ఆ రాత్రి పడుకుంటే తంబూరా పట్టుకుని, వ్రేళ్ళు కదలిస్తూ కమనీయంగా గానం చేసే వేదిత స్వరూపమే అతని కన్నులముందు చీటికీ మాటికీ సాక్షాత్కరించసాగింది.
ఒకరోజు వేకువఝామునే లేచి, తూర్పున తొలిరేఖలు విచ్చుకోక ముందే కెమేరా భుజాన తగిలించుకుని ఏటివైపు నడిచి వెళ్లాడు. ఏటికి అవతలివైపు ఓ గంగరావి చెట్టు వుంది. దాని వెనుక నిలబడి చెట్టుకు ఆనుకుని సిగరెట్టు కాల్చుకుంటున్నాడు. ఆ సమయంలో తను చేస్తున్న పని అనౌచిత్యం అనిగానీ, కుసంస్కారం అనిగానీ అతనికి అనిపించలేదు. తనని చూసి అతను సిగ్గుపడలేదు.
క్రమంగా తూర్పున ఎర్రని కాంతి ఉదయించి, ఆ కాంతి వివిధ కిరణాలుగా భూమిమీదకు వ్యాపించసాగింది. ఏటిలో జలజల పారుతూన్న నీరు ఎర్రగా మెరుస్తూ శోణిమ కాంతుల్ని విరజిమ్మసాగింది. గంగరావిచెట్టుమీద గూళ్ళలోని పక్షులు కలకలరావం చేస్తూ గాలిలోకి లేచాయి. శిశిరఋతువు కావటంవల్ల గాలికి చుట్టుప్రక్కల చెట్లమీద ఆకులు ఒక టొకటిగా రాలిపడుతున్నాయి.
దూరాన తెల్లని వెలుగు తళుక్కుమని మెరిసింది. మంచినీటికని బిందె తీసుకుని, మేలిముసుగు వేసుకుని వేదిత హంసలా నడిచివచ్చింది. శేషశాయి అప్రతిభుడయాడు. అతని చేతులు వొణికాయి. ఆమెకు తాను ఎక్కడ కనబడతానో అని బాగా చెట్టుచాటుకు జరిగి నిల్చున్నాడు. వేదిత బాగా దగ్గరకు వచ్చింది. ఏటి దాపున నాలుగయిదు చలమలు తియ్యబడి ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ మోహనమూర్తి అయిన వేదితా, చెట్టుచాటున దొంగలా పొంచివున్న శేషశాయీ తప్ప ఎవరూ లేరు. పల్లెప్రజలు మంచినీరు తీసుకుపోటానికని ఇంకా రావడం మొదలిడలేదు. వేదిత ఒక చలమదగ్గర నిలబడి బిందెలో నీళ్ళు నింపుకోవటానికని క్రిందికి వంగింది. మేలిముసుగు క్రిందికి జారింది. కెమేరామీద అతని చెయ్యివొణికింది. కెమేరా క్లిక్ మంది. వేదిత నీళ్ళు నింపుకుని ఒక చేత్తో బిందె భుజానికి ఆన్చుకుని, మరో చేత్తో మేలిముసుగు సరిచేసుకుంది. మళ్లీ కెమేరా క్లిక్ మంది. వేదిత వెనుదిరిగి చంకలో బిందెతో ఊరివైపుగా వెళ్లిపోతోంది. మళ్ళీ కెమేరా క్లిక్ మంది.
అదే రోజు బస్తీకి వెళ్ళి ఆ ఫోటోలు ప్రింటు చేయించుకు వచ్చాడు. ఆ రాత్రి భోజనం చేశాక తన గదిలో టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ఆ ఫోటోలను ముందు పెట్టుకుని దీక్షగా పరిశీలిస్తున్నాడు. మేలి ముసుగు జారినప్పుడు ఆమె జుట్టు ముడివీడి ఉంది. అప్పుడు వీడిందో, లేక అసలు ముడి వేసుకోలేదో,ముందుకు వంగినప్పుడు ఆమె కురులు రెండు భుజాల మీదుగా క్రిందికి జారాయి. ఎంత వొత్తుగా, అందంగా ఉన్నాయి ఆమె శిరోజాలు! క్రిందికి వొంగినప్పుడు ఆమె పమిటకూడా కాస్త ప్రక్కకు తొలిగింది. ఎంత ముగ్దమనోహరమైన ఆమె యవ్వనం! మేలి ముసుగు సవరించు కుంటున్నప్పుడు తీసిన రెండవ చిత్రం వంక అతని దృష్టి మరలింది. అందులో అతనికి వాస్తవమైన హిందూ వనిత చూపరుల్ని పరవశుల్ని చేసే నాజూకుతనం, ఎన్నాళ్ళ క్రిందటో అతను మరిచిపోయిన సంప్రదాయం, అందరూ ఇలా ఉంటే బాగుండుననే భ్రాంతి కలిగించే సహజత్వం కనిపించాయి. మూడవ చిత్రం ఆమె బిందె తీసుకుని వయ్యారంగా కదలి వెళ్ళిపోతున్నప్పుడు వెనుకనుండి తీసినది, అసలైన అజంతా శిల్పం, నిజమైన స్త్రీ సౌందర్యం వెనుకవైపు నుండి చూసినప్పుడే వ్యక్తమవుతుందన్న నిశ్చయానికి వచ్చాడు. పోతపోసినట్లు ఉన్న విగ్రహం, ఏ భాగానికా భాగం చక్కగా అమిరినట్లున్న శరీర.... అతను వివశుడైపోయాడు. అతని మనసు సంపుల్లమానమై ముఖం ప్రపుల్లమై ద్యోతకమైంది.
