"ఇలా ఎంతకాలం నుంచి జరుగుతూంది?"
"చెప్పానుగా పది సంవత్సరాల్నుంచీ జరుగుతుంది. మా కంప్యూటరు ఎప్పుడూ మమ్మల్ని సరి అయిన పంథాలోనే నడిపించింది. మారుతున్న ప్రజల అభిరుచికి మేము చేయవలసినదల్లా కాస్త కోడ్ మార్చటమే" అంటూ స్విచ్ నొక్కాడు.
కంప్యూటర్ స్క్రీన్ మీద గ్రాఫు పడింది.
"గత పది సంవత్సరాలుగా ఎంతో నిజాయితీగా పనిచేసిన ఈ మిషను గత మూడు నవలల విషయంలో ఎందుకు తప్పు అంకెల్ని సూచించిందో మాకు అర్ధంకావటం లేదు. నా లేటెస్ట్ నవల "నా భార్యాప్రియుడు" సూపర్ సక్సెస్ అవుతుందని ఇది చెప్పింది. కానీ ఆ పుస్తకం అమ్మకాలు మరీ నిరాశాజనకంగా వున్నాయి."
ఇద్దరూ గదిలోంచి బయటకి వచ్చారు.
"ఇన్ని లక్షలు ఇచ్చి మీ సంస్థని నా తరపున నియమించటానికి నేనేమీ తెలివితక్కువ వాడిని కాదు డాక్టర్ కీర్తి! మా అంచనాలు తారుమారై మా కంప్యూటర్ ఫెయిలయిన తరువాతే మీ దగ్గరికి రావటం జరిగింది. ఇందులో నా వ్యక్తిగతమైన 'ఈగో' ఏదీ లేదు. అంతా ఇమ్ పెర్సనల్..."
"సారీ" అన్నాడు కీర్తి. "నేను కేవలం మానసిక శాస్త్రవేత్తని మాత్రమే. ఎప్పుడైతే మిషన్లు ఇందులో ప్రవేశించాయో అప్పటినుంచి నా అవసరం ఇక వుండదు. తప్పుడు సలహా ఇచ్చినందుకు క్షమించండి."
"దట్సాల్ రైట్.....మరికాస్త వైన్ తీసుకుంటారా?"
"వద్దు - థాంక్స్ వెళతాను."
ఇద్దరూ బయటకొస్తూంటే అహల్య లేచి నిలబడింది. బిస్సీయాజీ నుంచి ఫోన్ వచ్చినట్టు చెప్దామనుకుంది. కానీ పక్కనెవరో వుండగా ఎందుకులే అని విరమించుకుంది.
అదే భరద్వాజ జీవితాన్ని రక్షించింది.
9
కీర్తిని దింపి భరద్వాజ ఇంటికొచ్చేసరికి రాత్రి పన్నెండు కావొస్తూంది. సోలార్ శాటిలైట్ పూర్తిగా పశ్చిమానికి వెళ్ళిపోవటంవల్ల బాగా చీకటి పడింది. చలి కూడా వేస్తూంది.
అతడు ఇంట్లో ప్రవేశించాడు.
గాయంవల్ల కొడుకు కూడా ఇంట్లోనే వున్నాడు. కుటుంబం అంతా నిద్రలో వున్నట్టుంది. అతడు పెన్ తో తాళం తీసుకుని లోపల ప్రవేశించి కిచెన్ లోకి వెళ్ళాడు. నెలరోజుల క్రితం సూపర్ బజార్ నుంచి తీసుకువచ్చిన అన్నం, కుక్క గొడుగులతో చేసిన కుర్మాలాంటి పదార్ధం మాత్రం వున్నాయి. అతడు భార్యమీద విసుక్కున్నాడు. కనీసం వారానికి ఒకసారైనా షాపింగ్ కి వెళ్ళి ఆహార పదార్ధాలు తీసుకురమ్మని చాలాసార్లు చెప్పాడు. ఆమె వినదు. నెలకొకసారి వెళుతుంది. మిగతావి ఫర్లేదు కానీ బజారు నుంచి తెచ్చిన అన్నం (ఉడకపెట్టిన బియ్యం) ఎంతబాగా సీల్ చేసినా నెలరోజుల తర్వాతే వేడిచేస్తే, రుచిపోయి గడ్డిలాగా వుంటుంది. అతడు మిగతా డబ్బాలు వెతికాడు. అదృష్టవశాత్తూ 'రీస్' డబ్బా దొరికింది. అతడి కొడుక్కి అదంటే చాలా ఇష్టం. క్రిందటి జన్మలో అతడు భద్రాచలం అడవుల్లో కోయవాడు అయివుంటాడని ఇంట్లోవాళ్ళు ఏడిపిస్తూ వుంటారు కూడా. (వంద సంవత్సరాల క్రితం అడవుల్లో కోయలు మంటపెట్టి ఆ మంట దగ్గరకొచ్చి రెక్కలు కాలి పడిపోయిన పురుగుల్ని పోగుచేసి, వేయించుకుని తినేవారట. ఆ పురుగుల్ని ఉసుర్లు అంటారు) అతడి భార్యకి కూడా ఇష్టమే కానీ ప్రకటించదు. ఇంకేమీ లేని స్థితిలో వాటినే వెచ్చ చేసుకుందామని డబ్బా మూత తెరవబోతూ పరీక్షగా చూశాడు. ఎక్స్ పైరీ డేట్ కోసం...
