Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 10

    "మళ్ళీ..."

    "రేపు."

    ఆమె చేతిని ప్రేమగా నిమిరి వదలి వెళ్ళాడు. కారు కదిలి ముందుకెళ్ళిపోయింది.

    ఈ దృశ్యం చూస్తున్న ధర్మారావు పెదవులమీద చిన్న చిరునవ్వు మెదిలింది.

    ఎన్నో సంవత్సరాల క్రితమైతే అతని సున్నితమైన మనస్తత్వం ఇలాంటి సంఘటనలు తిలకిస్తే విలవిల్లాడిపోయేది  కాని ఇప్పుడది అనుభవాల సంపుటిగా మొరయబారిపోయి వుంది. ఇప్పుడతని చర్మం చాలా దళసరి.

    ఎవరూ బయటకు వెళ్ళి తలుపు తియ్యవలసిన అవసరం లేదు. విద్యుల్లతాదేవి దగ్గర డూప్లికేట్ కీ వుంటుంది.

    రెండు నిమిషాల తర్వాత ఆమె గదిలోకి వచ్చింది. భర్తని చూసి చిరునవ్వు నవ్వి "పార్టీ బాగా జరిగిందా?" అనడిగింది.

    "చాలా"

    మరో పదినిమిషాల్లో ఆమె బాత్ రూమ్ లోకి వెళ్ళి ముఖం కడుక్కోవడం, డ్రెస్ మార్చుకోవడం పూర్తిచేసింది.

    అతని వంక చూసి మళ్ళీ నవ్వి చేతిలోని గ్లాసు తీసుకుని ఫ్రిజ్ మీద పెట్టి "మరీ అంత ఎక్కువగా త్రాగకూడదు రండి" అంది దగ్గరకు లాక్కుంటూ.

    అతనేమీ జవాబు చెప్పలేదు. ఆమెతోబాటు ప్రక్కమీదకు వొరిగాడు.


                                          4


    ప్రొద్దుటే పాలవాడు వచ్చి మరునాటికల్లా డబ్బివ్వకపోతే పాలు పొయ్యనని గోలచేసి వెళ్ళాడు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. జానకిరామయ్య ఆర్ధిక బాధ భరించలేక అడపా తడపా తన ఆఫీసులోని తోటి ఉద్యోగస్థుల దగ్గర అప్పులు చేస్తూ వుండేవాడు. ఆయన ఆఫీసులో పరిస్థితి బాగా ఉన్న కొందరు ఉద్యోగులు ధారాళంగా వడ్డీ వ్యాపారం చేస్తూ వుంటారు. అవసరం కొద్దీ అయిదు రూపాయలు, ఎనిమిది రూపాయలు, ఆఖరికి పది రూపాయల వడ్డీకి కూడా చాలా మంది అప్పు తీసుకున్న వాళ్ళను, వదలకుండా అంటిపెట్టుకుని వుండి ఖచ్చితంగా వడ్డీ వసూలు చేస్తారు. అలాగే కొంతమంది చీట్లు పాట పెట్టి అందులో మొదట ఇతరుల్ని బలవంతంగా ఇరికించి పాటపాడి తీసుకున్నాక నెలనెలా వసూలు చెయ్యడంతో  జీవితాలు  దుర్భరమైపోతూ ఉంటాయి.

    వాడవాడలా, ప్రతి ఇరవై ముప్పయి ఇళ్ళకూ ఒకచోట, రకరకాల ఆఫీసుల్లో ఈ చీట్లు అనే జాడ్యం మహమ్మారిలా వ్యాపించి ఉంది. ఈ చీట్లు, హెచ్చు వడ్డీలకు పుట్టే అప్పులు ఈ వ్యసనానికి అలవాటుపడి మానవుడు, పోనీ సగటు మానవుడు రోజు రోజుకూ జీవితం దుర్భరం చేసుకుంటూ వుంటాడు.

    ఆ రోజు జానకిరామయ్య ఓపిక చేసుకుని ఆఫీసు కెళ్ళాడు.

    ప్రొప్రయిటరు అతని వంక విసుగ్గా చూశాడు. "ఏమిటిలా వచ్చావు? ఇంతవరకూ తీసుకున్న సెలవు చాల్లేదా? ఇంకా పొడిగించ డానికొచ్చావా?" అన్న భావముంది ఆ చూపులో.

    రెండు నిమిషాలు మౌనంగా నిలబడి ఆయన ఎంతకూ తనని పలకరించకపోయేసరికి "కొంచెం ఎడ్వాన్స్ కావాలని వచ్చాను" అన్నాడు జానకిరామయ్య సంశయిస్తూ.

    "ఎడ్వాన్సా, ఇంతవరకూ తీసుకున్నవి చాల్లేదా" అన్నాడు ప్రొప్రయిటర్ చిరాగ్గా.

    "...అవసరం"

    "డబ్బు అవసరాల గురించి నీకంటే నాకెక్కువ తెలుసు జానకిరామయ్యా! ఒక ఏడాదిగా నిన్ను గమనిస్తున్నాను. నువ్వు పనిచెయ్యడం కన్నా సెలవులు తీసుకోవడం ఎక్కువైపోయింది. నువ్వు ఉద్యోగం నుంచి విరమిస్తే మంచిదని నా ఉద్దేశం."

    జానకిరామయ్య మొహం మాడిపోయింది. "దయవుంచి అలా అనకండి. ఇంకా పెళ్ళిళ్ళు కావల్సిన ఆడపిల్లలున్నారు. కొడుకు ఇంకా చేతికి  అంది రాలేదు" అన్నాడు వణికే కంఠంతో.

    "అందుకని...ఎన్నాళ్ళని ఓపికపట్టమంటావు? రేపట్నుంచే పనిలోకి రాకపోతే తీసిపారేస్తాను. నాక్కూడా విసుగెత్తిపోయింది."

    జానకిరామయ్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నీరసం వల్ల కానీ, వేదనవల్ల అతని మొహమంతా స్వేద బిందువులు అలుముకుని వున్నాయి.

    "సరే అలాగే వస్తాను. ఈ పూట డబ్బులివ్వండి" అన్నాడు.

    "లేవు" అన్నాడు ప్రొప్రయిటర్ తల క్రిందకు దించుకుని టేబుల్ మీద ఫైల్స్ వంక దృష్టి మరలిస్తూ.

    ఇంకో క్షణం అలాగే నిలబడి జానకిరామయ్య ఉసూరుమంటూ బయటకు వచ్చాడు.

    రోడ్డుకు అటువైపు ఎదురుగ చిన్న టీ కొట్టు వున్నది. చొక్కా జేబు తడుముకుంటే ఒక అర్ధరూపాయి బిళ్ళ తగిలింది. అటూ ఇటూ చూసి రోడ్డు క్రాస్ చేసి టీ కొట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిల్చుని త్రాగడానికే గాని, కూచోడానికి వసతి లేదు. నిలబడే మెల్లగా టీ త్రాగేసి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికేసి బయల్దేరాడు.

 

 Previous Page Next Page