Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 12

    "బజారులో షాపు తెరిచి వచ్చిన వాళ్ళని వెళ్ళిపొమ్మంటావా? నీ కెన్ని గుండెలు? వ్యాపారం చేయాలని లేదా? మేము ఎవరో తెలుసుకునే మాట్లాడుతున్నావా?" అని ప్రశ్నించింది. ఉమ.

    "నాకు తెలియదమ్మా! మీరు చెప్పలేదు."

    "ఈ తులసి ఎ.ఎస్.పి.గారి వైఫ్! నేను డి.ఎస్.పి. గారి డాక్టర్ని ఈ కళ్యాణి జాయింట్ కలెక్టర్ గారి కూతురు." పరిచయం చేసింది.

    "అంతా బాగా చదువుకున్నవారే! గొప్పవారే! పెద్దపెద్ద అధికారుల తాలూకు మనుషులు! కాని అక్కడ బోర్డు ఉంది చూచారా? అడ్మిషన్ రిజర్వ్ డ్! దయచేసి మీరే బయటకు వెళ్ళిపోండి!" ఆయనకు దయ ఉన్నంత సేపు అక్కడే కూర్చుంటారు. లేకపోతే ఎన్ని రోజులయినా రాత్రింబవళ్ళు షాపు తెరిచే ఉంచుతాము. అదే వారి మీద మాకున్న భక్తి!" అని చెప్పేసి ఆ వ్యక్తి వంక చూచి చేతులు జోడించి వెళ్ళిపోయాడు ప్రొప్రయిటర్.

    అతడు ఖండితంగా చెప్పిన సమాధానం విని వారు నివ్వెర పడిపోయారు.

    "ఇలాంటి షాపులోకి రావటం మనదే తెలివితక్కువ. వెళ్ళిపోదాం పద!" అంటూ మిగిలిన ఇద్దరిని తొందరించింది ఉమ.

    ఎలాగయినా అక్కడనించి బయటపడేందుకే ఆలోచిస్తోంది తులసి! "త్వరగా రండి" అంటూ ముందుగా వెలుపలకు వచ్చింది. వారిమాటలు వింటున్నాడో లేదో యోగి మాత్రం ఒక సోఫాలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఉలకలేదు. పలకలేదు. డేగ చూపులు ఎక్కడో గ్రుచ్చుకుంటున్నాయి.

    "ఏమిటలా గాలిపటంలా కొట్టుకుపోతున్నావు- ఆగాగు. మరోషాపులోకి వెడదాం. ఎవడో వాగాడని ఐస్ క్రీం తినకుండానే వెళ్ళి పోతావా?" కళ్యాణి వారిద్దరిని నిలువరించింది.

    మరో షాపులోకి వెళ్ళి తిండి ముచ్చట తీర్చుకున్నారు.

    వారు వెలుపలకు వచ్చే సమయానికి మొదటి షాపుముందు జనం గుంపులు కూడి ఉన్నారు. కిటకిటలాడుతున్నారు.

    "అక్కడ ఎవరైనా పోయారేమిటి? అంతమంది చూస్తున్నారు?" అంది ఉమ.

    "ఆ బవిరి గడ్డంవాడే పోయుంటాడు" అంది కళ్యాణి.

    "అపచారం! అపచారం!" అంటూ అప్రయత్నంగా చెంపలు వేసుకుంది తులసి.

    "దీనికి కూడ ఆ పిచ్చే ఎక్కినట్టుంది. బవిరి గడ్డంవాడు కాదు షాపు యజమానే పోయుంటాడు. మనల్ని వెలుపలకు పొమ్మన్నాడు కదా?" అంది అక్కసుగా ఉమ! అడుగులు ముందుకు పడలేదు.

    "మరీ అంత జనం ఉన్నారంటే ఏదో జరిగే ఉంటుంది. మనం కూడకెళ్ళి చూద్దామా?" ఉత్సాహంగా అడిగింది కళ్యాణి.

    "నీకు పిచ్చెక్కిందా? షాపు వాడు చేసిన పరాభవం మర్చిపోయావా?"

