Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 13

 

    అతను పొరపాట్న ఒక్క అడుగు పక్కకేస్తే చాలు!
    
    పాతాళంలా ఎంతో దిగువన కనబడుతున్న రోడ్డు మీదికి దభేలుమని పడిపోతాడు.
    
    "సన్నీ!" అంది డాక్టర్ సునీతా సుందరి అరుస్తూ.
    
    "సన్నీ! సన్నీ! వెనక్కి వచ్చెయి! ముందుకి పోవద్దు!" ఆమె మొహంలో కలవరం కనబడిపోతోంది.
    
    ఇంకో అడుగు ముందుకు వెయ్యబోయాడు జెయ్ చంద్ర. ఈసారి కుడిపాదం దూలం మీద కాకుండా బాలన్స్ తప్పి గాల్లోకి వేశాడు.
    
    "సన్నీ!" అని వెర్రికేక పెట్టింది ఆమె.
    
    అంతలోనే లక్కీగా మళ్ళీ తనని తాను బాలన్స్ చేసుకున్నాడు అతను. మళ్ళీ యింకో అడుగు ముందుకేశాడు.
    
    "జెయ్, మైనస్! వెనక్కి వచ్చెయ్యిరా?" అంది డాక్టర్ సునీత విహ్వలంగా.

 

    వినిపించుకోకుండా యింకో అడుగు ముందుకెయ్యబోయాడు జెయ్ చంద్ర. ఆ ఒక్క అడుగూ వేస్తే ఉంగరం అతనికి అందుతుంది.
    
    కానీ....
    
    ఆ లోగానే......
    
    హఠాత్తుగా అతని వళ్ళు తూలింది.
    
    పాదం పక్కకి పడింది.

 

    దాంతో బ్యాలన్స్ తప్పింది.
    
    జర్రున జారిపడబోయాడు అతను.
    
    అయితే....
    
    అలా జరుగుతూనే....
    
    క్షణంలో సగం వ్యవధిలోనే తన చెయ్యి ముందుకి జాచి, ఉంగరాన్ని అందుకున్నాడు!
    
    ఉంగరాన్ని అందుకున్న మరుక్షణంలో అతను అదృశ్యమైపోయాడు.
    
    "జై! మై సన్! మై సన్! జై!" అని పెద్దగా రోదించడం మొదలెట్టింది ఆమె.
    
    కూలీ ఆదుర్దాగా ముందుకు వురికి, వంగి చూశాడు. వెంటనే ఆనందం, ఆశ్చర్యం కూడా కనబడ్డాయి అతని మొహంలో.
    
    "అమ్మా! చూడండి!" అన్నాడు వుద్వేగంగా.
    
    చటుక్కున ముందుకు వచ్చేసింది డాక్టర్. తను కూడా వంగి చూసింది.
    
    అక్కడ....
    
    రెండంతస్తుల కింద అంటే ఆరో అంతస్తు దగ్గర యింకో ఇనపదూలం గాల్లోకి చొచ్చుకుని వచ్చి వుంది.
    
    ఎడం చేత్తో ఆ దూలాన్ని గాల్లో పట్టుకుని వేళ్ళాడుతున్నాడు జెయ్ చంద్ర.
    
    "థాంక్ గాడ్! థాంక్ గాడ్! జెయ్! జాగ్రత్త! ఒక్క నిమిషమలాగే వుండు. వీళ్ళొచ్చి దింపుతారు" అంది సునీతాసుందరి ఆనందభాష్పాలని చేత్తో తుడుచుకుంటూ.
    
    ఆ లోగానే.....ఉయ్యాల ఊగినట్లు ఊగడం మొదలెట్టాడతను.
    
    ఊపు ఊపుకీ గాల్లోనే ఇంకా ఎక్కువ దూరం కవర్ చేస్తున్నాడు అతను.
    
    నాలుగుసార్లు అలా వూగాక.....
    
    ఐదోసారి......
    
    అతని కాళ్ళు అక్కడే వున్న ఓ సిమెంటు దిమ్మకి తగిలాయి.
    
