స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు కంప్యూటరును వాడుతున్నట్టు భారతదేశంలో కూడా 'కంప్యూటర్ బేస్ డ్ రూట్ ఎరేంజ్ మెంట్స్' చేయడం ద్వారా వి.వి.ఐ.పి. లకు అత్యంత పటిష్టమైన సెక్యూరిటీని ఏర్పాటుచేయవచ్చు. కాని అవి చాలా ఖర్చుతో కూడుకొని వున్నాయి, పైగా మనదేశంలో కమ్యూనికేషన్స్ అంతగా అభివృద్ధి చెందలేదుకూడ.
ఒకప్పుడు అహింసే పరమధర్మంగా భావించిన భారతదేశంలో ఈ రోజున టెర్రరిజం పెచ్చు పెరిగిపోయింది. వి.వి.ఐ.పి లకు భద్రత లేకుండా పోయింది.
టెర్రరిజం ముసుగులో భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి, మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ హత్యోదంతాలను చూస్తుంటే ఈ దేశం అహింసా మార్గాన్ని వదలి అరాచకపు బాటన పయనిస్తున్నదా అని అనిపిస్తుంది.
రత్నగర్భ రక్త ప్రవాహంలో కొట్టుకుపోతున్నదేమోననే అనుమానం కలుగుతుంది.
భారతదేశ చరిత్రలో, గతంలో ఏనాడూ లేనంతగా టెర్రరిజం ఈనాడు త్రివిక్రమావతారమెత్తి వర్తమాన చరిత్రను రక్తసిక్తం చేస్తున్నది.
సత్యాగ్రహంద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న దేశంలో ఈనాడు అహింసకు బదులు హింస విలయతాండవం చేస్తున్నది.
ఫలితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజానాయకులు ఈ రోజున ప్రజల ముందుకు రాలేకపోతున్నారు. అలా రాలేకపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి స్వార్ధచింతన, రెండవది ప్రాణభీతి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారతావనిలో కొందరు నిస్వార్ధ రాజకీయ నాయకులు ధైర్యం చేసి ప్రజల ముందుకు వస్తే, విచ్చిన్నకర శక్తులు వారిని వెంటాడి పొట్టనపెట్టుకున్న సంఘటనలు ఆదునిక భారత చరిత్రలో రక్తాక్షరాలుగా లిఖితమయాయి.
ఇక శాంతి_భద్రతలు , సెక్యూరిటీ, ఇంటిలిజెన్స్ విభాగాలు పరిపాలనా సౌలభ్యానికిగాను నామమాత్రంగానే వున్నాయా అనే అనుమానం తలెత్తకపోదు.
అయితే, ఇన్ని జరుగుతున్నా నాయకులు వారి వారి ఆత్మరక్షణార్ధం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు లేదు.
ఇంటిలిజెన్స్, సెక్యూరిటీ బిభాగాలు ఎప్పటికప్పుడు కాగితాలమీద చూపిస్తున్న చర్యలను ప్రత్యక్షంగా తీసుకుంటున్నట్టు కనిపించదనే అపప్రధ ఉండనే వున్నది.
ప్రపంచ దేశాలలో ఇంటిలిజెన్స్ విభాగానికి, వారి సూచనలకు ప్రభుత్వం, ప్రజలు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మరి మన దేశంలోనో?
ఇతర దేశాలలో యుద్ధ సమయాలలో మిలిటరీ జనరల్స్ ఇంటిలిజెన్స్ రిపోర్టులకు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ప్రధాని సర్ విన్ స్టన్ చర్చిల్ ను శత్రు దేశాలు గుట్టుగా మట్టు బెట్టాలనుకున్నాయి. ఈ విషయాన్ని ముందుగానే గూఢచారి నివేదికద్వారా తెలుసుకున్న చర్చిల్ ముందుచూపుతో ప్రవర్తించాడు. తనవలెనే డూప్ ను తయారుచేసి, ఆ వ్యక్తిని కీలక సమావేశానికి పంపాడు.
అనుకున్న పథకం ప్రకారం శత్రువులు డూప్ అని తెలియక అతనిమీద హత్యాప్రయత్నం చేయబోయారు. ముందుగానే సెక్యూరిటీ సిబ్బందిని ఎలర్ట్ చేయడం వలన వాళ్ళ ప్రయత్నం విఫలమయింది.
స్టాలిన్ కూడా తనకు దూప్స్ ను ఏర్పాటు చేసుకుని ప్రమాదాల నుంచి తనను తాను రక్షించుకున్నాడు.
అంతెందుకు _ఇటీవలే అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాక్ మీద యుద్ధభేరి మ్రోగించినప్పుడు, దాని అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ తను బంకర్స్ లో వుంటూ అనేకమంది దూప్స్ ను యుద్దంలో నడిపించాడు.
చివరకు సద్దాం హుస్సేన్ ఓటమిని చవిచూసినా, ఒక మిలిటరీ జనరల్ గా, ఒక దేశాధ్యక్షునిగా, అతని గూడచారి వ్యవస్థను ప్రశంసించక తప్పలేదు!
సరిగ్గా వీటిలో ఓ ఒక్క విధానాన్ని అనుసరించినా, గూడచార వ్యవస్థను మరింత పటిష్టంచేసి ముందుగానే కీలక సమాచారాన్ని సంపాదించగలిగినా భారతదేశం తన దేశనేతలను, ప్రజా ప్రతినిధులను, అధికారులను పోగొట్టుకుని ఉండేది కాదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరుగా వున్న ఎస్.పి.శ్రీ నవీన్, ఈ వి.వి.ఐ.పి. భద్రత విషయంలో తనదైన బాలిని చేపట్టాడు.
తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి సంప్రదింపుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమిళనాడు వెళ్ళారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎవరో టెర్రరిస్టులు కిడ్నాప్ చేయడానికి పథకం వేశారని ముందుగానే తెలుసుకున్న నవీన్, ముఖ్యమంత్రిని కాపాడడానికి వినూత్నమైన పథకం పన్నాడు.
ఆ పథకం ప్రకారం, ఏకకాలంలో, ఒకే సిటీనుంచి, మూడు మార్గాలలో సి.ఎం. బయలుదేరారు_ఒకరు సూపర్ ఫాస్ట్ రైలులో, మరొకరు రోడ్డు మార్గాన కాన్వాయ్ లో, వేరొకరు ఆకాశమార్గాన వాయుదూత్ లో!
ఈ ముగ్గురిలో అసలు సి.ఎం. ఎవరు?
ఆయన డూప్స్ ఎవరు?