Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 6


                                         3


    జ్ఞానదేవ్ కి దూరపు చుట్టాలు ఆదిలక్ష్మి కుటుంబం. వాళ్ళది బెజవాడ. అంతదూరం నుంచి పనికట్టుకుని ప్రమధపురి వచ్చారు. చుట్టరికాలు తిరిగేసుకుని జ్ఞానదేవ్ ఇంట్లో దిగారు. ఆ సమయంలో విదుషి కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయి కుటుంబం ఒకప్పుడు ప్రమధపురిలోనే ఉండేది. చిన్నతనంలో విదుషి జ్ఞానదేవ్ దగ్గరే చదువుకుంది. ఆ అమ్మాయి హైస్కూలు చదువులోకి వచ్చేనాటికి వాళ్ళ కుటుంబం బెజవాడకి మారిపోయింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో యం.బి.బి.యస్. పాసయి హౌస్ సర్జన్సీ చేస్తోంది. హైద్రాబాద్ నుంచి బెజవాడ వచ్చిపోయేటప్పుడు ప్రమధపురికి వచ్చి జ్ఞానదేవ్ ఇంట్లో ఒకరోజు గడుపుతుంది. చైతన్య ఆమెని "అక్కా" అని పిలుస్తాడు. విదుషికి కూడా అతడంటే చాలా ప్రేమ. ఎవరైనా "అల్లరి వెధవ" అని విసుక్కుంటే "తెలివైన వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు. చూస్తూ ఉండండి ఇతడు చరిత్ర సృష్టిస్తాడు" అనేది.
    డాక్టర్ దయాసాగర్ హైద్రాబాద్ లో ప్రముఖ కార్డియాలజిస్ట్ అతడు విదుషికి ప్రొఫెసర్ "రోల్ ఆఫ్ సైకో థెరపీ ఇన్ డివైన్ క్యూర్స్" అనే విషయం మీద అతడు పరిశోధన సాగిస్తున్నాడు. తనకు సమాచారం సేకరించే పని కొందరు స్టూడెంట్స్ కి అప్పగించాడు. వాళ్ళలో విదుషి కూడా ఉంది. తమంత తాము ఉత్సాహంతో కొత్త విషయాలు తెలుసుకోవాలని ముందుకు వచ్చిన స్టూడెంట్స్ కే, ఆయన ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తాడు. ఎప్పటిలా జ్ఞానదేవ్ నీ, చిచ్చునీ, వర్ధననీ చూడటానికి వచ్చింది విదుషి. ఇళ సంగతి వింది. వివరాలు తెలుసుకోవాలని ఆగిపోయింది. నామాలయ్య ఇంటికి వెళ్ళి మామూలుగా ఆడుకొంటున్న శ్రీనివాస్ ని చూసి వచ్చింది. లోకల్ డాక్టర్ తో మాట్లాడి, శ్రీనివాస్ జబ్బు నిజమేనని నిర్ధారణ చేసుకుంది. దసరా రోజు జరిగిన విషయాలన్నీ నోట్ చేసుకుంది. నిర్ణయం ప్రొఫెసర్ చెయ్యవలసిందే!
    ఆదిలక్ష్మితోపాటు ఆమె కొడుకూ, కోడలూ, ఇరవయ్యొక్క రోజులు వయసున్న మనవడూ వచ్చారు. పనివాడు నార్మల్ గా లేడు. మూతి బాగా పొడుగ్గా ముందుకు సాగి ఉంది. దొప్ప చెవులు. చర్మం నిండా పొడలు! కొడుకుని వళ్ళో పెట్టుకుని ఏడుస్తూ "ఇదంతా వాడిపనే! నాకు తెలుసు! తన వశీకరణ శక్తి బెడిసికొట్టిందని మళ్ళీ ఏదో ప్రయోగం చేశాడు!" అంది కోడలు రత్నావళి.
