అగ్నిసాక్షి
మైనంపాటి భాస్కర్.
అందమైన చిన్న బంగాళా అది.
అందులో ఒక హాలు.
ఆ హల్లో జరుగుతోంది గ్రాండ్ గాలా పార్టి.
ఆ పార్టీ అరేంజ్ మెంట్స్ అన్ని చూసుకునే బాధ్యత ఒక పెద్ద హొటల్ కి అప్పగించాడు శశికాంత్.
హొటల్ నుంచి పదిహేను మంది సిబ్బంది వచ్చారు. సూటు వేసుకున్న ఒక స్టివార్డ్. సిల్కు చీరె కట్టుకున్న ఒక లేడీ సూపర్ వైజర్ యూనిఫారంలో ఉన్న ఒక కేక్స్ స్పెషలిస్టు. ఒక వైన్స్ స్పెషలిస్ట్.
మిగతా వాళ్ళు బట్లర్స్, వెయిటర్స్.
వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చాలా సమర్ధవంతంగా చేసుకుపోతున్నారు.
ఆ హల్లో ముడువైపులా పొడుగాటి బల్లలు వేశారు. వెన్నెల్లో ముంచి తీసినట్టున్న తెల్లటి బట్టలు పరిచి ఉన్నాయి వాటి మీద.
బల్లమీద సన్నని మంటలో వెలుగుతున్న నాజుకయిన స్టవ్ లు ఉన్నాయి. వాటిమీద అమర్చి వున్నాయి వెండి పాత్రలు.
ఆ పాత్రలలో ఉన్నాయి బిర్యాని, బగారా బైగన్, ఆలూ గోబీ, పీస్ మసాలా, పానీర్ మాటర్ మసాలా- ఇంకా -ఇంకా చాలా రకాలు. ఒక పెద్ద డిష్ లో పూరీలు వున్నాయి. ఇంకో డిష్ లో పెరుగు పచ్చడి.
"నాన్ వెజ్ డిషెస్ ఇటువైపు వున్నాయి" అన్నాడు శశికాంత్ బిజినెస్ మాగ్నేట్స్ ఖోస్లా వాడియాలతో.
వాళ్ళిద్దరూ కూడా పార్టీ అయిపోయాక శశికాంత్ తో లక్షలు విలువ చేసే కాంట్రాక్టులు కుదుర్చుకుని , అగ్రిమెంట్స్ సంతకాలు చేసే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు.
శాశికాంత్ ఇచ్చే పార్టిలంటే బిజినెస్ సర్కిల్స్ లో చాలా ఫేమస్. పార్టీలకోసం డబ్బు నీళ్ళలా ప్రవహింజేయగలడు.
మద్యం పుచ్చుకునే వారికోసం అక్కడే ఒక మూలగా చిన్న బార్ ఉంది. తళతళలాడుతున్న బాటిల్స్ వరసగా పేర్చి ఉన్నాయి. ఒక బార్ టెండర్ అక్కడ నిలబడి క్రిస్టల్ గ్లాసులని పరిశుభ్రమైన గుడ్డతో పాలిష్ చేస్తున్నట్లు భక్తిగా తుడుస్తున్నాడు. ఆ మధ్యాలలో ఖరీదైన 'టీచర్స్' స్కాచ్ విస్కీ నుంచి అమెరికన్ జిన్ అండ్ టానిక్ రష్యన్ ఒడ్కా, ఫ్రెంచ్ షాంపేనూ, గోవనీస్ ఫెనితో సహా అన్ని రకాలూ ఉన్నాయి.
ఇంకో ఇద్దరు వెయిటర్స్ ఒక టేబుల్ మీద సపోటా, సీతాఫలాలు, బత్తాయి, బొప్పాయి, అరటి, యాపిల్, పళ్ళు, పిరమిడ్లలాగా పేరుస్తున్నారు.
మరోవైపు క్రిస్టల్ బవుల్స్ లో నాలుగు రకాల ఐస్ క్రిములు, నాలుగు రకాల పుడ్డింగులూ వున్నాయి.
