Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 9

    గేటుదాకా వెళ్ళి అతిథుల్ని సాగనంపి ధర్మారావు లోపలికి వచ్చాడు. హాలు తలుపులు వేసి, తన గదిలోకి వెళ్ళబోతూ ఏదో అనుమానంతో వెనక్కి తిరిగాడు.

    తేజ తన గదిముందు నిలబడి వుంది.

    జుట్టు విరబోసుకుని, లేత గులాబీరంగు మేక్సీలో వుంది తేజ.

    "డాడీ!" అంది.

    "తేజా! ఇంకా నిద్రపోలేదా?"

    తేజ అతనికి దగ్గరగా వచ్చింది. "బయట కార్లు స్టార్ట్ చేస్తోన్న శబ్దానికి ఇప్పుడే మెలకువ వచ్చింది డాడీ!" అని ఒక్క క్షణం ఆగి, "డాడీ! ఒక్క విషయం అడగనా?" అంది.

    మగతగా, మత్తుగా కదుల్తోన్న ధర్మారావు కళ్ళు ప్రశ్నార్ధకంగా చూశాయి.

    "మీరిప్పటికే చాలా సంపాదించారు కదా, ఈ ఆర్భాటాలు  హంగామా ఇదంతా దేనికి?"

    ధర్మారావు నవ్వాడు " 'బాగా సంపాదించాడు'_ ఈ మాట సామాన్యులు అనుకునే పదాలు తేజా! దానికి అంతులేదు. అదో సముద్రం. కొంత కాలం సంపాదించి ఒకచోట ఆగిపోతే నిలకడగా నిలబడిపోయేదికాదు. ఓపిక వున్నంతకాలం ఈ సముద్రంలో ఎడతెరిపి లేకుండా ఈదుతూనే వుండాలి తేజా! రోజుకు అర్ధరూపాయి సంపాదించే దరిద్రుడి స్థానం నుంచి, లక్షలూ కోట్లు ఆర్జించే స్థితికి వచ్చానంటే జీవితంలో ఎన్ని మలుపులూ, అనుభవాలూ చూశానో నీకు తెలీదు. అతిమంచిగా వున్నన్నాళ్ళూ ఎన్నో కష్టాలు, ఎంతో దుఃఖం చవిచూశాను. దుర్భర దారిద్ర్యం అనుభవించాను. పైకి రావాలి డబ్బు సంపాదించాలి అంతే. ఇంకో ఆలోచన లేదు. నీతి, అవినీతి _ వీటి తారతమ్యం మరచిపోయాను. జీవితంలో జూదమాడాను తేజా! మంచి, నిజాయితీ, శీలం వీటి అర్ధాలు మరచిపోయాను, నీతిగా వున్నవాడెవడు కొన్ని మెట్లు దాటి పైకి పోలేడు. ఎక్కడో ఒకచోట ఆగిపోతాడు. సొసైటీలో కొన్ని విజయాలు సాధించదలచుకున్న వాడెవడూ వీటి గురించి ఆలోచించకూడదు. మెతకదనానికి ఎంతో దూరంగా వుండాలి. అమాయకత్వం, దయ మానవ జీవితానికి శాపాలు. అలా వున్నావారెప్పుడూ ఇతరులచేత మోసగించబడుతూనే వుంటారు కఠినత్వం, గడుసుతనం కొందరికి వరాలు. రాజకీయాలలోని, వ్యాపార రంగాలలోకాని ఎప్పటికప్పుడు ప్రత్యర్ధుల్ని తొక్కి పారేస్తూ పైకి వెళ్ళిపోవాలి. ఇదే నేను తెలుసుకున్న ధర్మం."

    మగతతో నిండివున్న ఆ కళ్ళలో, అవి ప్రసరించే కాంతిలో ఎన్నో సత్యాలు స్పురించాయి తేజకు.

    "తేజా! వెళ్ళి పడుకో, నాక్కూడా నిద్రవస్తోంది" ధర్మారావు తన గదిలోకి వెళ్ళిపోయాడు.

    లోపల ఎంతో అందంగా తీర్చిదిద్దినట్టున్న బెడ్ అతన్ని చూసి క్షణంపాటు వెక్కిరించినట్టయింది.

    కాని అతనేం బెదిరిపోయినట్టవలేదు. వాడ్రోబ్ దగ్గరకు వెళ్ళి లోపల్నుంచి నైట్ డ్రెస్ తీసుకుని దుస్తులు మార్చుకున్నాడు. కూతురితో నిద్రవస్తోన్నట్టు అన్నా నిజానికతనికి నిద్రరావడంలేదు. ప్రతిరోజూ అతను చాలా కొద్ది గంటలు నిద్రపోతాడు. మెలకువగా వున్నంత సేపూ తనకు నచ్చిన రకరకాల సబ్జక్టుల మీద వివిధ గ్రంథాలు చదువుతూ వుంటాడు. అతని లైబ్రరీలో వివిధ విషయాలకు సంబంధించిన అమూల్యమైన పుస్తకాలెన్నో వున్నాయి.

    ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళి డోర్ తెరచి ఐస్ క్యూబ్స్ తీసుకుని ఓ గ్లాస్ లో స్కాచ్ విస్కీ తీసుకుని రెండు క్యూబ్స్ వేసుకున్నాడు. కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు.

    అయిదు నిమిషాలలా గడిచింది.

    అతను నిల్చున్నచోటుకు ఆ వీధిచివరి దాకా కనిపిస్తోంది. వెలుగుతున్న స్ట్రీట్ లైట్ కాంతులవల్ల అంతా స్పష్టంగా గోచరిస్తోంది. అర్దరాత్రి కావడంవల్ల జనసంచార మేమీలేదు.

    ఉన్నట్టుండి వీధి చివర ఓ కారు మలుపు తిరిగి ఇటుకేసి వస్తూ వుండడం కనిపించింది.

    ఆ కారులో తన భార్య విద్యుల్లతాదేవి వస్తూ వుంటుందని అతనికి తెలుసు.

    విద్యుల్లతాదేవి సాయంత్రం ఏడు దాటగానే తన హ్యాండ్ బ్యాగ్ లో నలభయి, ఏభయి వేల రూపాయల క్యాస్ తీసుకుని కార్డ్సు ఆడటానికి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. క్లబ్బుల్లో కాకుండా _ సోఫిస్ట్ కేటెడ్ సొసైటీకి చెందిన కొన్ని ఇళ్ళే ఆమె పేకాట వ్యసనం తీరడానికి కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి.

    ఈ గేమ్ లో ఆమెకు ఎంతమందో పరిచయస్తులు ఏర్పడుతుంటారు. కొన్ని పరిచయాలు పెరిగి తెగిపోతూ వుంటాయి.

    కారు ధర్మారావు విశాలమైన భవంతి ముందాగింది.

    స్టీరింగు ముందు ఓ యువకుడు కూర్చుని వున్నాడు. విద్యుల్లతాదేవి కారుదిగి చుట్టూ తిరిగి అతనివైపు కొచ్చింది.

    "అర్జెంటేంలేదు కారు తీసుకెళ్ళండి, రేపు తీసుకుంటాను."

    "మీకు ఇబ్బందేమో"

    "ఇబ్బందేమీ లేదు. మాకు ఇంకా మూడు కార్లున్నాయి."

    అతను చెయ్యిజాపి ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కుని వ్రేళ్ళని ముద్దుపెట్టుకున్నాడు.
   

 Previous Page Next Page