"ఎందుకు నన్నలా పొగుడుతారు శేషుబాబూ? నేను నా తృప్తి కోసం, ఆనందంకోసం పాడుకుంటున్నాను. ఒకరికోసం కాదు."
"సరే" అని శాయి హఠాత్తుగా మాట మార్చేసి "ఇదివరకైతే మీ ఇంటికి నేను రావటానికి అనుచితమని చెప్పి తిరస్కరించావు. ఇప్పుడు సరాసరి లోపలికి వచ్చేశాను వెళ్ళిపొమ్మంటావా? ఆహ్వానిస్తావా?" అన్నాడు.
బొమలు ముడివైచి వేదిత అతనివైపు క్షణంసేపు చూసింది. ఆ చూపులో తిరస్కారమూలేదు. ఉదాసీనతాలేదు. తర్వాత నవ్వుతూ "వెళ్ళగొట్టను. రండి మా గృహం పావనం చెయ్యాలని మీకెంతో ఉత్సాహంగా ఉన్నట్లుంది" అని దగ్గర్లో ఉన్న ముక్కాలిపీట ముందుకు తోసి "మా ఇంట్లో విలువగల ఆసనాలు లేవు. ఏదో బీదదాన్ని. దీంతోనే సంతృప్తిపడాలి మీరు" అన్నది.
అతను లోపలకు వచ్చి ముక్కాలిపీటమీద చక్కగా కూర్చుని ఇల్లు నాలుగుమూలలా ఒకసారి కలయచూశాడు. "వెనుకటికీ ఇప్పటికీ పెద్దమార్పు లేదు. కాకపోతే ఇంటినిండా ఇప్పుడు కృష్ణుని చిత్రాలూ, బొమ్మలూ, శిల్పాలూ వెలిసినై. తెలియకడుగుతాను వేదితా! అంత భక్తురాలివి అయినావా ఏం?"
ఈ పలుకులు ఆమె గుండెల్ని సూటిగా సోకి, ముఖం ఎర్రబడింది. అయినా వెంటనే తమాయించుకుని తేలికగా నవ్వేస్తూ "అంతమాట నేనెప్పుడూ చెప్పను శేషుబాబూ! చేసేందుకు పనిలేక, ఇది నా వృత్తి చేసుకున్నాను" అంది మృదుస్వరంతో.
"నిజం చెబుతున్నాను వేదితా! నాకు ఈ దేవుళ్ళలోనూ, దెయ్యాలలోనూ నమ్మకం అంతరించిపోయింది. మానవుడు సుఖంగా బ్రతకటానికి, అతని మనస్సు విశాలంగా వ్యాపించటానికి ఇవన్నీ ప్రతిబంధకాలని నా ఉద్దేశం ఏమంటావు?"
"నేనేమంటాను శేషుబాబూ! ఎవరి నమ్మకాలు వారివి."
"నువ్వు భగవంతుడ్ని త్రికరణశుద్ధిగా నమ్ముతావా?"
"నమ్ముతాను."
"అతని ఉనికిని గురించి లీలగానైనా సందేహం రాదూ?"
"రాదు"
"నీకు భగవంతు డెప్పుడైనా కనిపిస్తాడా?" అన్నాడు వెక్కిరింపుగా.
"కనిపిస్తాడు" అన్నది వేదిత నిశ్చలంగా.
"ఎక్కడా? రాతి బొమ్మలోనా?"
"అంతటా! అందమైన ఈ ప్రకృతిలోని ప్రతి అణువుల్లో, వంటరిగా కూర్చున్నప్పుడు శూన్యంలో, నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో నిశ్చలంగా, ఏకాగ్రత కలిగినప్పుడు నా ప్రతి రక్త బిందువులో కనిపిస్తాడు."
"నువ్వు మారిపోయావు వేదితా! ఇంతటి తీక్షణ నమ్మకాల్తో మనుషుల్ని నేను చూడలేను. నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది వేదితా!" ఈ మాటలు అతను మనస్ఫూర్తిగా అన్నాడు. ఈ యిల్లు, ఆమె నిర్మించుకున్న పరిధి, సృష్టించుకున్న వాతావరణం, అవలంభించిన వైఖరి చూసి ఒక్క క్షణమయినా భరించలేడు అతను.
వేదిత ఇందాకటినుంచీ నిలబడే ఉంది. గోడకు ఆనుకుని, అర్ధనిమీలిత నేత్రాలతో అతనివంక చూస్తూ "మార్పు మనిషికి సహజం కాదా బాబూ? చిన్నతనాన ఉన్నట్టు మీరిప్పుడు ఉన్నారా? రోజులు గడిచిన కొద్ది ఎదుగుదలా, ఆ తరువాత క్షీణదశా తప్పవుకదా?" అంది.