వాడవలసిన ఆఖరి తారీఖు అయిపోయి రెండు నెలలయింది. రిస్కు తీసుకుందామనుకున్నాడు. పూర్తిగా పురుగులయితే ఫర్వాలేదు గానీ, తుమ్మెద కూడా చేరితే నిర్దేశింపబడిన కాలం పూర్తయ్యాక విషపూరితంగా మారుతుందని ఎక్కడో చదివాడు. రిస్కు తీసుకోదల్చుకోలేదు. విసురుగా డబ్బాని మూలకు విసిరేశాడు.
ఉన్నదేదో కాస్త తిని, జీర్ణం కావటానికి రోజూ వేసుకునే మాత్ర వేసుకోకుండా (తక్కువ తిన్నాడు కాబట్టి) పక్క మీద వాలాడు.
చాలాసేపటివరకూ నిద్రపట్టలేదు.
ఆ చీకటిలోంచి - ఆ నిశ్శబ్దంలోంచి సన్నగా ఏదో శబ్దం వినిపించింది. చాలా జాగ్రత్తగా వింటేగాని వినిపించని శబ్దం!
అతడు కళ్ళు విప్పాడు.
మళ్ళీ వినిపించింది శబ్దం.....దేన్నో గీరుతున్నట్టూ.
ఒక గెంతులో పక్కమీద నుంచి లేచి ముందు గదిలోకి వచ్చాడు. బయట తలుపు సన్నగా కదులుతూంది. అతడి గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకోవటం ప్రారంభించింది.
అతడు లోపలికి పరుగెత్తుకువెళ్ళి బాల్ పెన్ తీసుకుని ముందు గదిలోకి వచ్చాడు. వస్తూనే ఆ దృశ్యాన్ని చూసి స్థంభించిపోయాడు.
బయట తలుపు దగ్గిర సన్నటి మంట లోపలికి తోసుకువస్తూంది. ఎవరో బైట్నుంచి వూదినట్టు లోపలికి వెలుగుతూ ఆరుతూ వస్తూంది.
అతడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.
తన ఇంటి సింహద్వారాన్ని ఎవరో కాలుస్తున్నారు! తాము లోపల వుండగానే దొంగలు ఇంట్లోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తున్నారు.
తన ఇంటికి హీట్ షీల్డ్ వుంది. దాన్ని కూడా కాల్చేయగలుగుతున్నారు వీళ్ళు! (బైటనుంచి రాకెట్లు భూమి వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఆ రాపిడి మండి భస్మం అయిపోకుండా వాటికి తొడిగే తొడుగుని హీట్ షీల్డ్ అంటారు.)
కొంచెంసేపు ఏం చెయ్యడానికీ తోచనివాడిలా అచేతనంగా, కదలిక లేకుండా అలాగే వుండిపోయాడు.
లోపల గది క్రమక్రమంగా వేడెక్కటం గమనించాడు.
బయటవాళ్ళు ఆక్సీ-ఎసిటెలిన్ (3000 డిగ్రీల వేడిని సృష్టించేది) కన్నా పెద్ద పరికరాన్ని ఉపయోగిస్తున్నారన్నది తెలుస్తూంది. ఇంత అధునాతనమైన పరికరం ఉపయోగిస్తున్నారంటే...
చప్పున ఏదో స్ఫురించి కిటికీ వద్దకు పరుగెత్తాడు. తెర కాస్త పక్కకి తొలగించి క్రిందికి చూశాడు.
అతడు గొంతు తడి ఆరిపోయింది.
క్రింద రోడ్డుమీద రెండు కార్లున్నాయి. హేట్ పెట్టుకున్న యిద్దరు వ్యక్తులు కార్ల పక్కనే సిగరెట్లు కాల్చుకుంటూ తాపీగా నిలబడివున్నారు. వాళ్ళని చూడగానే తమ ఇంటిమీదకు దండెత్తింది ఎవరో అర్ధమైంది.
మాఫియా!
అంత చలిలోనూ అతడి వళ్ళంతా చెమటపట్టింది.
తాము చాలా చిన్న విషయం అనుకొని తీగలాగితే డొంక కదిలింది. తన కొడుకు అరెస్టు చేసిన విద్యార్ధులు పైకి కనబడినట్టు మామూలు కుర్రవాళ్ళు కాదు. వారి వెనుక 'మాఫియా' వుంది. ఇప్పుడు తన కొడుకు మీద ప్రతీకారం తీర్చుకోవటానికి వాళ్ళు వచ్చారు. చేసిన పనికి ఇరవై నాలుగు గంటలలోపు పగ తీర్చుకోవటానికి వాళ్ళు వచ్చారు. చేసిన పనికి ఇరవై నాలుగు గంటలలోపు పగ తీర్చుకోగలిగేవాళ్ళు నిశ్చయంగా మాఫియా గ్యాంగే! అందులో సందేహం లేదు. అందునా ఇంత అధునాతనమైన పరికరాల్ని వాడగలిగేవాళ్ళు ఇంకెవరూ అయివుండరు.
అతడు చేష్టలుడిగినట్లు కాల్తూన్న ఆ తలుపువైపు చూడసాగాడు.