ఈ విషయాలను ప్రజలకు చెప్పడం అత్యవసరంగా భావించి ఒక లక్ష్యంతో పరిశోధన సాగించాడు గులసుల్విస్కీ నోవ్!
హిందూ ప్రాంత దేశాలలోని విశ్వాసాలను సరి అయిన ఆధారం సాక్ష్యం చూపకుండానే కొట్టి పారేశాడు!
ఆ వ్యాసాలు ఆంగ్లంలోకి తర్జుమా అయి ప్రపంచమంతటా ప్రచారం పొందాయి. విదేశాలకు వెళ్ళి జూ ఆలజి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, దేశంలోనివారు వాటిని చదివి ప్రభావితులై ప్రచారంలోకి తీసుకువచ్చారు.
భారతీయ ప్రాంత దేశాలలో అతని ప్రతిపాదనను బాగా ప్రచారం పొందాయి. ఇదంతా జరిగి ఇంకా అయిదు దశాబ్దాలు పూర్తికాలేదు, అర్ధశతాబ్దానికి లోపలి సంగతి!
కాని యాభైవందల సంవత్సరాలకి పూర్వం భారతభూమిలో సర్పాలమీద విస్తృత పరిశోధనలు జరిగినా దాఖలాలు చాల విస్పష్టంగా ఉన్నాయి.
వాస్తవానికి సర్పజాతుల మీద విశ్లేషణాత్మక పఠనం మనకు రుగ్వేదంలోనే కన్పిస్తుంది. "ఆస్తికం వచనం స్మర" అనేది భారత ఇతిహాసానికి కీలకమయిన వాక్యం! అప్పటికే సర్ప విజ్ఞానంలో మనవాళ్ళ పండి పోయారు. ప్రపంచానికి దారి చూపగల సర్పవిజ్ఞానం మనది!"
"ఐస్ పార్లర్ కి దారితీయ మంటే ప్రపంచానికి దారిచూపు తున్నావు కాలుజారిపడగలవు. అదో ఐస్ పార్లర్! ఇంకా నీ సుత్తి ఆపేసి లోపలికి నడువ్! పైనాపిల్ ఫ్రూట్ సాలాడ్ తిని రెండు రోజులు అయింది" అంటూ తులసి వాగ్దాటికి ఆనకట్ట వేసింది ముప్పయ్యెనిమిది యాభై ఆరు కొలతలతో బొదబొదలాడుతున్న కళ్యాణి!
"ఐస్ క్రీమ్ లు తినితిని అంతలావెక్కి పోయావు? ఇంకాతిని లావెక్కితే నిన్నెవడే చేసుకుంటాడు?" అని ప్రశ్నించింది తులసి!
'భర్త అంటే భరించేవాడు?' అని కదా అర్ధం. ఐస్ పార్లర్ యజమాని తప్ప ఇంకెవరూ దీన్ని భరించలేరు. అని బదులిచ్చింది ఉమ!
"నువ్వేం తక్కువ తిన్నావా? గంట క్రితమే కదా అరకిలో జీడిపప్పు, అరకిలో బాదంపప్పు లాగించావ్!"
"ష్ ష్! అరవకండి! అవతల వింటున్నారు" అంది తులసి! తలలు దించినా చూపులు మాత్రం పరుగులెత్తించి యువకుల్ని గమనించారు.
పార్లర్ లోపల చల్లగా ఉంది. అందంగా అమర్చిన ఉడెన్ సీలింగ్ నించి వెన్నెలలాంటి వెలుతురు పడుతోంది!
కావలసిన అయిటమ్స్ చెప్పి మంచినీటి గ్లాసులు పెదవులకు ఆనించు కుంది తులసి! ఎదురుగా కన్పించిన దృశ్యం చూచి నివ్వెరపోయిందామె! చుట్టూ గోడలకు ఖాళీ లేకుండా అద్దాలు బిగించి ఉన్నాయి. ఎవరు ఏవైపు ఉన్నారో నిర్ణయించుకునేందుకు వీలుకాకుండా అన్నివంకలా ఉన్న ఆకృతులే కన్పిస్తున్నాయి.
