముందు కూడా ఏమీ అనము వెంటనే యింటికిరా!
    
                                                                                      ఇట్లు
                                                                     నీ రాకకై ఎదురుచూసే నీ తల్లిదండ్రులు.


    మూడోనాటికల్లా రామం ఊడిపడ్డాడు.
    రాగానే రాఘవ వాడ్ని వాటేసుకుని బావురుమని ఏడ్చాడు. ఈ ప్రపంచాన్ని శాపనార్ధాలు పెడుతూ తల్లి అతన్ని దగ్గరకు తీసుకుని మరికదలనివ్వలేదు. వాళ్ళిద్దరి మధ్యా ఓ వీరుడిలా, హీరోలా ఫోజుపెడుతూ కుర్రాడు నిలబడ్డాడు.
    కొడుకు తిరిగి వచ్చాడని చాటంత ముఖం చేసుకుని చెప్పటానికి వచ్చినప్పుడు మూర్తి అతని ముఖంలోకి రెండు నిమిషాలపాటు పరీక్షగా చూసి తన సంతోషంకూడా ప్రకటించాడు. ఏమీ వ్యాఖ్యానం చేయలేదు.
    
                                      * * *
    
    రాఘవ, లక్ష్మి మూర్తి యింటికి వచ్చారు. ఇద్దరి ముఖాలూ కళకళలాడుతున్నాయి లక్ష్మి చేతిలో వెండి కుంకుమ భరిణెవుంది.
    "రండి. రండి" అంది వసంత సాదరంగా.
    ఆదివారం కావటంవల్ల ఆ సమయానికి మూర్తి యింట్లోనే వున్నాడు. "ఏమిటి విశేషం" అన్నాడు వాళ్ళవాలకం చూసి సోఫాల్లో కూర్చున్నాక.
    "మా అమ్మాయి పుష్పవతి అయింది" అన్నాడు రాఘవ. ఈ మాటలు ముందుగా లక్ష్మి అనలేదు. అతని నోటిలోంచే వచ్చాయి.
    మూర్తి, వసంత ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు.
    "రేపు పేరంటం, భోజనాలు, మీరిద్ద్దరూ తప్పకుండా రావాలి" అంటూ లక్ష్మి ఆమెకు బొట్టుపెట్టింది.
    మూర్తికి తమాయించు కుందామన్నా ఒక్కోసారి నోరు వూరుకోదు, "ఇది చాలా ప్రకృతి సహజమైన విషయం దీనికి పేరంటం, భోజనాలు- యీ ఆర్భాటమంతా దేనికి? అసలు ఇలాంటి విషయాల వల్ల నా అభ్యంతరం చాలావుంది..." అని ఇంకేదో అనబోతున్నాడు.

 Previous Page Next Page