తన దృష్టిలో, ఆలోచనలో ఏమయినా దోషమున్నదా అని సంశయం కలిగింది. ప్రతి ఒక్కరూ ఆమెను పవిత్రభావంతో చూస్తున్నప్పుడు తనకే ఆమె అందచందాలని గురించి, లావణ్యాన్ని గురించి ఎందుకిలాంటి ఊహలు ఉత్పన్నమవుతున్నాయి? తను అంతటి కామాంధుడా? కామంధుడే కావచ్చు. అది మనిషికి అసహజం కాదు. ఒక యవ్వనవతి అపూర్వ సోయగాన్నీ, విలాసాన్నీ చూసి వివశుడవటం ప్రకృతి విరుద్ధము అవుతుందా? అతని ఆలోచన్లకు అతనికే నవ్వు వచ్చింది. తను అమెరికాలో నాలుగేండ్లకు పైగా ఉండి వచ్చాడు. ఆ దేశంలో నిషేధమనే మాట అతను విస్మరించాడు. స్వగ్రామంలో ఉన్నప్పుడు తనకు గల నమ్మకాలను విసర్జించాడు,మాంసం భుజించాడు, మద్యం సేవించాడు. అందగత్తెలతో యధేచ్ఛగా విహరించాడు. పెద్ద పెద్ద విందులూ, వినోదాలలో పాల్గొని డ్యాన్సులు చేశాడు. అతని అనుభవానికి హద్దులు లేవు. ఖుషీగా, విలాసంగా, మత్తుగా కాలం గడిపాడు. మొదట్లో అతనూ చాదస్తంగా, మందసంగా కొంతకాలం గడిపాడు. అతని సహపాఠి, ఓ అమెరికా మిత్రుడు అతన్ని పూర్తిగా మార్చేశాడు. శాయి మనోభావాలు, ఆడవాళ్ళని గురించి అతనికన్న మృదువైన అభిప్రాయాలూ అవగతం చేసుకుని ఆ మిత్రుడు తన సిద్ధాంతాలను అతనికి బోధించసాగాడు. "ఐ కాన్ట్ ఎడోర్ ఉమెన్, ఐ నో ఓన్లీ హౌ టు ఎన్ జాయ్ హర్" అనేవాడు. క్రమ క్రమంగా ఆ మాటలు శాయికి తలకెక్కాయి. తన పాత పద్ధతులకి స్వస్తిచెప్పి. కొత్త కవచం ధరించి, అమెరికన్ మిత్రుడ్ని అనుసరించి ముందుకు సాగాడు. ఆ మత్తులో, నూతన ఒరవడిలో తండ్రి చనిపోయినట్లు ఇంటి దగ్గర్నుంచి వచ్చిన కేబుల్ కూడా అతన్ని కదిలించలేదు. ఏం చేస్తాం? ముసలాడు మహా బ్రతికితే యింకో రెండేళ్ళు బ్రతికేను. కాస్త ముందుగా పోయాడు. నే నిప్పుడు వెళ్ళి ఏం చేస్తాను?" అన్నాడు త్రాగిన మైకంలో వాలుకుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకుంటూ. కాని అతని మిత్రుడే అతనికి నిషా వదలగొట్టి, బలవంతంచేసి విమానాశ్రయందాకా తీసుకువెళ్ళి ప్లేన్ ఎక్కించాడు. అతను స్వగ్రామానికి వచ్చి సరిగ్గా పది రోజులున్నాడంటే, కలగాపులగంగా, యాంత్రికంగా, హడావుడిగా ఏదో తంతు జరిపిస్తూ ముళ్ళమీద గడిపినట్లు గడిపాడు. ఎప్పుడు ఈ నరకం నుంచి బయటపడదామా అని ఆరాటంగా ఉంది. అప్పటికి వేదిత యింకా అత్తవారింట్లోనే ఉంది. అయినా ఆమెను గురించి ఆలోచించేటంతటి తీరికగాని, జ్ఞాపకంగాని అతని కప్పుడు లేవు. అతని ధ్యాసంతా ఆమెరికాలో ఉంది.
ఇప్పుడు ఆ ఫోటోలను ఎదురుగా పెట్టుకుని యింతటి సహజ సౌందర్యం అక్కడ తనకి కనిపించిందా అని ఆలోచిస్తున్నాడు. ఆకస్మికంగా అతనికి వాళ్ళ వంటి మీద అర్థంలేని తెలుపుమీద వాళ్ళు తొడుక్కునే దుస్తులమీద లాలిత్యం దోబూచులాడని వాళ్ళ శరీర సౌష్టవాల మీద ఏవగింపు కలిగింది.
కాసేపు ఆ ఫోటోలను చూస్తూ ఆనందించి తర్వాత డ్రాయరు సొరుగులో పెట్టి తాళం వేశాక లేచి బీరువా దగ్గరకు వెళ్ళాడు. అందులోంచి విస్కీబాటిల్, గాజుగ్లాసు తీసి, బీరువా తలుపుమూసి టేబుల్ దగ్గర కొచ్చాడు. గాజుగ్లాసులో కాస్త విస్కీ వొంపుకుని, గాజుకూజాలోని నీళ్ళతో గ్లాసునంతా నింపి, కుర్చీలో కూర్చుని కొంచెం కొంచెం త్రాగసాగాడు.