    "అది పరాభవం ఎలా అవుతుంది? మనతో అతనికి విరోధమే ముంది? యోగి మీద తనకున్న భక్తిని ప్రకటించుకున్నాడంతే కదా?"

    "ఇంకా ఏ శతాబ్దంలో బతుకుతున్నారీ మనుషులు! గడ్డంగీచుకోవడం ఒంటినిండా బట్టలు కట్టుకోవటం చేతకాని ఒక బైరాగి షాపులో కాలుపెడితే కనకవర్షం కురుస్తుందా?"

    కావాలంటే నేను కూడ మీతోపాటు ఆ చిత్రం చూచేందుకు వస్తాను కాని చింతకాయ లాజిక్కులు మాత్రం చెప్పకు" అంది ఉమ.

    "అదేమిటి! నేనెప్పుడూ వినలేదు. చింతకాయలాజిక్కేమిటి?"

    "వినకపోతే పోయావు. చింతకాయ ఎప్పుడయినా చూచావా?"

    "మొన్న మార్కెట్ కి వెళ్ళినపుడు షాపు వాడిముందు రాసిపోసుంటే చూచాను."

    "బాగా ఊరిపోయి వొంకీలు తిరిగిపోయి ఉంటాయి కదూ!"

    "అవును తొడిమ కూడ ఉంది!"

    "దాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకో! ముందు ముందు చాల పనుంటుంది."

    "పులుపు నాకు సయించదు. దాంతో నాకు పనిలేదు."

    "పని ఇప్పుడుండదు కాని ముందు ముందుంటుంది. పెళ్ళయి బాలింతరాలివి కూడ అయాక పాతచింతకాయ పచ్చడి నాలుక్కి రాచుకోవడంలో ఆనందమూ ఆరోగ్యమూ ఉంటాయి!"

    "కడుపుతో ఉన్నప్పుడు మూడో నెల దాటాక చింతకాయలు తినటం చూపిస్తారు కదే సినిమాల్లో!"

    "ఎగ్జాక్ట్ లీ కరెక్ట్! జీవితాల్లోంచి సెలెక్ట్ చేసిన కొన్ని ప్రత్యేక దృశ్యాలే సినిమాల్లోకి వస్తుంటాయి. జబ్బుచేసి తగ్గిన తరువాత కూడ చింతకాయ పచ్చడి తినాలి!"

    "బాలింతరాలు కావటం కూడ ఒక జబ్బేనంటావా?"

    "యాంటిబయాటిక్స్ కనిపెట్టని రోజుల్లో అయితే అంతే మరి!"

    "చింతకాయలాజిక్ అంటే ఏమిటో చెప్పలేదింకా! సాగలాగుతున్నావు!"

    "అవును మరి! చింతకాయ కాచేది చింతచెట్టు కోసమా? చింతపండు కోసమా? కనుక్కో చూద్దాం!"

    "చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుంది నీ ప్రశ్న!"

    "బెంగుళూరు బొటానికల్ గార్డెన్స్ కి ఎప్పుడయినా వెళ్ళావా?"

    "నీతోపాటే నేను కూడ వచ్చాకదా?" అంది కళ్యాణి!

    "అక్కడొక బోర్డుంది చూశావా?"

    "ఒకటేమిటి? చాలా చోట్ల బోర్డులున్నాయి!"

    "వృక్షాలు పుష్పించినా ఫలించినా సంతానాభివృద్దికే! అని ఉంది"

    "అవును ఉంది! ఇప్పుడెందుకు చెప్తున్నావు?"

    "చెట్లు ఎందుకు పూలు పూస్తాయో, కాయలు కాస్తాయో, తెలియనప్పుడు అక్కడ ప్రశ్నలుదయిస్తాయి. ఇది చెప్పే యక్ష ప్రశ్నలన్నీ అలాంటివే! జనం విరగబడి తోసుకుంటున్నారు. మనం వెళ్ళడం ఎలా? అంది ఉమ.
 

 Previous Page Next Page