Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 7


    "వశీకరణ శక్తి అంటే ఏమిటో, అది ఎలా ప్రయోగిస్తారో నీకు తెలుసా!"
    "ఆ! కోరుకున్న ఆడదాని ఎడంకాలి బొటనవేలి దుమ్ము తీసుకోవాలి. అది ఒక కుండలో వేసుకుని దానిలో తన, అంటే ఆ మొగవాడి మలమూత్రాలు కలపాలి. ఆ తర్వాత కుడిచేతి చూపుడు వేలినుంచి పదకొండు నెత్తురు బొట్లు రాల్చాలి. ఆ కుండని శ్మశానంలో పాతి అక్కడ హోమం చెయ్యాలి. అప్పుడు కోరుకున్న ఆడది చచ్చినట్లు వెంటపడి వస్తుంది. ఎంత పతివ్రత అయినా సరే!"
    శరీరం జలదరించింది విదుషికి. జ్ఞాన్ ముఖం చూసింది. అతడు కళ్ళు పెద్దవి చేసి, మరేవో గ్రహాల నుంచి దిగివచ్చిన మనిషిని చూస్తున్నట్లు చూస్తున్నాడు రత్నావళిని. "టూట్! టూట్!" ఛీత్కారం చేశాడు చిచ్చు. ఆదిలక్ష్మి అతడివైపు కోపంగా చూసింది.
    "నీకెలా తెలిసాయి, ఇవన్నీ!" అడిగింది విదుషి.
    "తాంత్రిక ప్రపంచం అనే పుస్తకంలో వున్నాయి. అఘోరా అనే ఆయన రాశాడు." అని కొంచెం ఆగి కళ్ళు పెద్దవి చేసి, "సంస్కృత శ్లోకాలలో ఉన్నాయి, ఈ విషయాలన్నీ! వాటి అర్థాలు కూడా రాశారు" అని చెప్పింది.
    వీళ్ళంతా అజ్ఞానులు కారు. బాగా చదువుకున్న వాళ్ళు. డిగ్రీలు సంపాదించుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు! ఇలాంటి వాళ్ళ సంఖ్య తక్కువలేదు ఈనాటికి సమాజంలో. పోనీ, ఇవన్నీ నిజమైన నమ్మకాలా అంటే అదీకాదు. "ఏమో! ఏ పుట్టలో ఏ పాముందో!" అనే లాంటి ధోరణి...
    "మమ్మల్ని ఇళాదేవి దగ్గరికి తీసికెళ్ళండి అన్నయ్యగారూ! మా అదృష్టం ఎలా ఉందో!" అంది ఆదిలక్ష్మి. ఆవిడ మొగవాళ్ళందర్నీ "అన్నయ్యా!" అనే పిలుస్తుంది. నిజానికి జ్ఞానదేవ్ కంటే ఆవిడ చాలా పెద్దది.
    చిచ్చు గదిలో కూచుని, ఆదిలక్ష్మి చెప్పిన విషయాలు క్లుప్తంగా నోట్సు చేసుకుంది విదుషి. ఆ సాయంత్రమే, అందరూ ఇళ ఇంటికి వెళ్ళారు. అప్పటికే చాలామంది జనం ఉన్నారు, ఆ ఇంటి వరండాలో! ప్రమధపురి నుంచే కాక, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వస్తున్నారు జనం! కృష్ణాజినం మీద కూచుని భగవద్గీత చదివి, వ్యాఖ్యానం చెప్తున్నాడు యోగానాథశాస్త్రి. ఇప్పుడాయన పళ్ళెంలో దక్షిణ డబ్బులు బాగా పడుతున్నాయి. భక్తులు ఒకరి తర్వాత ఒకరుగా లోపలికి వెళ్తున్నారు. పూజా మందిరంలో నామాలయ్య దంపతులిచ్చిన పట్టుపరికిణీ కట్టుకుని దుర్గాలా అలంకరించుకుని కూచుంటుంది ఇళ. మనసారా ధ్యానం చెయ్యటం ఆ పిల్లకి బాగా అలవాటయింది. తన దగ్గరకి వచ్చిన భక్తులకి దుర్గని తలుచుకుని, తీర్థం ఇయ్యటం ఆ పిల్ల పని!
    జ్ఞానదేవ్ ని చూడగానే కూచున్న పీటమీద నుంచి లేచి "నమస్కారం మాస్టారూ!" అంది ఇళ. పక్కనే ఉన్న అచ్యుతమ్మ కోపంగా "నువ్వలా లేవకూడదు!" అంది. ఇళ ముఖం చిన్నబుచ్చుకుంది. ఉక్రోషం పొంగింది మనసులో. ముఖం గంభీరంగా మార్చుకొని, "నన్ను నువ్వలా ఆజ్ఞాపించకూడదు!" అంది. గతుక్కుమంది అచ్యుతమ్మ. చైతన్య నవ్వాడు గట్టిగా. చాలా ముఖాలు అటు తిరిగాయి. అచ్యుతమ్మ గడుసుది! టపటప లెంపలేసుకుని "క్షమించు తల్లీ?" అంది. అక్కడ చేరిన చాలామంది ఎందుకో ఏమిటో, తెలీకుండా లెంపలేసుకుని దణ్ణాలు పెట్టేసుకున్నారు. "టూట్!" అన్నాడు చిచ్చు. నిట్టూర్పు అణుచుకుంది విదుషి.
    ఆదిలక్ష్మి కుటుంబం వంతు వచ్చింది. ఇరవై ఒక్క రోజులు వయసున్న పసివాణ్ణి ఇళ పాదాలముందు పడుకోబెట్టి, నమస్కారం చేసింది రత్నావళి. పసిపిల్ల ఇళ, అలవాటుగా, ఉద్దెరిణెతో పసివాడి గొంతులో తీర్థం పోసింది.
    "నో!" గట్టిగా అరిచింది విదుషి. కానీ, అప్పటికే నీళ్ళు పసివాడి గొంతులో గురగురలాడి, బలహీనంగా ఉన్న అతడి ఊపిరి ఆగిపోయింది. భయంతో బిగుసుకుపోయింది అచ్యుతమ్మ. ఘొల్లుమంది రత్నావళి. యోగానాథశాస్త్రి లోపలికి వచ్చాడు. గంభీరంగా అన్నాడు.
    "ఈ పిల్లాడు మామూలు పిల్లాడు కాదు. ఏదో క్షుద్రశక్తి రత్నావళి పూర్వజన్మ పాపం వల్ల ఇలా జన్మించింది. అందుకే దేవి తీర్థం గొంతులో పడగానే, క్షుద్రదేవత నాశనమయిపోయింది."
    ఈ మాటలు వినగానే, రత్నావళి ఏడుపు ఆగిపోయింది. భయంగా మృత శిశువుని చూసింది. ఆదిలక్ష్మి లెంపలేసుకుని చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంది. వరండాలో చేరిన జనం ఒకరినొకరు తోసుకుని వస్తున్నారు. "దేవి మహిమతో చచ్చిపోయిన క్షుద్రదేవతని" చూడడానికి! విదుషి, జ్ఞానదేవ్ వెనక్కి నెట్టివేయబడ్డారు. చిచ్చు మాత్రం లోపలికి చొచ్చుకుపోయాడు.
    తన పాదాలముందు పడిఉన్న పసివాడి మృతకళేబరాన్ని చూడలేకపోయింది ఇళ. రక్తమంతా ఆవిరైపోయినట్టు తెల్లగా పాలిపోయింది ఆ ముఖం. తల్లి పడబోయింది. చటుక్కున ముందుకొచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు చిచ్చు. అచ్యుతమ్మ గాభరా పడిపోయింది. వెంటనే చిచ్చు చేయి వదిలించి ఇళని ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక పడక గదిలోకి నడిపించుకు తీసుకుపోయింది. ఈ రోజుకి అమ్మాయి విశ్రాంతి తీసుకుంటుంది. మిగిలినవాళ్ళు రేపు రండి!" అని చెప్పాడు యోగనాథశాస్త్రి.
    అందరూ వెళ్ళిపోయినా ఆ ఇంటిముందే తచ్చాడుతున్నాడు చిచ్చు. విదుషి అతడి చెయ్యి పట్టుకుని "రా!" అంది. "అక్కా! పసివాడు చచ్చిపోవడం చూసి ఇళ బెదిరిపోయింది. దానికెవరయినా ధైర్యం చెప్తే బాగుండును!" దిగాలుగా అన్నాడు. ఆ మాటలు విని విదుషి లోపలికి వెళ్ళబోయింది. కానీ, అచ్యుతమ్మ రానియ్యలేదు. "ఇప్పుడెవరూ అమ్మాయిని చూడడానికి వీల్లేదు!" అంది. వీధి తలుపులు గడియ పెట్టేసింది.


