"మరో ఉదాహరణ చెబుతాను. ప్రత్తి రైతుల గిట్టుబాటు ధరకోసం అధికారంలో ఉన్న పార్టీ 'రాస్తారోకో' కార్యక్రమాన్ని నిర్వహించింది. రైతుల సానుభూతి కోసం ఆ నియోజకవర్గపు మంత్రి రైలు పట్టాలమీద బైఠాయించాడు. ప్రజల కంటితుడుపు కోసం హోమ్ మినిష్టర్ అక్కడికి పోలీసులను పంపించాడు. ఇరువర్గాలకీ ఘర్షణ జరిగింది. 'రాస్తారోకో' నిర్వహించిందీ అధికార పక్షమే! పోలీసులని పంపిందీ అధికార పక్షమే! మధ్యలో నష్టపోయినదెవరు? ఎనిమిది గంటలపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో -ఆగిపోయిన రైళ్ళ కంపార్ట్ మెంట్లలో మండుటెండలో మగ్గిపోయిన కుటుంబాలూ, పసిపిల్లలూ! అంతేకాదు. ఇంజన్ డ్రైవర్ల ఓవర్ టైమ్ తో కలుపుకుంటే దేశానికి రెండు కోట్ల రూపాయల నష్టం మిగిలింది అవునా, కాదా?"
"అవును." అంటూ జనంలోని ఉవ్వెత్తున ప్రతిస్పందన లభించింది. రాంభరత్ అనుచరులు ముందుకు దూకడానికి సిద్ధంగా వున్నారు. ఆ సమయంలో వక్తని మాట్లాడనివ్వకుండా ఆపితే జరిగే పరిణామం మంత్రికి తెలుసు. కనుసైగతో అనుచరులని ఆపుచేసాడు. దూరంగా నిలబడి చూస్తున్న సరళరేఖ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. బృహస్పతి ఉపన్యసిస్తుండగా మినిష్టరు తనవైపు చూసిన చూపు ఆమె జీవితంలో మర్చిపోలేదు. ఉపన్యాసం కొనసాగుతోంది.
"నిన్నటి పేపర్ చదివారా మీరు? ఈ పార్టీ సభ్యుడు ఒక రాజ్యసభ మెంబర్- పైగా సినిమా యాక్టర్. ఎన్నికల ప్రచారంలో ఒక పోలీసు అధికారిని కొట్టాడు. అతడిని ఎన్నికల అధికారి అరెస్ట్ చేసాడు. ప్రచారం కొనసాగించడానికి అనుమతి కోసం పోలీసు అధికారి తనని పాతికవేలు లంచం అడిగాడనీ, అదివ్వనందుకు ప్రచార రధానికి అడ్డుపడగా తను కాస్తా తోసాననీ ఆయన చెప్పాడు. బెయిల్ మీద విడుదలయ్యాడు. ఇదీ జరిగిన కథ! ఇప్పుడిందులో తర్కం ఆలోచిద్దాం. సాక్ష్యం యిచ్చింది రాజ్యసభ మెంబరు కాబట్టి పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. అలా చెయ్యలేదు. అంటే గౌరవనీయుడైన సభ్యుడు అబద్ధం ఆడుతున్నాడని ప్రభుత్వానికి తెలుసు. అదే నిజమైన పక్షంలో పోలీసు అధికారిని కొట్టినందుకు శిక్ష వెయ్యాలి. కానీ అదీ జరగదు. ఈ కేసు కనీసం కోర్టువరకూ కూడా వెళ్ళదు. ఇందులో భంగపడింది కేవలం ఎన్నికల అధికారీ పోలీస్ ఇన్ స్పెక్టరూ మాత్రమే! రేపటి నుంచి వాళ్ళూ మనకెందుకొచ్చిందిలే అనుకుంటారు. ఈ విధంగా రాజకీయం కొద్దికొద్దిగా నిజాయితీని కబళించి వేస్తోంది. దీనికి ఈ రాజకీయ నాయకుల్ని మనమేం చెయ్యాలి?" విలుకాడు గురిచూసి, ఆగి.... బలంగా బాణం వదిలినట్టు ఆఖరి ప్రశ్న సూటిగా అడిగాడు.
"తన్నాలి.... చంపాలి" అంటూ జనంలోంచి కేకలు వినిపించాయి.
రాంభరత్ మైకు ముందుకొచ్చి, సమయస్పూర్తితో "ఈ యువకుడు చెప్పినదంతా నిజమే! ఇలాంటి కలుషితమైన రాజకీయాల్ని తొలగించడం కోసమే మాపార్టీ కంకణం కట్టుకుంది. అందుకని మేము చేయబోయే దేమిటంటే...." అతని మాటలు పూర్తికాకుండానే ఒక కోడిగుడ్డు వచ్చి అతడి ముక్కుమీద పగిలింది. ఒక టొమాటో మూతిని ముద్దు పెట్టుకుంది. సెక్యూరిటీ వలయంగా నిలబడ్డారు. జనం చెప్పుల వర్షం కురిపిస్తున్నారు. ఈ హడావుడిలో బృహస్పతి కామ్ గా అక్కడినుంచి తప్పుకున్నాడు. వెళ్తూ వెళ్తూ సరళరేఖ వేపు చూసి పలకరింపుగా నవ్వాడు. మంత్రిగారి రక్షణ కార్యక్రమంలో వున్న సరళ అంత టెన్షన్ లో కూడా ఆ మందహాసంలోని వెక్కిరింతని గుర్తించింది.
