Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 6


    బృహస్పతికి విషయం అర్ధమైంది. 'నిన్నరాత్రి మీటింగ్ లో తాను ఉపన్యసించిన వాస్తవాల తాలూకు పరిణామం ఇదన్నమాట' అనుకున్నాడు. అతడికి ఒక రకమైన సింకింగ్ ఫీలింగ్ కలిగింది. అది పూర్తిగా కోపమూ కాదు, నిస్సహాయతా కాదు.

    అతడా పెన్సివ్ మూడ్ లోనే మంత్రి దగ్గరికి బయలు దేరాడు. పార్టీ కార్యాలయం హడావుడిగా వున్నా అతడికి సులభంగానే ఇంటర్వ్యూ లభించింది. మంత్రి రాంభరత్ అతడిని గుర్తుపట్టి పలకరింపుగా నవ్వాడు.

    "మీ కార్యకర్తలతో మా ఇంటిమీద దాడి చేయించటంలో ఉద్దేశం ఏమిటి?" సూటిగా ప్రశ్నించాడు బృహస్పతి.

    "ఓ! అందుకోసం వచ్చావా? నిన్నరాత్రి జరిగిన దానికి పశ్చాత్తాపం వెలిబుచ్చడానికి వచ్చావనుకున్నాను" హేళనగా హిందీలో అన్నాడు. హిందీలో అతడి ఉచ్చారణ స్వచ్చంగానే వుంది.

    "నా ప్రశ్నకి సమాధానం అది కాదు".

    "నీ పేరు?"
   
    "బృహస్పతి"

    "చూడు మిస్టర్ బృహస్పతీ! వాళ్ళు సుశిక్షితులయిన పార్టీ కార్యకర్తలు. నాయకుడి మీద ఈగ వాలినా సహించలేని క్రమశిక్షణ వారికుంది. అందుకనే నా ఆజ్ఞకూడా తీసుకోకుండా వెళ్ళి నీకో పాఠం నేర్పాలనుకున్నారు. మీ ఇంట్లో ఫర్నిచర్ విరగ్గొట్టారు. వీళ్ళు అక్కడితో ఆగినందుకు సంతోషించు. ఇంకే మీటింగ్ లోనూ నీకు నువ్వే హీరో వనుకుని, ఏ రాజకీయనాయకుడికీ వ్యతిరేకంగా నీ అమూల్యాభిప్రాయాల్ని చెప్పకు."

    "మీటింగ్ లో నేను నా అభిప్రాయాన్ని వెలిబుచ్చేముందు మిమ్మల్ని దాని గురించి మరీ మరీ అడిగాను. మీ అనుమతి తీసుకున్నాకే ఆ విషయం వెల్లడించాను. అది చాలా చిన్న కమ్యూనికేషన్ గాప్. దానికి మీ చర్య మాత్రం హర్షించలేనిది. విధ్వంసం చిన్నదే! బంద్ లలోనూ, రాస్తారోకోల్లోనూ కార్యకర్తలు చేసే విధ్వంసాలతో పోల్చుకుంటే నిజంగా యిది చిన్నదే. కానీ మాది చాలా బీద కుటుంబం సర్! ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే మాకు ఆరు నెలలు పడుతుంది. ఆ విషయం ఆలోచించారా మీరు?"

    "ఆలోచించే అవసరం నాకు లేదు."

    "అవును. అందుకే మీరు రాజకీయ నాయకులయ్యారు!"

    రాంభరత్ నవ్వి, "కరెక్ట్ గా చెప్పావు" అని, బృహస్పతి అక్కడే నిలబడి వుండడంతో "వెళ్ళు. ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అన్నాడు.

    "రాజకీయ నాయకులని కూడా చట్టం తన పరిధిలోకి తీసుకుని ఎన్నో నిద్రలేని రాత్రులు, దిగులుతో ఆలోచించేలా చేసే రోజు ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నాను సర్!"

    రాంభరత్ బెల్ కొట్టి "ఆ సెక్యూరిటీ అమ్మాయి వుంటే లోపలికి పిలు" అన్నాడు.

