"తెలుసండి! కానీ ట్రయిన్ కదిలేటైమయిపోయిందనీ..."
"బాగుందమ్మా- నీకు టైమయితే సరిపోయిందా- రూల్సెందుకనుకున్నావ్?దిగుదిగు. తొందరగా కంపార్టుమెంటులోంచి దిగి- ఇంకోదాంటో ఎక్కు...." ముసలాయన కసిరాడు.
ఆవిడ జాలిగా చూసింది కానీ ముసలాయన కారాగాలేదు. ఆవిడ లేచి నిలబడింది. గార్డ్ విజిల్ వేశాడు. అయినా ఆవిడ ఆగలేదు. ముసలాయనమాటలు, చూపులు ఆవిడ అహంపై దెబ్బతీశాయేమో- కదుల్తున్న బండిలోంచికూడా దిగిపోడానికి సిద్దపడిందామె.
"చూడమ్మా- ఎక్కడిదాకా వెడతావ్?" అన్నాడు ముసలాయన.
"బండి కదుల్తున్నట్లుంది. సామర్లకోటలో దిగి బోగీ మారవచ్చు కానీ అందాకా కూర్చో..." అన్నాడాయన.
ఆవిడ చటుక్కున ఆగిపోయింది. వెనక్కు తిరిగి "రాజమండ్రిదాకా సీటు ఇప్పించాగలరాండీ..." అంది.
"కాళీ వుంటే నేనే ఇచ్చేవాణ్ని సామర్లకోటలో దిగి నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో అమ్మా-." అన్నాడాయన. ఆవిడ డబ్బులివ్వబోతే పుచ్చుకోలేదు- "నేను టికెట్ కోయబోవడంలేదు అలాంటప్పుడు డబ్బులెలా తీసుకుంటారు? అన్నాడాయన.
రాజారావు ఆశ్చర్యంగా ఆయనవంక చూశాడు. దేశంలో ఇలాంటి వుద్యోగులు- ముఖ్యంగా రైల్వే రిజర్వేషన్ కంపార్టు మెంటులో వున్నారా? అందరూ ఇలాగే వుంటే ఎంత బాగుండేది?
ముసలాయనకు హృదయముంది. అందరి కష్టాలనూ అర్ధంచేసుకుని సాయపడడానికి ప్రయత్నిస్తాడు. తనకు వీలైనంతలో అందరకూ మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రూలు గురించి పిచ్చిలేకపోయినా- అన్ని రూల్సు నతిక్రమించడు. న్యాయప్రకారం వ్యవహారం జరిగిపోవడానికి తన ప్రయత్నం తను చేస్తున్నాడు. పైసాకూడా లంచంపుచ్చుకోడు. ఈ నిజాయితీ ఆయనకిచ్చిన ప్రతిఫలం ఏమిటో?
"ఇంకా రెండేళ్లు సర్వీసుంది నాకు. ఈ వుద్యోగం చేసి చేసి జీవితంలో అలసిపోయాను. హాయిగా కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలన్నది నా కోరిక. నన్నిబ్బంది పెట్టకండి. ఉంటే నేనే ఇచ్చేవాణ్నిగా..." అంటున్నాదయన బాలకృష్టతో.
ట్రయిన్ సామర్లకోటలో ఆగింది. వాల్తేరువెయిటింగ్ లిస్టు నంబర్ వన్ కోసం ముసలాయన ఎదురుచూస్తూ కూర్చున్నాడు. సామర్లకోటలో పొజిషన్ చాలా టైటుగా వుంది. అక్కడ కోటా పూర్తికాగా - వెయిటింగులిస్టువాళ్ళు అయిదుగురున్నారు వాల్తేరతను రావడంతో అక్కడి వెయిటింగు లిస్టువాళ్ళకి బెర్తు దొరకలేదు. ఆడమనిషిని బోగీలోంచి దింపేశాడు ముసలాయన. ట్రయిన్ మళ్ళీ కదిలింది.
