ఈ వాదన కాదనలేనిదిగా కనిపించింది అన్నదమ్ములిద్దరికీ. "మరి ఎలా?" వికీకి మేం పెద్దదిక్కుగా ఇక్కడే వుండి చూచుకొనేట్టు లేదు. వాడా అమాయకుడు పసివాడు."
"పెద్ద దిక్కుగా నేనుండనా? నేనున్న దెందుకు? మీ మేనల్లుడి ప్రాణానికి నాప్రాణం అడ్డు. మా తాతముత్తాతల కాలంనుండి ఈ ఇంటి ఉప్పు తింటున్నాం. మా విశ్వాసం ప్రకటించుకొనే సమయమిదే."
"మీ విశ్వాసం మా అక్క బావ ప్రాణాలను కాపాడలేకపోయిందెందుకు?" అడగకుండా ఉండలేకపోయాడు విజయరాజ్.
"అందుకు నేను సిగ్గుపడుతున్నాను విజయ్ బాబూ. ఉదయకాంతారావు ఈ ఎస్టేట్ మీద కన్నేశాడని నాకు నమ్మకంగా తెలిసింది గాని ఇంత ఘాతుకానికి తలపడతాడని ఊహించలేదు. అతడు హంతకుడని నా గట్టి నమ్మకం. పులి ఎంత క్రూరమైనదైనా కావచ్చు. మనిషిని హరీమనిపించడానికి ఒక పంజాదెబ్బ చాలొచ్చు! కాని, ఆ మనిషే ఉపాయంగా పులిని బంధించగలడు. మట్టుపెట్టనూ గలడు. పులి మన పరిసరాలలోనే ఉందీ అనుకొన్నప్పుడు ఆ జాగ్రత్త అదే వస్తుంది! ఇకనుండి ప్రతి క్షణం పులిని బంధించే ప్రయత్నంలోనే వుంటాను!"
"కాని, వికీకి ఇంత పెద్ద ఎస్టేట్ ని నిభాయించుకొనే శక్తి ఎక్కడిది? ఈ వ్యవహారాలన్నీ ఏం తెలుస్తాయి?"
"ఆయనకు అన్నీ నేర్పడానికి నేనున్నాను!"
"వాడి చదువు ఇంకా పూర్తికాలేదు. ఒకసారి ఆగిపోతే మళ్ళీ కొనసాగించడం కష్టం."
"కొద్ది నెలలపాటైనా ఆయన్ని ఇక్కడుంచక తప్పదు. ఎక్కడిదక్కడ సెటిలయ్యాక ఆయన వెళ్ళిపోయి అప్పుడప్పుడూ వచ్చి చూచుకొంటే సరి. ఆయన చదువు పూర్తి చేసుకొని వచ్చేవరకు నేను మేనేజ్ చేస్తాను. పూర్తిగా ఆయన ఏం సంబంధం లేనట్టుగా వెళ్ళిపోతే మాత్రం నేనీ ఎస్టేట్ ని కాపాడలేను."
చివరికి వికాస్ ని ఇక్కడ వదిలిపోవడానికి ఒప్పుకొన్నారు అన్నదమ్ములు.
"వెళ్ళిపోతున్నామేగాని మా ప్రాణాలన్నీ వీడిమీదే వుంటాయని మరవకండి! ఏం జాగ్రత్తలు తీసుకొంటారో, ఎలా కాపాడుతారో మీ ఇష్టం. 'అయ్యో, ఎందుకు వదిలిపెట్టి వచ్చాము' అని పశ్చాత్తాపపడే క్షణాలు రానివ్వరని ఆశిస్తున్నాము!" ఏర్ పోర్ట్ లో వీడ్కోలు తీసుకొంటూ అన్నాడు జయరాజ్.
"వికీ! జాగ్రత్త! ధర్మలింగం పెద్దవారు! ఆయన చెప్పినట్టు విను! కొద్దిరోజుల తరువాత నేనో, చినమామయ్యో వీలు చూసుకొని వస్తాం!" మేనల్లుడిని కౌగలించుకొని విడవలేక విడిచి వెడుతున్నట్టుగా వెళ్ళిపోయారు.