    రెండు నిముహాల్లో సరళరేఖ లోపలికి వచ్చింది.

    "తలుపెయ్" అన్నాడు రాంభరత్ "బోల్టు పెట్టు."

    సరళరేఖ బోల్టు పెడుతుండగా అతడు పిడికిలి బిగించి బలంగా బృహస్పతి గడ్డం కింద కొట్టాడు. పెద్ద చప్పుడుతో గదిలో ఓ మూలగా వెళ్ళి పడ్డాడు బృహస్పతి. తల గోడకి కొట్టుకుంది. ఈ అనూహ్య పరిణామానికి విస్తుపోయినా క్షణంలో తేరుకుని, ఆవేశంగా లేచి చువ్వలా నిలబడ్డాడు. అతడి పిడికిళ్ళు కూడా అటాక్ కోసం సిద్ధపడ్డాయి.

    "ఆగు" అన్నాడు రాంభరత్.... "ఇప్పుడు నువ్వు నా మీద చెయ్యి చేసుకుంటే ఆరునెలలకి తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. ఇన్ స్పెక్టర్ సరళరేఖ అనే "చట్టం" నీ పక్కనే ఉంది" అని తలుపు దగ్గరికి వెళ్ళి బోల్టు తీసి ద్వారం తెరిచాడు. ".... వెళ్ళు! ఇప్పుడు అర్ధమైందా? అధికారం చట్టానికి ఎందుకు భయపడదో!"

    చాలా చిన్న వాక్యం! కానీ అర్ధవంతమైన వాక్యం!!

    బృహస్పతి సరళరేఖ వేపు చూసాడు. ఆ అమ్మాయి కళ్ళలో సన్నటి నవ్వూ, హేళన కనబడ్డాయి. అతడు తల వంచుకుని బయటికి నడుస్తూ, గుమ్మం దగ్గర ఆగి, ఓ క్షణం కన్నార్పకుండా మంత్రివేపు చూసి, ఆ గదిలోంచి బయటికి వచ్చేసాడు.

    చిన్న వాక్యంలో చాలా అర్ధాలుండవచ్చు.

    అర్ధం చేసుకోగలిగితే చిన్న చూపులోనే మరిన్ని విశాలమైన అర్థాలుంటాయి.


                                              *    *    *


                           కేంద్ర నేరపరిశోధక శాఖ

    దేశంలో నేరాలని పరిశోధించే శాఖో- లేక కేంద్రంలో జరిగే నేరాలని పరిశోధించే శాఖో తెలీదు కానీ, ఆ రోజు ఆ ఆఫీసు మాత్రం చాలా హడావుడిగా ఉంది. కారణం సి.బి.ఐ. డైరెక్టరు ఆ రోజు ఢిల్లీ నుంచి ఆ బ్రాంచీకి వస్తున్నాడు. ప్రధాన మంత్రి కొడుకు ఎన్నికల్లో నిలబడితే, ఊళ్ళో పెళ్ళికి హడావుడి పడ్డ జంతువుల్లా కుక్క గొడుగుల్లాంటి రాజకీయ నాయకులు హంగామా చేసినట్టు- డిపార్ట్ మెంట్ లో చిన్న ఉద్యోగులు సైతం ఆయన దృష్టిలో పడాలని హడావుడి చేస్తున్నారు.

    సి.బి.ఐ. డైరెక్టర్ వచ్చింది మాత్రం తన వ్యక్తిగత పని మీద!.... వ్యక్తిగత పనులకి అధికారికంగా కాంప్ లు వేసుకోవడం అనేది ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన perks లో ఒకటి కదా!!

