Previous Page Next Page 
భామ కలాపం పేజి 14


    "ఒక్క నిమిషం!" అంటూ అతను విభూతి చేతిలోకి తీసుకుని కొంత మెడకు రాసుకుని, కొంత నోట్లో వేసుకుంటూ వచ్చాడు.

 

    గుడిలో ఒక వైపు పారిజాతం మొక్కలూ, కొంత మేర దట్టంగా పెరిగిన రకరకాల చెట్లూ ఉన్నాయి.


    "ఇక్కడ కూర్చుందాం కాసేపు" అంది సుదీర.

 

    కర్చీఫ్ తో అక్కడ దులిపి, శుభ్రం చేశాడు భరత్.


    కూర్చున్నారు.

 

    "మా సిల్వర్ మీ చిలక సుదీరని చంపెసినందుకు చాలా ఫీలయ్యాను."

 

    అతను నిర్లిప్తంగా చూశాడు. 'పోన్లెండి.......పోయిన సుదీర ఇంక తిరిగి రాదు కదా!"

 

    "మీరు కావాలనుకుంటే సుదీర మీ దగ్గరకు వచ్చేస్తుంది."

 

    అతను అర్ధం కానట్లు తికమకగా చూశాడు. "అదెలా సాధ్యం?"

 

    "ఎలానా? ఈ సుదీర మిమ్మల్ని పెళ్ళి చేసేసుకుంటుంది."

 

    ఆ మాట వినబడగానే అతని మొహంలో కనబడ్డ భావాన్ని రికార్డు చేసుకుని, బతికినన్నాళ్ళు చూసుకోవడానికి వీలుగా విడియో కెమెరా వెంట తెచ్చుకోనందుకు తనని తానె తిట్టుకుంది సుదీర.


    భరత్ కొద్దిగా నోరు తెరిచి ఆశ్చర్యం, ఆమె తనని అట పట్టిస్తోందేమోనన్న అనుమానం, అపనమ్మకం అన్ని కలసిన చూపు చూశాడు.

 

    "కొన్ని అరబ్ కంట్రీస్ లో అంతే భరత్! రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం నష్టపరిహారంగా ఇచ్చుకోవాలన్న న్యాయం వుంది. నావల్ల మీ సుదీర పోయింది కాబట్టి, ఈ సుదీరని సొంతం చేసుకోవడం మీ హక్కు! అవునా?" అంది చిరునవ్వుతో.

 

    అతను కంగారుపడ్డాడు. "నేను..నేను మిమ్మల్ని నష్టపరిహారం ఇవ్వమని అడగలేదే! అది చనిపోవాలని రాసిపెట్టి ఉంది. చనిపోయింది అంతే! జరగవలసినది జరిగి తీరుతుంది కదా!"


    "నిజమే! అలాగే మీరు నా భర్త కావాలని రాసిపెట్టి ఉంటె అది జరిగి తీరవలసిందే కదా?"


    ఏదో అనబోయి మానేశాడు భరత్. తర్వాత చాలా సేపటికి కష్టం మీద నోరు తెరచి, "ఏమిటి?" అన్నాడు.


    "నన్ను పెళ్ళి చేసుకోవడం మీకు ఇష్టమేనా? కదా? ఒక్క మాటలో చెప్పండి!"

 

    "నేను............"

 

    "చెప్పండి"

 

    "మీరు చాలా అసహజంగా మాట్లాడుతున్నారు."

 

    "వయసొచ్చిన ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్ళి సంగతి మాట్లాడుకోవడం అంత అసహజమా?"

 

    "మీకు, నాకూ ఎ విషయంలోను పోలిక లేదు. మనిద్దరం పూర్తిగా వ్యతిరేకం.........."


    "వెల్!" అని నవ్వింది సుదీర. "మీరు అచ్చం నాలాగే ఉంటె మిమ్మల్ని పెళ్ళి చేసుకోమని అడిగేదాన్నే కాదు. మీరూ నాలాగే సన్నగా, నాజుగ్గా ఉండి, చీర కట్టుకుని జాకెట్టు తొడుక్కునే ఆడపిల్ల అయితే అసలు మిమ్మల్ని ఎందుకు పెళ్ళి చేసుకుంటాను? మనిద్దరం పూర్తిగా వ్యతిరేకం. మీరు ఒక మగాడు. నేనొక ఆడపిల్లని. వ్యతిరేక ద్రువాలు ఆకర్షించబడతాయని మీరు విన్లేదా?"


