బండిలో కొత్త మొహాలు కనబడుతూంటే పిల్లలు కొందరు పొలోమని బండి వెంటబడ్డారు. ఆడవాళ్ళం కూడ గుమ్మాలలోంచి రోడ్డు మీదికి వచ్చి బండిలోకి తొంగిచూడడం ఆరంభించారు. అరుణకీ కాస్త సిగ్గేసింది. ఏదో వింత వస్తువుని చూసినట్లో, లేకఓ మహారాణి వస్తూంటేనో చూసినట్లు చూస్తున్నారు. ఎంత అమాయకులు.
"ఏం సుబ్బన్నా డాక్టరమ్మగారిని తీసుకొస్తున్నావేమిటి?" అంటూ ఎవరో ముసలాడు చెయ్యి కళ్ళకి అడ్డం, పెట్టి బండిలోకి తొంగిచూస్తూ అడిగాడు.
డాక్టరమ్మతనకి అప్పుడే డాక్టరమ్మ బిరుదు వచ్చిందన్నమాట అప్పుడే తనరాక వార్త వూరందరికి చాటేసినట్లున్నాడు సుబ్బారావు.
తోవలో ఇద్దరు ముగ్గురు సుబ్బారావుని పలకరిస్తూ కొత్త డాక్టరమ్మని కుతూహలంగా చూశారు. అరుణకి ఎంతో మొహమాటం వేస్తూంది. తనుఇంకా ఏదీ నిశ్చయించుకోలేదు. అప్పుడే ఈ వూరివారందరూ తనకోసం తన రాకకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
బండి శివాలయం పక్క సందులోకి వెళ్ళి ఓ పెంకుటింటి ముందు ఆగింది. ఆగగానే సుబ్బారావు ఓ గెంతు గెంతిదిగాడు. "ఇదే మాఇల్లు దిగండి" అన్నాడు ఎడ్లను పట్టుకుని. కృష్ణమూర్తి దిగి, చెల్లెలికి చెయ్యి అందించి దింపాడు.
"ఒరే నాగన్నా ఈ సామాను పట్టుకెళ్ళి ఆ ముందు గదిలో పెట్టరా" బండి ఆగడంతో లోపలనుంచి ఓ పాలేరు వచ్చాడు" సామాను లోపల పెట్టిఎడ్లకింత గడ్డి వేయి" అన్నాడు సుబ్బారావు.
"రండిలోపలికి రండి." నవ్వుతూ దారితీశాడు.
అవడం పెంకుటిల్లే గాని చూరు బాగా క్రిందికి డించి ఉంది. ముందుకి ఓ మాదిరి వెడల్పయిన అరుగులున్నాయి..... ఇటూ, అటూ ముందున్న ఖాళీ స్థలంలో ఓ వరస వావి లేకుండా ఇష్టం వచ్చినట్లు అన్ని రకాల పూల మొక్కలుకలిసి ఉన్నాయి వీధివైపు ఎడం వైపు ఏవో పాదులుపందిర్ల మీదకు అల్లుపెట్టారు. చుట్టూముళ్ళ డొంకతో కంచె ఉంది.
లోపలనుంచి ఓ వయసు మళ్ళిన ఆవిడ, ఓ పదహారేళ్ళ పిల్లనించుని అరుణవైపు కుతూహలంగా చూస్తున్నారు. వీధిలో ఓ వైపు అరుగు మీద ఓ వయసు పైబడ్డ ఆయన రాట్నం పెట్టుకుని ఏక దీక్షగా రాట్నం వడుకుతున్నారు పదమూడు, పధ్నాలుగేళ్ళ అబ్బాయి అరుగు క్రింద నిలబడి సిగ్గు సిగ్గుగా, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బండి దిగి దిగగానే ఒక్క క్షణంలోనే అరుణచూసిన దృశ్యాలివి.
లోపలికి వెళ్ళగానే అరుణమీద రాట్నం వడుకుతున్న ఆయన తల ఎత్తిచూశాడు. "మా నాన్నగారు" అన్నాడు సుబ్బారావు. అరుణ, కృష్ణమూర్తి ఒకేసారి నమస్కారం చేశారు ఆయనకి వీళ్ళ రాకఉదంతం ముందే తెలుసుకున్నట్లు ప్రశ్నలు ఏం వేయలేదు." సంతోషం అబ్బాయి చెప్పాడు. మంచిదమ్మా మంచిది నీ యత్నం సఫల మవ్వాలని ఆశీర్వదిస్తున్నాను" అంటూ ఆశీర్వదించినట్లు చెయ్యి ఎత్తాడు. అరుణఏదో చెప్పబోయింది." ఆయనకి బ్రహ్మచెముడు వినపడదు మీరేం చెప్పినా లాభం లేదు" అని వారించాడు సుబ్బారావు.