4
"భలే ఆకస్మికంగా, తారసపడ్డావే! నిన్న రాత్రినుంచీ నీ కోసమే వెతుకుతున్నాను. ఇంటికొస్తే అక్కడా లేవు...." అన్నాడు శ్రీహర్ష. అతడో జర్నలిస్టు.
"ఏమిటి విశేషం?" బృహస్పతి అడిగాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్.
"నిన్న నువ్వు ఇచ్చిన ఉపన్యాసం మా ప్రెస్ క్లబ్ లో సంచలనం రేపింది...."
"కొంపదీసి ఈరోజు ఉదయం హెడ్ లైన్లలో వేసారా, ఏమిటి?"
"లేదు, సరదాగా బాక్స్ ఐటమ్ గా వేసాం."
"స....ర....దా....గా" పళ్ళు బిగించి అన్నాడు బృహస్పతి. "ప్రజలు తెలుసుకోవలసిన చేదు నిజాల్ని పచ్చిగా చెప్తే- అది మీకు సరదా వ్యవహారంగా వుందా?" అతడి కంఠంలో విషాదం ధ్వనించింది.
"నువ్వు చెప్పినదంతా నిజమే! కానీ మాకు కావలసినది ఒక మినిష్టరు సభ ఎలా రసాభాస అయిందన్నది మాత్రమే. అంతే తప్ప విషాద వాస్తవాల్ని రాయడం మొదలుపెడితే అవి న్యూస్ పేపర్లు అవవు. వాటినెవరూ డబ్బులు పెట్టి కొని చదవరు."
"పేపర్లు తమ బాధ్యత మర్చిపోబట్టే మనదేశం ఇలా తగలబడింది. ఒక్కొక్క పేపరూ ఒక్కొక్క పార్టీకి అంకితం అయిపోయింది."
"పొద్దున్నే మా పేపర్ల మీద పడ్డావు సరేగానీ- రాత్రంతా ఎక్కడున్నావో అది చెప్పవేం?"
"ఒక ఇన్ స్పెక్టర్ వుందిలే! పేరు సరళరేఖ. ఉద్యోగంలో జాయినయి ఆరు నెలలు కాలేదు, అప్పుడే ఇరవై వేలదాకా సంపాదించింది."
"ఆ ఉద్యోగానికది చాలా తక్కువనుకో. అయితే లేడీ లంచగొండి ఇన్ స్పెక్టర్ అనేది విచిత్రంగా వుంది."
"ఆ అమ్మాయి ఆశయం తెలిస్తే మరీ ఆశ్చర్యపోతావు. భారత ప్రధాని అవ్వాలనేది ఆవిడ జీవితేచ్చ. లంచాలు సంపాదించి, దానితో మొగుణ్ణి ఎన్నికల్లో నిలబెట్టి, వాడు చచ్చాక ఆ సానుభూతి ఓటుతో గెలవాలనీ ఆ అమ్మాయి పథకం. ఏ హర్షద్ మెహతా వంశంలోనో పుట్టాల్సింది. పోతే పొరపాట్న నాతో ఛాలెంజ్ చేసింది! దానికి ఫలితంగా కళ్ళనీళ్ళ పర్యంతమై క్షమాపణ చెప్పి, ఆ ఇరవై వేలూ నాకు సమర్పించుకుంది."
"ఎలా?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీహర్ష.
"నిన్నరాత్రి మినిష్టర్ మీటింగ్ లో గొడవయ్యాక, అక్కడి నుంచి వెళ్ళి మందు కొట్టాను. రోడ్డుమీద ఆ ఇన్ స్పెక్టర్ పట్టుకుంది. ప్రొహిబిషన్ టైమ్ లో మందు కొట్టినందుకు, ఐదు వేలు లంచం అడిగింది. అదే సమయానికి అక్కడికి అవినీతి నిరోధక శాఖ అధికారి వచ్చాడు."
"అతనికెలా తెలిసింది?"
"నేను ముందే చెప్పి ఉంచాలే! ఫలానా పోలీస్ స్టేషన్ లో ఫలానా ఇన్ స్పెక్టర్ విపరీతంగా లంచాలు తీసుకుంటోందని ఎ.సి.బి. వాళ్ళకి చెప్పి వుంచాను. నా జేబులో వున్నా టేప్ రికార్డర్ ఆ అధికారికి సాక్ష్యంగా యిచ్చాను."
"మైగాడ్!" అన్నాడు శ్రీహర్ష.