కన్పించే దృశ్యం యదార్ధం కాదని అద్దంలో నీడ మాత్రమే అని నిర్ణయించుకోవటానికి అరనిముషం పట్టిందామెకు.
చల్లనిగాలి తగులుతున్నా నుదురుమీద ముత్యాల్లా చెమట బిందువులు ఉదయించి తరళించినాయి. శరీరం జలదరించింది. చూపులు నీరసంగా మారి ముఖం నర్వెస్ గా అయిపోయింది.
"ఏమిటే అలా నీరుకారిపోతున్నావ్?" ఆశ్చర్యంగా అడిగింది కళ్యాణి.
"మన వెనుక ఎవరున్నారో గమనించారా?" గుస గుసలాడుతున్న విధంగా చెప్పింది తులసి! రహస్యం చెప్పటానికే కంఠం వణికింది. ఉమ తల త్రిప్పి వెనుకకు చూచింది.
తల మీద అడుగు ఎత్తున జటాజూటం ఉన్న ఒక యోగి ఆమెకు కన్పించాడు! ముఖం వికారంగా ముడ్చుకుంది. అతడు కౌపీనం తప్ప మరేమీ ధరించలేదు. శరీరం మీద ఏనాడు కత్తిపెట్టిన వాడు కానట్లు వెంట్రుకలు అసహ్యంగా కన్పించాయి.
అతని చూపులు మాత్రం డేగ చూపుల్లా వాడిగా గ్రుచ్చుకుంటున్నాయి.
"అడ్మిషన్ రిజర్వ్ డ్ అని బోర్డుపెడతారు. కాని వీళ్ళ కసలు బుద్ది ఉండదు. ఎవర్నిపడితే వాళ్ళని రానిస్తారు. ఎంత అసహ్యంగా ఉన్నాడో! డోకులు పుట్టేలాగ! మరో పార్లర్ కి వెళ్ళిపోదాం పదండి!" అంది ఉమా కూర్చోకుండా.
కళ్యాణి కూడ వెనుదిరిగి అతని వాలకాన్ని పరిశీలించింది. శరీరమంతా గొంగళిపురుగులు పారాడినట్లు జలదరించింది. తులసి మాత్రం ముచ్చమటల మధ్య తడిసిపోయి ఉంది. తలత్రిప్పి అయినా చూచేందుకు సాహసించలేదు.
కళ్యాణి వెజిటర్ ని పిలిచి అతని మీద గయ్యిమనిలేచింది!" హారర్ సినిమాలో విలన్ వేషంలాంటి మనుషుల్ని రానిస్తారేమిటి?" మర్యాదస్తులు ఎలా వచ్చి కూర్చోవాలనుకుంటున్నారు?" అంది.
"మాకు తెలియదండి అమ్మాయిగారూ! ప్రొప్రయిటర్ గారున్నారు కదా! వారిని అడగండి!" అన్నాడు వెయిటర్.
పరిస్థితిని గమనించి ప్రొప్రయిటర్ వారిదగ్గరకు వచ్చాడు.
"ఆ వెలిబూడిద రాయుళ్ళని కూడ రానివ్వాలా లోపలికి?"
"ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు?" ప్రొప్రయిటర్ అడిగాడు.
"మా వెనుక కూర్చున్న సన్యాసి గురించి. అర్ధం కాలేదా?"
"ఆయన సన్యాసి కాదమ్మా దేవుడు! కీకారణ్యాలలో మాత్రమే తిరిగే మహాపురుషుడు! కోట్లు క్రుమ్మరించినా అలాంటివారి దర్శన భాగ్యం దొరకదు. ఆయన ఎక్కడ కాలుపెడితే అక్కడ కనక వర్షాలు కురుస్తాయట! ఎవరు పిలిచినా ఏమిచ్చినా రారు! ఈ రోజు నాకా భాగ్యం కలిగింది. పిలవకుండా వచ్చి కూర్చున్నారు, మీకేమయినా ఇబ్బందిగా ఉంటే లేచి వెళ్ళిపొండి."