Previous Page Next Page 
దావాగ్ని పేజి 6


    తనెవరు? కేప్టెన్ వినీల:

 

    బిఎస్సీలో యూనివర్శిటీ ఫస్ట్. గోల్డ్ మెడలిస్ట్: ఇప్పటికే రెండువేల ఫ్లయింగ్ అవర్స్ తన క్రెడిట్ కి ఉన్న పైలట్ కరాటే ఎక్స్ పర్ట్:

 

    తను కేప్టెన్ వినీల:

 

    ఒక్కసారిగా ఉత్సాహం ఉబికినట్లయింది వినీలకి.

 

    ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక విమానంలో కూర్చుని, టేకాఫ్ కి రెడీ అయింది వినీల. విమానం చక్రాలు ముందుకు దొర్లబోయే ముందు ఒక్కసారి టెర్మినల్ వైపు చూసింది.

 

    బందీ అయిన గొగ్గిరిపళ్ళ గొరిల్లాలా అద్దాల లాంజ్ లో నిలబడి చూస్తున్నాడు జనరల్ భోజా.

 

                                   *    *    *    *

 

    తను పైలట్ చేస్తున్న ప్లేన్ తోబాటు బాంబేలో దిగి, అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంది వినీల. సోమాజీగూడాలో ఉన్న ఒక పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ చేరుకుంది. వంద ప్లాట్లు ఉన్న ఆ బ్రహ్మాండమయిన భవంతిలో వుంది వినీల డూప్లెక్స్ ఫ్లాటు కింద అంతస్తులోని ఒక ఫ్లాటునీ, సరిగ్గా దాని పై అంతస్తులోని మరో ఫ్లాటునీ కలిపేసి, మధ్యలో మెట్లు వేసినట్లుంది అది:

 

    అంటే అది రెండు అంతస్తుల ఫ్లాట్ అన్నమాట: తనకొక్కదానికే అయితే అంత పెద్ద ఫ్లాట్ అనవసరం వినీలకి. కానీ అన్నయ్య సత్యజిత్ కూడా అప్పుడప్పుడూ వచ్చిపోతూ వుంటాడు కాబట్టి ఆ ఫ్లాట్ తీసుకుంది.      

 

    ఇంటికి రాగానే స్కైబాగ్ ఓ పక్కకి గిరాటేసేసి, బాత్ రూంలో కెళ్ళిపోయి, షవర్ బాత్ తీసుకుంది వినీల. వార్డ్ రోబ్ ముందు నిలబడి, జీన్సు వేసుకుందామా, చీర కట్టుకుందామా అని కాసేపు ఆలోచించి, చివరికి చీరే కట్టుకోవాలని నిర్ణయించుకుని, బాదంపండు రంగులో ఉన్న సింధెటిక్ చీర, అదేరంగు పరికిణీ, దానికి మాచ్ అయ్యే నల్లజాకెట్టూ నల్ల బ్రా తీసుకుంది.   

 

    అంతలోనే ఫోన్ మోగింది.

 

    కార్డ్ లెస్ ఫోన్ చెవిదగ్గర పెట్టుకుంది వినీల. "కెప్టెన్ వినీలా?"

 

    అన్నయ్య గొంతు.

 

    వెంటనే డిస్ కనెక్టు చేసేసింది వినీల.

 

    తక్షణం ఫోన్ రింగయింది.

 

    మళ్ళీ అన్నయ్యే.

 

    "ఏమిటి?" అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో.

 

    "ఐయామ్ వెరీసారీ: మొదటిసారిగా నువ్వు వేరే దేశానికి వెళ్ళే ప్లేస్ ని పైలట్ చేశావు. ఆ ప్లయిట్ లో నేను వస్తానని చెప్పాను. సెలబ్రేట్ చేసుకుందామనుకున్నాం. కానీ రాలేకపోయాను."  

 

    "ఎందుకని?" గొంతులో తెచ్చిపెట్టుకున్న కటుత్వం.

 

    "షిట్: బిజినెస్:"

 

    "ఏం బిజినెస్?"

 

    "ఆ సోదంతా నీకెందుకులేగానీ, నీ మొదటిప్లయిట్ లో రాలేకపోయాను. కానీ ఇప్పుడే ఫ్లాట్ కి వస్తున్నాను. ఇద్దరం కలిసి మంచి హోటల్లో డిన్నర్ కి వెడదాం సరేనా?"

 

    "వద్దు"

 

    "ఏం?"

 

    "నేను ఇవాళ ఇంట్లోనే వండుకు తిందామనుకుంటున్నాను"

 

    నవ్వాడు సత్యజిత్.

 

    "ఏం వండుతున్నావ్?"

 

    ఊరిస్తున్నట్లు అంది వినీల. "చేమదుంప ముక్కలేసి పెట్టిన మజ్జిగపులుసూ, దానికితోడుగా ముద్దపప్పూ, వంకాయ కాల్చి చేసిన పెరుగు పచ్చడి, కొబ్బరి కూడా."

 

    అవన్నీ అన్నయ్యకి ఇష్టమైనవని తెలుసు వినీలకి.

 

    గట్టిగా చప్పరించాడు సత్యజిత్.

 

    "అయితే ఇప్పుడే వచ్చేస్తున్నా.."

 

    "ఎందుకులే పాపం: నీ బిజినెస్ దెబ్బతిని పోతుందేమో:"

 

    "నిన్నూ..."

 

    నవ్వి ఫోన్ డిస్ కనెక్టు చేసేసింది వినీల. కిచెన్ లోకి వెళ్ళి చకచక వంట మొదలెట్టింది. అన్నీ సిద్ధంచేసి, స్టౌ మీద పెట్టింది.

 

    టైం తొమ్మిదవుతోంది

 

    ఇంతలో -

 

    తన పెంపుడు కుక్కపిల్ల స్క్వీకీ అరుపు వినబడింది. ఆమెకి దాని అరుపులో ఉన్న సున్నితమైన తేడాలు బాగా తెలుసు. ఆకలేస్తే ఒక విధంగా అరుస్తుంది. అలిగితే మరోలా అరుస్తుంది.

 

    ఇప్పుడు అరుస్తున్న అరుపుకి అర్థం వేరు.

 

    "అరవకు: అర్థమయిందిలే:" అని గారంగా దాన్ని కసిరి, మూలాన వున్న చిన్నబుట్ట తీసింది వినీల ఆ బుట్టకి ఓ పొడుగాటి తాడుకట్టి ఉంది.

 

    గునగునవచ్చి బుట్టలో కూర్చుంది కుక్కపిల్ల. కుక్కపిల్లతోసహా బుట్టని తాడుసాయంతో కిటికీలోంచి కిందికి దించింది వినీల.

 

    బుట్ట బావిలో దిగుతున్న బకెట్ లా కిందికి దిగింది. అది నేలని తాకగానే అప్పటిదాకా కుదురుగా కూర్చుని వున్న కుక్కపిల్ల కిందకిగెంతి, ఒక చెట్టు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, ఒక కాలెత్తి తన అవసరం తీర్చుకొని, మళ్ళీ వచ్చి బుద్ధిగా బుట్టలో కూర్చుంది.                               

 Previous Page Next Page