    "ఏమిటి! వశీకరణ శక్తి బెడిసికొట్టిందా! ఏం జరిగింది!" కుతూహలంగా అడిగింది విదుషి.
    కోడలు మరింత గట్టిగా ఏడ్చి రుమాలతో ముక్కు తుడుచుకుని చెప్పింది.
    "వాడి పేరు నాకు తెలీదు. మా ఇంటి ఎదురుగా ఉండేవాడు. ఎప్పుడూ నిక్కరూ, బన్నీను వేసుకుని డాబామీద అటూ, ఇటూ తిరుగుతూ మిర్రిమిర్రి చూసేవాడు. రెండు ప్రేమలేఖలు రాసాడు. మొదటిది చింపేశాను, రెండోది నాన్నకి చూపించాను. నాన్న బాగా తిట్టి బుద్ధి చెప్పివచ్చాడు. ఇంక నా జోలికి రాడనుకున్నాను. బుద్ధిగా పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం పెళ్ళి చేసుకుని కాపురం చేసుకుంటున్నాను. అలాంటిది ఏడాది కిందట ఎవరో నన్ను "రత్నా! రా! రా!" అని పిలుస్తున్నట్లు అనిపించింది. నా శరీరం నా వశంలో లేదు. మనసు "వెళ్ళొద్దు" అని చెప్తోంది. కానీ శరీరం ముందుకు సాగిపోతుంది. ఏం చేస్తున్నానో తెలీదు. అలా వెళ్ళిపోతున్నాను. సమయానికి అత్తగారు ఎదురవబట్టి బతికిపోయాను.
    అక్కడ నుంచి అత్తగారు ఆదిలక్ష్మి అందుకుంది.
    "మా పాలిట దేవుడున్నాడు. అందుకే సరిగ్గా సమయానికి దీనికి ఎదురొచ్చాను. భ్రమరాంబగారు రమ్మని కబురు చేస్తే వెళ్ళొస్తున్నాను. పిచ్చిదానిలాగ వీధినబడి పోతోంది. "ఎక్కడికే" అంటే మాట్లాడదు. "ఏం జరిగిందే!" అంటే చెప్పదు. నేను కనిపెట్టేశాను, ఏదో క్షుద్రశక్తి దీనిని పిలుస్తోంది. ఆంజనేయస్వామిని మనసులో తలచుకుని, ఊచిపుచ్చుకుని లెంపకాయ కొట్టాను. అక్కడితో కెవ్వుమని అరుస్తూ ఈ లోకంలోకి వచ్చింది."
    గర్వంగా తన బర్మాముడి సవరించుకుంది. ఒక చేత్తో "దూరం నుంచి కూడా హిప్నాటిక్ సజెషన్స్ ఇవొచ్చు!" గంభీరంగా అన్నాడు ఆదిలక్ష్మి కొడుకు బియాస్. అతడి పూర్తి పేరు సత్యనారాయణ. ఇంటిపేరు బి. ఫ్ర్రెండ్స్ బి.యస్. అని పిలిచేవారు. అది బియాస్ గా మారి స్థిరపడింది. అతడు ఇటీవలే "డుంపర్ అండ్ డూమర్" హిప్నొటిక్ ఇన్ స్టిట్యూట్ లో చేరి హిప్నొటిజం నేర్చుకుంటున్నాడు. మళ్ళీ మొదలుపెట్టింది రత్నావళి.
    "వశీకరణ శక్తి ఫెయిలవడంతో, మళ్ళీ ఏదో ప్రయోగం చేసి ఉంటాడు. అందుకే నాకు గాడిద ముఖం కొడుకు పుట్టాడు."
    కొడుకు ముఖం చూసి, చూడలేక ఏడ్చింది. "అవును. క్షుద్ర దేవతలు కడుపులో ఉన్న శిశువుల్ని కూడా వికృతంగా మార్చగలరు! పురాణాల్లో శిశుపాలుడు అలాగే పుట్టాడని ఉంది. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే మామూలుగా అయిపోయాడట! ఆయన దేవుడు కదా! దేవుడి ముందు క్షుద్రదేవతలు నిలవగలవా!"
