పట్టరాని కోపం వచ్చింది చిచ్చుకి!
"వాడేం డాక్టరూ? డాక్టర్లకి భయం ఉండకూడదు?" అన్నాడు.
"చిచ్చూ! నాకు చాలా బాధగా ఉంది?"
"ఇంకానా? నిన్ను హైదరాబాద్ తీసుకుపోనా? అక్కడ విదుషి అక్క ఉంది. అక్కకి ఇలాంటి భయాలు లేవు. నాకూ లేవు!"
"వంట్లో బాధకాదు. ఆ చంటిపిల్లాడు చచ్చిపోవటం నాకు బాగాలేదు. ఆ ముఖం మరచిపోలేకపోతున్నాను. నావల్ల ఎవరైనా బాగుపడితే బాగుంటుంది కానీ, ఇలా అయిపోతే భరించలేను!"
"ఫూల్స్ అంత చంటిపిల్లాడి నోట్లో తీర్థం" అంటూ నీళ్ళు పోస్తే బతుకుతాడా?"
కళ్ళు పెద్దవిచేసింది ఇళ.
"అయితే ఆ పసివాడు చావటానికి నేనే కారణమంటావా?" ఏడవబోయింది.
కంగారుపడిపోయాడు చిచ్చు.
"కాదు! కాదు! క్షుద్రశక్తి. నువ్వు మంచిపని చేశావు. క్షుద్రశక్తిని పారదోలేశావు!"
ఇళని ఓదార్చడానికి అన్నాడు. అన్న వెంటనే తన మాటలు తనకే ఎలాగో వినిపించాయి.
"చంటివాడు చచ్చిపోకుండా క్షుద్రశక్తి మాత్రం పోయివుంటే బాగుండేది!"
"అవును బాగుండేది ఇళా! ఇంక నువ్వు ఇక్కడుండకు! మా నాన్న నన్ను హైదరాబాద్ లో చదివిస్తానంటున్నాడు. నువ్వూ వచ్చేయ్!"
"అలాగే వచ్చేస్తాను. అక్కడా భక్తులుంటారుగా? నాకు కానుకలిస్తారు, చదువుకోసం..." అమాయకంగా అంది. ఈడ్చికొట్టినట్లయింది చిచ్చుకి, మాట్లాడలేకపోయాడు. మనసులో చెలరేగుతోన్న అసహనాన్ని, మాటల్లో పెట్టగలిగే శక్తి కలగడంలేదు అతనికి.
అంతలోనే అచ్యుతమ్మ వచ్చేసింది అక్కడికి! అహర్నిశలూ ఇళని కనిపెట్టుకుని ఉండటంతోనే సరిపోతుంది అచ్యుతమ్మకి. దేవి అంశ ఉన్న ఇళ మామూలుగా అందరు పిల్లల్లాగా తిరక్కూడదు మరి "ఇళ! ఇంటికిరా! నెమ్మదిగానే చెప్పింది. జ్వరం పడ్డ పిల్లని అంతకంటే మందలించలేకపోయింది.
"అమ్మా! నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నాను చిచ్చూతో!" సంబరంగా చెప్పింది ఇళ. గుండె గుభేలుమంది అచ్యుతమ్మకి! మిగేసేలా చూసింది చిచ్చుని.
"తప్పమ్మా అలా అనకూడదు. మన ప్రమధపురిలో వెలిసిన కనకదుర్గ నిన్ను కరుణించి తన అంశ నీలో ప్రవేశపెట్టింది. నువ్వు ఆ దేవిని వదిలి వెళ్ళకూడదు. కళ్ళుపోతాయి" అనునయంగా చెప్పింది.
భయంగా చూసింది ఇళ. అప్రయత్నంగా లెంపలు వాయించుకుంది.
"రా! అమ్మా" ఇళ చెయ్యి పట్టుకుని తనవైపు లాక్కుంది అచ్యుతమ్మ. బేలగా చిచ్చుని చూసి తల్లివెంట వెళ్ళింది ఇళ.
* * * *
ప్రమధపురికి దగ్గరలోనే అడవుల మధ్య ఒక కుగ్రామం ఉంది. దాని పేరు కుంట్లోపల్లి. అంతా కొండ ప్రాంతం! పోడు వ్యవసాయం తప్ప మరో ఆధారం లేదు అక్కడి కొత్త జాతులవాళ్ళకి! వీళ్ళతో కొందరు జ్యోతిష్యాలు చెప్తారు. మరికొందరు మూలికలమ్ముతారు. కొందరు ఊళ్ళలో పిచ్చికుక్కలున్నప్పుడు, వాటిని పట్టటానికి మునిసిపాలిటీ వాళ్ళకి సాయం చేస్తారు. మరికొందరు పాతకాలపు కథలు, పాటల రూపంలో ఉన్నవి పాడి వినిపిస్తారు. వాళ్ళలో ఒక గ్రూప్ ఊరిబయట విశాలంగా ఉన్న ఆవరణ ఎంచుకుని, అక్కడ తమ వాయిద్యాలతో పాడతారు. ఆటపాటలలో అద్భుతమైన కథలుంటాయి. ఊళ్ళోవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు గుంపులుగా చేరి చాపలమీద కూర్చుని, కథ విని వాళ్ళకి డబ్బులిస్తారు. అలా కథలు వినేవాళ్ళలో నాగరిక మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళకంటే పాలేళ్ళు, సన్నకారు రైతులు, చాకళ్ళు, మంగళ్ళు మొదలైన వాళ్ళ కుటుంబాలే ఎక్కువ. చిన్నపిల్లలు మాత్రం అన్ని కుటుంబాల్లోంచీ వస్తారు. అలాంటి కొండజాతుల వాళ్ళు దాదాపు పాతికమంది యోగానాథశాస్త్రి ఇంటికి వచ్చారు. బెదిరిపోయాడు యోగానాథశాస్త్రి. వాళ్ళంటే ఊళ్ళోవాళ్ళకి ఇప్పటికీ భయమే. వాళ్ళు గురితప్పకుండా బాణాలు వెయ్యగలరు. పోలీసులు తుపాకులు లేకుండా పోట్లాటకి దిగితే వాళ్ళని ఊళ్ళో ఎవరూ గెలవలేరు. సాధారణంగా వాళ్ళు ఊళ్ళో ఎవరి జోలికీ రారు! కాని తమకి అన్యాయం జరిగిందంటే మాత్రం ఊరుకోరు!