    ఏమాట కామాటే చెప్పుకోవాలి. "దేశాన్ని నిజాయితీగా ముందుకు నడిపిస్తాను. నా కుటుంబసభ్యులకి మాత్రం గాస్ కనెక్షన్ లు ఇప్పించుకుంటాను. అంత పెద్ద బాధ్యత నిజాయితీతో నిర్వహిస్తున్నప్పుడు, ఇంత చిన్న స్వార్ధాన్ని మీరెందుకు ఒప్పుకోరు?..." అని ప్రజలని ప్రశ్నించే ప్రధాన రాజకీయ నాయకుడిలో ఉండే ద్వైదీ భావమే సి.బి.ఐ. డైరెక్టర్ లోనూ ఉంది. పనికి సంబంధించినంతవరకూ చాలా పట్టుదలతో, క్రమశిక్షణతో చేస్తాడు.

    ఇప్పుడాయన ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది కూతురి పని మీద! ఆ అమ్మాయి తన ప్రేమ విషయం తండ్రికి చెప్పింది. ఊహించని ఈ విషయం విని ఆయన కొంచెం కంగారుపడ్డాడు.

    "నా కూతురు ప్రేమలో పడిందంటే నేను నమ్మలేకుండా ఉన్నానమ్మా!" అన్నాడు.

    "అదేమిటి నాన్నా! సి.బి.ఐ. డైరెక్టరు కూతుళ్ళూ, కొడుకులూ ప్రేమలో పడకూడదని రూల్ ఏమైనా ఉందా?"

    "అది సరేగానీ, ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేస్తుంటాడు?"

    "ఏమీ చేయడు. చెయ్యడం మీద అతనికి నమ్మకం లేదు."

    "వ్వాట్?" అదిరిపడ్డాడు. ".... నువ్వు చెపుతున్నది నాకేమీ అర్ధంకావడం లేదమ్మా!"    

    "ఏ పనయినా మనుషులు డబ్బు కోసమో, అధికారం కోసమో, కీర్తికోసమో చేస్తారని అతడి అభిప్రాయం. ఆ మూడూ తనకి అనవసరమని అతడు మనస్పూర్తిగా నమ్ముతాడు. అందుకే ఏ పనీ చేయడు."

    "ఇంత చదువుకున్న దానివి, ఇంత తెలివితేటలున్న దానివి అలాంటి వాడ్ని ప్రేమించావంటే నాకు చాలా విచారంగానూ, అవమానంగానూ వుంది. అందని ద్రాక్షపళ్ళు పులుపు అని ఎప్పుడయినా విన్నావా? పని చెయ్యడం చేతకాని వాళ్ళందరూ ఇలాంటి నీతి కబుర్లే చెపుతారు."

    "అతడి గురించి నీకు సరిగ్గా తెలీదు నాన్నా! తలచుకుంటే అతడు ఏమైనా చేయగలడు?"

    "అతడి పేరు?"

    "బృహస్పతి."

    "పేరు మాత్రం చిత్రంగా ఉంది."

    "మనిషి కూడా అంత అద్భుతమైన వ్యక్తే నాన్నా!" అంది ఆ అమ్మాయి. ఆ తరువాత తండ్రికి దగ్గరగా వచ్చి ప్రాధేయపూర్వకమైన స్వరంతో "ఒకసారి అతడ్ని చూస్తే నీకే తెలుస్తుంది. నా తెలివితేటలమీద నీకు నమ్మకం ఉందన్నావుగా! నీ నమ్మకం చెదిరిపోదు. అతడు పైకి మామూలుగా, నిర్లక్ష్యంగా కనబడతాడు. మొదట్లో నేనూ భ్రమపడ్డాను. తన థియరీని అతడు చాలా స్పష్టంగా నిరూపించాడు."

    "ఏమిటి ఆ థియరీ?"

    "మామూలు భుక్తికి కావలసిన సంపాదన సంగతి వదిలేసెయ్. 'అంతకన్నా ఎక్కువ ఆస్తి, అధికారం సంపాదించాలంటే మాత్రం అవతలివాడిని మోసం చెయ్యక తప్పదు-' అనే థియరీ అతడిది. అందుకే అలా వుండిపోయాడు తప్ప, కావాలనుకుంటే లక్షాధికారో, లక్నోలో గవర్నరో అయి వుండేవాడు."

