Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 13

    "ఆ రోజు నైట్ న మీతో పాటు డ్యూటీలో వున్నాం. మీకు తెల్సిందే గదసార్! నేను రాజు నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటున్నాం.
   
    "....ఏం కబుర్లు?" ఇన్ స్పెక్టర్ అడ్డు తగిలి అడిగాడు.
   
    "అంతకు క్రితంరోజు చూసిన చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమా కబుర్లు, చూడు బుల్లెమ్మా పాట గురించి..." వినయంగా చెప్పాడు రమణ.
   
    "ఊ...తర్వాత ఏమయింది?"
   
    "కబుర్ల మధ్యలో ఏదో ఘాటుగా వాసన గాలిలో తేలిఆడుతూ వచ్చి మా ముక్కులను చుట్టేసింది. మేము తెలివి తప్పిపడిపోయాము అనుకుంటాము....మళ్ళీ తెలివివచ్చేసరికి మా శరీరం మీద కడ్రాయరు తప్ప యింకేమి లేవు. పోలీస్ డ్రస్ లేదు....టోపీ లేదు, ఆఖరికి మా చేతి వాచీలు కూడా లేవు.
   
    ఆ గదిలో మా చుట్టూ పదిమంది దృఢకాయులు వున్నారు...."ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు యిక్కడికి తీసుకువచ్చారు? మా దుస్తులు ఏమయ్యాయి.....?" అని మాత్రమే అడిగాడు, అప్పుడు వాళ్ళువ్యంగ్యంగా నవ్వారు.
   
    "మీరు అరిస్తే మాడు పగలకొడతాము. వెర్రి మొర్రి వేషాలు వేస్తే వళ్ళు వాయకొడతాం. మా అవసరానికి మిమ్మల్ని తీసుకు వచ్చాం....గంట రెండు గంటల్లో మీ దుస్తులు మీ చేతుల్లో పువ్వుల్లాగా పెడతాము సురక్షితంగా మీ స్టేషన్ కి పంపిస్తాం" అన్నారు. మేము అరవబోతే మా నోరు నొక్కారు. అందరి చేతుల్లో మారణాయుధాలు రకరకాలువి వున్నాయి.
   
    అరగంట తరవాత నలుగురు మనుషులు ఆ గదిలోకి వచ్చారు. వాళ్ళలో ఇద్దరు అచ్చం మాలాగా వున్నారు. మాలాగా అంటే ఎత్తు లావూ మాలాగా వున్నారు....ముఖాలకి మాస్క్ ధరించారు ఆ మాస్క్ మా ఫేస్ లాగా తయారుచేసినవి. వాళ్ళేదో పెద్దపని చేసి వుంటారని గ్రహించి మా ముఖాల్లా ముఖాలు పెట్టుకుని ఏ వెధవపని చేసి వచ్చారురా దొంగనాయాళ్ళలారా?"
   
    అంటూ నేను రాజు వాళ్ళ మీదకు వెళ్ళాం. దాంతో వాళ్ళకి కోపంవచ్చి బడితెలు తీసుకుని బాదారు. దొంగలని చావచితక కొట్టటంతో మన డిపార్టుమెంటుకి అమోఘమైన పేరు కదా సార్! వాళ్ళముందు మనమేం పనికివస్తాం. ఒక్క నెత్తురుబొట్టు పైకి చిందకుండా శరీరంమీద కమిలి వాతలు తేలేలా ఒక్కో దెబ్బ కొడుతుంటే కళ్ళముందు రౌరవాది నరకాలు కానవచ్చాయి.
   
    దెబ్బలతో మా వళ్ళు హూనంఅయి, మాకు తెలివి తప్పిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. మళ్ళీ తెలివి వచ్చేసరికి ఆసుపత్రిలో బెడ్ మీద వున్నాం జరిగింది అక్షరం పొల్లుపోకుండా యింతేసార్! ఏం జరిగిందో మళ్ళీ చెప్పండి అంటూ ఒకటికి పదిసార్లు అడిగారు! అలా అడగటం తప్పనికాదు సార్! మా బాధ అల్లా మేము చెప్పింది నమ్మక మమ్మల్ని అనుమానిస్తున్నారా అన్నదే సార్!" రమణ బాధగా ముఖంపెట్టి వినయంగా అన్నాడు.
   