    ఒక గుటక మింగాడు భరత్. "అసలు నన్ను పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు?"

 

    "బాడి కేమిస్త్రి అనుకుంటాను. మిమ్మల్ని చూడగానే, మీపేరు తలుచుకోగానే నా శరీరంలో రసాయనికమైన మార్పు ఏదన్నా వస్తుందేమో! గుండెలు గబగబ కొట్టుకుంటున్నాయి. మెడ మీద సన్నటి నూగులా ఉన్న వెంట్రుకలు లేచి నిలబడతాయి."


    "అది ఆకర్షణ అవుతుంది. ప్రేమ కాదు. ఆకర్షణ త్వరలో తొలిగిపోవచ్చు."

 

    "పోవచ్చేమో! ఎప్పుడో ఒకప్పుడు చినిగిపోక తప్పదని తెలిసి బట్టలేసుకోవడం మానేస్తున్నామా? ఎప్పటికో ఒకప్పటికి చావడం తప్పదని తెలిసి బతకడం మానేస్తున్నామా? అలాగే ఇదీను!"

 

    "కాని........."

 

    "మీరు ఇంకెవరన్నా అమ్మాయిని పెళ్ళి చేసుకోదలుచుకున్నారా?"


    "లేదు.....లేదు."

 

    "ఒకవేళ చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని చేసుకుంటారు?"


    "ఆ విషయం అసలు అలోచించనేలేదు."

 

    "పోనీ నాలాంటి అమ్మాయిని చేసుకోకూడదని పట్టింపు ఏదన్నా ఉందా?"

 

    కొంచెం తడబడి, "లేదు" అన్నాడు.

 

    "దెన్? నన్ను పెళ్ళి చేసుకోకపోవడానికి ఒక్కటంటే ఒక్క అభ్యంతరం చెప్పండి. జస్ట్ వన్ సింగిల్ వాలిడ్ అబ్జేక్షన్!" అంది పదునుగా.

 

    "సుదీరగారూ! నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా పెళ్ళి ఆలోచనే లేదు. ఇప్పుడు మీరు ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి మా నాన్నగారితో కూడా మాట్లాడి చెబుతాను."


    నవ్వేసింది సుదీర. "అది ఆడపిల్లలు అనవలసిన మాట. ఒకే! ఆలోచించే చెప్పండి" అని కాసేపు ఆగి, "నాకు అన్ని ఉన్నాయి. అందుకని ఇంతవరకూ ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఫలానాది కావాలని అడగలేదు. కానీ, ఇవాళ రెండు చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. "ఓ దేవా! పరమశివా! నీలాగే భోళా శంకరుడైన ఈ అందమైన అబ్బాయి నా భర్తగా అయ్యేటట్లు అనుగ్రహించూ అని" అని చిరునవ్వుతో కళ్ళు మూసుకుని చేతులు జోడించింది. విశాలమైన ఆమె నయానాల మీద రెండు సీతాకోక చిలకలు రెక్కలు జాచి వాలినంత అందంగా కనబడుతున్నాయి ఆమె కనురెప్పలు.


    "వస్తాను!" అని చిరునవ్వుతో తల పంకించి, చెయ్యి ఊపి కారెక్కింది సుదీర.


                                                                           --------------

 

    భరత్ గుడి నుంచి ఇంటికొచ్చేసరికి అక్కడ మరో కారు ఆగింది. అది సరికొత్త మార్క్ 4 అంబాసిడర్. దాని బానేట్ మీద ఖడ్గమృగానికి ఉన్నట్లు ఒక కొమ్ము ఉంది. అధికారానికి సంకేతంలా ఒక జండా చుట్టి ఉంది దానికి.


    అది ప్రభుత్వ వాహనం దానిలో నుంచి యముడి వాహనంలా ఉన్న ఒక మనిషి దిగాడు. అతడు ప్రభుత్వోద్యోగి కాడు. ఆ కారు అతనికి కేటాయించింది కాదు. గవర్నమెంటు వెహికిల్స్ ని ముఖ్యంగా ప్రయివేటు పనులకి, ఇంట్లో ఆడంగులని సినిమాలకి, షాపింగులకి తీసుకెళ్ళడానికి , పిల్లలకి కాన్వెంటు దగ్గర డ్రాప్ చెయ్యడానికి ఎక్కువగా వుపయోగిస్తారని అందరికి తెలిసిన సంగతే!