చేతిలో కాక్ టెయిల్ గ్లాసు పట్టుకుని మధ్య మధ్య మద్యం చప్పరిస్తూ గెస్టుల మధ్య "సర్క్యులేట్" అవుతున్నాడు శశికాంత్. చిరునవ్వుతో అందరిని పేరు పేరునా పలకరిస్తున్నాడు.
కాక్ టెయిల్స్ పూర్తికాగానే చిన్నచిన్న పింగాణి పాత్రలలో సూప్ సర్వ్ చేయడం మొదలెట్టారు తెల్లటి లివరీస్ ధరించి ఉన్న వెయిటర్స్.
వెయిటర్ తెచ్చిన ట్రేవైపు చూశాడు ఖోస్లా. టొమాటో సూప్, వెజిటబుల్ సూప్, చికెన్ సూప్, కార్న్ సూప్- అలా అరడజను రకాలు ఉన్నాయి ట్రేలోని పింగాణి పాత్రలలో.
తను టొమాటో సూప్ తీసుకున్నాడు ఖోస్లా. చికెన్ సూప్ తీసుకున్నాడు వాడియా.
"ఎంతయి ఉంటుంది, ఈ పార్టీకి ఖర్చు?" అన్నాడు వాడియా ఆరాగా.
"ఎంత కాదన్నా పాతికవేలకు తక్కువ అయి ఉండదు" అన్నాడు ఖోస్లా.
"తెగ సంపాదిస్తున్నాడు బిజినెస్ లో! ఖర్చు పెట్టుకొని! ఖర్చు పెట్టుకోవడానికి కాకపోతే డబ్బెందుకు?" అన్నాడు వాడియా , కొంచెం జెలసి కలిసిన గొంతుతో.
ఇద్దరూ నవ్వుకున్నారు.
"ఆ అమ్మాయితోనేనా శశికాంత్ ఎంగేజ్ మెంటు ఇప్పుడు?" అన్నాడు ఖోస్లా, శశికాంత్ కి దగ్గరగా నిలబడి ఉన్న ఒక అమ్మాయి వైపు చూస్తూ.
"అయి ఉండాలి. చక్కటి జంట! లక్కి బగర్!" అన్నాడు వాడియా ప్రశంశపూర్వకంగా.
వాళ్ళిద్దరూ తనని గురించే మాట్లాడుకుంటున్నారని గమనించినట్లు వాళ్ళ వైపు తిరిగి తలపంకించి చిరునవ్వు నవ్వాడు శశికాంత్.
తెల్లటి సూటు వేసుకుని ఉన్నాడు అతను. కాళ్ళకి తెల్లటి కిడ్ లెదర్ షూస్ - నల్లటి షర్టు వేసుకున్నాడు. టై కట్టుకోలేదు.
చాలా కాజువల్ గానే ఉన్నా చాలా స్మార్ట్ గా కనబడుతున్నాడు అతను.
అతని పక్కనే నిలబడి ఉన్న సౌమ్య మొహంలో కొద్దిగా బిడియం కనబడుతోంది. పింక్ కలర్ శారిలో గులాబి మొగ్గలా కనబడుతోంది తను.
ఆ అమ్మాయితో తన పెళ్ళి కుదిరింది అని అందరికి తెలియజేప్పటానికే శశికాంత్ ఇప్పుడు ఈ పార్టీని ఏర్పాటు చేశాడని అక్కడున్న అందరికి తెలుసు.
ఆ విషయాన్ని ఇప్పుడు ఫార్మల్ గా అనౌన్స్ చేస్తాడు శశికాంత్. ఇప్పుడో, ఇంకో నిమిషంలోనో!
దానికోసమే ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు అందరూ.
"ఆ అమ్మాయి ఏం చదువు చదివిందో తెలుసా?" అన్నాడు ఖోస్లా.
"తెలియదు. కానీ చూడగానే అనిపిస్తోంది కనీసం రెండన్నా మాస్టర్స్ డిగ్రిస్ ఉండి ఉంటాయని" అన్నాడు వాడియా.