నిజంగా వాళ్ళలా అనుకుంటూన్న సంగతి నాకు తెలీదండీ. అయినా పాపం అమాయకులు. వారు అనుకోటానికి విలువేమున్నది లెండి?"
"ఏమో వేదితా! మున్ముందు నిన్నింకా అందలమెక్కించి, యోగినిని చేసి నైవేద్యాలు కూడా సమర్పిస్తారని భయంగా ఉంది. "అలా చేస్తే మీకేమిటి నష్టమని" అడుగుతావేమో, నష్టంకాదు కష్టం వుంది. ఈ కష్టమనేది విచిత్ర ప్రవృత్తికి సంబంధించింది - వివరించలేను.
"వివరించవద్దులెండి. కాని మిమ్మల్ని అనవసరంగా ఇన్ని ఆందోళనలకు గురిచేస్తున్నాననే నా బెంగ" అంది వేదిత నవ్వుతూ.
"నీ నవ్వు చాలా మనోహరమైనది సుమా! నా కెప్పుడన్నా రోగం వచ్చి మంచాన పడితే నీతో నవ్వించి రోగం నయం చేసుకుంటాను. అంతటి శక్తి వుందనిపిస్తుందందులో."
దానికీ వేదిత ఏదో సమాధానం చెప్పబోయింది. ఇంతలో బయట అడుగుల చప్పుడై తలెత్తి చూసేసరికి తండ్రి లోపలకు వస్తున్నాడు. ఆయన ముక్కాలిపీటమీద బుద్ధిమంతుడిలా కూర్చునివున్న శాయినిచూచి గుర్తుపట్టి "ఓ! శాయిబాబా! నిన్ను కలుసుకుందామని మీ యింటికి రెండుసార్లు వచ్చాను నాయనా! ఇంట్లో లేవు. అరె! చాలా మారిపోయావే! అయితే బాగా పచ్చబడ్డావు అక్కడి నీరు బాగా పడినట్లుంది" అన్నాడు మంచాన్ని వాల్చుకుని దగ్గరకు లాక్కుంటూ.
శాయి ఆయనకు నమస్కారంచేసి "మీ వంట్లో ఎలా ఉంటోంది!" అని పరామర్శ చేశాడు.
"ఆఁ, ఏదో రోజులు ఈడ్చుకువస్తున్నాను. పెద్దతనం వచ్చేసింది కదా. ఈ మధ్య చూపుకూడా సరిగ్గా ఆనటంలేదు - ఘటం మొండిది కాబట్టి ఇన్నాళ్ళు ఈడ్చుకొచ్చానుగాని మా తరం వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ వయస్సులో యింట్లో కూర్చుని విశ్రాంతి తీసుకుందామన్నా దేవాలయ నిర్వాహణ బాధ్యతా, ఊళ్ళో యితర వైద్య సౌఖర్యంలేని లోటూ నన్ను విశ్రాంతి తీసుకోనివ్వటం లేదు. ఆఁ, నా సంగతికేంగాని విదేశాల కబుర్లేమిటి నాయనా? అక్కడ ఏ విధంగా కాలం గడిపావు?"
వారిద్దరూ కబుర్లలో పడ్డారు. "మీ అమ్మగారు చాలా దిగులు పెట్టుకుంది నీ గురించే. ఎప్పుడు వస్తావా అని కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూస్తోంది. ముఖ్యంగా నీ భార్య సీతని చూస్తే కడుపు తరుక్కుపోయేది నాయనా!"
అంటున్నాడు తండ్రి. వేదిత మెల్లిగా లోపలకు వెళ్ళిపోయింది. ఈ సంఘటన ఆమెకేమీ బాగుండలేదు. "ఇదేమిటి? ప్రాపంచిక విషయాల గురించి ఇన్ని మాటలు మాట్లాడా నీవేళ?" అని తనమీద తనే విసుక్కొంటుంది.
* * *
శేషశాయి రోజూ ఉదయమూ, సాయంత్రమూ అడవులవైపు తుపాకీ తీసుకుని వాహ్యాళికి వెళ్ళటం కార్యక్రమంగా చేసుకున్నాడు. ఎప్పుడయినా ఓ పిట్టనో, చిన్న జంతువునో కొట్టేవాడు. అప్పుడప్పుడూ తనవెంట కెమేరాకూడా తీసుకువెళ్లి, ప్రకృతి దృశ్యాలను ఫోటో తీస్తూండేవాడు. అతనికా వూళ్ళో పొద్దుపోవటంలేదు. గ్రామంలో కల్లా సంపన్నత కలది అతని కుటుంబం. అతను తిరిగి వచ్చాడని తెలియగానే ఊళ్ళోని పెద్దలు తరచు అతనింటికి రావడం మొదలుపెట్టి కలుపుగోలుతనంగా ఉంటూ అనేక సమస్యలు, వ్యవహారాలు ముచ్చటిస్తూ ఉండేవారు. అతన్ని కొన్ని సందర్భాలలో తీర్పు చెప్పమని కొట్లాటలలో ఉభయపక్షాల వారూ వచ్చి అర్థిస్తూ ఉండేవారు. గ్రామ పెద్దలు అతన్ని పల్లెటూరి రాజకీయాలలో ఇరికించి అతని ద్వారా వూరిని పైకి తీసుకువద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఒక విధమైన శిక్షణకే అలవాటు పడిన అతని మనస్సుకు ఇవన్నీ పట్టలేదు. ఏ బాధ్యతల్లోనో తలదూర్చట మతనికి యిష్టంలేదు. తన ఉనికిని యిక్కడ సుస్థిరం చేసుకోవటం అంతకన్నా యిష్టంలేదు.
