Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 11


    
    నాకైతే ఏమీ కనిపించలేదు.
    
    ఇక అక్కడ వుండడం భావ్యం కాదనిపించి వచ్చేశాను.
    
    రెండోరోజు రంగస్వామి బస్టాండ్ లో వున్నప్పుడు వెళ్ళి కలుసుకున్నాను.
    
    "సాయంకాలం అయిదుగంటలకి మెయిన్ రోడ్డుమీద కాకుండా పొలాల్లోంచి మీ ఇంటికి వచ్చేసేయ్" అని చెప్పాను.
    
    "ఎందుకు?"
    
    "అదంతా తరువాత- ముందు నువు నాకోమాటివ్వాలి"
    
    "ఏమిటి?"
    
    "నువు ఎలాంటి దృశ్యాన్ని చూసైనా కోపం తెచ్చుకోకూడదు" కొంచెంసేపు ఆలోచించాక "సరే" నన్నాడు.
    
    "రేపటినుంచి నువ్వు తాగకూడదు"
    
    దానికీ సరేనన్నాడు.
    
    "ఆడపిల్ల తప్పుకైనా మగవాడే బాధ్యత నీ విషయంలోనూ అంతే. నీ భార్య గురించి నీకంటే వూరికంతా బాగా తెలుసు. ఆ పిల్ల చాలా మంచిది. నువ్వేదాన్ని చెడ్డదాన్ని చేశావ్. అందుకే నువ్వు నీ తప్పు గ్రహించాలి. ఇకనైనా  ఆ పిల్లను మంచిగా చూసుకోవాలి"
    
    "ఇప్పుడు ఇవన్నీ ఎందుకు?"
    
    "అవసరం కాబట్టే చెబుతున్నాను" అని వచ్చేశాను.
    
    అదేరోజు సాయంకాలం రంగస్వామి కరెక్టుగా హాజరైపోయాడు.
    
    ఇద్దరం నిన్న నేచూసిన పొలం దగ్గరికివెళ్ళాం. అప్పటికి చీకటి తెరలోకం ముఖం మీదికి జారిపోయింది. గాలి ఇలాంటి దృశ్యాల్ని చాలా చూడాలని పరిగెడుతున్నట్టు వేగంగా వీస్తోంది. నక్షత్రాల్ని పట్టుకోవడానికి మబ్బుల వలల్ని దేవతలు విసిరినట్టు ఆకాశమంతా తెల్లగా వుంది. అప్పుడే పుడుతున్న చందమామ ఎర్రటి జిలేబీ ముక్కలా వుంది.
    
    గాలికి వ్యతిరేకంగా మొక్కజొన్న కంకులు కదిలాయి.
    
    అంటే వున్నారన్నమాట.
    
    మరో పదినిమిషాలకు కాబోలు మధుమతి పొలం గట్టు మీదికి వచ్చింది అంతక్రితం అనుభవించిన సుఖమంతా ఆమె ముఖంలో చెమట బిందువు లేచినట్టు లేత వెన్నెల్లో కనిపిస్తోంది.
    
    "అదిగో నీ భార్య" అన్నాను చిన్నగా.
    
    రంగస్వామి ఆవేశంతో వూగిపోయాడు.
    
    "నువ్వు నాకిచ్చిన మాట మరిచిపోయావా" అన్నాను సీరియస్ గా. ఏమనుకున్నాడో ఏమో గానీ మౌనంగా వుండిపోయాడు.
    
    "నువ్వు మారకుండా నీ భార్యను హింసించావని తెలిస్తే నిన్ను చంపి జైలుకి వెళ్ళడానిక్కూడా జంకను" అన్నాను హెచ్చరిస్తున్నట్టు.
    
    రంగస్వామి ముఖంలో భయం నీళ్ళలో మొసలి చర్మంలా కదిలింది.
    
    "ఇద్దరం మరో దారిగుండా వూర్లోకి వచ్చేశాం. అలా మధుమతిని, రమేష్ ని పట్టుకుని డిటెక్టివ్ రంగనాయకిని అయ్యాను" అని చెప్పడం ఆపింది.
    
    చాలాసేపటివరకు లిఖిత మాట్లాడలేకపోయింది.
    
    "రంగస్వామి ఆ తరువాత మారాడా"
    
    "ఆ చచ్చినట్టు మారాడు. ఆడది ఏం చేస్తుందిలే అన్న తక్కువ భావం వున్నప్పుడే మగాడు ఆమెను గడ్డిపరక క్రింద జమకడతాడు. ఆమెకీ బలం వుందని తెలిస్తే తోక ముడిచేస్తాడు. రంగస్వామి ఆ విషయం గ్రహించే మారాడు. తాగుడు అంతా మానేశాడు. పెళ్ళాం తప్ప మరో లోకం లేనట్టు వుండిపోయాడు."
    
    "ఇప్పటివరకు మొత్తం ఎన్ని కేసులు పట్టావ్?"
    
    "ఇరవై రెండు"
    
    "ఎలా?"
    
    "కొత్త సంబంధం పెట్టుకున్న వాళ్ళంతా మామూలుగా కొన్ని తప్పులు చేస్తుంటారు. దాంతో దొరికిపోతుంటారు. అలా ఎవరికీ దొరక్కుండా ఈ సంబంధాన్ని కొనసాగించాలంటే మొత్తం పన్నెండు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి ఓ అమ్మాయితో పెళ్ళయిన ఓ పురుషుడు హోటల్ కే వెళ్ళాడనుకుందాం. తామిద్దరూ వుండే రూమ్ కి ఎదురుగా వున్న గదిని కూడా తనే బుక్ చేసుకోవాలి. ఎప్పుడయినా ఇద్దరూ కలిసి బయటికి రావాలంటే పక్కనున్న రూమ్ లోంచి ఎవరయినా అప్పుడే బయటికి వస్తున్నారేమో చూసుకుని ఎవరూ రావడం లేదని నిర్దారించుకున్నాక బయటపడాలి. కానీ ఇలా తమ గదిలోంచి తల మాత్రం బయటపెట్టి చూస్తున్నప్పుడు ఎదురుగదిలోంచి ఎవరయినా వచ్చి తమను చూసే అవకాశం వుంది. కనుకే ఎదురుగదిని కూడా తామే బుక్ చేసుకోవాలి. తమ సంబంధాన్ని ఎవరయినా చూశాక వచ్చే ఇబ్బందులతో పోలిస్తే ఓ గదికి అదనంగా అద్దె చెల్లించడం పెద్ద విషయమేమీ కాదు. ఇలా మొత్తం పన్నెండు జాగ్రత్తలు పాటిస్తే మన కొత్త సంబంధాన్ని ఆ బ్రహ్మదేవుడైనా పట్టుకోలేడు."
    
    "ఏమిటవి?"
    
    "ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్కో జాగ్రత్త చెబుతాను. ఏ జాగ్రత్త తీసుకోకపోవడంవల్ల ఆ జంట నాకు పట్టుపడింది కూడా వివరిస్తాను. సరేనా?"
    
    లిఖితకు ఓ ఇంగ్లీషు పుస్తకం గుర్తొచ్చింది. ఆ పుస్తకం పేరు 'కాట్ ఇన్ ది యాక్ట్' అమెరికాలో ప్రముఖ డిటెక్టివ్ విలియం డబ్ల్యు పియర్స్ అనే ఆయన రాశారు. పదేళ్ళ కాలంలో ఆయన మొత్తం ఐదువందల కొత్త సంబంధాలను పట్టుకున్నాడు. ఇరవై రెండు కేసులను తాను ఎలా పట్టుకున్నదీ అందులో రాశాడు. ఆయన కేవలం పది జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని ఏ డిటెక్టివ్వూ పట్టుకోలేడని రాశాడు. మరి ఈమె ఏమిటి పన్నెండు అంటూ వుంది.
    
    రంగనాయకి ఇండియన్ డిటెక్టివ్ కాబట్టి మరో రెండు జాగ్రత్తలను ఎక్ స్ట్రాగా చెబుతోందా?
    
    "అప్పుడప్పుడూ నువ్వొస్తుండాలి. నువ్వు కనబడితే కొండంత ధైర్యం" లిఖిత అర్దిస్తున్నట్టు అడిగింది.
    
    "అలానే"
    
    "వస్తానని ఒట్టు పెట్టు"
    
    లిఖిత చేయి ముందుకు చాచింది. అయితే రంగనాయకి దాన్ని అందుకోకుండా "జితేంద్రమీద ఒట్టు- తప్పక వస్తాను" అని లేచింది.
    
    జితేంద్ర విషయం ఎవరికీ తెలియదనుకుంటున్న లిఖిత ఆమె నోటంట ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
    
    "జితేంద్ర చెప్పిందంతా నిజమే నగల దుకాణం నడిపేవాడు. నీమీది మోహంతో అలా నీ వెంబడి వచ్చేశాడు" రంగనాయకి చోద్యం చెబుతున్నట్టు ఆశ్చర్యాన్ని ముఖానికి పౌడర్ లా రాసుకుని చెప్పింది.
    
    "మరి ఆ నగల దుకాణం ఇప్పుడేమైంది!"
    
    "ఈ వెర్రిబాగులోడు ఏమైనా చెప్పుంటేనా? అలా వచ్చేశాడు. ఆ అంగల్లో పనిచేసే వాళ్ళు రెండురోజులు చూసి మూడోరోజు నుంచి హస్తలాఘవం ప్రారంభించారు. పదిరోజులు తిరిగేసరికల్లా రాక్ లు తప్ప నగల్లేవు. నెల బాడుగ కట్టకపోయేసరికి దుకాణాల యజమాని రెండురోజుల ముందే మరొకరికి దుకాణాన్ని అద్దెకిచ్చేశాడు. ఇప్పుడక్కడ మాధురీదీక్షిత్ చీరల ఎంబ్రాయిడరీ అంగడి జరుగుతోంది"

 Previous Page Next Page