పెద్ద పెద్ద అంగలతో ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు.
"చార్జ్" అని అరిచాడు శివరాజ్!
సర్పాలు రెండూ వెనుకకు తిరిగాయి. జనం వెనుకకు తిరిగి భయంతో పరుగులు తీస్తున్నారు. అతని శ్రేయోభిలాషులు కావచ్చు. ద్రవిడ మాహేశ్వరుడి అభిమానులు కావచ్చు. వెనుకనించి కాలర్ పట్టుకుని లాగుతున్నారు. అడుగు ముందుకు వేయటం అసాధ్యమయింది.
జనం అంతా ఒక వంక! వారి మధ్య శివరాజ్ చిక్కుబడిపోయాడు.
యోగి మరొక వంక! అతని మార్గం నిరాఘాటవమయింది.
రెండు సర్పాలతో అతడు పూర్తిగా కనుమరుగు అయ్యాడు.
జనాన్ని త్రోసుకొని దారి చూసుకుంటూ ఎ.యస్.పి వారి నుంచి బయటపడగలిగాడు. కాని ఆ సమయానికి ముద్దాయి అక్కడలేడు.
"యింక అతని విషయంలో కల్పించుకోవటం మంచిదికాదు"
"ఎవరో దారి తప్పి వచ్చిన మహాయోగి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు."
ఇలా ఎవరి యిష్టం వచ్చినట్టు వారు మాటాడుతున్నారు.
ఆ మాటలేవీ పట్టించుకోకుండా కోర్టు ఆవరణలోకి పరుగుతీసి జీపులో కూర్చుని స్టార్టు చేశాడు. వీలయిన చోటున సమాచారం సేకరిస్తూ నగరమంతా గాలించాడు. అతని ఆచూకీ తెలియలేదు.
రాత్రి తొమ్మిది గంటలు అయ్యేసరికి నీరసంతో కృంగిపోయాడు కార్యాలయంలోకి వచ్చి కూర్చున్నాడేకాని మనసు మనసులోలేదు.
పగపట్టి వెళ్ళిపోయిన ద్రవిడ మాహేశ్వరులం మళ్ళీ తిరిగొస్తాడా? ఒకే ప్రశ్న అతని మనసంతా ఆవరించి తొలుస్తోంది. వృత్తిరీత్యా తనకి ఎదురయిన మొదటి పరాజయం అది. అవమానం భరించరానిది అయింది.
మరో అయిదు నిమిషాలకు ఆఫీసర్స్ క్లబ్ నించి టెలిఫోన్ పిలుపు! హడావుడిగా బయలుదేరాడు! హాలు వెనక ఎ.సి. రూంలో ఎదురుచూస్తున్నారు.
జిల్లా కలెక్టర్! జిల్లా మేజిస్ట్రేట్! పోలీసు సూపరింటెండెంట్!
"అతన్ని పట్టుకోవాలని నీవు చేసిన ప్రయత్నం విఫలమయింది. ఈ వార్త నీ కన్నా ముందుగానే మా దగ్గరకు చేరింది" అంటూ ప్రారంభించాడు ఎస్.పి.
"విఫల మవుతుందని నాకు ముందుగానే తెలుసు" జస్టిస్!
"ఎలా ఊహించ గలిగారు ముందుగానే!" డిస్ట్రిక్టు కలెక్టర్!
"అతడు మంత్రశక్తులు కలిగినవాడిని అతనితో మాట్లాడినప్పుడే వూహించాను! చట్టరీత్యా అతనికి విధించాల్సిన శిక్ష విధించాను. కాని ఈ చట్టాలు ఈ యంత్రాంగం ఇవేమీ అతన్ని బంధించలేవని నాకుతెలుసు! నా చిన్న తనంతో ఒకసారి మా తండ్రివెంట కొండ ప్రాంత గ్రామాలు చూచేందుకు వెళ్ళాను. నల్లమల అడవుల ప్రాంతమది.
అప్పుడు ఇలాంటి ఒక వ్యక్తిని చూచాను. ఎన్నో కథలు విన్నాను.
