రాజమండ్రి ఎయిరోడ్రోమ్.
పోలీసు ఆఫీసర్లతో, ఫైర్ సిబ్బందితో ప్రయాణీకులకు సంబంధించిన హితులు, సన్నిహితులతో నిండి వున్నది.
అందరి చూపులు ఆకాశం వైపు వున్నాయి.
అప్పటికి క్షణం ముందే ఎయిర్ పోర్టు అధికారులు వాయుదూత్ పైలట్ ఇచ్చిన సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకున్నారు.
వాయుదూత్ లో పెట్టిన టైమ్ బాంబ్ పేలడానికి ఇంకా కేవలం అయిదు నిమిషాలు మాత్రమే మిగిలి వున్నాయి.
అంటే కిడ్నాపర్లు హెచ్చరించిన సమయం నుంచి పదకొండు నిమిషాలు ఇట్టే గడిచిపోయాయి.
ఆ క్షణంలోనే ఎయిరోడ్రామ్ నుంచి క్లియరెన్స్ సిగ్నల్స్ అందుకున్నాడు వాయుదూత్ పైలట్.
పై నుంచి రన్_వే క్లియర్ గా కనిపిస్తుంది.
వాయుదూత్ ను రన్_వేలో లాండ్ చేసి ప్రయాణీకులందరినీ సురక్షిత ప్రదేశానికి చేర్చడానికి ఆ అయిదు నిమిషాల వ్యవదీ చాలేట్టు లేదు.
సరిగ్గా అయిదు నిమిషాలకు పది సెకన్ల కాలం మిగిలి వుండగానే పైలట్ చాకచక్యంగా వాయుదూత్ ని ఎమర్జెన్సీ లాండింగ్ చేశాడు.
అదృష్టం బాగుండి వాయుదూత్ ఏ ప్రమాదం జరగకుండానే సేఫ్ గా లాండ్ అయింది.
ప్రయాణీకులతో పాటు, ఇద్దరు పైలట్లు వాయుదూత్ నుంచి దిగిలాండ్ వైపుకు పరుగులు పెట్టారు.
సెక్యూరిటీ ఆఫీసరు విక్రమ్, ఎయిర్ హోస్టెస్ వాయుదూత్ లో స్పృహ లేకుండా అలాగే పడివున్నారు.
మైక్ లో ఎయిరోడ్రోమ్ సిబ్బంది, పోలీసు ఆఫీసర్లు సెక్యూరిటీ ఆఫీసరు విక్రమ్ ను, ఎయిర్ హోస్టెస్ ను వెంటనే వాయుదూత్ నుంచి బయటకు రావలసిందిగా హెచ్చరికలు చేశారు.
అప్పటికే వారిరువురిలో చలనం లేదు. క్షణాలు యథావిధిగా దొర్లిపోతున్నాయి.
తొమ్మిది....
ఎనిమిది....
ఏడు....
వాళ్ళిద్దరి చెవులు తూట్లుపడేటట్టు సైరన్ మోగించారు.
మరొక ప్రయత్నంగా ఫైర్ సిబ్బంది వాయుదూత్ పైకి, లోపలకు వాటర్ పంప్ చేశారు.
సరిగ్గా నాలుగవ సెకెన్ లో _ఎయిరో డ్రోమ్ లో జరుగుతున్న హడావుడికి _ అప్పటివరకు ప్రాణాయామంలో వున్న విక్రమ్ మేల్కొన్నాడు.
స్పృహలో లేని ఎయిర్ హోస్టెస్ ను భుజానవేసుకుని వాయుదూత్ నుంచి దిగాడు.
"జీరో" సెకన్ జీరో కౌంట్ లో పడింది. పదహారో నిమిషంలోకి జస్ట్....
ఆశ్చర్యం....టైమ్ బాంబ్ పేలలేదు! అసలు టైమ్ బాంబ్ బాంబ్ వాయుదూత్ లో లేదేమో! ఉంటే ఎందుకు పేలలేదు?
క్షణం అనుమానం ఆవరించింది అందరిలో. మరి నాలుగు క్షణాలు అలానే గడిచాయి.
వాయుదూత్ లో మిగిలిపోయిన పెట్ డాగ్ 'గ్లోరీ' టైమ్ బాంబ్ ను నోటకరచుకుని కిందకు దూకింది.
క్షణం జనం గుండెలు ఝల్లుమన్నాయి.
అప్పుడు అర్ధమయింది, టైమ్ బాంబ్ ఇంకా ఎందుకు పేలలేదో.
పదహారో నిమిషంలో పడ్డాక టైమ్ బాంబ్ పేలుతుందన్న హైజాకర్స్ హెచ్చరికకు అర్ధం మరొకలా తీసుకోవలసి ఉన్నదేమో!
పదహారో నిమిషంలో పడిన తరువాత ఎప్పుడు టైమ్ బాంబ్ పెలేదీ వాళ్ళు నిర్దిష్టంగా చెప్పలేదు. అంటే పదహారో నిమిషంలో ఏ క్షణాన అయినా బాంబ్ పేలవచ్చు.
ఇంకా పదిహేడో నిమిషంలో పడడానికి కేవలం పదిక్షణాలు మాత్రం మిగిలాయి.
పది....
తొమ్మిది....
ఎనిమిది....
ఆఘమేఘాల మీద వస్తున్న కుక్క 'గ్లోరీ'ని చూస్తుంటే దాని యజమానితో పాటు అందరికి కలవరం పుట్టింది.
భయంతో కేకలు పెడుతూ జనం ఏరో డ్రోమ్ దాటి రోడ్డువైపుకు ఉరుకులు పరుగులు పెట్టారు.
క్షణాలు 'జీరో' కౌంట్ లో పడడానికి ముందే....
"ధన్...." పెట్ డాగ్ గ్లోరీ లాంజ్ లోకి రాకుండా విక్రమ్ దాన్ని షూట్ చేశాడు.
"జీరో...."
"ఢాం...."
సెకను జీరో కౌంట్ లో పడడంతోనే నలుదిక్కులు పిక్కటిల్లేట్టు శబ్దం చేస్తూ టైమ్ బాంబ్ పేలింది.
తెల్లటి పామేరియన్ డాగ్ కాలిపోయిన నల్లని కాగితపు మసిలా గాల్లో వుంది.
విషం కాదు, మత్తు మందు కలిసిన కూల్ డ్రింక్స్ తాగడం వలన ఎయిర్ హోస్టెస్ ఇంకా కొద్ది గంటలు మత్తులోనేపడి వుంటుందని ఆమెను పరీక్ష చేసిన డాక్టర్లు నిర్ధారించారు.