నలభై... ఏభై... అరవై.... డెబ్బై.... ఎనభై కిలోమీటర్ల స్పీడుతో దూసుకు పోతుంది కారు. గాలిలో తేలిపోతున్న అనుభూతి. అభిరాం కారుని ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేసినా ఎటువంటి పోరాపాటూ చేయడని మహదేవ్ కి తెలుసు. అందుకే రిలాక్స్ గా సీటులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
* * * * *
సమయం పదీ ముఫ్ఫై అయిదు నిముషాలు.
అభిరాం కారుని స్లోగా పోనివ్వసాగాడు. కారు వరంగల్ నగరం లోనికి ప్రవేశించింది.
"వచ్చేశాం" అన్నాడతను.
"ఎక్స్ పర్ట్ డ్రైవర్ అవార్దివ్వవచ్చు నీకు..." మెచ్చుకోలుగా అన్నాడు మహదేవ్.
"పొగడ్తలు తరువతః ఇక్కడ అతి ప్రాచీన కాలంనాటి దుర్గం, రాజసౌధం వున్నాయి అన్నానుగా అవెక్కడున్నాయో ఎవర్నయినా అడగాలి" అన్నాడు అభిరాం కారు ఆపి కిందికి దిగుతూ.
మహదేవ్ కూడా దిగాడు.
"బాబూ ఇక్కడ ప్రాచీన దుర్గం వుంటుందట కదా ఎక్కడ?" ఆటే వెళుతున్న ఓ కుర్రాడిని అడిగాడు అభిరాం.
"అంటే?" అర్ధం కానట్లు అడిగాడతను.
"అదే శిల్పాలూ, రాతి హంసతోరణ ద్వారాలూ అవీ వుంటాయి కదా" తన ఎగ్జిక్యూటివ్స్ చెప్పినవి గుర్తు తెచ్చుకుని చెప్పాడు అభిరాం.
"ఓ... అవా?" అంటూ ఎటు వెళ్ళాలో చెప్పాడా కుర్రవాడు.
వెంటనే అభిరాం, మహాదేవ్ లు కారులో కూర్చుని పదినిముషాల్లో చేరుకున్నారు అక్కడికి కారు దిగి లాక్ చేసి ముందుకు నడిచారు.
పూర్వం అక్కడ కోటగానీ దేవాలయం కానీ వున్నట్టు ఒక పెద్ద ప్రహరీ, నాలుగువైపులా నాలుగు రాతఃయ్ హంసద్వారాలు వున్నాయి.
కొంతమంది వాటిని ఫోటోలు తీసుకుంటున్నారు. అభిరాం, మహదేవ్ ముందుకు నడిచారు.
ఇంతలో ఓ పాతికేళ్ళ యువకుడు వారి వద్దకి వచ్చి "సార్, మీరు టూరిస్టులా?" అని ప్రశ్నించాడు. సన్నగా, తెల్లగా వున్నాడతను. పైకి దువ్విన తల, లోతుకు పోయిన కళ్ళు, తెల్ల షర్టు- నల్ల ప్యాంట్ ధరించి టక్ చేసుకొని వున్నాడు.
మాసిన గడ్డం, అక్కడక్కడా చిరిగిన షూతో చదువుకున్న నిరుద్యోగిలా వున్నాడతను.
"మీరు టూరిస్టులా?" తనవైపే చూస్తున్న అభిరాం, మహదేవ్ లని తిరిగి ప్రశ్నించాడతను.
"అవును! అన్నాడు అభిరాం.
"నేను గైడ్ ని కాదు కానీ ఈ స్థలం, రాజసౌధం, ఈ ప్రదేశం విశిష్టతా వివరిస్తాను. నేనుండేది ఇక్కడే. ఓ ట్వంటీ రూపీస్ యిప్పిస్తారా? భోజనం చేసి రెండు రోజులయింది" అర్దిస్తున్నట్టు అన్నాడతను.
అభిరాం, మహదేవ్ ఆశ్చర్యంగా చూశారతని వంక.
"ప్లీజ్ సర్" స్పష్టమైన ఉచ్చారణతో అన్నాడతను.
