అలాంటి సంఘటనలు మరెన్నో జరగడం వల్ల, వయసుకి మించిన గాంభీర్యం చోటు చేసుకుంది అతనిలో. కళ్ళలో అమాయకత్వానికి బదులు కాఠిన్యం కనబడుతుంది.
సీత ఆ కుర్రడ్నే ఆసక్తిగా చూడడం గమనించి చెప్పాడు వార్డెన్. ఆ కుర్రాడి పేరు సారధి. చాకులాంటి వాడు. చదువులో ఫస్టు. క్లాసులో ఫస్టు.
తల పంకించింది సీత.
అ రోజు ఫంక్షన్ ముగిసేలోగా ఆమెకి ఒక బ్రహ్మాండమైన పబ్లిసిటి స్టంటు తట్టింది. 'ప్రెస్' అని అట్ట తగిలించి వున్న వైపు ఒకసారి చూసి ఇద్దరు విలేఖరులు ఉన్నారని నిశ్చయం చేసుకుని లేచి నిలబడి ఒక ప్రకటన చేసింది.
"మన బాలల తాత బాపూజీ , చాచా నెహ్రు లలాగే నాకు పిల్లలంటే పంచప్రాణాలు! ఈ చిట్టి చిట్టి తల్లులను, చిన్ని చిన్ని తండ్రులను చూస్తూ ఉంటె నా మనసు పులకించి పరవళ్ళు తొక్కుతోంది. ఈ సందర్భంలో ఒక వాగ్ధానం చేస్తున్నాను. చురుకైన కుర్రవాడూ, అనాధ బాలుడూ అయిన ఈ సారధికి చదువు సంధ్యలు చెప్పించి, ఆదర్శ భావి భారత పౌరుడిగా రుపొందిస్తానని శపథం చేస్తున్నాను. అతను ఏం చదువుకుంటానంటే, ఎంతవరకూ చదువుకుంటానంటే అంతవరకూ చెప్పిస్తాను" అంది!
హాలు కులేలా చప్పట్లు మోగాయి.
సీతకి తెలుసు. ఇతన్ని పోషించడానికి తమకి అయ్యే ఖర్చు వల్ల తరగబోయే డబ్బు కంటే పెరగబోయే ప్రతిష్టే ఎక్కువని, దోపిడీ దొంగలని, గుండాలని తమకి అంటుకున్న జీడి మరకని తుడిచేసుకోవాలంటే అప్పుడప్పుడు ఇలాంటి చిల్లర ఖర్చులు తప్పవు.
వ్యాపారాల్లో రకరకాల పాపాలు చేస్తూ , ప్రజలకి క్షౌరకల్యాణం చేసేవాళ్ళు, ప్రతి సంవత్సరం రాముడికో, మరో దేముడికో కల్యాణం చేయించడం లాంటిదే ఇది!
ఒక పేదవాడు జానెడు స్థలంలో బెత్తెడు గూడు కట్టుకుంటానంటే సిమెంటు దగ్గర నుంచి స్టీలు దాకా ఏది దొరకనివ్వకుండా అన్ని తామే దొరకబుచ్చుకుని, బ్లాకులో అమ్మి డబ్బు పాతరేసి, ఆ డబ్బుతో దేముడికి గుడి కట్టించే దొరల పద్దతి లాంటిదే ఇది!
సారధిని నాటకియంగా దగ్గరకు తీసుకుని తల నిమిరింది సీత. "పెద్దయ్యాక ఏం చదువు కుంటావు బాబూ!" అంది విలేఖర్ల వైపు ఓరగా చూస్తూ.
"లా! అన్నాడు సారధి తలపటయించకుండా.
తను లా ఎందుకు చదసుకోవాలనుకుంటున్నాడో సారదకి బాగా తెలుసు. తను చదివిన మేరియో పూజో 'గాడ్ ఫాదర్ పేపర్స్' లోని ఒక వాక్యంలో గల అక్షరాలు శిలాక్షరాలలా అతని మనసులో నిలిచిపోయాయి. అంత చిన్న వయసులోనే పెద్ద పెద్ద నవలలను ఔపోసన పట్టేయ్యడం మొదలెట్టాడు అతను.
"చేతిలో తుపాకులు పట్టుకున్న వందమంది మనుషుల కంటే, చేతిలో బ్రీఫ్ కేసు పట్టుకున్న ఒక లాయరు ఎక్కువ డబ్బు దొంలించగలడు.