"నువ్వింత వేదాంతివి అవుతావని తెలిస్తే నిన్నసలు పెరగనిచ్చి ఉండను."
వేదిత ఫక్కుమని నవ్వింది. నవ్వినప్పుడు ఆమె మనస్సులోని స్వచ్ఛతా, ధవళిమా గదంతా వ్యాపించినట్లయింది.
"ఏమయినా మీకు చాలా దైర్యం బాబూ" అన్నది.
"అదేం?"
"అన్ని బాధ్యతలూ మీ చేతిక్రిందికి తీసుకుంటారు. ఆఖరికి నా పెంపకం కూడా."
అతనుకూడా నవ్వాడు. "గతం గుర్తువస్తే కాస్త చనువు అధికమవుతూ ఉంటుంది వేదితా! చిన్నతనాన నాతో ఎప్పుడూ తగాదా పడే దానివి. అది గుర్తుంది. నేనెప్పుడూ నిన్ను శిక్షిస్తూ ఉండేవాడిని. అప్పుడు నీ కళ్లల్లో కనిపించిన తృణీకారాన్ని యిప్పటికీ మరిచిపోలేను వేదితా!" అన్నాడు.
ఆమె సిగ్గుపడుతూ నవ్వి "అది బాల్యం శేషుబాబూ! తాత్కాలి కోద్రేకమేగాని మిమ్మల్ని నేనెన్నడూ ద్వేషించలేదు" అన్నది.
"నీ సుకుమార హృదయంలో ద్వేషానికి తావులేదన్న సంగతి తెలుసు నాకు. కళ్యాణమూర్తి, నేను యిక్కడెప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకునేవాళ్ళమా? కాలేజీలో చేరాక ప్రియాతి ప్రియమైన స్నేహితులమైపోయాము. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చాము. అతన్ని గురించి అడగవేం?"
"ప్రశ్నలువేసే అలవాటు చాలా కాలంగా తప్పిపోయింది బాబూ"
"బాగుంది. నీ కన్నీ మంచి అలవాట్లే అయినాయి. కళ్యాణమూర్తి యూనివర్సిటీలో ఆనర్స్ ప్యాసయి కలకత్తాలో ఒక ఆయిల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. గత రెండు మూడేండ్లుగా యిద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. ఇంకా అక్కడే ఉన్నాడో, ఎక్కడికైనా ట్రాన్స్ ఫరయిపోయాడో తెలీదు."
కళ్యాణమూర్తి ప్రసక్తి వచ్చేసరికి ఎంత దాచుకుందామన్నా ఆమె కన్నులలో ఓ వెలుగురేఖ తళుక్కుమని మెరిసింది. ఎంత అతీతులం అవుదామనుకున్నా ఈ లోకంలోని బంధాలను తేలికగా తెంచుకోలేము. శాయి ఆమె ముఖంవంక చూడకుండా చెప్పుకుపోతూ ఉండటాన ఈ విషయం గమనించలేదు.
అతను నిట్టూర్పు విడుస్తూ అన్నాడు. "నేను ఈ పల్లెటూరు వచ్చి యిరుక్కుపోయాను. రోజూ ఓ సమస్య క్రింద గడుస్తోంది నాకు. ఎక్కువ రోజులు ఈ ఊరిలోనూ ఉండను. ఇక్కడ కూర్చుని సోమరిపోతులా తింటూ వ్యర్థంగా రోజులు ఎలా గడపను? ఎన్నాళ్ళు తిన్నా తరగని ఆస్తి ఒకటి ఏడిసింది. ఎక్కడయినా ఉద్యోగం చేయటానికి మనస్కరించటంలేదు. బొంబాయిలో నాతో కలిసి చదువుకున్న మిత్రులూ, డబ్బుతో నాతో పోటీ పడగలిగినవారూ చాలామంది ఉన్నారు. వారిలో కొంతమందిని చేర్చుకుని ఇంజనీరింగు కన్ సరన్స్ పెడదామని ఉంది ఏమంటావు?"
"నాకేం తెలుసు బాబూ! ఇంట్లో కూర్చుని భజగీతాలు పాడుకునే పిచ్చిదాన్ని. మీ కెలాతోస్తే అలా చేయండి."
"నువ్వు పిచ్చిదానివేం కాదు. ఈ ఊరి ప్రజల వరానివటగా !"