Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 12


    పార్థసారథి మాట్లాడలేదు. వెహికల్ మెయిన్ టైనర్ మొన్నే కొత్త యిల్లు కట్టడం పూర్తి చేసేడని అతడికి తెలుసు.
    "మనకి ఎన్ని వ్యాన్ లున్నాయి?"
    "ఏడు."
    "మరెందుకు ప్రెక్స్ ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళాలన్నా వాహనం లేదని గోలపెడుతూ వుంటారు?"
    ఆమె నవ్వింది. "డ్రైవర్స్ కి పాకెట్ మనీ కావల్సి వచ్చినప్పుడల్లా మన వెహికల్స్ రిపేర్ కి వెడ్తూ వుంటాయి సార్" అంది. ఈ మాటతో అతనికి కూడా నవ్వొచ్చింది.
    "ఆలస్యమయితే ఎలా? మీరు టాక్సీల్లో వెళ్తున్నారా?"
    "ఔను" అంది.
    ఒక నిర్ణీత సమయం దాటితే, స్టాఫ్ ని వ్యాన్ లలోనే ఇళ్ళదగ్గిర దింపుతారు. తెల్లవారుజామున ఎక్కించుకోవటం కూడా. "అడ్మినిస్ట్రేషన్ ప్రెక్స్ ని నేనోసారి కలుసుకొమ్మన్నానని చెప్పు" అన్నాడు. ఆమె తలూపింది. ఎక్చ్సేంజి పక్కనుంచి మలుపు తిరుగుతూంటే అతడి దృష్టి ఓల్డ్ బిల్డింగ్ మీద పడింది.
    "ఏముందక్కడ?"
    "పాత రికార్డులూ- విరిగిపోయిన ఫర్నిచరు"
    అటువైపు నడుస్తూ "తాళం తీసుందేం?" అనడిగాడు.
    "ఏదైనా వెతుకుతున్నారేమో" అంది జయ.
    అతడు తలుపు కొద్దిగా తోసి లోపలికి చూసి చప్పున మొహం వెనక్కితీసేసి తలుపు దగ్గిరకి లాగి "పదం వెళదాం" అన్నాడు. ఆమె అతడివైపు చూసింది. అతడి మొహం రక్తం లేనట్టు ఇంకిపోయింది.
    తెరిచిన తలుపు యిచ్చిన వెలుతుర్లో- ఆ మసక చీకట్లో గుట్టలు గుట్టలుగా వున్న పాత రికార్డు మధ్య - తెలుగు న్యూస్ రీడర్ రామారావు కౌగిట్లో లైబ్రేరియన్ సుషమా చక్రవర్తిని ఆమె స్పష్టంగా చూసింది.
                   *    *    *
    "కుడికాలు ముందు పెట్టు" అన్నాడు నవ్వి. "ఇదే గుడి అనుకో"
    రాధ తలెత్తి చూసింది. జేగురురంగు గోడలు, పన్నెండడుగుల ఎత్తుగా "రిజిస్టార్ ఆఫీసు" అన్న బోర్డు- దూరంగా స్టూల్ మీద జోగుతున్న ఫ్యూను. ఆమె నిజంగానే కుడికాలు ముందు పెట్టి లోపలికి ప్రవేశించింది.
    రిటైరవటానికి సిద్ధంగా వున్న ముసలాయన పెద్ద రిజిష్టర్ ముందేసుకొని కూర్చొని వున్నాడు. పక్కనే రెండు దండలున్నాయి. వీళ్ళని చూడగానే నవ్వి కుర్చీలోంచి లేచి, "వెల్ కమ్" అన్నాడు.
    కృష్ణ కూడా నవ్వి, "గుడ్ ఈవినింగ్ సర్!" అన్నాడు.
    రాధ బెదురుగా చుట్టూ చూసింది. గవర్నమెంటు ఆఫీసంటే గుట్టలు గుట్టలుగా ఫైళ్ళూ, కాగితాలూ, పడివుంటాయి అనుకుంది. ఇంత నీట్ గా వుంటుందనుకోలేదు.
    కృష్ణ మోచేత్తో పొడవటంతో ఉలిక్కిపడి చూసింది.
    రిజిష్టర్ వైపు చూపించి పెన్ ఇచ్చాడు.
    ఆమె చెయ్యి సన్నగా వణికింది.
    నెమ్మదిగా సంతకం పెట్టింది.
    "శుభం. ఇద్దరూ కలిసున్నంత కాలం సుఖంగా, ఆనందంగా వుండండి" అన్నాడు రిజిస్ట్రారు. "థాంక్యూ" అంటూ కృష్ణ, రిజిస్ట్రారు ఇచ్చిన దండని రాధ మెడలో వేసేడు. రాధకూడా కొద్ది సిగ్గుతో తలవంచుకొని, అతడి మెడలో దండ వేసింది.
    ఫ్లాష్ వెలిగింది.