ఆ విధంగా సారధి చదువు ఒక దారిలో పడింది. అతను ప్రతి సంవత్సరం డిస్టింక్షనులో పాసయ్యాడు. ఎల్. ఎల్. బి. లో అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది.
గోల్డు మేడలు వచ్చినా, మొదట్లో గోళ్ళు గిల్లుకుంటూ కుర్చోక తప్పదు చాలామంది లాయర్లకు. అందుకే ప్రాక్టిసు బాగా వున్న వాళ్ళ దగ్గర జునియర్లుగా చేరతారు.
కానీ, సారధికి ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. రత్నాకరరావు ఏలుతున్న నేర సామ్రాజ్యంలో రోజు ఎక్కడో ఏదో గొడవ అవుతూనే ఉంటుంది. కోర్టు పని తగులుతూనే ఉంటుంది. అతని తాలుకు వాళ్ళ నెవరినైనా తప్పనిసరి పరిస్థితులలో పోలీసులు అరెస్టు చేస్తే బెయిల్ మీద విడిపించడం, క్రిమినల్ కేసులో వాయిదాలు పడుతూ ఉండడం, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మొదట్లో సారదే చేస్తూ ఉండేవాడు.
క్రమక్రమంగా చిన్న కోర్టులనుంచి పెద్ద కోర్టుకి ఎగబ్రాకాడు సారధి. అతను కేసు టేకప్ చేశాడంటే , ఎదుటి పక్షం లాయర్లు జన్కేవాళ్ళు అల్పమైన లీగల్ పాయింట్స్ గురించి అతనెప్పుడు ఆలోచించడు. కొండ ఎలుకలాగా చట్టం పునాదులనే దోలుచుకుంటూ వెళ్ళిపోయి, లొసుగులు తవ్వి తీసి చట్టానికే ఎసరు పెట్టి అది చెల్లదని వాదించగల మొనగాడని పేరు తెచ్చుకున్నాడు.
అతన్ని చూస్తే చాలా మురిపెం రత్నాకరరావుకి తన భార్య తెలివి తేటల మీద కూడా అంతే నమ్మకం ఉంది అతనికి.
అతని క్రైం సామ్రాజ్యాన్ని వాళ్ళిద్దరూ రెండు కళ్ళయి కనిపెట్టి ఉంటారు. రెండు కాళ్ళయి నడిపిస్తారు. రెండు చేతులయి , రెండు చేతులా సంపాదించి పెడుతూ ఉంటారు.
రత్నాకరరావుకి అంతరంగికుడు సారధి. ఎవరితో చెప్పుకోలేని విషస దృశ్యమైన విషయాలు కూడా సారధితో చెబుతుంటాడు అతను. దిక్కు, మొక్కూ లేకుండా పిచ్చి మొక్కలా పెరుగుతున్న తనకి ఆధారం చూపించి, సొసైటీలో గౌరవప్రదమైన స్థానం కలిపించిన సీత అన్నా, రత్నాకరరావు అన్నా సారధికి చెప్పలేనంత కృతజ్ఞత ఉంది- వాళ్ళిద్దరి బలహీనతలు దుర్గుణలూ తెలిసినా కూడా!
రాక్షసుల పెంపకంలో పెరిగినట్లు పెరిగాడు సారధి. స్వతహాగా అతనికి ఉన్న తెలివితేటలూ గాడి తప్పి ఈవిల్ జీనియస్ లా దుష్టశక్తిలా తయారయ్యాడు.
రత్నాకరరావుకి సంబంధించిన కేసులు తప్ప మరొకటి తీసుకోడు అతను. అన్ని కేసులు గెలిపించినా, అతను రత్నాకరరావుని ఒక్కసారి కూడా ఫీజు కావాలని, కనీసం జీతం కావాలని అడగలేదు. అతని అవసరాలన్నీ రాత్నాకరరావే కనిపెట్టి తీరుస్తుంటాడు.
తను పడ్డ శ్రమకి, పడబోయే శ్రమకి కలిపి ఒకేసారి భారీ ఎత్తున ఫీజు అడిగి తీసుకోవాలని ఉంది సారధికి.
అ ఫీజే సుదీర!
అది ఉత్త పగటికల అని తెలుసు అతనికి. ఆ సంగతి ఇవాళ ఋజువయిపోయింది.
సుదీర భరత్ ని చేసుకుంటుందా?