"అమ్మా ఇదిగోనమ్మా అరుణాదేవిగారు ఈయన వాళ్ళ అన్నగారు" అంటూ తల్లికి పరిచయం చేశాడు. "ఇది మాచెల్లెలు రుక్కు, వాడు మా తమ్ముడు కృష్ణ. రుక్కూ గదిలో మంచం కుర్చీ అవీ వేయించావా? వేన్నీళ్ళు పెట్టావా? రండి, గదిలోకి రండి గదిలోకి రండి స్నానం అది చేద్దురుగాని" హడావిడి పడ్డాడు సుబ్బారావు ముందువీధివైపు గదిలోకి ఇద్దర్నీ తీసుకెళ్ళాడు. రెండు నవారు మంచాలు, ఒక టేబిలు, కుర్చీ, టేబిలు మీద అల్లిక చేసిన గుడ్డ అంతా అరుణ రాకకోసం ఆర్భాటంగా ఏర్పాటు చేసినట్లు ఉంది.
సుబ్బారావు తల్లి లక్ష్మమ్మ అరుణని ఆపాదమస్తకంవింతగా పరిశీలించింది ఆ కట్టూ బొట్టూ అంతా తనకి చాలా భిన్నంగా ఉందనిపించింది. చదువుకున్న పిల్ల, పట్నం పిల్ల ఇలాగే ఉంటారు కాబోలు చదువుకుంది కదా, ఎంత గర్వంగా ఉంటుందో తమతో మాట్లాడదేమోనని సందేహించింది కాని చూస్తే అమ్మాయి మామూలుగానే ఉంది. వినయంగా నమస్కారంచేసింది మర్యాదగా పమిట నిండుగా కప్పుకుంది.
"ఏమిటమ్మా అలా నించున్నావు? కాఫీ చేశావా?" తల్లికి కర్తవ్యం గుర్తు తెచ్చాడు సుబ్బారావు.
అక్కడితో లక్ష్మమ్మ గారు అరుణని పరీక్షించడం మాని, "ఆకాఫీ డికాషన్ తీసి ఉంచాను స్నానం చేసి తాగుతావా అమ్మాయీ, ఇప్పుడే తాగుతావా?" అనడిగింది.
అరుణకి మధ్యాహ్నం వేళకి కాఫీ పడకపోవడంతో తల నొప్పిగా ఉంది. ప్రయాణం అలసటదుమ్ము ధూళి...... అంత కలిసి చిరాగ్గా ఉంది. మొహమాటాల్ని వెనక్కి నెట్టిచెప్పేసింది. "కాఫీ తాగేచేస్తాం మళ్ళీ బాగా సాయంత్రం అయితే ఇంకేం కాఫీ తాగుతాం:" అంది.
"స్నానానికి తొందరేం? ముందు కాఫీ పట్టుకురా అమ్మా?" ఆవిడలోపలికి వెళ్ళేలోపలే రుక్కు రెండుగ్లాసులలో కాఫీ తెచ్చింది. ఇత్తడి గ్లాసులు తళతళలాడేటట్లు తోమి మరీ తీసుకొచ్చింది రుక్కు. అతిథులకి మర్యాదకి భంగం అన్నట్లు నిండా పోసింది. అర్ధ గజంగ్లాసు నిండా కాఫీ.
"అమ్మో ఇంత కాఫీయా సగం తీసేయమ్మా ఇంత తాగలేనూ" అంది అరుణ రుక్కువంక ఆప్యాయంగా చూస్తూ.
"తాగేయమ్మా ఫరవాలేదు కాస్తేగా ప్రొద్దుటెప్పుడో భోజనం చేసి ఉంటారు." అంది లక్ష్మమ్మ.
కృష్ణమూర్తి మాత్రం మంచి ఆకలిమీద ఉన్నాడేమో వద్దనకుండా అంతాతాగేసి గ్లాసు కింద పెట్టాడు. అరుణ ఇంకేమనాలో తెలియక కాఫీ తాగడం మొదలుపెట్టింది. తీరానోట్లోపోసుకున్నా కమలమ్మ ఆ కాఫీ ఆ గ్లాసుడు త్రాగడం అసంభవమనిపించింది. ఇంట్లో ఫిల్టర్ కాఫీ, చిక్కటిపాలు వేసుకుని తాగడం అలవాటేమో వీళ్ళనీళ్ళలో గుండవేసి గుడ్డతో వడకట్టినట్లున్నారు. అంతా మడ్డి మడ్డిగా ఉత్త పాలవాసన వేసింది. దానికి తోడు పానకం చేశారు. వాంతి వచ్చినట్లయింది అరుణకి. బలవంతంగా సగం వరకు మింగి" ఇంక తాగలేనంది. అలవాటు లేదు ఎక్కువ తాగడం" అంది. అందరూ ఏమనుకుంటారోనని మొహమాటంగా చూస్తూ.
"ఫరవాలేదు, వదిలేయండి అలవాటు లేకపోతే" అని అన్నాడు.
