"విశాలా! అంతా విధి లీల అమ్మా! నా బ్రతుకు బయటపడే రోజులు వచ్చియిలా అయింది. ఏనుగంత కొడుకుకంటే ఎలికంత భర్త మేలు అన్నారు. ఎంతచేసినా ఎంత చూసినా భర్తముందు అంతా దిగదుడుపే!"
"నేను అనుభవించాను కదా వదినా!"
"విశాలా! నీ కూతురికి రేచీకటి అంటే అబ్బాయి ఏమంటాడో- సగం గుడ్డిదాన్ని ఎలా చేసుకోను అంటాడో ఏమో తెలిసి తెలిసి ఎలా అని నేను కాస్త మధనపడ్డానమ్మా! అందుకే భగవంతుడు నాకీ శిక్ష విధించాడు."
"అలా అనొద్దన్నయ్యా! ఎవరికర్మ కెవరు కర్తలు? ఎవరి కెలా రాసివుంటే అలా జరగకమానదు. మనువు అయినా మన చేతిలోలేదు. దేనికయినా ప్రాప్తముండాలి."
"ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది విశాలా! మధుని- నిలేసి అడగ్గలను, వాదించి వప్పించగలను."
"ఇప్పుడా సంగతులన్నీ ఎందుకన్నయ్యా! జయప్రద నా యింటి కోడలయ్యాక అవన్నీ ఆలోచిద్దాం, చెల్లి పెళ్ళి చేశాక మధుకి బాధ్యత పెరుగుతుంది. వాడే స్వయంగా నిర్ణయించుకోగలడు, మనం ఎందుకు వత్తిడి చేయాలి."
విశాల చేతలందుకుని ఆమె తల తడిమి "విశాలా! ఒక కడుపున పుట్టకపోయినా నీకు నేనంటే ఎంత ప్రేమ తల్లీ! ఆత్మీయుల ప్రేమానురాగాలు ఆపదల్లోనే బయటపడేది. నీది చాలా మంచి మనసు విశాలా!" అన్నాడు సుందర్రావు.
"పద వదినా! అవన్ని మాట్లాడుకోవటానికి ఇదా సమయం. ముందు కాళ్ళూ ముఖం కడుక్కుని కాఫీ తీసుకుందువు గానీ" అంది అన్నపూర్ణ.
లేచి పెరట్లోకి కదిలారిద్దరూ!
నీళ్ళు తెస్తున్న జయప్రద అత్తనిచూసి పలకరింపుగా నవ్వి "ఎప్పుడొచ్చావత్తయ్యా?" అని పలుకరించింది.
"ఇప్పుడే జయా! కులాసానా?"
తలూపి వంటింట్లోకి వెళ్ళిపోయింది జయప్రద. పెరట్లోకి నడిచారిద్దరూ.
* * *
'ప్రేమ గొప్పది'
'మంచి స్టేట్ మెంట్'
"ప్రేమ పవిత్రమైంది"
"మంచి కామెంట్"
"ప్రేమ విలువైంది"
"మంచి మాట"
"ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది"
'మంచి టైటిల్'
'ప్రేమే దైవం'
"సినిమా పేరా?"
"మణీ! ఎందుకు నన్నిలా ఆటలు పట్టిస్తావ్?"
నవ్వింది మణి.
"మధూ! నీవు చెప్పిన మాటలన్నీ నిజమే! కానీ అవన్ని యిప్పుడు అప్రమత్తం. ప్రేమించి పెళ్ళి చేసుకునే వారు మాటాడాల్సిన మాటలుకావు."
"మరేం మాటాడాలి?"
"ఆరోజు చెరుకుతోటలో ఏమేం మాటాడావు?"
"క్షమించు మణీ! ఆరోజు ఆవేశంలోనే, కాదు నీపై ప్రేమతో నీనుంచి అందీ అందకుండా వుండే అంగీకారంలో నిన్ను నాదాన్ని చేసుకున్నాను."
"నేను కాదన్నానా? నీ మనసు తెలుసుకున్నాను. నీ ప్రేమ గుర్తు తెచ్చుకున్నాను. ఈ రోజుల్లో మనలాంటి యువతీ యువకులు ఏది తప్పు కాదని భావిస్తున్నారో అందుకు అంగీకరించాను"
మణి చేతిని తన చేతుల్లోకి తీసుకుని "మణీ! నిజంగా నీవు నా జీవితానికి వెలుగువు.నీవే నా జీవితంలో ప్రవేశించకుండా వుంటే నా బ్రతుకు నిర్జీవంగా, అంధకారయుతంగా సాగిపోయేది. నలుగురిలాగా పెళ్ళి చేసుకుని నెలనెలా జీతం తెచ్చి కుటుంబాన్ని పోషిస్తూ, ఏడాదికో రెండేళ్ళకో పిల్లల్నికంటూ రొటీన్ జీవితాన్ని ముగించి వుండేవాడిని. కానీ నీ అమృతమయిన రాక వలన నా జీవితమంతీ వెలుగు నింపుకుంది. నిజం మణీ! ప్రేమించే భార్య దొరకటం- జీవితానికి వరం" అన్నాడు ఉద్వేగంగా.
"మధూ! ఇప్పుడా విషయం ఎందుకు" అంది అతనంతగా తనని పొగుడుతూ వుంటే సిగ్గుతో.
"ఇప్పుడు నాకో చిక్కువచ్చింది మణీ!"
"ప్రేమికులకి ఎదురయ్యే అడ్డుగోడేనా?"
"అంటే?"
"పెళ్ళేనా?"
"అవును"
"మీ నాన్నగారు ఏదయినా నిశ్చయించారా?"
"అవును- మా నాన్నగారికి ఓ వేలు విడిచిన చెల్లెలుంది చుట్టరికం కాస్త దూరమే అయినా ఆత్మీయత దృఢమైంది. అసలు ఆమె కొడుక్కి మా చెల్లెల్ని ఖాయం చేసుకుని రావాలనే మా నాన్నగారు అక్కడికి వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తూ తిరిగివస్తూ ఏక్సిడెంటుకి గురయ్యారు.
ముఖ్యంగా అదే ఇప్పుడు నా మెడకి ఉరితాడవుతోంది.
మా అత్తగారు ఓ కండీషన్ పెట్టారు. ఆమెకి ఇద్దరే పిల్లలు. ఓ అబ్బాయి! ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి ఈమధ్య రేచీకటి జబ్బువచ్చింది. ఖర్మ. రాత్రంతా ఆవిడకి అంధకారం.
నేనా అమ్మాయిని చేసుకుంటే తన కొడుక్కి మా జయని చేసుకుంటుందట."
చూశావా? ఎంత స్వార్ధమో?