    "ఛా....ఛా....మిమ్మల్ని అనుమానించటం కాదు. ఏదన్నా క్లూ దొరుకుతుందేమోనని మళ్ళీ మళ్ళీ ఆడుగుతున్నాను__మీరు మాత్రం రికార్డు చేసినట్లు అదే చెపుతున్నారు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
    "జరిగింది అదేకదసార్!" రాజు మరింత వినయంగా శెలవిచ్చాడు.
   
    "నిజమేలే జరిగింది అంతవరకే అయినప్పుడు మీరు మాత్రం ఏం చెప్పగలరు! ఎవరో చాటుమనుషులు మన మీద పగ పూనినట్లు చేస్తున్నారు....వాళ్ళేదో పెద్దప్లాను మీద వున్నారని నా అనుమానం" ఇన్ స్పెక్టర్ సాలోచనగా ఆలోచిస్తూ అన్నాడు.
   
    "మీరు అనుమానించారంటే ఏదో తప్పక వుంటుంది సార్!"
   
    "మీది చాలా ముందుచూపు సార్!"
   
    "వాళ్ళు ఏదో ఒకరోజు పట్టుబడక పోరా వళ్ళు వాయగొట్టక పోమా? కాపోతే__" అంటూ నసిగాడు రాజు.
   
    "ఏమిటి కాపోతే! మీ అనుమానం ఏమిటో చెప్పండి" ఇన్ స్పెక్టర్ అడిగాడు.
   
    "చూడబోతే వాళ్ళు ఘటికుల్లాగా వున్నారు సార్! ఇప్పుడంటే చిన్న విషయంతో పోయింది....వాళ్ళు మన అందరిలాంటి మనుషులని తయారుచేసి మన్ని కట్టి ఏ చీకటి కొట్లోనో పడేసి వాళ్ళు ఈ స్టేషను స్వాధీనం చేసుకుని__"రాజు చెపుతుంటే ఇన్ స్పెక్టర్ ముఖంలో భయం రెపరెప లాడింది.
   
    "ఛత్....పిచ్చిపిచ్చి ఆలోచనలు చేయకు చెప్పకు" రమణ విసుకున్నాడు రాజుమీద.
   
    "లేదు లేదు రాజు ఆలోచనలో చాలా ముందుచూపు వుంది. ఏమో అలా జరిగినా జరగవచ్చు ఇప్పటికి రెండుసార్లు మన కళ్ళల్లో దుమ్ము కొట్టటం జరిగింది" ఆవేశంగా అంటున్న ఇన్ స్పెక్టర్ కి తొందరలో తను నోరు జారిన విషయం గుర్తొచ్చింది....కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది.
   
    "మా కళ్ళల్లో అంటే దుమ్ము కొట్టారు తెలుసూ మరి మీ కళ్ళల్లో...." అడిగాడు రాజు.
   
    "నా కళ్ళల్లో అంటే దుమ్ము కొట్టారు తెలుసూ మరి మీ కళ్ళల్లో...." అడిగాడు రాజు.
   
    "నా కళ్ళల్లో అంటే నా కళ్ళలో అని కాదు. మీ యిద్దరినీ మోసగిస అధి నాకు మాత్రం దెబ్బ కాదా! ఆ వుద్దేశ్యంతో అన్నాను."

    "నిజమేసార్! నా బుర్ర అంతదూరం పనిచెయ్యలేదు" రాజు అన్నాడు.
   
    రాజు అన్న తీరుకి ఇన్ స్పెక్టర్ చాలా సంతోషించాడు.

 Previous Page Next Page