ఒకరోజు సాయంత్రం అతను దేవాలయం మీదుగా వెడుతూ లోపలనుండి వేదిత కోమలగానం వినబడేసరికి, పాదరక్షలు బయట విడిచి లోపలకు ప్రవేశించాడు. గోవిందాచార్యులు గర్భగుళ్ళో దేవుడి దగ్గర ఉండి భక్తులకి హారతి చూపిస్తూ, మంత్రాలు చదువుతూ, భగవతార్చనలో నిమగ్నుడై ఉన్నాడు. మండపం మీద స్త్రీ, బాల, వృద్ధులు పాతిక ముప్పయిమంది వరకూ కూర్చుని ఉన్నారు. వారి సరసన కూర్చుని వేదిత తంబూరా మీటుతూ, కృష్ణగీతాలు పాడుతోంది, ఒకింత దూరంలో అతను స్తంభానికి ఆనుకుని, గీతా లాలపిస్తూన్న వేదిత ముఖంకేసి తదేకదీక్షగా కళ్ళు పెద్దవి చేసి చూడసాగాడు. ఆమె అతన్ని గమనించింది కాని ఆమె ముఖంలో ఎట్టి మార్పూ, హావభావ ప్రదర్శనా ద్యోతకం కాలేదు. కనులు అరమోడ్పు చేసుకుని, తంబూరా మీద తన సున్నితమైన వ్రేళ్ళు కదిలిస్తూ భక్తి పారవశ్యంలో ఆమె పాడుతోంది.
శేషశాయి విచిలితుడై, ఆశ్చర్యంగా వింటున్నాడు. చల్లని యీ సాయంకాలం, దక్షిణ దిశనుండి వీస్తూన్న శీతల వాయువులు, మధురమైన దేవాలయ వాతావరణం, ఎక్కువమంది స్త్రీలూ, కొద్దిమంది పురుషులూ గుమిగూడటం, అపురూప సౌందర్యంతో, దిగ్భ్రాంతి కలిగించే వర్చస్సుతో ఓ యువతి వారి మధ్య కూర్చుని వైష్ణవ గీతాలు ఆలాపించటం అతనికెంతో మనోహరంగా తోచింది. అతను విసుక్కునే యి గ్రామీణ వాతావరణంమీద ఎంతో మమకారం పుట్టుకు వచ్చింది. అతను ఆకస్మికంగా అక్కడి భూమినీ, ఆ పరిసరాలనూ ప్రేమించాడు.
వేదిత అంటే ఆ గ్రామస్థులకు గల ఆదరాభిమానాలకతను ఆచ్చెరు వొందాడు. ఎంతోమందితో మాట్లాడేటప్పుడు అతడామెను గురించిన ప్రశంసలు వినటం తటస్థించింది. వారందరికీ ఆమె అంటే భక్తి గౌరవాలు, ప్రేమ. ఆమె వారి తలలోని నాలిక.
వేదితలోని మరో ఆకర్షించే విషయమేమిటంటే ఆమె యెవరితోనూ వేదాంత చర్చలు చెయ్యదు. దీర్ఘ ప్రసంగాలు చెయ్యదు. వాద ప్రతివాదాలు చెయ్యదు. తనకేమీ తెలుసునని చెప్పదు. అందరితో మనసు విప్పి నవ్వుతూ మాట్లాడుతుంది. పిల్లలతో ఆడుకుంటుంది. ఎవ్వరూ లేనప్పుడు పువ్వులతో, మొక్కలతో, పావురాలతో, కుందేళ్ళతో కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. లేకపోతే విధి విరామం లేకుండా సత్ గ్రంథాలు చదువుతూ కూర్చుంటుంది. ఆమె ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏమీ చెయ్యకపోయినా ఆమెను చూస్తే - ఆమెకు ఎంతో తెలుసుననీ, అతీతురాలనీ, తమకు లేని ప్రత్యేకత ఆమెకు ఉన్నదనీ ఎవరికైనా అనుభూతి కలుగుతుంది.
కాని ఆమెను చూస్తే శేషశాయికి కలిగిన అనుభూతి వేరు. దానికి నిర్వచనం లేదు. అతని కంతా అస్పష్టంగా, మసక మసగ్గా ఉంది.