Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 12

 

    శృతినీ, ఆమె అందిస్తున్న కాఫీ కప్పునీ, చూసి, మణికట్టు లోపలికి వచ్చేటట్లు పెట్టుకున్న వాచ్ లో టైం చూసుకున్నాడు కేశవరావు.
    
    "ఏడవుతుందమ్మా! మధ్యాహ్నం ఒక చుక్క కాఫీ తాగాక, రాత్రికి భోజనమే! అసుర సంధ్యవేళ ఏమీ తిననూ, తాగనూ! కాస్త మడీ, ఆచారం అంటే పట్టింపు నాకు" అన్నాడు ఆ మడీ ఆచారం మీకు లేవు సుమా అన్న భావం వచ్చేటట్లు.
    
    శృతి ఇబ్బందిగా సరస్వతి వైపు చూసింది, సరస్వతి ముక్కుపుటాలు రోషంతో పెద్దవయ్యాయి.
    
    పరిస్థితి చెడిపోతున్న కొద్దీ కేశవరావుకి ఆనందంగా ఉంది. ఆ సంతోషంతో ఉదారంగా శృతిని అడిగాడు ---
    
    "మీ నాన్నగారు ఎక్కడమ్మాయి పని చేస్తుందీ?"    

 

    "డిస్ట్రిక్ట్ జడ్జ్ గా పనిచేసేవారండీ! ఆయన పోయి రెండేళ్ళవుతూంది."
    
    "వారి పేరేమిటన్నావూ?"
    
    "రాజగోపాల్ నాయుడు" అంది శృతి చటుక్కున.
    
    "నాయుడా!" అంటూ కొయ్యబారిపోయాడు కేశవరావు.
    
    శృతి గాభరాగా సరస్వతి వైపు చూసింది.
    
    "నాయుడా? మరి మీరు?" అన్నాడు కేశవరావు చీదరగా చూస్తూ.
    
    సరస్వతి నెమ్మదిగా చెప్పింది ---
    
    "శృతి వాళ్ళ అమ్మ మాకు దూరపు బంధువు వరుసకు నాకు అక్కగారవుతుంది. తనది వర్ణాంతర వివాహం. ఆయన నాయుడు."    

 

    స్ప్రింగులా లేచి నిలబడ్డాడు కేశవరావు. ఆయన మొహంలో షాక్ తగ్గి, ఆ స్థానంలో సంతోషం కనబడుతూంది.
    
    ఇది వజ్రాయుధంలాంటి అభ్యంతరం! ఇంటర్ కాస్ట్ వివాహాలు చేసుకున్న వంశంతో సంబంధం ఎలా కలుపుకుంటాడు తను?
    
    రెండు చేతులూ పెద్దగా శబ్దం వచ్చేటట్లు జోడించి, "నమస్కారం!" అంటూ విసవిస బయటికి నడిచాడాయన - ఇంకో క్షణం అక్కడుంటే తను అపవిత్రమై పోతానన్నట్లు.
    
    కూతురి పెళ్ళి తప్పిపోయిన శుభ సందర్భంలో ఆయనకి సెలెబ్రేట్ చేసుకోవాలనిపించింది.
    
    సెలెబ్రేషన్ అంటే బాటిల్ తప్పదు కదా!
    
    ఇకనుంచీ తాగకూడదు - అని నిన్న చేసుకున్న భీషణ ప్రతిజ్ఞను పక్కకు నెట్టేసి, "ఇవాళొక్క రోజు మాత్రమే!" అని సరిపుచ్చుకుంటూ బార్ వైపు నడిచాడు కేశవరావు.
    
    కుక్క ఒకటి వంకర తోక ఊపుకుంటూ ఆయన ముందు నుంచీ పరిగెత్తి వెళ్ళింది.
    
                                                         * * * * *
    
    మరునాడు హాస్పిటల్లో ప్రతిమని చూడగానే కోపంగా తల పక్కకి తిప్పేసుకుని దూరంగా వెళ్ళిపోబోయింది శృతి.
    
    "శృతీ! శృతీ! ప్లీజ్! ఆగు!" అంటూ త్వరత్వరగా వచ్చింది ప్రతిమ.
    
    శృతి ముభావంగా అడిగింది. "ఏం? బ్రహ్మాండమైన గొడవ జరిగిందా మీ ఇంట్లో?"
    
    "గొడవే జరిగింది. ఈ సంబంధం వద్దని అమ్మ, నాన్నగారూ తేల్చేసుకున్నారు."
    
    "ఎందుకని? సరస్వతి పిన్ని భర్తకి కజిన్ బ్రదర్ గారి భార్య చెల్లెలు ఎవరో నాయుణ్ణి చేసుకుందనేనా? అంటే మైలపడి పోయిందన్న మాట ఆ కుటుంబం?"    
    
    శృతి గొంతులో రోషం ధ్వనిస్తోంది.
    
    ప్రతిమ ఇష్టంగా స్నేహితురాలివైపు చూసింది.
    
