తొందర్లోనే 'రేప్' (R.A.P.E.) విదేశాలకు పాకింది. వివిధ దేశాలు ఈ అకాడమీలని స్థాపించాయి. లయిన్ రొటేరియన్ లకన్నా ఈ డాక్టరేట్ సంపాదించుకోవటానికి ప్రముఖులు తాపత్రయపడసాగారు. బిజినెస్ కి సంబంధించిన మనిషి అని తెలిపేది కాబట్టి ఈ గుర్తింపు వచ్చినవాడు, తమ పేరుకి ముందు 'బిస్సీ' అని తగిలించుకోవచ్చు.
2020 లో రాయల్ అకాడమీ తన మొట్టమొదటి డాక్టరేట్ యాజీకి ప్రసాదించింది.
యాజీ-బిస్సీ యాజీ అయ్యాడు.
* * * *
ఆ గదిలో అలంకరణ ఆ గదికి హుందాతనం తెస్తుందో, గదివల్లే అలంకరణకి హుందాతనం వస్తుందో తెలియని పరిస్థితి.
ఆక్సిజనేటెడ్ ఎయిర్ కంట్రోలర్ వల్ల ఆ గది చల్లగా, హుషారుగా వుంది. పదిన్నర అడుగుల బల్ల దానికెదురుగా నాలుగు కుర్చీలు, బల్లకివతలివైపు ఎలక్ట్రానిక్స్ బటన్స్ అమర్చబడిన కుషన్ కుర్చీ వున్నాయి. బల్ల మీద వున్న చిన్న టీ వీ స్క్రీన్ లో అతడి గది కవతలి వైపున్న ఆఫీసు మొత్తం కనబడుతూంది. అది కాకుండా కావాలనుకుంటే రకరకాల ఛానెల్స్ లో ఒక్కో వ్యక్తిని విడిగా కూడా చూడగలడు అతడు.
గదిలో ఒక మూల గోడదగ్గిర కృత్రిమంగా పెంచిన గులాబీ మొక్కలున్నాయి. మరోవైపు రాక్ నుంచి పుస్తకాలు కనబడుతున్నాయి.
యాజీ ఆఫీసులో వున్నంతసేపూ అందరూ మిషన్ లులా పని చేస్తారు. అలా అని అతడు కర్కోటకుడనికాదు, నౌఖర్లతో కూడా చాలా సరదాగా వుంటాడు. కానీ అతడి కళ్ళల్లో అదోలాటి తీక్షణత వుంది. మాటల కందనిది. అది వేదం చదవటంవల్ల వచ్చిందే కావచ్చు. కోట్లు గడించటంవల్ల వచ్చిందే కావచ్చు.
అతడి కళ్ళలో తీక్షణతే కాక రవ్వంత విషాదంతో కూడిన ఆర్ద్రత కూడా వుంది. కానీ అది ఎవరికీ కనపడదు. ఏ ఒంటరి సాయంత్రమో, చేతిలో హుక్కాతో నలభయ్యవ అంతస్థు బాల్కనీలో నిలబడి, భూమి ఆకాశం కలిసే చోటుని చూస్తూ జ్ఞాపకాల దొంతర్లలోకి వెళ్ళినప్పుడు మాత్రం కళ్ళలోంచి ఆ దిగులు బయటపడుతుంది. కానీ క్షణాల్లో సర్దుకుని మామూలు మనిషవుతాడు.
ప్రస్తుతం అతడు తన ఆఫీసురూమ్ లో కూర్చుని వున్నాడు. కొత్త రకం విగ్గు తయారీ విషయమై ఫ్రాన్స్ దేశంతో కుదుర్చుకున్న కాంట్రాక్టు కాపేని పరిశీలిస్తున్నాడు. కొంతకాలం క్రితమే పేలిన బాంబు, ఎన్ని లక్షల మందిని చంపిందో ఇంకా సరిగ్గా లెక్కతేలలేదు కానీ, నిశ్చయంగా అతడికి లక్షల నష్టాన్ని మాత్రం తీసుకురాబోతూంది. ఫ్రాన్సు ఈ పరిస్థితుల్లో అతడితో బిజినెస్సు చెయ్యలేదు.
దానివల్ల అతడికి పెద్దగా నష్టంలేదు. ఇలాటి విపత్తులు ఎన్నో అతడు చూసేడు. అయినా అతడు ఆలోచిస్తున్నది అదికాదు. చేతిలో కాంట్రాక్టు కాగితాలు వున్నాయన్న మాటేగాని అతడి మనసెక్కడో కాగితంలో వుంది.
వెనక్కి...ఇంకా వెనక్కి.....సంవత్సరాల....పుష్కరాల వెనక్కి వెళ్ళి.....