    "కడుపులో ఉన్న శిశువుకి హిప్నోటిక్ సజెషన్స్ పంపించి, వికృతంగా మార్చవచ్చు. పూర్వం పురాణాల్లో గర్భంలో ఉన్న శిశువుతో మాట్లాడిన ఉదాహరణలున్నాయి. నారదుడు ప్రహ్మాదుడితో మాట్లాడాడు. అర్జునుడు చెప్పినది అభిమన్యుడు విన్నాడు. గర్భంలో ఉన్న శిశువు మన మాటలు వినగలదని సైంటిఫిక్ గా కూడా ఋజువయినట్టు ఆ మధ్య పేపర్లో పడింది. ఆ పేపర్ కటింగ్ చేసి దాచలేదు." చెప్పాడు బియాస్, చాలా సీరియస్ గా.
    "మీ ఊళ్ళో ఇళాదేవి దుర్గామాత అవతారమనీ, ఆవిడ చెయ్యి వేస్తే ఎలాంటి జబ్బయినా నయమవుతుందనీ విన్నాం. ఆవిడ చేతుల్లో ఈ పసివాడిని పెట్టి ఆశీర్వదించమని అడగటానికి వచ్చాం" ముగించింది ఆదిలక్ష్మి. మతిపోయింది విదుషికి. ఇది ఇరవయ్యో శతాబ్ధమేనా! కొండ గుహల్లో నివసిస్తూ అజ్ఞానంలో మగ్గిపోతూ జీవన సంగ్రామంలో తారసిల్లే శుభ అశుభాలన్నింటికీ దేవతల్నీ, దెయ్యాల్నీ కారణాలుగా ఊహిస్తూ కనబడ్డ ప్రతి రాతికీ, ప్రతి చెట్టుకి, నిప్పుకీ, గాలికీ, ఎండకీ, వానకీ మొక్కుతూ... పచ్చి మాంసం తింటూ ఆ మాంసాన్ని దేవతలకి నైవేద్యం పెడ్తూ రెండు కాళ్ళ పశువుగా తిరిగిన దశలో నుండి మానవుడు నిజంగా బయటపడ్డాడా! గ్రహాంతరాలకి ప్రయాణం చెయ్యగలిగిన దశకి ఎదిగిన మానవ సంస్కృతిలో పాతరాతి యుగం నాటి మూఢనమ్మకాలు రకరకాలుగా రూపం మార్చుకుని ప్రత్యక్షమవుతున్నాయా! ఇది ఏ నాగరికతకి ఫలశ్రుతి!
    "నీ మీద సమ్మోహన వశీకరణ శక్తి ప్రయోగించారని ఎలా చెప్పగలవు?" రత్నావళిని అడిగింది విదుషి.
    "ఆ చూపులు చూస్తేనే తెలుస్తుంది" ఠకీమని సమాధానం చెప్పింది వెంటనే మరో ప్రశ్న అడగాలనిపించింది. కానీ అత్తగారూ, భర్త పక్కనే వుండగా అడగవలసిన ప్రశ్న కాదది.
    "అతడు ఇప్పటికీ మీ పుట్టింటికి ఎదురింటి డాబాలోనే ఉన్నాడా!"
    "అవును."
    "మీ ఇంటినుంచి అదే అత్తింటి నుంచి నడిచే బయలుదేరావా!"
    "ఎంతో దూరం లేదు. ఒకటి, ఒకటిన్నర కిలోమీటర్లు అదీగాక, అసలు నావంటి మీద స్పృహలేదుగా? ఎవరో "రా! రా!" అంటున్నారు. ఆ పిలుపు వినిపించిన వైపున నడిచిపోతున్నాను."

 Previous Page Next Page