"వసతులు వుండవంటావు? ఏమీ ఫర్వాలేదు. పల్లెటూరు చూడాలని ముచ్చట పడుతోంది. తీసుకెళ్ళు."
"అలాగే సర్" అంటూ బ్రతుకుజీవుడా అన్నట్టు ఆ గదిలోంచి బయటికి వచ్చి గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాడు శ్రీధర్.
శ్రీధర్ మనసు మధనపడసాగింది. కృష్ణారావుగారు ఈ ఏర్పాటు ఎందుకు చేసినట్టు! అమూల్య ప్రవర్తన తనకు అనుమానాన్ని కలిగిస్తూనే ఉన్నది. తను ఎంత తప్పించుకు తిరిగినా ఆ అమ్మాయి తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నది. తను తప్పించుకు తిరుగుతున్నాడు. ఎందుకు? తనకు నిప్పుతో చెలగాటం ఆడాలని లేదు. తన అంతస్థు తనకు తెలుసు. తను తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాడు కాదు. కాని ఇదేమిటి? కృష్ణారావుగారు ఇలాంటి ప్రోగ్రాం వేశారు? అమూల్య కావాలని పల్లెటూరు చూడాలని రావడం లేదని తనతో పంపిస్తున్నారా? అలా ఎన్నటికి జరగదు. ఇది సినిమా కాదు. కృష్ణారావుగారి అంతస్థులో ఉన్న ఏ తండ్రీ తన కూతుర్ని తనలాంటివాడికి ఇవ్వాలని కోరుకోడు. మరి అమూల్యకు నిజంగానే పల్లెటూరు చూడాలనే కోర్కె కలిగిందని కృష్ణారావుగారు నమ్మి ఉంటారు.
"ప్రథమ దృష్టిలో ప్రేమ" అనేదాన్ని తాను నమ్మడు. కాని అమూల్య సౌందర్యం తనను ఆకర్షించింది. ఆమెను చూడాలని తన మనస్సు ఉవిళ్ళూరుతోంది. అయినా తను నిర్భయంగా చూడలేడు. దొంగచూపులు చూస్తున్నాడు.
తను పిరికివాడా? తనలోని ఆత్మహీనతా భావం తన చేత అలా చేయిస్తుందా?
తను పిరికివాడు కాదు. అయితే తనకు ఆలోచించే వివేకం ఉన్నది. ఆ మనుషులూ, ఆ ప్రపంచం తనకు సంబంధించింది కాదని తనకు తెలుసు. అందుకే తను ఆమె ఆకర్షణకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు.
* * *
"మీకేమన్నా మతిపోయిందా" డైనింగ్ టేబుల్ దగ్గర కృష్ణారావు భార్య అన్నది.
"ఇంతలో ఏం కొంపలు అంటుకు పోతాయి? అమ్మాయి పల్లెటూరు చూడాలని ముచ్చట పడుతోంది."
"అందుకని వయసులో ఉన్న ఆ కుర్రాడితో అమూల్యను పంపిస్తారా?"
"ఓ మమ్మీ! ఇందులో నీకు అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఆదిత్య, శేఖర్, రాజు మొదలైన కుర్రాళ్ళతో నేను ఫ్రీగా తిరగటం లేదూ? ఆవిధంగా తప్పని ఎప్పుడైనా చెప్పావా?"
"నువ్వు నోరు మూసుకో? ఆరిందాలా మాట్లాడకు. వాళ్ళకూ ఇతనికి పోలిక ఏమిటి? వాళ్ళ మన అంతస్తుకు సరితూగే వాళ్ళు. ఈ పల్లెటూరి బైతుతో, తిండిలేక ఉద్యోగం కోసం మనల్ని ఆశ్రయించిన వాడితో నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళడం ఏమిటి?"
"మమ్మీ!" దాదాపు అరిచినట్టే అన్నది అమూల్య.