అతడి ఆలోచన్లని భంగపరుస్తూ టీవీ స్క్రీన్ మీద అతడి సెక్రటరీ కనబడింది.
స్విచ్ ఆన్ చేసి "ఎస్" అన్నాడు.
"మీరు కనుక్కోమన్న విషయం పూర్తిగా కనుక్కొన్నాం సార్! అదే .....ప్రస్తుతం దేశంలో వున్న వ్యాపార రచయితల సంగతి."
"వెల్" అన్నాడు. "ప్రొఫెషనల్స్ అక్కరలేదు. బాగా వ్రాసే ఎవరైనా ఫర్వాలేదు."
"ఉన్నవాళ్ళల్లో బాగా వ్రాసేది భరద్వాజ. అతడు ప్రొఫెషనల్ రచయిత కూడా! ప్రస్తుతం వున్న రచయితల...." అంటూన్న ఆమె మాటలు మధ్యలో ఆపుచేస్తూ "మొత్తం అతడి గురించిన వివరాలన్నీ వ్రాసి ఫైలు పంపు...." అన్నాడు.
"అలాగే సర్!"
"ఇంకా అతడు వ్రాసిన పుస్తకాలు ఏమైనా వుంటే పంపు....."
"ష్యూర్ సర్!"
గంట తర్వాత ఆమె పుస్తకాల్లో అతడి రూమ్ లో ప్రవేశించింది. అన్నిటికన్నా పైన అతడి లేటెస్టు నవల "నా భార్య ప్రియుడు" అన్న పుస్తకం అందమైన గెటప్ లో వుంది.
ఆమె కర్ధంకానిది ఒకటే!!!
క్రాఫు-విగ్గు వీటి గురించి ఎప్పుడూ తల బ్రద్దలు కొట్టుకునే తన ప్రొప్రయిటరు ఇప్పుడు వున్నట్టుండి ఈ సాహిత్య పరీక్షమీద పడ్డాడేమిటా? అని! అంతలో అతనన్నాడు.
"ఇతనుగాక నీకు తెలిసిన రచయితలు ఇంకెవరన్నా వున్నారా? బాగా వ్రాసేవాళ్ళు" అని అడిగాడు.
ఆమె ఇబ్బందిగా చూస్తూ "అందరూ అనుకునేది భరద్వాజే టాప్ రైటర్ అని సర్" అని అంది. అతడు తల పంకిస్తూ "సర్లే. నేను అడిగినట్టూ, అతడి గురించి వివరాలు సేకరించు. వివరాలంటే..... ఒక రచనకి అతడు ఎంత డబ్బు తీసుకుంటాడు? వ్రాయటానికి ఎంతకాలం పడుతుంది......వగైరా! ఈ వివరాలు సేకరించటానికి పెద్ద కష్టపడనక్కరలేదనుకుంటా" అన్నాడు.
"ఒక్కగంట చాలు సార్...."
అతడడిగిన వివరాలన్నీ సేకరించటానికి ఆమెకి అరగంటపైగా పట్టింది. దాదాపు నలభై ఫోనులూ, పన్నెండు టెలెక్సులూ అయ్యాక రిపోర్టు తయారైంది. ఆఖరి వాక్యంగా 'ఈయన తండ్రి ఈ రోజే పోయారట!' అని వ్రాసి ముగించింది.
అప్పటికి రాత్రి (?) ఎనిమిది కావస్తూంది.
సోలార్ శాటిలైట్ సరిగ్గా నడినెత్తిన వుండటంవల్ల వెలుగు తీక్షణంగా వుంది.
ఆమె రిపోర్టు కాగితాలు సర్ది ఫైలు తీసుకెళ్ళి అందజేసింది. వాటిని అందుకుని టైమ్ చూసుకుంటూ "ఇంకా టైముందిగా అతడితో వీలైతే ఈ రాత్రికే అపాయింట్ మెంట్ ఏర్పాటు చేయి. అతడి తండ్రి ఈ రోజే చనిపోయాడనుకుంటా. వీలవుతుందో లేదో కనుక్కో!" అన్నాడు.
ఆమె విస్మయంతో అతడివైపు చూసింది.
అతడికన్నీ తెలుసుకానీ ఏమీ తెలియనట్టూ సెక్రటరీలకు పనులు పురమాయిస్తాడు. భరద్వాజ గురించి తమని ఫైలు తయారు చేయమన్నాడే గానీ ఈపాటికి అన్ని వివరాలూ తనే సేకరించి వుంటాడు. ఒక భరద్వాజదే కాదు. మొత్తం తెలుగులో ఉన్న రచయిత - రచయిత్రులందరిదీ! ఆమె కర్ధంకానిదల్లా గత సంవత్సరం నుంచీ అతడీ వేటలో ఎందుకున్నాడూ అన్నదే.