"మీ సీటు బెజవాడవరకే వుంది. ఏలూరునించీ ప్రయత్నాలు మొదలుపెడితే మీకు సికింద్రాబాదు వరకూ సీటు దొరుకుతుంది లేకపోతే బెజవాడ నుంచి మీ ప్రయాణం దుర్భరమవుతుంది. కంపార్టుమెంటు మారడం ఎలాగూ తపప్దు మీకు..." అంటూ స్నేహ పూర్వకంగా అందరికీ సలహా ఇచ్చాడు ముసలాయన.
"మాకింకే ఆశ లేదంటారా?" అన్నాడు ఈశ్వర్రావు.
"బాగుందండీ- రామాయణమంతావిని రాముడికి సీత ఏమవుతుందన్నాట్ట. అలావుంది__" అన్నాడు ముసలాయన "నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ బోగీలో మీకు విజయవాడ వరకే సీటు. ఆ తర్వాత ఇందులో మీకు అవకాశంలేదు. నేను విజయవాడలో దిగిపోతాను__"
మీరు దిగితే మా అవకాశం పెరిగినట్లే_" అనుకున్నాడు ఈశ్వరరావు.
ట్రయిన్ రాజమండ్రిలో ఆగింది. అక్కడ పొజిషన్ చాలా టైటుగా వుంది. కోటా జనం అందరూరాగా వెయిటింగు లిస్టులో పదిహేనుగురున్నారు. ఒక్కరికీ బెర్తు దొరకలేదు. పులిమీద పుట్రలా అక్కడికింకో వ్యక్తి వచ్చాడు.
అతనికి వాల్తేరు-బొంబాయి బోగీలో రిజర్వేషన్ దొరికిందట. తెలియక అతను సికింద్రాబాద్ రిజర్వేషన్ బోగీలో ఎక్కాడట. అక్కడ కండక్టర్ అతనికి మళ్ళీ రిజర్వేషన్ చార్జి చేశాడట. ఆ ప్రకారం అందులో ప్రయాణం చేస్తుండగా తోటి ప్రయాణికుడు వివరాలు చూసి - మీకు బొంబాయి బోగీలో రిజర్వేషన్ అయింది. అది వేరే వుంటుంది- వెళ్ళి కనుక్కోమన్నాడట.
"బాగుందండీ-" అన్నాడు ముసలాయన-"బొంబాయి బోగీలో రిజర్వేషనుంటే సికింద్రాబాద్ బోగీ ఎక్కడం బాగానే వుంది. అందులోని కండక్టర్ మీకు మళ్ళీ రిజర్వేషన్ చార్జి చేయడం బొత్తిగా బాగాలేదు. అంతగా అందులోకాళీలుంటే ఈ టిక్కెట్టు మీదనే అందులోనూ బెర్తుఈయవచ్చు. మీరు రాలేదనుకుని మీ బెర్తు ఇంకొకరికిచ్చేశాం ఇప్పుడేం లాభంలేదు__"
"అంతేనంటారా?" అన్నాడతను.
జరిగింది ఈశ్వరరావు కర్ధమైంది. ఈ మోసం బహుశా పుణికింతాలవ్యక్తి కోసం వాల్తేర్ ప్లాటుఫారం కౌంటర్ వ్యక్తి చేసి వుంటాడు ఈ మనిషికి బొంబాయిబోగీ గురించి తెలిసివుండదు, రిజర్వేషన్ విషయంలో ఏదో గంద్రగోళంముందనీ కావాలంటే కొత్తగా టిక్కెట్టు రాసిస్తాననీ అని వుంటాడు. ఇంత ప్రయాణంలో అయిదున్నరకోసం ఎవడూ చూసుకోడు కదా! బొంబాయిబోగీలోని ఈ కాళీ, వెయిటింగులిస్టు నంబరు వన్నూ కలిపి- వెరసి మొత్తం రెండు బెర్తులూ- పుణికింతాల వ్యక్తి మనుషులకిచ్చేశారు. జరిగిన మోసం ఆ మనిషికిప్పటికి తెలిసినట్లుంది.