Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 7


    అది కనిపెట్టలేకే విచ్చిన్నకర శక్తులు ఆ ముగ్గురినీ కిడ్నాప్ చేయడానికి ప్రస్తుతం ప్రయత్నంలో వున్నాయి.

    వారిలో అసలు సి.ఎం. ఎవరో?

    ఆ పజిల్ ను పూరించ గలిగితే కిడ్నాపర్ల గెలుపు తథ్యం.

    వాళ్ళు ఆ మిస్టరీని బ్రేక్ చేయలేకపోతే నవీన్ దే పైచేయిగా వుంటుంది.

    అప్పుడు వి.వి.ఐ.పి. ల భద్రత విషయంలో వినూత్న శకం ప్రారంభమైనట్టే!


                           *    *    *


    ఫస్ట్ క్లాస్ ఎ.సి. కూపే.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు.

    చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు నవీన్ మరొకసారి ఆ కంపార్ట్ మెంట్ అంతా క్షుణ్ణంగా పరిశీలించాడు.

    ట్రెయిన్ కదిలేముందు పార్టీ కార్యకర్తలు అభిమానులు వేసిన పూలదండలన్నీ ఓ మూల గుట్టగా వేసివున్నాయి.

    హైస్కేల్ సెక్యూరిటీ రిస్క్ వున్న వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వుడడంతో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెక్యూరిటీ చాలదనిపించింది నవీన్ కి.

    "వి.వి.ఐ.పి. మొబైల్ కాలింగ్ హెడ్ క్వార్టర్స్, హౌడు యూ హియర్ మీ?"

    మాన్ పాక్ సెట్ లో నవీన్ హెడ్ క్వార్టర్స్ ను కాంటాక్ట్ చేశాడు.

    ఛానల్ 1 నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు.

    ఛానల్ 2 లో మరొక ప్రయత్నం చేశాడు.

    రెస్పాన్స్ కోసం కొద్దిక్షణాలు ఆగాడు.

    "కమాండర్ కాలింగ్! వి.వి.ఐ.పి. మొబైల్...."   

    అజ్ఞాత వ్యక్తి స్వరం పోలీసు వైర్ లెస్ కమ్యూనికేషన్ ఛానల్ 2 లో ఖంగుమంది.

    ఉలిక్కిపడ్డాడు నవీన్.

    ఒకొక్కప్పుడు ఎయిర్ డిస్టర్బెన్స్ వలన పోలీసు వైర్ లెస్ కమ్యూనికేషన్స్ లో ఆకాశవాణి కార్యక్రమాలు వినిపించడం వింతైన విషయమేమీ కాదు.

    ఇది అలాంటిది కాదు. ఒక అజ్ఞాత వ్యక్తి కంఠమని స్పష్టంగా తెలుస్తున్నది.

    "కమాండర్ కాలింగ్ వి.వి.ఐ.పి. మొబైల్_సిగ్నల్ క్విక్!" నవీన్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కమాండర్ మరొకసారి కాంటాక్ట్ చేశాడు.

    నవీన్ ఆలోచనలోపడ్డాడు.

    "మిస్టర్ నవీన్! నా కమ్యూనికేషన్ రిసీవ్ అయిందా?" అదే స్వరం మరల వినిపించింది.

    తనను పేరుపెట్టి పిలుస్తున్నాడంటే అతడెవరో తనకు తెలియక పోయినా తన వివరాలన్నీ ముందుగా అతనికి తెలిసేవుండాలి.

    "ఎస్ మిస్టర్ కమాండర్ ! యువర్ కమ్యూనికేషన్ రిసీవ్ద్. విషయం ఏమిటో చెప్పండి!" నవీన్ రిటర్న్ సిగ్నల్ ఇచ్చాడు.

    "దట్స్ గుడ్, మిస్టర్ నవీన్! మరల నేను మిమ్మల్ని ఇదే ఛానల్ లో కాంటాక్ట్ చేసేవరకు వెయిట్ చేయండి."

    ఆ ఛానల్ నుంచి అజ్ఞాత వ్యక్తి తప్పుకున్నాడు. నవీన్ రెండవ సెట్ తీసి ఛానల్ 1 లో కంట్రోల్ ను కాంటాక్ట్ చేశాడు.

    "నవీన్! ఎవరో ట్రెయిన్ ను సాబిటైజ్ చేస్తున్నట్టు అనుమానంగా వుంది. వాళ్ళ దృష్టి వి.వి.ఐ.పి. మీద వుందేమో జాగ్రత్త!" కంట్రోల్ నుంచి డి.ఐ.జి. సూచన లిచ్చాడు.

    ఆ సూచనల ప్రకారం నవీన్ రెండు మాన్ పాక్ సెట్స్ ను రెండు చానల్స్ లో వుంచి, సెక్యూరిటీ సిబ్బందిని రెడ్ ఎలర్ట్ చేశాడు.

    అదే క్షణాన ఛానల్ 1 లో అజ్ఞాత వ్యక్తి కంఠం ఖంగుమంది: "వి.వి.ఐ.పి. తో సహా సూపర్ ఫాస్ట్ ప్రస్తుతం మా కంట్రోల్ లో ఉంది. ట్రెయిన్ లో టైమ్ బాంబ్ పెట్టాం. ట్రెయిన్ ను ఆపడానికి ప్రయత్నం చేస్తే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఈ విషయం అన్ని స్టేషన్లకు తెలియపరచండి" అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు.

    నవీన్ గుండెల్లో డైనమైట్ పేలినట్టయింది.

    "మిస్టర్ నవీన్...." అజ్ఞాతవ్యక్తి పిలుపు.

    నవీన్ త్రుళ్ళిపడ్డాడు.

    "మిస్టర్ నవీన్! పోలీసులే తెలివిగలవారనుకోకండి. వి.వి.ఐ.పి.కి డూప్స్ పెట్టారని తెలిసే మొత్తం మూడు మార్గాలను దిగ్భందం చేశాను. ఈ ముగ్గురిలో సి.ఎం. ఎవరో వెంటనే చెబితే అందరికీ మంచిది. లేదా మారణహోమం సృష్టిస్తాను!"   

    అజ్ఞాత వ్యక్తికి సి.ఎం. సెక్యూరిటీ సంబంధించిన సీక్రెట్ తెలిసిపోయిందని తెల్లముఖం వేశాడు నవీన్.

    "మిస్టర్ నవీన్ ! కాలయాపన చేస్తే నష్టపోయేది మీరేనని తెలుసుకోండి. నౌ_టెల్ ద ట్రూత్! ఈ ముగ్గురిలో సి.ఎం.ఎవరు? సమాధానం చెప్పకపోతే సి.ఎం.తో పాటు డూప్స్, మీరు, మీ సిబ్బంది, వందలమంది ప్రయాణీకులు చస్తారు. జస్ట్ _సీ ఫర్ ఎగ్జాంపుల్...."

    అజ్ఞాత వ్యక్తి అనడమే తడవుగా నవీన్ ఆలోచనలను ఫట్ మని తెంపేస్తూ పెద్ద శబ్దం అయింది.

    నల్లని కారుమబ్బు ఆకాశాన్ని కమ్ముకుందా అన్నట్టు నల్లని పొగ పైకి లేచింది. శబ్దతరంగాలు ట్రెయిన్ అంత వేగంగా వెడుతున్నా నవీన్ కర్ణభేరిని తాకాయి.
 

 Previous Page Next Page