"కలుసుకోవటానికి ఏర్పాట్లు చేస్తావుకదూ" అని అతడు అనటంతో ఆమె ఆలోచనల నుంచి ఉలిక్కిపడి తెప్పరిల్లి తలూపి బైటకొచ్చింది.
ఆమె వెళ్ళిపోయినా తర్వాత చాలాసేపటివరకూ అతడేపనీ చేయకుండా అలాగే కూర్చుండిపోయాడు. మూసిన అతడి కనురెప్పలకే మాటలు వస్తే అవి ఒక అందమైన పేరుని ఉచ్చరిస్తూ వుండేవనుకుంటా!
ఆ పేరు "మందాకిని".
.........
8
అతడి సెక్రటరీ తిరిగి వచ్చి తన సీట్లో కూర్చొని ఫోను తీసి నెంబరు నొక్కింది. అట్నుంచి రెస్పాన్స్ రాగానే, "హల్లో ఎవరు మాట్లాడుతున్నారు?" అని ఇంగ్లీషులో అడిగింది.
"అహల్య సెక్రటరీ టు భరద్వాజ"
"నేను బిస్సీయాజీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాను."
"చెప్పండి. ఏం కావాలి?"
"యాజీ భరద్వాజను కలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు పది గంటలకి వీలవుతుందా?"
అహల్య అపాయింట్ మెంట్ ఛార్టు చూసి, "ఖాళీగానే వుంటారు రమ్మనండి అంది.
"నేను మాట్లాడుతుంది యాజీ ఆఫీసు నుంచి" అందామె.
ఒకసారి చెప్పినదాన్ని ఆమె మళ్ళీ ఎందుకు తిరిగి చెప్పుతుందో అర్ధం కాక "అయితే....?" అంది అహల్య.
యాజీ నుంచి ఫోనూ, అపాయింట్ మెంట్ అనగానే అవతలి వాళ్ళు ఎగ్జయిట్ అవటం మాత్రమే అతడి సెక్రటరీకి తెలుసు. దేశపు ప్రెసిడెంట్ కూడా యాజీతో ఒక సాయంత్రం గడపటానికి చాలా ఉత్సాహపడతాడు. అటువంటిది ఈ సెక్రటరీ ఇలా మాట్లాడటం ఆశ్చర్యం అనిపించింది. "యాజీ ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నారు" అంది విసుగ్గా.
"ఆయనకి కలుసుకోవాలని వుంటే అయన వస్తారు. ఈయనకి కలుసుకోవాలని వుంటే ఈయన వెళతారు" అంది అహల్య తాపీగా.
"మైగాడ్! మీకు బిస్సీయాజీ అపాయింట్ మెంట్సు గురించి తెలీదా?"
"తెలీదు. నేను ఆయన సెక్రటరీని కాను" అని ఫోను పెట్టేసింది అహల్య.
లోపలికి వెళ్ళి జరిగినదంతా భరద్వాజకి చెప్దామనుకుంది. కానీ ఎంతో అవసరం అయితే తప్ప ఆమె ఆ గదిలోకి వెళ్ళదు.
'వచ్చాక చెప్దాంలే' అనుకుంది. తరువాత పని హడావుడిలో పడి ఆ విషయమే మర్చిపోయింది. లోపల భరద్వాజ డాక్టర్ కీర్తితో మాట్లాడుతున్నాడు.
* * * *
"ITS A 12th GENERATION COMPUTER. మేము ఇచ్చిన ఆర్డర్ కి ప్రత్యేకంగా నిపుణులు తయారుచేసిన కంప్యూటర్ ఇది" అన్నాడు భరద్వాజ.
"ఒక నవల పూర్తికాగానే దాన్ని ఈ కంప్యూటర్ కి ఫీడ్ చేస్తాము. ఈ రచన మార్కెట్ లోకి వెళితే ప్రజలు దాని ఎలా ఆదరిస్తారూ అన్నది ముందే ఈ కంప్యూటర్ మాకు చెపుతుంది. కావలసినచోట ఇంకా సెక్స్ గానీ, హింసగానీ పెట్టవలసివస్తే ఆ విషయాన్ని మాకు చెబుతుంది. మేము చెయ్యవలసినదల్లా నవలని కంప్యూటర్ భాషలోకి మార్చి దీనికి అందించటమే! అందుకోసం విదేశాల్లో శిక్షణ పొంది వచ్చిన నిపుణుడు మాకు వున్నాడు."