కిటికీలో నుంచి బయటకు చూస్తున్న నవీన్ కు సూపర్ ఫాస్ట్ దాటగానే 'డి'గ్రేడ్ రైలు స్టేషన్ ను రిమోట్ కంట్రోల్ తో అజ్ఞాత వ్యక్తి బ్లాస్ట్ చేశాడని అర్ధమయింది.
కాలయాపన చేయడం వలన నష్టమే జరిగింది.
ఇటువంటి సందర్భాలలో ఆవేశం పనికిరాదు. ఆలోచన కావాలి. ప్రతిచర్యా ఆచితూచినట్టుండాలి.
వేగంగా ఆలోచించాలి, సకాలంలో నిర్ణయం తీసికోవాలి. ఈ రెంటిలో ఏది బ్యాలెన్స్ తప్పినా దాని పర్యవసానం తీవ్రంగా వుంటుంది.
"మిస్టర్ సెక్యూరిటీ ఆఫీసర్! సి.ఎం. ప్రయాణిస్తున్న వాయుదూత్ లో టైంబాంబ్ ఉంది. మీ సెక్యూరిటీ అసిస్టెంట్ విక్రమ్ చేసిన పనికి పైలట్స్ ఇద్దరూ విషం కలిపిన డ్రింక్స్ తాగుతున్నారు. ఇక వాయుదూత్ గతి ఏమవుతుందో ఆలోచించండి!"
"ఆఁ !" అంటూ నవీన్ బిర్ర బిగుసుకుపోయాడు.
ప్రస్తుతం పరిస్థితులలో సెక్యూరిటీ అంటూ ప్రయోగాలు మొదలుపెడితే అమాయకుల ప్రాణాలు పోయేట్టు వున్నాయి.
క్షణం ఆలోచించాడు నవీన్. "మిస్టర్ కమాండర్! వాయుదూత్ ను సురక్షితంగా కిందకు చేర్చే ప్రయత్నం చేయించండి. అందులో వున్న వ్యక్తి సి.ఎం.కాదు!" నవీన్ రహస్యాన్ని వెల్లడించక తప్పలేదు.
"వెల్ మిస్టర్ నవీన్! ఈ మాట నేను అడిగిన వెంటనే చెప్పివుంటే నష్టం జరిగేది కాదు. ఎనీ వే_వాయుదూత్ ను సేఫ్ గా లాండ్ చేయించడానికి నా శాయశక్తులా కృషిచేస్తాను." అభయమిచ్చాడు అజ్ఞాత వ్యక్తి.
ఏం జరుగుతుందో అనే అందోళనలో వున్నారు పోలీసు ఆఫీసర్లు అందరు.
సరిగ్గా అదే క్షణం....వాయుదూత్ లో....
"నో....నో....ఆ కూల్ డ్రింక్స్ తాగొద్దు." ఎయిర్ హోస్టెస్ గావుకేక పెట్టింది.
పైలట్స్ ఇద్దరు ఎత్తిన బాటిల్స్ కిందకు దించి ప్రశ్నార్ధకంగా చూశారు.
"ఎందుకని?"
హైజాకర్స్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి.
"అందులో....అందులో...." ఎయిర్ హోస్టెస్ పెదాలు అస్పష్టంగా కదిలాయి.
"ఎస్, వాటిలో సెక్యూరిటీ ఆఫీసరు విషం కలిపాడు. అవునా?" హైజాకరొకడు వేసిన ప్రశ్నకు తల దించుకుందామె.
పైలట్స్ దగ్గరి కూల్ డ్రింక్స్ బాటిల్స్ ను తీసుకుని సెక్యూరిటీ ఆఫీసరు కొకటి, ఎయిర్ హోస్టెస్ కొకటి ఇచ్చి తాగమని రైఫిల్ వాళ్ళకు గురిపెట్టాడు హైజాకర్.
ఇద్దరూ క్షణం ముఖముఖాలు చూసుకుని డ్రింక్స్ గడగడ తాగేశారు.
మరికొన్ని నిమిషాలలోనే ఇరువురూ చెరొక సీటులో వాలిపోయారు.
కమాండరు నుంచి వైర్ లెస్ లో వార్త అందగానే హైజాకర్ ముఖ్యమంత్రి రూపంలో వున్న వ్యక్తి ముఖానికి వున్న మాస్క్ ను లాగివేశాడు. అదికాస్తా వూడిపడింది.
"పైలట్స్! వాయుదూత్ ని సరిగ్గా పదిహేను నిమిషాలలో లాండ్ చేయలేకపోతే పదహారో నిమిషంలో టైమ్ బాంబ్ పేలుతుంది...." హైజాక రొకడు వార్నింగ్ ఇచ్చాడు.
హైజాకర్లు నలుగురూ పారాచూట్లు తీసుకుని కిందకు దూకేశారు.
* * *
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పల్లెలో పట్టణంలో అడుగడుగునా చెక్ పోస్టులు.
పోలీసులు వచ్చేపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఆ పరిస్థితులలో పోలీసులు కళ్ళుగప్పి తప్పించుకుపోవడం ఎవరితరం కాదు.
కాన్వాయ్ లో వున్న సి.ఎం. ను కిడ్నాప్ చేసిన తరువాత కమాండరు మనుషులు సి.ఎం.ను, సెక్యూరిటీ ఆఫీసరు మహేంద్రను తిరుపతి ఘాట్ రోడ్డుకు తీసుకువచ్చారు.
పోలీసులు పన్నిన వలయం నుంచి తప్పించుకోవడం కష్టమనే బందీ లిద్దరినీ తిరుపతి కొండలలో బంధించాలనుకున్నారు.
కాని, ఆ కారుకు వున్న వైర్ లెస్ సెట్ ను వదిలివేస్తే ఇక కమాండరుతో వున్న ఒకే ఒక్క కమ్యూనికేషన్ లింక్ పోతుంది_అటు కమాండరు తదుపరి ఆర్డర్స్ తెలుసుకోవాలన్నా, ఇటు ప్రభుత్వం వైఖరి తెలుసుకోవాలన్నా వీలుపడదు.
అందుకే వైర్ లెస్ సెట్ బిగించివున్న ఆ కారును ఘాట్ రోడ్డు నుంచి దారి మళ్ళించి చిన్న చిన్న పొదలు వున్న రిజర్వు ఫారెస్టులోకి తీసుకువచ్చారు.
సి.ఎం.ను సెక్యూరిటీ ఆఫీసరు మహేంద్రను కారులోనే బంధించి, కారులో టైమ్ బాంబ్ పెట్టారు. బందీ లిద్దరూ తప్పించుకునే అవకాశం ఏమాత్రం లేదు.
వైర్ లెస్ సెట్ వాల్యూమ్ పెంచి కమాండరు పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు కిడ్నాపర్లు.
హృదయ స్పందనతో పోటీ పడుతున్నట్టు క్షణాలు వేగంగా కదలిపోతున్నాయి.
* * *