"దూరంగా ఉండండిరా! ఏం కావాలి మీకు!" అడిగాడు.
వాళ్ళు ఇంటి ఆవరణలో ఎడంగా నిలబడి "అమ్మాయిగారి దర్శనం కావాలి స్వామిగారూ!" అన్నారు.
"దేనికి?"
"సర్కారోళ్ళు మాకు భూములిచ్చారు. పట్టాలు పంచాలు కానీ ఏం చేసుకోం ఆటిని? ఇటేపు నదులు రావు. కాలువలు తవ్వలేదు. ఒక బావి తవ్వుకోవాలనుకుంటున్నాం. నీళ్ళెక్కడ పడతయ్యో... అమ్మాయిగారు చెప్తారని వొచ్చాం!"
"ఆ కొండ భూముల్లో నీళ్ళా?"
"అమ్మాయిగారికి ఇలాంటి విషయాలు తెలీవు పొండి! ఇంకెవరినయినా అడగండి!" వాళ్ళని అక్కడనుంచి తరుముతున్నట్లు అన్నాడు.
మనూళ్ళో అమ్మాయిగారిని పెట్టుకుని, ఎక్కడిపోతాం స్వామి వారూ? ఒక్కసారి అమ్మాయిగారిని కాసింత ఆ చోటు చూపించమనండి, చాలు! లేకపోతే బయటికి పిలవండి ఆయమ్మకి మేమే మొక్కుకుంటాం!"
ఎవరూ పిలవక్కర్లేకుండానే ఇళ బయటికి వచ్చింది. ఆ అమ్మాయికి ఇల్లు బంధిఖానాలాగా తయారయింది. ఏమాత్రం అవకాశం ఉన్నా బయటికి వచ్చేస్తోంది. కొండజాతి వాళ్ళు ఇళని ప్రాధేయపడసాగారు. నీళ్ళు పడే స్థలం చూపించమని! యోగానాథశాస్త్రి ఎంత కసిరినా వాళ్ళు వినిపించుకోలేదు. అక్కడినుంచి కదల్లేదు. చివరికి ఇళ "నీళ్ళు పడే స్థలం నేను చూపిస్తాను!" అంది. తెల్లబోయాడు యోగానాథశాస్త్రి. కంగారుపడిపోయాడు. "వొద్దు! వొద్దు! ఇలాంటివి నీకు తెలీవు" అన్నాడు. కొండజాతివాళ్ళంతా ఒక కంఠంతో 'స్వామివారు దయ సూపండి. అమ్మాయి గారిని పంపండి!" అని మొక్కటం మొదలుపెట్టారు. వాళ్ళని పంపెయ్యటం అసాధ్యం అని యోగానాథశాస్త్రికి తెలుసు! చేసేదిలేక ఇళని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రమధపురికి అవతల కుంట్లోపల్లి సరిహద్దుల్లో ఎత్తుగా ఉన్నది చూపించి, "ఇక్కడ తవ్వండి!" అంది ఇళ.
* * * *
యోగానాథశాస్త్రి అపనమ్మకంగా "ఇది మెరక దిబ్బ. ఇక్కడ నీళ్ళు పడతాయా?" అన్నాడు. కొండజాతులవాళ్ళకి అలాంటి అపనమ్మకం కలగలేదు. వాళ్ళకి దేవుళ్ళపై, మంత్రాలలో అపారమైన నమ్మకం.
"ఎందుకు పడవు స్వాములోరూ దేవత దయతలిస్తే కొండల్లో సహితం నీళ్ళు వస్తయ్!" అన్నారు. తమకి తోచిన పద్ధతిలో పూజచేసి యోగానాథశాస్త్రి చేతిలో అయిదు రూపాయలు పెట్టి నుయ్యి త్రవ్వడం మొదలుపెట్టారు. ఈ సంగతి క్షణాలలో ఊళ్ళో పాకింది. జ్ఞానదేవ్ చాలా భయపడ్డాడు. "కొండజాతివాళ్లు అమాయకులు, మంచివాళ్ళు, నిజాయితీపరులు. కానీ ఆశాభంగం సహించి ఊరుకోరు. వాళ్ళు యోగానాథశాస్త్రి కిచ్చిన అయిదురూపాయలు మనకి అయిదువేలతో సమానం! పాపం! ఎంత కష్టపడి సంపాదించారో, ఆ అయిదూ..." అన్నాడు చిచ్చుతో!