అతని గుండె అసూయతో దహించుకుపోయింది. శిక్షణ పొందిన అతని లీగల్ బ్రెయిను, "దీనికి పై ఎత్తు ఏమిటా' అని ఆలోచించడం మొదలెట్టింది.
-------------
"వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కారులో వస్తారే! అసలు మీకు ఎన్ని కార్లు ఉన్నాయేం?" అంది భారతి ఆశ్చర్యంగా.
నవ్వింది సుదీర "ఏడు"
"మరి కుక్కలో?"
"అవి ఏడే!" అంది సుదీర. ఈ సారీ ఆమెతో బాటు "జోజో' అనే గ్రేహవుండ్ కుక్క వచ్చింది.
"ఈ కుక్కేమిటి ఇలా వుంది? మీరు మొన్న తీసుకొచ్చిన దానంత బాగా లేదు. మరి ఉరకుక్కలా వుందే!"
నవ్వొచ్చింది సుదీరకి. "చూడటానికి అలా ఉంటుంది గానీ, మంచి జాతి కుక్క అది" అని ఇంట్లోకి చూస్తూ, "మీ అన్నయ్య ఉన్నారా?" అంది. ఎప్పుడెప్పుడు భరత్ లో ఈ శుభవార్త చెబుదామా అని ఉంది తనకు.
"అన్నయ్య లేడు. ఇప్పుడే గుడికి వెళ్ళాడు."
చెప్పలేనంత నిరాశ కలిగింది సుదీరకి. "ఏ గుడి?"
"ఈ వీధిలోనే......శివాలయం!"
"త్వరగా వచ్చేస్తారా?"
"ఉహు! గంట దాటుతుంది. శివాష్టకం, అవి అన్ని పూర్తిచేసి గానీ రాడు."
"అర్జెంటుగా ఆయనతో మాట్లాడాలె! ఎలాగ?"
"ఏమిటి.....ఏదన్నా ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నారా?"
"ఆ! చాలా పెద్ద ప్రోగ్రామే!" అంది సుదీర, చిరునవ్వు పెదిమల కింద తొక్కి పెడుతూ.
"అయితే, మనమే వెళదాం గుడికి, పదండి."
ఇబ్బందిగా మొహం పెట్టింది సుదీర. "మీకు శ్రమ ఎందుకు? నేను వెళ్ళి మాట్లాడి, అటునుంచి ఆటే ఇంటికి వెళ్ళిపోతాను."
"శ్రమేముంది........వస్తాలెండి!" అని కదిలింది భారతి.
ఆదుర్దాగా చూసింది సుదీర. 'వద్దొద్దు! ప్లీజ్! నేను వెళ్ళగలను"
ఒక్క క్షణం సేపు సుదీర మొహంలోకి చిత్రంగా చూసి, "అలాగే!" అని ఆగిపోయింది భారతి. కొన్ని విషయాలు నోటితో చెప్పకుండానే అర్ధమయిపోతాయి. మరి అంత అర్ధం చేసుకోలేని చిన్న పిల్లెం కాదు భారతి. తనకి పద్దెనిమిదేళ్ళ కన్నెమనసు ఉంది.
"వెళ్ళొస్తానండి!" అంది సుదీర సదాశివరావుగారితో. అయన చెట్టుకింద పడక కుర్చీలో ఒక రైటింగ్ ప్లాంక్ పెట్టుకుని, ఎడమచేత్తో నిదానంగా రాసుకుంటున్నారు. కుడి చెయ్యి బలహీనంగా, స్పర్శజ్ఞానం లేకుండా వేలాడుతోంది.
కారు ఎక్కి మెల్లిగా డ్రయివ్ చేస్తూ శివాలయం ముందు ఆపింది సుదీర. కుక్కని కారు లోపలే ఉంచి, డోర్ లాక్ చేసింది.
అది మరి పాడుపడిపోయిన గుడిలాగా ఉంది. గోడలకి సున్నం వేసి చాలా రోజులు అయి వుండాలి. అక్కడక్కడ నాచు పెరిగి ఉంది. గుళ్ళో అసలు జనమే లేరు. భరత్ ఒక్కడే శివాష్టకం జపిస్తూ నిలబడి ఉన్నాడు.
అది పూర్తి అయ్యేదాకా అతని పక్కనే నిశ్శబ్దంగా నిలబడింది సుదీర.
తన పక్కన మరో వ్యక్తీ నిలబడి ఉండడం కాసేపటి తరువాత గమనించి తల తిప్పి చూశాడు అతను.
"ఓ! మీరా?"
"మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను."