'నర్సమ్మ, నాయర్ నమ్మకస్తురాలయిన నౌకర్లు అనుకుంది. కాని తను పిచ్చిది అని తెలిసి కూడా వాళ్లిరువురు తను రాంగానే చటుక్కున మాటలెందుకు ఆపేయాలి, నాయర్ కనుసైగ చేయాలి? అది గ్రహించి నర్సమ్మ ఎందుకెళ్ళిపోవాలి? ఈ యింట్లో వీరిరువురి గూడుపుఠాణీ ఏమిటి? ఇంట్లో సామానులు చాటుగా చేరవేసే యింటి దొంగలా? భగవాన్ గాడి మోచేతి నీళ్ళు తాగి పడున్న మోసగాళ్ళా?"
తను రాసిన లెటర్ నాయర్ కి గాని, నర్సమ్మకి గాని యిచ్చే ప్రయత్నం మానేసి, ఆలోచనలో పడిపోయింది అమల.
"ఏంటమ్మాయిగారూ! ఏం కావాలి?" అన్నాడు నాయర్ కుక్కర్ మీద వెయిట్ పెడుతూ.
"ఆ......ఆ..... వచ్చాడు, వచ్చారు. సరాసరి కళ్ళు మూసుకుపోండి, కనపడతారు. ప్రభాకరుడు" నాయర్ వ్యంగ్యంగా అన్నాడు.
"ఇదిగో కళ్ళు మూసుకుని నీవు చెప్పినట్లే వెళుతున్నా. ప్రభా కనపడకపోయాడో, జాగ్రత్త నీ ముక్కు చెవులు కోసి కుక్కలకు వేస్తా" అని అమల కళ్ళు తెరుచుకునే రెప్పలయినా ఆర్పకుండా గదిలోంచి బైటకు వచ్చింది.
'నాయర్ ని, నర్సమ్మని, తనని ఈ ఇంట్లో ప్రవేశపెట్టిన నౌకర్ ని, శంకరంని, ఎవరిని నమ్మటానికి లేదు. మరి ఎవరిని నమ్మితే పనవుతుంది?" ఆలోచిస్తూ అమల ముందు గదిలోకి వచ్చింది.
ముఖ్యమైన వాళ్ళతో అతి ముఖ్యమైన పనులు మాట్లాడటానికి వరండా ముందు గది వుపయోగిస్తుంటాడు భుజంగరావు.
గది లోపలికి అడుగుపెట్టి ఆగిపోయింది అమల. గిరుక్కున వెనుతిరిగి పోదామనుకుంది. కాని ఆ ప్రయత్నం విరమించి, అక్కడే నుంచుంది.
"రోజా తల్లీ! రామ్మా! ఇంతకుముందే మన కృష్ణ వచ్చాడు. నీ బావమ్మా!" భుజంగరావు సోఫాలోంచి లేచి అమలవద్దకు వస్తూ అన్నాడు.
"రోజీ!" అన్నాడు కృష్ణ సోఫాలోంచి లేచినుంచుని.
అమల పిచ్చివాలకంతో కృష్ణని ఎగాదిగా చూస్తూ నుంచుంది.
సీమ దొరలా వున్నాడు కృష్ణ. ఖరీదైన సూటు, మంచి పర్సనాలిటీ. నల్లని నొక్కుల దుబ్బు క్రాఫు, గుబురుగా వున్న సైడ్ లాక్స్, ఉండిలేనట్లు సన్నని మీసకట్టు. ఎర్రటి పెదవులు విశాలమైన నుదురు, చురుకైన కళ్ళు. సూటిగా వున్న ముక్కు, అందము, హుందాతనం అతని సోత్తయినట్లున్నది.
"సరోజ ఈ కృష్ణను కాదని ప్రభాకర్ అందమైనవాడా?" అమల ఆలోచిస్తున్నది.