    "కంగ్రాచ్యులేషన్సోయ్. ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయిలో కూడా ఇంత బిడియం, సిగ్గు వున్నాయంటే నిజంగా నువ్వు అదృష్టవంతుడివి" అన్నాడు రిజిస్ట్రారు. రాధ మొహం సిగ్గుతో మరింత ఎర్రగా కందిపోయింది.
    "వెళ్దామా" అన్నాడు కృష్ణ. రాధ తలూపింది. అతడు షేక్ హాండ్ ఇస్తూ "మళ్ళీ కలుద్దాం సార్" అన్నాడు.
    రిజిస్ట్రార్ బిగ్గరగా నవ్వి "జైలర్ కీ, పెళ్ళిళ్ళ రిజిస్ట్రార్ కీ 'మళ్ళీ కలుద్దాం' అని అనకూడదోయ్" అన్నాడు. రాధకి కూడా నవ్వొచ్చింది. చిరునవ్వుతో చేతులు జోడించి వెనుదిరిగింది.
    ఇద్దరూ బైటకొచ్చాక - "మన వాళ్ళందరికీ చెప్పి సస్పెన్సు బ్రేక్ చేద్దామా" అన్నాడు కృష్ణ. అది సస్పెన్సు. నిజంగా స్టాఫ్ కలలోకూడా వూహించలేదు- ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారని. అంత అకస్మాత్తుగా, అనుకోకుండా కృష్ణ బలవంతం మీద జరిగిపోయింది.
    "ముందు బామ్మ దగ్గిరకి వెళ్ళాలి" అంది రాధ.
    టాక్సీ రాధ ఇంటివైపు నడిచింది.
    బామ్మని చూడగానే రాధకి ఎందుకో ఏడుపు ఆగలేదు. "ఇదేమిటే - శుభమా అని పెళ్లి చేసుకొని-" అంటూ దగ్గిరకి తీసుకొంది బామ్మ.
    "నువ్వు లేకుండానే పెళ్లి చేసుకున్నాను బామ్మా!"
    "ఆకాశమంత పందిరెయ్యటానికి ఆడపెళ్ళి వాళ్లం. మన దగ్గిర డబ్బేది? మన సమస్య అర్ధం చేసుకున్నాడు కాబట్టే అబ్బాయి యిలా జరిపించాడు."
    కృష్ణ యిబ్బందిగా చూసి, "మనం వెళదామా?" అన్నాడు.
    "బామ్మని కూడా తీసుకెళదామండీ-" అంది.
    "వ్హాట్" అని అరిచాడు కృష్ణ. ".... ఇంకా నయం."
    "ఎక్కడికి నాయనా"
    "హనీమూన్ కి బామ్మగారూ!"
    "అవన్నీ నాకెందుకు బాబూ. నాకీ టిక్కెట్టు కొనిపెట్టావు చాలు" అంది. రాధ ఏమిటన్నట్టు చూసింది.
    "కాశీ వెళ్తున్నానే అబ్బాయి దయవల్ల".
    రాధ విస్మయంతో కృష్ణవైపు చూసింది. అతడు నవ్వి ముసలావిడ వైపుతిరిగి "అంతమాట అనకండి బామ్మగారూ! నాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప -" అన్నాడు నమ్రతగా.
    ఐదు నిమిషాల తర్వాతా టాక్సీ రాక్స్ పాలెస్ వైపు వెళ్తూంటే కృష్ణ అనుకున్నాడు తనలో తనే "....థాంక్స్ పరశురాముడుగారూ, అంతా మీరు చెప్పినట్లే జరుగుతోంది."
                       7
    ఆ రోజు మధ్యాహ్నం అసెంబ్లీలో పార్థసారథి రేడియో తరపున క్షమాపణ చెప్పుకున్నాడు. అతడి మూడ్ పాడయ్యింది. నిజానికి తప్పు అతడిది కాదు. కానీ ఒక సంస్థలో అత్యున్నత పదవిని చేరుకున్నాడు. ఆ సంస్థ తనది అన్న భావన కలుగుతుంది. దాని బాగోగుల్ని ఉన్నత అధికారులు తమ పెర్సనల్ విషయం గానే తీసుకుంటారు. ఈ విషయం అలా కష్టపడి పైకొచ్చిన వాళ్ళకు తెలుస్తుంది. అందుకే సారధికి ఆ రోజు మధ్యాహ్నం జరిగిన అవమానం తక్కువదేమీ కాదు. చరిత్రలో మొట్టమొదటి సారిగా ఒక రాస్త్ర ప్రభుత్వానికి రేడియో డైరెక్టర్ క్షమాపణ చెప్పుకోవటం....! అట్నుంచి అటే ఇంటికి వెళ్లిపోదామా అనుకున్నాడు. కానీ బాగోదని కార్యాలయానికి వచ్చాడు. అప్పుడు రెండయింది.