    రాఘవరావు కూతురివేపు కళ్ళప్పగించి, నోట మాటరాక చూస్తూ ఉండిపోయాడు. ప్రేమలో పడితే తర్కం అనే ధర్మామీటరులో మూర్ఖత్వం అనే పాదరసం లెవల్ కాస్త పెరుగుతుందని తెలుసుకానీ, మరీ ఇంత ఊర్ధ్వ శిఖరాలు చేరుకుంటుందని ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాడు. మరొకవైపు తన కూతురి విచక్షణా జ్ఞానం మీద ఆయనకి అపారమయిన నమ్మకం ఉంది.

    ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో "సరేనమ్మా! నేనక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని ప్రత్యక్షంగా చూస్తాను" అన్నాడు.

    దాని పరిణామమే ఈ కాంప్!

    ఊళ్ళో దిగిన తరువాత ఆయన బృహస్పతిని తన ఆఫీసుకి పిలిపించాడు. తన కూతురు ఎందుకు ప్రేమలో పడిందో, దానికి సగం కారణం అతడిని చూడగానే ఆయనకీ అర్ధమైంది. బృహస్పతి నిజంగానే స్మార్ట్ గా వున్నాడు. అయితే కళ్ళలో నిర్లక్ష్యం, నుదుటిమీదికి పడిన క్రాఫ్ లో పొగరూ మాత్రం ఆయనకి నచ్చలేదు. 

    "నా కూతురు నీ గురించి చెప్పింది."

    "చెపుతానని చెప్పింది. చెప్పమని చెప్పాను."

    "నువ్వే చేస్తుంటావ్?"

    "అది కూడా చెప్పమని చెప్పానే!"

    "చెప్పింది....! ఏమీ చేయవని చెప్పింది" ఆయన కుర్చీలోంచి లేచి గంభీరంగా పచార్లు చేస్తూ కొనసాగించాడు. "....ఈ మధ్య కుర్రవాళ్ళందరూ తమ తమ వితండ వాదనలని అందమైన థియరీలుగా చిత్రీకరించుకోవటం గొప్ప ఫ్యాషనైపోయింది. నీకేమీ చేయటం చేతకాదు కాబట్టి ఆ చేతకాని తనానికి మేధావి తనపు obstinate ముసుగు వేసుకున్నావు. మరోలా చెప్పాలంటే నువ్వుసూడో ఇంటలెక్చువల్ కంపల్సిస్ సైకోపాథటిక్ న్యూరోసిస్ తో బాధపడుతున్న మానసిక రోగివి- అని నేనంటే దానికి నీ సమాధానం ఏమిటి?"

    "చిన్న చిన్న మానసిక లోపాలకి కూడా పెద్ద పెద్ద ఇంగ్లీషు రోగాల పేర్లు పెట్టి సైకాలజిస్టులుగా, మానసిక శాస్త్రనిపుణులుగా పత్రికల్లో ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం డబ్బు సంపాదించడానికి దగ్గర మార్గం సార్!" వినయంగా అన్నాడు బృహస్పతి.

    కోపంతో ముక్కు పుటాలు అదురుతుండగా ఆయన "నేనడిగిన ప్రశ్నకీ, నువ్వు చెప్పిన సమాధానానికి సంబంధం ఏమిటి" అన్నాడు.

    "మీరెలాగూ ఆరునెలల్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి ఏదయినా పత్రికల్లో ఆ శీర్షిక నిర్వహిస్తే బాగుంటుందని కాబోయే అల్లుడిగా నా ఉద్దేశ్యం సర్!"

    ఆయన ఒక్కక్షణం బిత్తరపోయాడు. సి.బి.ఐ. డైరెక్టర్ ని ఎవరయినా అంతమాట అనగలుగుతారని ఆయన ఊహించలేదు. అయితే కూతురు గుర్తొచ్చి బలవంతం మీద కోపం అణుచుకున్నాడు.

    "అయితే ఇప్పుడేమంటావ్?"  

 Previous Page Next Page