                                                      *    *    *    *


    ఉసిరిచెట్టు కింద నిలబడి గట్టిగా ఈల వేశాడు చిచ్చు. రెండు రోజుల్నుంచీ, అలాగే వేస్తున్నాడు ఇళ కోసం. అచ్యుతమ్మ చిచ్చుని, తమ ఇంటి దరిదాపులకి రానియ్యటంలేదు. అంచేత ఈ మార్గం అవలంబించాడు. రెండు మూడు సార్లు ఈల వేసినా రెస్పాన్సే రాలేదు. నిరాశతో వెళ్ళిపోదామని అనుకుంటుంటే నీరసంగా, కాళ్ళీడ్చుకుంటూ ఉసిరిచెట్టు కిందకి వస్తోన్న ఇళ కనిపించింది. ఆగిపోయాడు. బాగా చిక్కిపోయి, వడలిపోయింది ఇళ. ఆ కొంచెం దూరం నడిచినందుకే, బాగా ఆయాసపడిపోతోంది. "ఇదేమిటి? ఇలా అయిపోయావ్? వంట్లో బాగాలేదా?" అడిగాడు చిచ్చు.
    "పసివాడిలో ఉన్న క్షుద్ర దేవతని వెళ్ళగొట్టాను. అది నా మీదకి వచ్చింది, దాన్ని పంపెయ్యడానికి నేనూ, నాన్నా ఇద్దరం జపం చేస్తున్నాము. ఇవాళ పోయిందన్నాడు నాన్న. కానీ నాకసలు వంట్లో శక్తి లేదు." కళ్ళలో నీళ్లు తిరిగాయి చిచ్చుకి!
    "క్షుద్ర దేవత నీ మీదకి వచ్చిందని ఎలా చెప్పగలవూ?"
    "నాకు ఫెళ్ళుమంటూ జ్వరం వచ్చిందిగా! క్షుద్రదేవత మహిమట! అవి తేలిగ్గా వదలవట!"
    "జ్వరం వచ్చిందా? మందులు తీసుకోలేదా?"
    "మందు తీసుకుంటే క్షుద్రదేవత రెచ్చిపోతుందిట! "కషాయం తాగుతూ ధ్యానం చేస్తున్నాను. నాన్న కూడా ధ్యానం చేస్తున్నాడు."
    "డాక్టర్ దగ్గరకి వెళ్ళలేదా?"
    "నాన్న డాక్టర్ ని రమ్మన్నాడు. ఆయన రానన్నాడు. ఆయనకి క్షుద్రదేవతలంటే భయమట!"

 Previous Page Next Page