    "శృతీ డియర్! అలా అని అన్నానా నేను! ఛీ ఛీ! అయినా ఎప్పుడూ చెప్పలేదేం నాతో?"
    
    "మా అమ్మది ఇంటర్ కాస్ట్ మారేజ్ అని మీ అందరికీ చాటింపు ఎందుకు వెయ్యలేదంటావ్. అవునా? ఏం? నేను ఫలానా కులం, ఫలానా తెగ అని గొంతు చించుకుని అరిచి చెప్పుకోకుండా స్నేహాలు కుదరవా?"
    
    ప్రతిమ చిరునవ్వు నవ్వింది.
    
    "శృతిగారికి ఇవాళ చాలా కోపంగా ఉంది. అవునా? అలా అయితే కోపం పోవడానికి నా నెత్తిమీద ఒక్క మొట్టికాయ మొట్టు!" అంటూ శృతి భుజం మీద చెయ్యేసి, "శృతీ! ప్లీజ్! నువ్వు నా డియరెస్టు ఫ్రెండువి! నువ్వలా కోపంగా ఉంటే నాకస్సలేం బావుండదు! నువ్వు! ప్లీజ్! నవ్వు!" అంది.
    
    బలవంతంగా చిరునవ్వు నవ్వింది శృతి.
    
    "అసలు మీ నాన్నగారికి గరిట కాల్చి వాత పెట్టాలి!"
    
    ప్రతిమ చిన్నగా నవ్వింది. "మా నాన్నగారికెందుకు? నాకు పెట్టు! నీ కోసం తగ్గుతుంది."
    
    "వాత పెట్టడం నా కోపం తగ్గడానికి కాదు - ఆయన పాపం తగ్గడానికి!"
    
    ప్రతిమ మౌనంగా ఉండిపోయింది.
    
    "ప్రతిమా! నువ్వు అమాయకురాలివి. నీకు అర్ధమవుతుందో, లేదో గాని ఈమధ్య ఇలాంటి కేసులెక్కువైపోతున్నాయి ప్రతిమా! ఆడపిల్ల ఉద్యోగంలో చేరగానే, ఆ సంపాదన దూరమై పోతుందేమోనన్న భయంతో పెళ్ళి చెయ్యకుండా ఉండడానికి, కనీసం పెళ్ళి వాయిదా వెయ్యడానికి తాపత్రయ పడిపోతున్నారు."
    
    "ఛీ! అలా ఎందుకు చేస్తారు ఎవరైనా?" అంది ప్రతిమ అపనమ్మకంగా.
    
    "మన అరవింద కేసే తీసుకో! తనకీ ఇలాంటి ఎక్ పీరియన్సే అయింది కదా? తన జీతం లేకపోతే ఇల్లు గడవదని అలా ముదరబెట్టేశారు. అప్పుడే ముఫ్ఫయ్ మూడు వచ్చేశాయిట అరవిందకి! నో డౌట్! రోజులు గడవడం కష్టమైపోతోంది. ఆర్ధికంగా నలిగిపోతూ, ఒక్క పైసా ఎక్ స్ ట్రా సంపాదన ఉన్నా మహా భాగ్యం అనుకునే రోజులివి. అలాగని ఇక్కడ, ఈ విషయంలో కూడా, ఆడపిల్లలే అన్యాయమైపోవాలా, ప్రతిమా? ఎటుపోయి ఎటువచ్చినా ఆడదానికేనా పనిష్ మెంటు? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు చాలవనా?" అంది శృతి ఆవేశంగా.
    
    ప్రతిమ నిశ్చయంగా తల వూపింది. "నాన్నగారు అలాంటి వారు కాదు. ఆయన భయమంతా నాకు మంచి హజ్బెండు వస్తాడో, రాడో అనే! అంతే! నథింగ్ మోర్!"
    
    "నా మొహమేం కాదూ? ఆయన ధోరణి చూస్తుంటే ఎక్కడ పెళ్ళి కుదిరిపోతోందో అని హడలిపోతున్నట్లు కనబడ్డాడు. నిన్న పిన్ని వాళ్ళింటికీ రాగానే పుల్లవిరుపుగా మాట్లాడటం మొదలెట్టి, వాళ్ళ ఇంట్లో లేని లోపాలు వెదకడానికి తహతహలాడిపోయారు తెలుసా?"
    
    మౌనంగా వింటోంది ప్రతిమ.
    
    "మొన్న మీ ఇంట్లో నాతో మాట్లాడిన మాటలు విన్నావుగా? శ్రీరాం వాళ్ళ తాత ముత్తాతలు ఏం చేస్తుండేవారని అడిగారు. యాయవారం చేసుకునే వారని చెబితే అడుక్కుతినే వాళ్ళా అని అడిగారు ఎకసెక్కంగా. మీ తాతగారి గొప్పలు చెప్పబోయారు."

 Previous Page Next Page