"ఓకే!" ముందుకు వెళ్తూ అన్నాడు అభిరాం.
"వరంగల్ కి పూర్వం వున్నపేరు "ఓరుగల్లు" క్రీ.శ. 11వ శతాబ్దంలో మహోన్నత దశ అనుభవించైనా ఆంద్ర కాకతీయ సామ్రాజ్యానికి ఈ పట్టణం రాజధానిగా వుండేది. కాకతీయాంద్ర చక్రవర్తులలో గణపతి దేవుడు, తరువాత అతని కుమార్తె రుద్రమదేవి ఆ పిమ్మట ఆమె మనుమడు ప్రతాపరుద్రుడు ఈ నగరాన్ని పాలించారు. ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లు పట్టణం ఏడుసార్లు మహమ్మదీయుల దండయాత్రలకు గురయింది. చివరకు క్రీ.శ. 1323లో మహమ్మద్-బీన్-తుగ్లక్ ప్రతాపరుద్రుని ఓడించి ఓరుగల్లు పట్టణాన్ని వశపరుచుకున్నాడు" ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడతను.
అభిరాం అతని మాటల్ని పట్టించుకోకుండా అటు యిటు చూడసాగాడు.
మహదేవ్ కి అతను చెప్పిన విషయాల్లో కొన్ని ఇదివరకే తెలుసు. అయినా శ్రద్దగా వినసాగాడు.
"ఈ దుర్గాన్ని చూసినవారికి సాంచీ స్థూప తోరణాలు జ్ఞాపకానికి వస్తాయి. ఇక రాజసౌధంలో అద్భుతమైన శిల్పాలూ, కళాఖండాలు అనేకం వున్నాయి. మనం ఇప్పుడు అక్కడికే వెళుతున్నాం..." అంటూ కుడివైపుకు తిరిగాడతను.
ఒకప్పటి వైభవానికి గుర్తుగా, ఎన్నో శతాబ్దాల చరిత్రని తనలో నిక్షిప్తం చేసుకున్న రాజసౌధం నేడు పూర్వపు ఠీవీ కోల్పోయి మౌనిలా వుంది.
అందరూ లోపలికి నడిచారు.
అక్కడ ఎటు చూసినా రకరకాల భంగిమలలో అద్భుతమైన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యతకి సాక్షీభూతాలై ప్రత్యక్షమయ్యాయ్.
అభిరాం వాటిని యధాలాపంగా చూస్తూ నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు.
మహదేవ్ మాత్రం ఆ శిల్పాలలోని ఉట్టిపడుతున్న జీవకళనీ, ఆ శిల్పాకు మలచటానికి ఆనాటి శిల్పులు కనపరిచిన ప్రతిభనీ దీక్షగా అధ్యయనం చేస్తూ, ఒక్కో శిల్పం ముందు ఆగి, ఆగి ముందుకు సాగుతున్నాడు. అతి సున్నితంగా, సుందరంగా తీర్చిదిద్దిన చూరు అంచులూ, మనోహరంగా కూర్చిన ముత్యాల మాలలూ, గుబురు గుబురుగా వున్నట్టుండే చిన్న చిన్న ప్రతిరూపాలు అతన్నెంతో ఆకర్షించాయి. ఇంకొంచెం ముందుకు నడిచాడు. అక్కడ మదించిన ఏనుగులపై తాండవ నృత్యం చేసే రాక్షస చిత్రాలు భూతచిత్రాలూ ఎన్నో వున్నాయి.
అభిరాం వాటివంక దీక్షగా చూస్తున్నాడు.
"ఊఁ.... నీకిష్టమైన శిల్పాలు కూడా వున్నాయ్" నవ్వుతూ అన్నాడు మహదేవ్.
అతడు చిన్నగా నవ్వాడు. నిజానికి అతడు అక్కడికొచ్చింది అవి చూడటానికే.
"ఈ భూత చిత్రాలున్నాయి కదా.... వీటి వెనుక కథ మీకేమయినా తెలుసా?" తమతో వచ్చిన యువకుడిని అడిగాడు అభిరాం.