    సోషల్ రెస్పాన్సుబులిటీకి చట్టానికి తేడా తెలియనంత మూర్ఖుడు కాదు పార్థసారథి. కానీ ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయాడు. తన కుర్చీలో ఒంటరిగా నుదుటికి చెయ్యి ఆన్చుకొని శూన్యంలోకి చూస్తూ చాలాసేపు కూర్చుండిపోయాడు. ఎవరైనా కొద్దిగా కదిలిస్తే దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చేలా వుంది అతడి పరిస్థితి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. చాలా రిజర్వ్ డ్ గా, గంభీరంగా వుండేవాళ్ళు లోపల చాలా సున్నితంగా వుంటారు.
    నాలుగున్నరకి యిక అతడు సీటులో కూర్చోలేక కార్లో యింటికి వెళ్ళిపోయాడు.
                  *    *    *
    "ఈ మధ్య మీరు అదోలా వుంటున్నారు ఎందుకు" అని అడిగినప్పట్నుంచి జయ అదోలాటి గిల్టీ కాన్షస్ నెస్ తనే అనుభవించసాగింది. ప్రొద్దున్న పదకొండింటికి ఇది జరిగింది. ఆ మధ్యాహ్నమే పార్థసారథి అసెంబ్లీకి వెళ్ళాడు. ఆమెకీ అతడు వెళ్ళటం తెలుసు. వాడిపోయిన మొహంలో అతడు తిరిగిరావటం ఆమె చూసింది. తిరిగి నాలుగున్నరకి అతడు ఇంటికి వెళ్లి పోవటం గమనించింది.
    ఆ తర్వాత ఆమె మామూలుగానే ఐదింటికి ఇంటికొచ్చేసింది. ఆమె ఒక రూమ్ లో వుంటుంది. అటాచ్డ్ బాత్- ఇంకో చిన్న రూమ్ ప్రక్కనే. మొత్తం రెండువందల రూపాయల అద్దె. ఆమె జీతం ఆమెకి సరిగ్గా సరిపోతుంది. పైన ఆధారపడి ఎవ్వరూ లేరు.
    ఆరింటికల్లా ఆమె వంట పూర్తయ్యింది. తర్వాత ఒంటరిగా ఏం చెయ్యాలో తోచక దినపత్రిక తిరగేయసాగింది.
    అప్పుడొచ్చింది పొద్దుటి సంఘటన తాలూకు జ్ఞాపకం.
    మసక చీకటి- పాత రికార్డుల దొంతర్లు- రామారావు- ఆ తర్వాత ఆమె ఆలోచన - సారధి మీదకు వెళ్ళింది. తను కొంచెం కుశలం అడగగానే అతడి మొహంలో కనబడిన ఒంటరితనం- చిన్నపిల్లవాడు తాయిలంవైపు జాలిగా చూసినట్టు అనుభూతి.
    చూస్తూ వుండగానే ఆమె ఆలోచన్లలో పార్థసారథి బలంగా చోటు చేసుకున్నాడు. ఎంతో కూడా కాలేదు. మహా ఐతే పది నిముషాలు - కాకపోతే పదిహేను. అంతే! ఆమెలో ఆ క్షణమే వెళ్ళి అతడిని ఓదార్చాలన్నంత కోర్కె ఎంత బలంగా కలిగిందంటే - వెంటనే మొహానికి పౌడరు అద్దుకొని, తలుపు తాళంవేసి, క్రిందికి దిగింది. ఆలోచిస్తే అదంతా చాలా అవాస్తవికంగా కనబడవచ్చుగానీ, అక్కడ ఆలోచన లేదు. కేవలం ఫీలింగే అది. ఒక్కసారి కలిగేక- పిచ్చితనం తొందరపాటు- ఏ పదమైతేనేం - అది ఉక్కిరిబిక్కిరి చేసి, అనుకున్న పనిని చేసేసేలా చేస్తుంది. ఐతే అతడి ఇంటి తలుపు తట్టి, అతడు వచ్చి తలుపు తీసేక, అతడి మొహంలో ఒక్కసారిగా కనబడిన ఆశ్చర్యం చూసేక ఆమెలో అప్పటివరకూ వున్న ఉద్విగ్నత చప్పున చల్లారిపోయింది.
    ఆమెకి పురుషుడు కొత్తకాదు! ఐతే ఒక పురుషుడి కోసం ఇలా 'ఫీలవటం' కొత్త. కొత్తలో తడబాటు ఎప్పుడూ వుంటుంది. అది నాలుకని తడబడేటట్టూ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నదో తెలియకుండానే - శరత్ బాబు నవల్లోలా "మీ జీవితంలో చీకటిని నా యీ అర్పణ ఏమాత్రం పారదోలగలిగినా- నాకా అవకాశం ఇవ్వండి సారధిబాబూ" అంది. ఇదే వాక్యాన్ని ఆమెతో ఇంకెవరయినా అని వుంటే విరగబడి నవ్వి వుండేదేమో.

 Previous Page Next Page