"మాజానకి ఉంటే...... ఇలామీ రొచ్చినందుకు ఎంతసంతోషించేదో 'ప్చ్" అంది లక్ష్మమ్మగారు కోడలిని తలుచుకునిరాని కన్నీరు కొంగుతో వత్తుకుంటూ అరుణ ముఖంలో బాధ అనిపించి, నిజంగా జానకే ఉండి ఉంటే తనిలా వాళ్ళ పల్లెటూరికి వాళ్ళ ఇంటికి వచ్చినందుకు ఎంత ఆశ్చర్యపోయేదో వచ్చినందుకు ఎంత సంతోషంగా స్వాగతం చెప్పేదో జానకే ఉంటే తనిలా ముక్కూ మొహం తెలియని వాళ్ళ ఇంటికి వచ్చినందుకు మొహమాటపడవలసి వచ్చేదికాదు.
"దాన్ని జ్ఞాపకార్ధం ఒక నలుసైనా లేదు ఇంట్లో ఇన్నేళ్ళు కాపురం చేసినా దాని కడుపు పండలేదు. ఆఖరికి ఆ ముచ్చట తీరకుండానే వెళ్ళిపోయింది. మా మొహానికి ఆ అదృష్టం లేదు....." ఏమి టేమిటో వల్లిస్తూంది ఆవిడ.
ఆవేదననిండిన గొంతుతో....."ఏ ఎందుకమ్మా అవన్నీ ఇప్పుడు అయిపోయిందానికి విచారించి అన్నాడు.
అరుణకి అతనిని చూస్తే కాస్త ఆశ్చర్యమే అనిపించింది భార్య చనిపోయి రెండుమూడు నెలలుకూడా కాలేదు అతనిలోని విషాద ఛాయలు కనబడడంలేదు అతని నిగ్రహానికి మెచ్చుకోవాలో, భార్యని అంత త్వరగా మరిచిపోయిన అతని ఉదాసీనతకి నిరసించాలో తెలియలేదు అరుణకి.
"నిండాముఫ్ఫై ఏళ్ళులేవు వీడికి, అప్పుడేరెండో పెళ్ళి చేసుకోవలసిరావడం వాడి ఖర్మమా ఖర్మ" నుదురుకొట్టుకుంటూ అంది లక్ష్మమ్మ.
అరుణ తెల్లబోయింది అప్పుడే రెండో పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారన్న మాట ఏం మనుష్యులు ఏడేళ్ళు కాపురం చేసిన భార్యపోతే అప్పుడే పెళ్ళి ప్రయత్నాలు: ఛీ ఛీ:
"ఎందుకమ్మా ఇప్పుడా మాటలు లోపలికి వెళ్ళి నాగన్న చేతనీళ్ళు పెట్టించు స్నానం చేస్తారు." అనిమాట మార్చాడు "మీరు బట్టలు అవి తీసుకోండి స్నానం చేద్దురుగాని ఏం కావలసినా మొహమాటపడకండి. మీ ఇల్లేననుకోండి స్నానం చేసిరండి తరవాత మాట్లాడుకుందాం." గదిలోంచి వెడుతూ అన్నాడు సుబ్బారావు.
గది ఓ మాదిరి పెద్దదే అయినా, కిటికీ ఒక్కటితప్ప లేదు. ఉన్నదికాస్తా చిన్నది అయిన తగినంత వెలుతురురావడం లేదు. అందులో బాగా సాయంత్రం అయింది ఎలక్ ట్రిక్ దీపాలుండవు. హరికేన్ లాంతర్లగుడ్డి వెలుగులో అలవాటు లేక చికాకుగా ఉంటుంది. త్వరగా స్నానం అదీ చేసెయ్యాలి,' అనుకుంది అరుణ.
రుక్కు అరుణ వెంట వెంట ఉండి అన్నీ కుతూహలంగా చూస్తూంది. అరుణ ఎటాచ్ లోంచి తీసిన నూనె పౌడర్లు, క్రీములు బ్రష్ లు అవీ ఆశ్చర్యంగా చూస్తూ నిలుచుంది. అరుణ పెట్టెలోంచి సాదా తెల్లచీరబట్టలు తీసుకుని స్నానానికి బయలుదేరింది.
రుక్కుపెరట్లో స్నానాలగదికితీసుకెళ్ళింది స్నానాలగది అన్న పేరేగాని అదిగదేం కాదు. క్రిందనాపరాళ్ళు పరిచి చుట్టూతడిక, రేకులు అడ్డంపెట్టారు. పైనేం కప్పులేదులోపల ఒక బాల్చీలో వేడినీళ్ళు తోడిపెట్టారు. ఆ తడికనిండా ఉన్న కన్నాలు చూసి అరుణ అందులో స్నానం చేయడానికి బిడియపడింది.
"పెరట్లో ఎవరినీ రానీయకేం రుక్కూ, నాకు సిగ్గేస్తుంది ఇక్కడ పోసుకోవాలంటే" అంది అరుణ.