"చూడు సరూ! మరీ పిచ్చిగా మాట్లాడకు. ఆ అబ్బాయితో మనం వియ్యమందుకోబోతున్నామా ఏమిటి? పల్లెటూరు చూడాలని సర్దా పడుతోంది. అమ్మాయి ఇంతలోనే కొంప మునిగిపోదు"
"అయితే అవంతిని కూడా పంపించండి. ఆ కుర్రాడి మీద నమ్మకం లేదు. ఇలాంటివాళ్ళు అమాయకులైన ఆడపిల్లని బుట్టలో వేసేస్తారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు.
అమూల్య తండ్రి ముఖంలోకి ఇబ్బందిగా చూసింది.
"ఓ మమ్మీ! బోర్, నేను వెళ్ళను. రేపు నాకు వేరే ప్రోగ్రాం ఉన్నది. మా క్లాస్ మేట్సంతా కలిసి గండిపేట వెళ్తున్నాం" అన్నది అవంతి.
"చిన్న విషయాలకు ఫస్ చేయకు" అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లేచివెళ్ళాడు కృష్ణారావు.
"అమూల్య సగం తిన్న అన్నంలో చెయ్యి కడుక్కుని లేచి వెళ్ళిపోయింది.
సరళకు కూతురిపైన ఎక్కడలేని కోపం వచ్చింది.
ఆరాత్రి భార్యకు భర్తకు మధ్య పెద్ద ఘర్షణే జరిగింది.
భర్త ఇంత చిన్న విషయంలో తన మాట కాదనడం ఏనాడూ సానుభవంలోకి రాని సరళకు ఆశ్చర్యం వేసింది.
రోషం కూడా కలిగింది తన మాట చెల్లనందుకు.
కొత్త అంబాసిడర్ విజయవాడ రోడ్డు మీద వేగంగా పోతున్నది. బాలభానుని నులివెచ్చని కిరణాలు కారు అద్దాలమీద పడుతున్నాయ్.
వెనకసీట్లో అమూల్యా, శ్రీధర్ కూర్చుని వున్నారు. శ్రీధర్ మూలగా ఒదిగి కూర్చున్నాడు. అతడు కూర్చున్న తీరు చూస్తుంటే అమూల్యకు నవ్వు వచ్చింది. వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధించింది.
శ్రీధర్ కారు అద్దంలోంచి బయటికి చూస్తున్నారు.
అమూల్య శ్రీధర్ నే చూస్తున్నది.
"అబ్బ బోర్" అన్నది అమూల్య.
శ్రీధర్ చివ్వున తలతిప్పి తిరిగి చూశాడు.
"ఎంతసేపు ఇలా ప్రయాణం?"
"ఇప్పుడేగా బయలుదేరాం? మొత్తం అయిదున్నర, ఆరుగంటలు పట్టవచ్చు."
"అదికాదు నేనంటున్నది. ఇలా మాట్లాడకుండా కూర్చుంటే ఈ ప్రయాణం ఆరుగంటలు కాదు ఆరు యుగాలు పడుతుంది.
శ్రీధర్ పలకలేదు.
"ఆడపిల్లల్ని చూసి బిడియపడే మగవాళ్ళంటే నాకు యిష్టం వుండదు."
శ్రీధర్ జవాబివ్వలేదు.
'కొందరు మగవాళ్ళు ఆడవాళ్ళను చూసి తెగ మెలికలు తిరిగిపోతారు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం."
"ఇవన్నీ నాకెందుకు చెబుతున్నట్టు?"
కొంచెం తీవ్రంగా చూస్తే ముడుచుకు పోతారు కనకే"
"అలాగని ఎవరన్నారు?"
"నేను చూడటం లేదూ?"
"ఏమిటి మీరు చూస్తున్నది?"
"మరి ఆ కూర్చోవడం ఏమిటి?
"మీ ఒళ్ళో కూర్చోమంటారా?" చురుగ్గా చూశాడు.
"అమూల్య ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. ఫర్వాలేదు. గట్టివాడే.