Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 11

             *                 *                   *

    గోపీకృష్ణ నీట్ గా డ్రస్ చేసుకుని అద్దం ముందు నిలబడి పావుగంట సేపు తల దువ్వుకుని బయటకెళ్ళబోతున్నాడు.

    "గోపీ!" అని పిలిచింది ప్రజ్ఞ లోపలినుంచి.
   
    "ఏమిటే, త్వరగా చెప్పు. అవతల చాలా పన్లున్నాయి" అన్నాడు గోపీకృష్ణ విసుగ్గా.

    గోపీకృష్ణ అంటే ప్రజ్ఞకు చాలా ప్రేమ. అతను జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని _ ఆడుతూ పాడుతూ గడపాలని చూస్తున్నాడని ఆమెకు తెలుసు.

    అతనికి దగ్గరగా వచ్చింది.

    ఇద్దరకూ వయసులో ఒక రెండేళ్ళకంటే భేదం లేదు. అతన్ని 'అన్నయ్యా' అనకుండా "గోపీ" అని పిలవడమే ఆమె అలవాటు.

    "ఏమిట్రా అంత అర్జంటు పన్లు. కాలేజి ఎగ్గొట్టి స్నేహితుల్ని వేసుకుని రోడ్డు వెంట తిరగడమేగా"

    'అందులో వున్న ఛారమ్ నీకేం తెలుసే వెర్రిదానా' అన్నట్టు చూశాడు గోపీకృష్ణ.

    "ఒరేయ్! నీకు చదువుమీద ఇంటరెస్టు లేకపోతే పోనీయ్. చదువు మానేసి ఏదయినా ఉద్యోగంలో చేరకూడదూ?"

    "ఉద్యోగమా? ఏం ఉద్యోగం చెయ్యమంటావు?"

    "ఏదయినా చెయ్యవచ్చు. ఇప్పుడీ ఊళ్ళో  బోలెడు ప్రయివేటు కంపెనీలున్నాయి. వాటిల్లో చిన్న చిన్న ఉద్యోగాలుంటాయి. నాన్నగారి దగ్గర ఎకౌంట్స్ రాయడం నేర్చుకుని, పార్టు  టైంగా ఎకౌంట్స్ రాసి సంపాదించటానికి బోలెడు షాపులున్నాయి.

    గోపీకృష్ణ హేళనగా నవ్వాడు. "ఏమిటే ఇంత బతుకూ బతికి గుమాస్తా ఉద్యోగాలూ, ఎకౌంట్స్ రాసి గడుపుకునే ఉద్యోగాలు చెయ్యమంటావా?"

    "మరి ఏం చేస్తావురా? అటు చదువుకోక, ఇటు చిన్న చిన్న ఉద్యోగాలూ పనికిరావు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు"

    గోపీకృష్ణ మళ్ళీ నవ్వాడు. "నేను చదువుకోకపోయినా, మీ దృష్టిలో ఉపయోగకరమైన పని చెయ్యకపోయినా, మీరెవరూ ఊహించనంత గొప్పవాడ్నవుతాను. చూస్తూ వుండు" అన్నాడు.

    "ఎలాగ? లాటరీ టిక్కెట్లు కొంటున్నావా?"

    "అలాంటి వెర్రి మొర్రి పనులు నేనేమీ చెయ్యను. నా స్వయంకృషి వల్లే పైకి వస్తాను."

    ప్రజ్ఞ అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది. గోపీ కళ్ళలో జీవితంలో ఏదో చెయ్యగలనన్న ఆత్మ విశ్వాసం, ఆత్మ  విశ్వాసాన్ని మించిన ధీమా తొణికిసలాడుతున్నాయి.  అతని  నమ్మకమేమిటో, కృషి ఏమీ లేకుండా ఎలా పైకి రాగలననుకుంటున్నాడో  ఆమెకర్ధం కాలేదు.

    ఈ తరం కుర్రాళ్ళకు ఏ పరిస్థితులలోనూ రాజీపడని మనస్తత్వం, సమర్ధతకు మించిన అహం ఉంటుందని ఆమెకు తెలుసు. జీవితాలు కాలిపోవడంవల్ల అవి ఎలా దారితీస్తాయో కూడా ఆమెకు తెలుసు. అతన్తో వాదించి ప్రయోజనం లేదని ఊరుకుంది.


                   *                       *                   *


    గోపీకృష్ణ బయటకు వెళ్ళిపోయాక ప్రజ్ఞ తల్లి దగ్గరకెళ్ళింది.

    "అమ్మా!" అని పిలిచింది.   
  
    ఇంటి వెనక భాగంలో వున్న వరండాలో నేలమీద కూర్చుని పరధ్యానంగా ఏదో చూస్తున్న రాఘవమ్మ తలత్రిప్పి చూసింది.

    "నేను..."

    రాఘవమ్మ 'చెప్పు' అన్నట్టు చూసింది.
   
    "నేను ఉద్యోగం చేస్తాను"
   
    "నీకు ఉద్యోగమెవరిస్తారు?"

    "ఏదో ఒకటి బట్టల కొట్లో సేల్స్ గరల్ గానో, ఫోటో స్టూడియోల్లో, లాబ్ లో పనిచేసే అమ్మాయిల్లాగానో, నెలకు రెండొందలో, మూడు వందలో సంపాదించే ఉద్యోగాలు మా ఫ్రెండ్స్ చాలామంది చేస్తున్నారు."

    "దానివల్ల ప్రయోజనమేమిటే ?"

    "నాన్నగారి ఆర్ధిక ఇబ్బందుల్లో చేదోడు వాదోడుగా వుంటాను."
   
    రాఘవమ్మ  నవ్వింది. "ఆ చాలీ చాలని సంపాదనకు ఇంకో చాలీ చాలని సంపాదన తోడయినంత మాత్రాన మన సమస్యలు చల్లారవు"

    "మరి?"

    "తొందరగా పెళ్ళి చేసుకుని ఈ నరకం నుంచి వెళ్ళిపో."

    "ఇంకో నరకంలోకా?"

    "మనలాంటి వాళ్ళకు ఎక్కడకెళ్ళినా నరకాలే తారసపడుతూ వుంటాయి, స్వర్గాలు ఎదురవ్వవు."

    "అలా ఎప్పుడు ఏదో ఒక నరకంలోనే వుండవచ్చునుగా, ఇంకొకటి ఎందుకు వెతుక్కోవాలి."

    "సామాజిక ధర్మం కోసం."

    ప్రజ్ఞ తల్లి ముఖంలోకి చూసింది. జీవితంలోని సమస్తాన్నీ పోగొట్టుకున్నట్టు నిర్లిప్తంగా, శూన్యంగా గోచరించింది.    
 

 Previous Page Next Page