నాగులు నరులు పరస్పరం సమ్మోహపరచుకొంటూ సహజీవనం సాగించే విచిత్రమయిన వ్యవస్థ అది!
"అదంతా అబద్దం అని నేను అనుకోలేను!" అన్నారు జడ్జిగారు.
జిల్లా కలెక్టర్ గారు అవును అనలేదు. కాదు అనలేదు.
"సర్! ఎప్పటికయినా అతన్ని పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడతాను. ప్రస్తుతానికి అతను తప్పించుకున్నా నేను విడిచి పెట్టాను. వెతికి పట్టుకుంటాను" అన్నాడు శివరాజ్ ఏ.యస్.పి. పట్టుదలగా.
జడ్జిగారు ఎస్.పి. వంక చూచారు.
"హనీమూన్ కి వెళ్ళాలని పెట్టిన శలవు కాన్సిల్ చేసుకోనవసరం లేదు. వెళ్ళి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకో!" అని సలహా యిచ్చారు ఎస్.పి.!!
3
"అజహర్ భాయిజాన్" అనే పేరు జనం నోళ్ళల్లో పడి శతాబ్దాలు మారాక 'అజర్ బైజాన్' గా రూపాంతరం అయింది.
వాస్తవానికి ఆ ప్రాంతం సోవియట్ యూనియన్ వ్యవసాయానికి చాల కీలకమయిన చోటుగా వుండేది. యూనియన్ విడిపోయాక పరిస్థితి వేరు. కాని అంతకు మునుపు సామూహిక వ్యవసాయ క్షేత్రాలు నెలకొల్పటానికి యూనియన్ కి చాల అనుకూలమయిన ప్రాంతంగా దాన్ని గుర్తించారు.
సహజంగా బీడుగా పడివుండి శతాబ్దాలపాటు ఆలనా పాలనాలేని ప్రాంతాన్ని సాగులోకి తీసుకువస్తున్న క్రొత్తలో కొన్ని ప్రత్యేకమయిన సమస్యలు తలెత్తుతాయి.
వ్యవసాయ విప్లవం పేరుతో అజర్ బైజాన్ లోని బంజరు ప్రాంతాలలో సాగుబడి ప్రారంభించారు.
అక్కడ తలయెత్తిన సమస్యలతో పాముల బాధ ఒకటి!
అంతకు పూర్వం వారిలో సర్పాలు కాటు వేస్తే మరణించే వారి సంఖ్య అధికంగా వుండేది. క్రొత్త వ్యవసాయ విప్లవం రైతులకి ఈ సమస్యని మరింత చేసింది.
సెంటిమెంట్స్ యందు విశ్వాసాలు ఎక్కువ!
విప్లవం విజయవంతమయ్యాక ప్రజలలో సర్పాల గురించి సమస్యలు అధికమయ్యాక వారి విశ్వాసాలను తొలగించటం అత్యవసరమని ప్రభుత్వాలు భావించాయి.
సర్పాల గురించి శాస్త్రీయ విచారణ సైంటిఫిక్ స్టడీ చేయవలసిందిగా రచయితల్ని కోరటం ప్రోత్సహించటం జరిగింది.
ఆ విధంగా పాపులర్ అయినా ఓ రచయిత గులసుల్విస్కీ నోవ్! ఆయన ప్రపంచంలోని పాముల మీద జరిగినా సైంటిఫిక్ స్టడీని అపోసన పట్టి నూతన సిద్దాంతాలు ఏర్పరచాడు.
వాటిలో మొదటి పాయింట్ పాములు హిందువులు భావించిన విధంగా పగబట్టవు. వాటి జోలికి వెళ్ళినా ప్రతీకారేచ్చతో పని చేయగల శక్తి వాటికి లేదు అని ప్రకటించాడు గులసుల్విస్కినోవ్! రెండో పాయింట్ పాములకు అతీత శక్తులుండవు. అవి శతాబ్దాలు జీవిస్తాయనే మాట అబద్దం! వాటి అత్యధిక వయసు యిరవై ఆరు సంవత్సరాలు మాత్రమే! అన్నాడు.