విమానం గాలిలోకి ఎగిరాక వికీని తీసుకొని ఏర్ పోర్ట్ నుండి బయటికి వచ్చాడు ధర్మలింగం .ముఖం చిన్న బుచ్చుకొన్నట్టుగా వున్న అతడిని చూసి, "అప్పుడే బెంగగా అనిపిస్తూందా చినబాబూ?" అడిగాడు.
"ఎవరూ లేకుండా వుండడం కొంచెం కష్టమే కదా?"
"మేమంతా లేమా?"
"ఉన్నారు! క్రొత్త కదా అంతా?" ఇబ్బందిగా నవ్వాడు.
"మీరు బొమ్మలవీ వేస్తారని విన్నాను! అందుకు కావలసిన సామాను తీసుకొని వెడదాం. మీకు కొంచెం టైం పాస్ అవుతుంది?"
"భలే గుర్తు చేశారే?" వికీ ఉత్సాహంగా అన్నాడు.
సుల్తాన్ బజారులో కారాపి, బొమ్మలు వేయడానికి కావలసిన సరంజామా అంతా కొని, తిరిగి బయల్దేరారు.
ఒకనాడు సంస్థానంగా విలసిల్లినా ఇంకా పల్లెటూరి ఛాయలు వదలని ఊరది.
ఊరికి వెలుపల రెండుకిలోమీటర్ల దూరంలో.....
"ఎక్కడున్నావయ్యా? ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా" అని భక్తుడు మొరపెట్టుకొనేంత ఎత్తుకాకపోయినా ఎత్తయిన గుట్టలమధ్య వెలసిన ఆంజనేయస్వామి వారి ఆలయం. ఆలయం ముందు శాకోపశాఖలుగా విస్తరిల్లిన అస్వర్ధవృక్షం, అశ్వర్ధవృక్ష శిఖరాగ్రాన్ని సవాలు చేస్తున్నట్టుగా నిటారుగా, పొడుగ్గా నిలబెట్టిన ధ్వజస్తంభం. ఆ ప్రక్కనే కోనేరు.
సంధ్యపూజ ఆరంభమైనట్టుగా గుడిలో గంట మ్రోగుతున్న సమయంలో వికాస్ మెట్లు నెమ్మదిగా ఎక్కివచ్చి, సేదదీర్చుకొంటున్నట్టుగా, అశ్వర్ధ వృక్షం క్రింద నిలబడ్డాడు. మెడలో బైనాక్యులార్ భుజానికి బొమ్మలు గీసే సరంజామా వున్న బట్ట సంచీ ఉన్నాయి.
అపరిచితమైన ఆ పరిసరాలను ఆసక్తిగా వీక్షించసాగాడు.
ఎంతో ప్రశాంతంగా, పవిత్రంగా వున్న ఆ వాతావరణంలో గాలి తాకిడికి ధ్వజస్తంభం తన చిరుగంటలను చిన్నగా మ్రోగిస్తుంటే, రావి ఆకులు వింత శబ్దం చేస్తున్నాయి.
అశ్వర్ధవృక్షం మొదట్లో వెలిసిన నాగశిల. పూజలందుకొంటున్నట్టుగా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టివున్నాయి.. నాగశిల తలమీద పచ్చగన్నేరు. , దేవగన్నేరు పూలు పెట్టి వున్నాయి.
కొద్ది క్షణాల తరువాత....
కోనేట్లో పాదప్రక్షాళనం చేసుకొని, ఆలయ ప్రవేశం చేశాడతడు.
".........ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివత్మకం.
తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం....."
స్వామి వారి చుట్టూ ప్రభావళిలో ఆకులు గ్రుచ్చుతున్నాడు పూజారి శిఖామణి.
"మీరా చినబాబుగారూ?" శిఖామణి కళ్ళలో సంభ్రమం, ఆశ్చర్యం చోటు చేసుకొన్నాయి. జవాబుగా ఒక స్నిగ్ధహాసం చేశాడతడు.
"ఈయన మీ ఇంటి ఇలవేల్పు. మీ ముత్తాతగారిచేత ఈ స్వామివారి ప్రతిష్ఠాపన జరిగింది. మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ స్వామివారిని అర్పించి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ!" శిఖామణి చెప్పాడు ఆకులు గ్రుచ్చుతూనే.