Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 9


    సూర్యం యస్. యస్. సి. పాసయ్యేవరకూ ధనలక్ష్మికి రోజులు అంతంత మాత్రంగా ఎలాగో గడిచాయి. ఈలోగా ధనలక్ష్మి పెద్దమనిషి అయింది. ఇరుగూ, పొరుగూ జానకి దగ్గిరచేరి "ఈ అమ్మాయికి పెళ్ళి చెయ్యరా?" అని అడగటం ప్రారంభించారు. అలా అడిగినప్పుడల్లా జానకి గుండెల్లో రాయి పడేది. ధనలక్ష్మికి పెళ్ళి చెయ్యటం ఎలాగా? అని. ధనలక్ష్మికి పెళ్ళిచేసి పంపిస్తే తనకు చేదోడు వాదోడుగా ఎవరుంటారా అని.... పెద్దమనిషి అయ్యాక కూడా ధనలక్ష్మి ఇరుగు పొరుగిళ్ళకు పని సాయాలకు వెళ్ళటం మానలేదు. ఆ వీధికి ప్రక్క వీధిలో లాయరుగారి భార్యకు ఏదో జబ్బుచేసింది. కొన్నాళ్ళు వండిపెడితే నెలకు నలభై రూపాయలిస్తానంది. సంతోషంగా ఒప్పుకుంది ధనలక్ష్మి. "నువ్వక్కడ వంటచేస్తే, నాకు ఇంట్లో ఎవరు సాయం చేస్తారు?" అని సణుక్కుంది జానకి.
    "తెల్లవారుఝామున లేచి మన ఇంట్లో వంటచేసి అక్కడికి వెళ్తాను అత్తయ్యగారూ! మనింట్లో పెందలాడే వంటయిపోతే, అందరికీ మంచిదేగా!" అంది. జానకి సమాధానపడి ఊరుకుంది.
    సూర్యం యస్.యస్.సి. ఫస్ట్ క్లాసులో పాసయినరోజు ధనలక్ష్మి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. తను అడుగున దాచుకున్న డబ్బులోంచి తనే వస్తువులు కొని, మిఠాయి చేసి ఇంట్లో అందరికీ పెట్టింది.
    "మావయ్యగారూ! తమ్ముణ్ణి కాలేజీలో చేర్పించాలి! ఆ గొడవలన్నీ నాకు తెలియవు. మీరే కాస్త చూసిపెట్టాలి అంది సంబరంగా.
    "ఏమిటీ?" అన్నాడు జగననాధం పంతులు మిన్ను విరిగి మీద పడినంతగా ఆశ్చర్యపోతూ....
    "కాలేజీలో చేర్పిస్తావా, కా....లే....జీ....లో.... కాలేజీ అంటే ఏమిటనుకుంటున్నావ్? నేను చదివానా కాలేజీలో? సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ అయి బడిపంతుల్నయ్యాను.... కాలేజీ చదువంటే మూటలు కావాలమ్మాయ్, మూటలు!! మనం బాపనోళ్ళం! మనకు స్కాలర్ షిప్పులు కూడా రావు."
    వెటకారంగా అన్నాడు జగన్నాథం పంతులు....
    "ఫరవాలేదు మామయ్యగారూ! నేనెలాగో కష్టపడి వాణ్ణి చదివిస్తాను." మొండిగా అంది ధనలక్ష్మి.
    "ఏమిటి? నువ్వు కష్టపడి చదివిస్తావా? పెళ్ళీ పెటాకులు లేకుండా మా నెత్తిమీద నువ్వింకా ఎంతకాలం ఇలా ఊరేగుదామనుకుంటున్నావు? మమ్మల్నిలా బ్రతకనియ్యి తల్లీ? నీకేదో ఒక సంబంధం చూసి పెళ్ళి చేసేస్తే మా బరువు వదులుతుంది కాస్త...."
    హతాశురాలయిపోయింది ధనలక్ష్మి. జానకీ, జగన్నాథం పంతులు ఏమీ పట్టించుకోకపోయినా, ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఎంతో ఉదారంగా నడుం కట్టుకుని ధనలక్ష్మికి సంబంధాలు తీసుకు రాసాగారు. వాళ్ళంతా రెండో పెళ్ళివాళ్ళూ, మూడో పెళ్ళివాళ్ళూ, రోగిష్టి వాళ్ళూ....అయితే మాత్రం! ధనలక్ష్మి లాంటి ఆడదానికి అంతకంటే గొప్ప సంబంధం ఎక్కడనుంచి వస్తుంది? అలా సంబంధాలు రాగానే జానకి కూడా ఊరుకోలేక, తన పెళ్ళినాటి పట్టుచీర కట్టి సింగారించి పెళ్ళివారిముందు కూచోబెట్టేది. ఆ వచ్చిన వాళ్ళందరూ ఎలాగోఒకలాగ పెళ్ళయితే చాలనే రకాలు కావటంవల్ల ధనలక్ష్మిని చేసుకోవటానికి ఒప్పుకునేవారు. కానీ, కొన్ని సందర్భాల్లో జానకి, మరికొన్ని సందర్భాల్లో జగన్నాధం ఏదో ఒక వంకతో ఆ సంబంధాలు తిరస్కరించేవారు. కనీసం పెళ్ళిచేయగలిగేపాటి డబ్బు కూడా లేదు జగన్నాథం దగ్గర. ఒకవేళ ఉన్న ధనలక్ష్మి కోసం ఖర్చుపెడతాడా అన్నది వేరేసంగతి.
