Previous Page Next Page 
హిమసుందరి పేజి 11

    "తనని మంటల్లోకి తోసిన మొగుడిని రక్షించటం."

    "ఇంతటితో తనకి విముక్తి ప్రసాదించినందుకేమో!"

    "మీకంతా వేళాకోళంగా వున్నట్లుంది."

    "వేళాకోళం కాదు. ఇలాంటి త్యాగాలు నాకూ నచ్చవు. మీనాక్షి అలా ఎందుకు చేసింది. అంటే ఏం చెప్పను? స్త్రీ మనసు అగాధం అని, సముద్రం కన్నా లోతని- అదని, యిదని అంటారు కదా పెద్దలు....."

    "సరేలెండి! ఆ తర్వాత ఆ మాష్టారు ఏమయారు?"

    "పెళ్ళాం చావంగానే మీదపడి భోరున ఏడిచాడు. కిందపడి దొర్లుతూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. జరిగిందానికి పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు కాబోలు అనుకున్నారు. ఏడాది తిరక్కముందే మళ్ళి పెళ్ళి చేసుకున్నాడు."

    "అలాంటి దౌర్భాగ్యుడికి పిల్లనెవరు యిచ్చారు?"

    "ఆడపిల్లను కన్న తల్లీ, తండ్రీ!"

    "పాపం! ఆ పిల్లదాని బతుకు కూడా అలాగే అయిందా?"

    "ఉహూ! ఆరు నెలలు మాష్టారుతో కాపురం చేసి, రిబ్బెన్ లు, ఊదొత్తులు సైకిలు మీద పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్మే జహంగీర్ అనే కుర్రాడితో ఓ మంచి ముహూర్తం చూసుకుని లేచిపోయింది."

    "ఆహా ఎంత మంచిపని చేసింది!" సీతామనోహరి సంతోషపడిపోతూ అంది.

    "ఇది మంచిపనా!" రామకృష్ణ తెల్లబోయాడు.

    "చాలా మంచిపని. మాష్టారు తలతీసినంత పని. నేరం చేయని మీనాక్షి చావుకన్నా గొప్ప తీర్పు. నన్నడిగితే ఇలాంటి మగవాళ్ళకి బుద్ధిరావాలంటే ఏ కసాయి వాడినో తీసుకుని లేచిపోవటమే కాదు- మాస్టారు ఎదురింట్లోనే కాపురం పెట్టాలి దాంతో మాస్టారు లాంటి వాళ్లకి బుద్ధి వస్తుంది!" సీత ఆవేశంగా అంది.

    "పిచ్చి సీతా! నీకు ఆవేశం తప్ప ముందు చూపు లేదు. ఆడది యిలా మాట్లాడితే లోకం తాటాకులు కడుతుంది. నీ మంచితనం, అమాయకమయిన బుద్ధి నాకు తెలుసు గాబట్టి నిన్ను అర్ధం చేసుకున్నాను. అందరి ఎదుట అనేవు."

    "ఏం అంటే?"

    "నవ్వుతారు."

    "నవ్వనివ్వండి!" మొండిగా అంది సీత.

    "నీ ఇష్టం! నీకు లేని బాధ నాకెందుకు?" ఆ ప్రసక్తి అంతటితో తుంచేస్తూ అన్నాడు రామకృష్ణ.

    "తర్వాత మాస్టారు ఏమయ్యారు? సన్యాసుల్లో కలసిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా?"

    "రెండూ చెయ్యలేదు. మూడోపెళ్ళి చేసుకున్నాడు ఈ పిల్ల మీనాక్షిలాగా చావలేదు- రెండోపెళ్ళాం లాగా లేచిపోలేదు. కొన్నాళ్ళు కాపురం చేసి, యిద్దరి పిల్లలను కూడా కంది. మూడో పెళ్ళాం పరమగయ్యాలిట. వెంకట్రావు మాస్టారుని మధ్య మధ్య కొడుతుండేది."

    సీత చిన్నపిల్లలా ఆనందం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టింది. :భలే భలే" అంది.

    అది చూసి రామకృష్ణ కి నవ్వు వచ్చింది.

    "కధ అయిపోయిందిగా - ఇంక పడుకుందామా సీతూ!" ముచ్చటపడుతూ అడిగాడు రామకృష్ణ.

    "కుదరదు" అంది సీత. ఆ అన్నతీరు కూడా టాట్, వల్లకాదు- అని అరిచినట్లు అనిపించింది.

    "ఏమయింది సీతా?"

    "ఏమీ కాలేదు- మీరు మాట తప్పారు."

    "నేను మాట తప్పానా! లేదే?"

    "లేదే కాదు - గుర్తులేదే అనండి."

    "గుర్తులేదే!"

    "వెంకట్రావు మాష్టారు కధ, దశరధరామయ్య కధ చెపుతానని ఒక్క కధ మాత్రమే చెప్పారు."

    "ఓ..... అదా! గ్రాంధిక భాషలో చెప్పాలంటే- ఇప్పటికే కాలాతీతం అయింది. సీతే! నా ప్రాణ మనోహర్!"

    "చాలించండి. మీరు ఏ భాషలో చెప్పినా ఈ సీత కరిగి నీరు కాదు." వస్తున్న నవ్వుని బిగబట్టుకుని సీత సీరియస్ గా అంది.

    "ఉత్త నల్లరాయి!"

    "నల్లరాయి, కటిన శిల, రేగటి మట్టి లాంటి తిట్లు ఆఖరుకి తిడుదురుగాని - కధ కానీండి. ఇలా నాన్చారంటే మీకే నష్టం."

 Previous Page Next Page