    ఆ కారు ఒక కార్పోరేషన్ చెయిర్మన్ ది. అయన తాలూకు బంధుమిత్ర పరివారమంతా దాన్ని యదేచ్చాగా వాడేస్తూ వుంటారు.


    కారు దిగిన మనిషి "సదాశివంగారూ!" అని పిలిచాడు.


    సదాశివరావుగారూ బయటికి వచ్చారు. నీరుకావి రంగు ముతక ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చి.

 

    కారులో వచ్చిన మనిషి ఆ కారు కంటే నల్లగా ఉన్నాడు. అయితే మంచులా తెల్లగా, పల్చగా ఉన్న పొందూరు ఖద్దరు పంచె, లాల్చీ- డ్రైక్లినింగ్ చేసినవి- వేసుకుని వున్నాడు.


    "ఎవరూ?" అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూశారు సదాశివరావుగారు.

 

    "నమస్కారమండి! ఎన్నాళ్ళయిందో మిమ్మల్ని చూసి? ఎప్పుడో నలబై అయిదేళ్ళ క్రితం జైల్లో-" అంటున్నాడు ఆ ఆసామి. అతని పేరు చలపతి.


    నలబై అయిదేళ్ళ క్రితం సదాశివరావుగారు దేశంకోసం జైలుకెళ్ళారు. అదే సమయంలో పిక్ పాకెట్ చేస్తూ దొరికిపోయి అదే జైలుకి వెళ్ళాడు చలపతి. "స్వాతంత్ర్యం రాకముందు జైలు కెళ్ళాను" అని రోజుకి వందసార్లు చెబుతూ వుంటాడు అతను - ఎండుకేళ్ళాడో చెప్పకుండా!


    అతను ఇప్పుడు పెద్ద పదవుల దళారి. పవర్ బ్రోకరు. ప్రతి రాజకీయ నాయకుడు అతనికి పరిచయమే.

 

    పెద్దవాళ్ళ పరిచయాల కావాలంటే క్లబ్బులో చేరుతారు కొంతమంది. క్లబ్బులన్నిటిలోనూ చేరడంతో బాటు మరో పద్ధతి కూడా కనిపెట్టాడు చలపతి. సన్మానాలు, ఫంక్షనులూ జరిపిస్తూ తన పేరు జనం మధ్యలో నలుగుతూ ఉండేటట్లు చూసుకోవడం. దేశానికి స్వాతంత్యం వచ్చాక అతనిలాంటి వాళ్ళు ముందుకి దూసుకుపోతుంటే సదాశివరావు గారి లాంటి వాళ్ళు మాత్రం వెనకబడి పోయారు.


    "మీరు.........?" అన్నారు సదాశివరావుగారు.


    "నేను చలపతినండి!"

 

    "ఓహొహొ....చలపతివా! కులాసానా?"

 

    "ఏదో మీ దయ! మినిస్టరు కృష్ణస్వామిగారు మిమ్మల్ని ఒకసారి పలకరించి రమ్మన్నారండి! వారు టూర్ లో వెళుతున్నారు. లేకపోతే తనే స్వయంగా వచ్చేవాడినని మనవి చెయ్యమన్నారు."


    సదాశివరావుగారి మొహంలో సంతోషం కనబడింది. "మన కృష్ణస్వామేనా! బాగున్నాడా!"

 

    "ఏదో మీ దయ! ఈసారి స్వాతంత్ర్యయోధులకు పెన్షను మంజూరు చేసేటప్పుడు మీ పేరు తప్పకుండా లిస్టులో వుండేటట్లు చేస్తానని చెప్పమన్నారండి! ఇన్నాళ్ళు ఆలస్యమైనందుకు సిగ్గుపడుతున్నానని మనవి చెయ్యమన్నారు. ఇంతకీ తమరు జైల్లో ఎన్నాళ్ళున్నారండి?"


    కొంచెం అలోచించి, చెప్పారు సదాశివరావుగారు.

 Previous Page Next Page