    ఏది ఏమైనా ఇలా తనకు సంబంధాలు తప్పిపోవటం ధనలక్ష్మికీ బాగానే ఉంది. ఆ అమ్మాయికి తమ్ముణ్ణి వదిలి పెళ్ళిచేసుకోవాలని లేదు. అంచేత తనకు ఏ విధంగానూ ఇబ్బంది కలిగించని చుట్టుప్రక్కలవారి ఔదార్యాన్నీ_ కృతజ్ఞతతో మౌనంగా సహించటం నేర్చుకుంది.
    ధనలక్ష్మి వంటపని చేస్తున్న లాయరుగారి భార్య తనకు జబ్బు కాస్త తగ్గగానే దేవుడికి తన కృతజ్ఞత చెప్పుకోవటానికి గుడికి వెళ్ళింది. పాపం, ధనలక్ష్మి కర్మకాలి సరిగా అదే సమయంలో వంటకు వెళ్ళింది. సరి అయిన పోషణ లేకపోయినా, వయసు తెచ్చిన సహజ సౌందర్యంతో మెరిసిపోతోంది ధనలక్ష్మి. లాయరుగారి కన్ను ధనలక్ష్మి మీద పడింది. బీదపిల్ల, డబ్బుకోసం వంటపని చేస్తోంది. తను డబ్బు ఇస్తానంటే కాదంటుందా అనే భరోసాతో ఆ లాయర్ తొందరపడి ధనలక్ష్మి చెయ్యి పట్టుకున్నాడు. ధనలక్ష్మి కంగారుగా, గట్టిగా కేకలు పెట్టేసింది. చుట్టుపక్కల నలుగురూ పోగయ్యారు. లాయర్ అక్కణ్ణించి పారిపోయాడు. ధనలక్ష్మి కన్నీళ్లు కారుస్తూ తల దించుకొని నిలబడిపోయింది. నలుగురూ నాలుగు విధాల మాట్లాడుకుంటూ నవ్వుకొంటూ వెళ్ళిపోయారు. ధనలక్ష్మి అక్కడ నిలబడలేక ఇంటికి వచ్చేసింది. జానకి "అలా ఉన్నావేం?" అని అడిగితే, ఏం చెప్పలేక మరోసారి ఏడ్చింది. ఆ సాయంత్రం లాయర్ గారి భార్య జానకి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి "పాపం! ధనలక్ష్మిది తప్పులేదు. మావారే తన మగబుద్ధి పోనిచ్చుకోలేకపోయారు. అయినా ధనాన్ని ఇదివరకులా ఇంటింటికీ పంపకండి. ఏదో ఒక సంబంధం చూసి ముడిపెట్టెయ్యండి. ఏదైనా జరగరానిది జరిగితే ఎంత మొత్తుకొని ప్రయోజనం ఉండదు" అని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది.
    ఆ తరువాత లాయర్ గారి భార్య ధనలక్ష్మిని తమ ఇంటికి పిలవలేదు. వెళ్ళే సాహసం ధనలక్ష్మికీ కలగలేదు. "ఏదైనా జరగరానిది జరిగితే...." అన్న లాయర్ గారి భార్య మాటలు తలుచుకొని జానకి హడలిపోతూ, ధనలక్ష్మిని గుమ్మం కదలనియ్యటం లేదు. పాపం ధనలక్ష్మికి ఆ కొద్దిపాటి సంపాదనకు కూడా మార్గం మూసుకుపోయింది... పెళ్ళి సంబంధాలు మాత్రం వస్తున్నాయి, పోతున్నాయి.
    "నీ తమ్ముడికి మంచి ఉద్యోగం చూశాను" అన్నాడు జగన్నాథం పంతులు ధనలక్ష్మితో హుషారుగా. ఉద్యోగ మనగానే ఉసూరుమని పోయి "ఏం ఉద్యోగం?" అంది నిరాశగా.
    "మా స్కూల్ లోనే! ప్యూన్ ఉద్యోగం..."
    "ప్యూన్ ఉద్యోగమా? నౌకరుగానా? మా తమ్ముడు నౌకరా?" ఏడుపు గొంతుకతో అంది ధనలక్ష్మి. జగన్నాథం పంతులుకి మండిపోయింది.
    "ఆ! నౌకరు ఉద్యోగం కాకపోతే, కలెక్టర్ ఉద్యోగం దొరుకుతుంది నీ తమ్ముడికి. బి.ఏ.లు పాసయినవాళ్ళు కూడా ప్యూన్ ఉద్యోగాలకోసం పడిగాపులు పడుతున్న కాలమిది. ఎంత కష్టపడి నీ తమ్ముడికి ఆ ఉద్యోగం ఇప్పించానో నీకేం తెలుసు? హెడ్మాష్టారి కాళ్ళు పట్టుకొన్నాను. కమిటీ మెంబర్ల అందరి కాళ్ళూ పట్టుకున్నాను, ఇంకా...." తను ఇంకా ఎవరెవరి కాళ్ళు పట్టుకొన్నాడో జగన్నాధం వివరించబోయాడు. కానీ, ధనలక్ష్మి వినలేకపోయింది. ప్యూన్ గా కాకీ యూనిఫారం వేసుకొని, సూర్యం జగన్నాధం పంతులు వెనకాల వెళ్తున్నప్పుడు మాత్రం ధనలక్ష్మి ఏడ్చేసింది. సూర్యం వెనక్కు తిరిగి వచ్చి "బాధపడకక్కా! ప్యూన్ గా చేరినంత మాత్రాన నా చదువు ఆగిపోదు. నైట్ స్కూలులో చేరి చదువుకుంటాను. ఈ రోజుల్లో చదువులో ఆసక్తి ఉన్నవాళ్ళకి చదువుకోవటానికి చాలా అవకాశాలున్నాయి" అన్నాడు.

 Previous Page Next Page