Previous Page Next Page 
దావాగ్ని పేజి 5


    కరాచీ ఇండియాలో లేదనీ, అది పాకిస్తాన్ లో ఒక ముఖ్య పట్టణమనీ చెప్పబోయి, మళ్ళీ యింకో గుద్దు పడుతుందని భయపడిపోయాడు తోకాస్.

 

    ఆటంబాంబులు తయారు చేసేస్తానని భోజా చాలాతేలిగ్గా అనేశాడు గానీ, అది కలలో కూడా జరగని పని అని అతనికి తెలుసు ఆటంబాంబు తయారు చేయాలంటే అత్యంత ఆధునాతనమైన శాస్త్రీయ పరిజ్ఞానం కావాలి. యురేనియంలాంటి ముడిపదార్థాలు కావాలి. హెవీవాటర్ కావాలి.  

 

    ఇదంతా కూడా, చిత్రద్వీప్ లాంటి చిన్న దేశానికి సంబంధించినంత వరకూ - నెక్స్ ట్ టూ ఇంపాసిబుల్:

 

    అందుకే అతనికి ఇండియా అంటే మరింత కోపం. అసహాయత కూడిన, అసమర్థతో పెరిగిన అసూయ:

 

    రోడ్లు వేసుకోవడం కూడా చేతకాక ఆ పనికి కూడా ఇండియన్ గవర్నమెంటుమీదా, ఇండియన్ కంపెనీల మీదా ఆధారపడే తన దేశం తను బతికి ఉండగా ఆటంబాంబులు తయారుచేసే టెక్నాలజీ సంపాదించలేదని బాగా తెలుసు భోజాకి.

 

    కానీ వాస్తవాలకి, కోరికలకీ ఎక్కడా ఎప్పుడూ పొంతన ఉండదు కదా:

 

    రోడ్లు అనుకోగానే భోజాకి చిత్రద్వీప్ లో నేషనల్ హైవే వెయ్యడానికి టెండర్ లు పిలవడం గుర్తొచ్చింది.

 

    అందులో ఒక ఇండియన్ కంపెనీ (దీస్ బ్లడీ ఇండియన్ డాగ్స్:) బి అండ్ పి వాళ్ళ టెండరు కూడా వుంది.

 

    దాని ఓనరు బాబూజీ, తమ టెండర్ యాక్సెప్ట్ చేయిస్తే, పదిలక్షలు అమెరికన్ డాలర్లు తన స్విస్ బ్యాంకి ఎకౌంట్ కి గుట్టు చప్పుడు కాకుండా ట్రాన్స్ ఫర్ చేయిస్తానన్నాడు.

 

    సొమ్ము చేసుకుని స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానికి కాకపోతే ఈ పదవులెందుకు?

 

    ప్రపంచంలో ఎక్కడయినా అంతే:

 

    కాస్ట్ లీ సూట్స్ వేసుకున్నా, ఖాకీ యూనిఫాం వేసుకున్నా, ఖద్దరు బట్టలేసుకున్నా, కాషాయం ధరించినా కూడా - రాజకీయ నాయకులకికావలసింది-  

 

    పదవి - పవరు - డబ్బు-

 

    మళ్ళీ -

 

    డబ్బు - పవరు - పదవి

 

    ఇది ఒక విషవలయం

 

    "ఆ ఇండియన్ డాగ్ బాబూజీగాడితో అపాయింట్ మెంట్ ఫిక్స్ చెయ్యి. ఇదిగో: మన శాసన సభలో యిక్కడి ఇండియన్ గాళ్ళకోసం ఒక బిల్లు తయారుచేశాం కదూ:"

 

    "అవున్సార్: మేరేజ్ టాక్స్ :"

 

    నవ్వాడు భోజా.

 

    "అవును: మేరేజ్ టాక్స్ ఇండియన్ గాళ్ళు పెళ్ళి చేసుకుంటే పన్ను...: అది నేను ఓ కె చేశానని సెనేట్ మెంబర్స్ తో చెప్పు. బిల్లు ఓటింగు కొచ్చినప్పుడు వెధవలందరినీ చేతులెత్తమను. లేకపోతే చేతులు నరికిస్తానని చెప్పు.

 

    దీంతో యిక్కడి ఇండియన్ గాళ్ళ తిక్కకుదురుతుంది. పెళ్ళి చేసుకోవాలంటే నాకు టాక్స్ కట్టాలి. టాక్స్ కట్టకపోతే పెళ్ళికాదు. పెళ్ళి కాకపోతే:

 

    పెళ్ళిళ్ళు కాకపోతే ఇండియన్స్ ఏం చెయ్యాలో, ఏం చేసుకోవాలో స్వచ్చమైన భాషలో చెప్పి, "ఇంక ఫో: పోయి పనిచూడు:" అన్నాడు తోకాస్ తో.

 

    తోకలేని కోతిలాగా పరుగెత్తి వెళ్ళిపోయాడు తోకాస్

 

                                  *    *    *    *

 

    తన మనసులో ఉన్న టెన్షన్ బయటికి కనబడకుండా పైకి మామూలుగా ఉంది కేప్టెన్ వినీల. జనరల్ భోజా పైకి జోకర్ లా కనబడవచ్చు. కానీ అతను పెద్ద శాడిస్ట్ అని విన్నది తను పిచ్చివాడి చేతిలో రాయిలాగా అతని చేతిలో పవర్ వుంది. అతను ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. ఆ నిర్ణయం వల్ల ఎప్పుడు ఎవరికే కీడు మూడుతుందో తెలియదు.

 

    అయినా తను మహాపరాధమేమీ చెయ్యలేదు. ముక్తసరిగా మాట్లాడింది, వచ్చేసింది.       

 

    జెట్ ప్లేన్ ని పైలట్ చెయ్యడమే ఒక పెద్ద టెన్షన్. ప్రతి టేకాఫ్, ప్రతి లాండింగ్ కూడా ఒక ఛాలెంజ్: దానికితోడు యిప్పుడు ఈ భోజా టెన్షన్.

 

    అసలు తనని ఏరికోరి ఈ ఫ్లయిట్ కి వేసిందెవరు? వాళ్ళకి తెలిసి వుండదా చిత్రద్వీప్ పరిస్థితి? భోజా సంగతి...? చిత్రద్వీప్ కి వెళ్ళే లేడీ పైలట్లు ఎదుర్కునే యిబ్బందులు?   

 

    అన్నీ తెలిసే చేశారా? కావాలని కచ్ఛతో?

 

    ఆడవాళ్ళు మేం అన్నిట్లో సమానమే అని ముందుకొస్తే ఏడిచేవాళ్ళు అన్ని రంగాల్లోనూ వుంటారు.

 

    అందరూ కాదు - కొందరు.

 

    కానీ వాళ్ళకు తెలిసి వుండదు -

 

    తను ఎవరికి భయపడే రకం కాదని:

 Previous Page Next Page