3. పంది మేక ఎను | బోతు మృగముల
నెమలి కొక్కెర - ఖడ్గమృగముల |
మాంసపు ముద్దలు - వేరు వేరుగ
పచనము చేయబ | డే రుచులు రుచులుగ |
తినగా మిగిలిన - పదార్ధములతో |
బంగరు కంచము | లు వెలుగు కాంతులతో
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది .... ||శ్రీ||
4. ద్రాక్ష దాడి మా | ది ఫలముల రసములు
కల్లు తేనెలు - పుష్పాసవములు |
నానావిధ ఫల - పుష్ప జాతుల
పలుచని చిక్కని - మధుర రసాలు |
త్రాగగా మిగిలిన పానీయములతో
బంగరు పాత్రలు - వెలుగు కాంతులతో |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది .... ||శ్రీ||
5. మత్తున శయనించు - సుదతుల మోములు
పద్మములనుకొని - మూగు భ్రమరములు |
నిమీలిత వి | శాల నేత్రములు
నిశాముకుళిత - పద్మ పత్రములు |
ఉత్తమ కాంతల - గూడి రావణుడు
తారాపతి వలె - తేజరిల్లెడు |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది .... ||శ్రీ||
6. స్తన మధ్యసీమ | ముత్యాల హారము
నిదురబోదూగు - హంసల వారము |
మొల నూలు మెరయు - ఘన జఘనములు
జల పక్షులాడు - ఇసుక తిన్నెలు |
చలువరాల పొర | లు చంద్రముఖులు
ఏటి చంద్రుని - చాటు చూపులు |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను | అచ్చెరువొంది ..... ||శ్రీ||
7. ఆలింగనముల - సొక్కిన వనితల
మణిహారముల వొ | త్తిడిన కుచములు
కామక్రీడల - సోలిన కాంతల
చెదరిన కురులు - జారిన చీరలు |
తునిగిన మాలలు - నలిగిన పూవులు
మదగజమాడిన - వనమునుబోలు
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ..... ||శ్రీ||
8. కుచములు భుజములు - పిరుదులు తొడలు
ఒండొరులకు అ | మరిన తలగడలు |
అల్లి బిల్లిగా - వొరిగిన కొమ్మలు
వ్రాలిన కురులు - రాలిన విరులు
చెదరిన చిన్నెలు - తరిగిన వన్నెలు
సుడిగాలి బడిన - వనమును బోలు |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ..... ||శ్రీ||
9. తాగితాగి మ | త్తిల్లిన సవతులు
ఒకరినొకరు ముం | చెత్తు చుంబనలు |
సాటి కాంతను - కాంతుడనుకొని
బిగి కౌగిటగొను - కామినీ మణులు |
మధువు గ్రోలిన - సతుల శ్వాసలు
రావణు కెంతో - సుఖ వాసనలు |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ..... ||శ్రీ||
10. రావణుండు రణ | మందున గెలిచి
స్త్రీలెందరికో - లంకకు జేర్చెను |
పితృదైత్య గం | ధర్వ కన్యలు
ఎందరెందరో రా | జర్షి కన్యలు
సీతదక్కవా | రందరు కన్యలె |
రావణుమెచ్చి వ | రించిన వారలె |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ..... ||శ్రీ||
11. ఉత్తమ జాతికి - చెందిన స్త్రీలు
శృంగార ప్రియులు - సౌందర్యవతులు |
రావణు శక్తి సం - పదల మురిసిరి
వంచన లేకయే - మోహితలైరి -
సతులందరిని - లంకేశ్వరుడు
సమముగ నేలేడు - రసిక శేఖరుడు |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ..... ||శ్రీ||
12. "సీత గూడ అవి | వాహితయైన
రావణుని దశ | మిన్నంటకుండున ?
రాణులందరికి | మహా రాణియన
సీత సుఖములకు - హద్దులుండునా?"
అని హనుమంతుడు - తలచె భ్రమించి
లంకేశుని ఔ | న్నత్యము గాంచి |
పుష్పకమందు రా | వణ మందిరంమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది ..... ||శ్రీ||