    మళ్ళీ ఇంకోసారి వూగాడు. ఈసారి అతని కాళ్ళు ఆ సిమెంటు దిమ్మకి తగలగానే కాళ్ళతో దాన్ని గట్టిగా తన్నిపట్టుకున్నాడు.
    
    ఆ తర్వాత తనని తాను బ్యాలెన్స్ చేసుకుని, నెమ్మదిగా తలెత్తి చూశాడు. తల్లి కనబడింది.
    
    "ఉండుసన్నీ! నేను వచ్చేస్తున్నాను" అంది డాక్టర్ సునీతా సుందరి త్వరత్వరగా.
    
    "నో థాంక్స్ మామ్! గుడ్ బై!" అనేసి ఒడుపుగా దూలాన్ని వదిలేసి, ఆరో అంతస్తులోకి నడిచాడతను.
    
    "సన్నీ!" అంటూ ఆ వీధంతా వినబడేటట్లు పెద్ద కేకపెట్టింది సునీత.
    
    ఆమె పిలుపుకి సమాధానం లేదు.
    
    ఆ తర్వాత ఆమె త్వరత్వరగా కిందికెళ్ళి చూసేసరికి అక్కడ జెయ్ చంద్ర కనబడలేదు. అప్పటికే అక్కడ్నుంచి వెళ్ళిపోయాడతను.
    
    ఇంటికొచ్చేసి ఏడుస్తూ సోఫాలో కూలబడిపోయింది డాక్టర్ సునీతా సుందరి.
    
    కానీ ఆమె రోదనలో.....కొడుకు వెళ్ళిపోయాడనే దుఃఖంలేదు బొత్తిగా.
    
    కానీ అతను తనని ధిక్కరించాడనే రోషముంది.
    
    తన మాట చెల్లలేదనే పంతముంది.
    
    దారుణంగా దెబ్బతిన్న అహంభావముంది.
    
    అంతే! అంతకుమించి ఇంకేంలేదు.
    
                                                                * * *
    
    చేతిలో కెమిస్ట్రీ పుస్తకం పట్టుకుని అటూ ఇటూ నాన్ స్టాప్ గా పచార్లు చేస్తూ సీరియస్ గా చదువుకుంటున్న సితార యథాలాపంగా ఓసారి కిందికి చూసేటప్పటికి.....
    
    అక్కడ శేషు ఇంటి ముందర ఒక ఆటో డుర్రుమంటూ వచ్చి ఆగడం కనబడింది.
    
    ఆమె యధాలాపంగా చూస్తుండగానే.....అందులోనుంచి దభీమని జెయ్ చంద్ర దిగాడు.
    
    అతని చేతిలో పెద్ద సూట్ కేస్ వుంది. అతని భుజానికి స్కై బ్యాగు ఒకటి వేళ్ళాడుతూ వుంది.
    
    అతని వెనకే కిందికి దూకింది ఒక దూడసైజులో వున్న ఆల్సెషియన్ కుక్క. అతనికంటే ముందే తను శేషు ఇంట్లోకి పరిగెత్తి ఓసారి సర్వేచేసి వచ్చింది.
    
    'ఈ ఇల్లు నాకు సుతరామూ నచ్చలేదుసుమీ!' అన్నట్లు గుర్రుగా మొరిగింది కుక్క.
        
    'అయినా తప్పదునేస్తం!' అన్నట్లు సానుభూతిగా దానితల నిమిరాడు అతను.
    
    ఈలోగా శేషు బయటికొచ్చాడు.
    
    అతని మొహంలో చెప్పలేనంత ఆశ్చర్యం కనబడుతోంది.
    
    "ఏంట్రా యిదీ?" అన్నాడు అనుమానంగా.
    
    "ఇల్లొదిలి వచ్చేశా" అన్నాడతను టూకీగా.
    
    "ఎందుకూ?"
    
    "ప్రేమ కోసం!"
    
    చప్పున అప్పుడే గుర్తొచ్చినట్లు అన్నాడు శేషు.
    
    "మరి ఆస్తి?"
    
    "అది డిటోనే!"

 Previous Page Next Page