"ఆ అమ్మాయి అధికారి కాళ్ళావేళ్ళా పడింది. దాదాపు ఏడ్చేసింది. పాపం, ఆ ముసలాడు కొద్దిగా కరిగినట్టు కనబడ్డాడు. నేను మాత్రం ఆ అమ్మాయిని అరెస్టు చెయ్యకపోతే ఎన్.టి.ఆర్. సమాధి దగ్గర నిరాహారదీక్ష చేస్తానని బెదిరించాను. మీరూమీరూ రాజీ కురుద్చుకోండన్నాడు ఆ అధికారి. ఇరవై వేలకి రాజీ కుదిరింది. ఇంటికి తీసుకెళ్ళి ఆ డబ్బు అప్పగించింది. అన్నీ మూటలు కట్టివున్నాయి. అకౌంట్స్ రాసుకున్నట్టు ఒక్కొక్క మూట మీదా- ఆ డబ్బు ఎలా సంపాదించిందీ రాసుకుంది. మట్కా కేసులూ- బ్రోతల్ కేసులూ- పేకాట క్లబ్ లమీద రైడింగ్ లూ- ఇలా రకరకాలుగా మూటలు కట్టి విడిగా వుంచింది. చివరికి స్టువర్ట్ పురం దొంగనెవరినో పట్టుకున్నప్పుడు 'మంగళసూత్రం' లంచంగా తీసుకుని, వాడిని వదిలేసిందట! మన భవిష్యత్ ప్రధాని!"
"డైరీ రాసుకున్నట్టు అంతా విపులంగా రాసుకుందన్నమాట. అన్నట్టు నాకో అనుమానం.... పేకాటకి డబ్బుల్లేని వాడివి నీకు పాకెట్ సైజు టేప్ రికార్డర్ ఎక్కడ్నించి వచ్చింది?"
"టేప్ రికార్డరా, పాడా? సిగరెట్ పెట్టెకి సెల్లోఫెన్ పేపర్ అతికించా నంతే!"
"మరి ఆ అవినీతి అధికారికి అనుమానం రాలేదా?"
"అవినీతిలేదు. అధికారీలేడు. ఆ వచ్చినవాడు నా ఫ్రెండ్."
"వ్వాట్!" ఆశ్చర్యంగా నోరు తెరిచాడు శ్రీహర్ష.
బృహస్పతి నవ్వాడు. "చెప్పానుగా ఆ అమ్మాయితో ఛాలెంజ్ చేసానని! ఆ రోజు అన్యాయంగా నన్ను అరెస్టు చేసింది. ఫలితంగా నిన్న ఇరవై వేలు సమర్పించుకుంది. అన్నట్టు డైరీ అంటే గుర్తొచ్చింది. మంగళ్ సింగ్ మీద నీ పరిశోధన ఎంత వరకు వచ్చింది?"
శ్రీహర్ష జర్నలిస్ట్. కాస్త సాహిత్యాభిలాష ఉన్నవాడు. 'చంబల్ లోయ దొంగలు" అన్న పేరుమీద డాకూ మంగళ్ సింగ్ జీవితచరిత్ర రాస్తున్నాడు. మంగళ్ సింగ్ కి ఒక చిత్రమైన అలవాటు ఉండేది. వేట అభిరుచి వున్నవాళ్ళు పులినిగానీ, జింకని గానీ చంపితే ఆ తలని, లేదా చర్మాన్ని ఇంటికి ఎలా తెచ్చుకుంటారో, మంగళ్ సింగ్ గ్రామాలమీద పడి లూటీ చేసినప్పుడు చంపిన వాళ్ళ శవాలు ముందుపెట్టుకుని ఫోటోలు దిగేవాడు. ఎక్కడెక్క దొంగతనాలు చేసిందీ చిట్టాలా రాసుకునే వాడు. ఇదంతా చెప్పి శ్రీహర్ష "కనీసం అలాంటి ఫోటో ఒకటి దొరికినా నేను రాస్తున్న గ్రంథానికి ఎంతో లాభం చేకూరుతుంది" అన్నాడు.
బృహస్పతి చిరునవ్వుతో "మంగళ్ సింగ్ లూటీచేసి దాచిన రాజా విక్రమ్ దేవ్ జమిందారీ తాలూకు వందకోట్ల విలువచేసే బంగారం నిధి వివరాలు దొరికితే మనందరికీ మరీ లాభిస్తుంది" అన్నాడు.
"నా పరిశోధనాత్మక గ్రంథం అంటే నీకు చాలా ఎగతాళిగా వున్నట్టుందే!"
"లేదు బ్రదర్! పుస్తకం వల్లే వచ్చే కీర్తికన్నా, నిధివల్ల వచ్చే డబ్బు విలువ ఎక్కువని చెపుతున్నానంతే."
* * *
శ్రీహర్ష దగ్గరనుంచి బృహస్పతి ఇంటికెళ్ళేసరికి మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది. మలుపు తిరుగుతూ ఆ జంక్షన్ లోనే ఆగిపోయాడు.
ఇంటిముందు జనం గుమిగూడి వున్నారు. అతడికేమీ అర్ధంకాలేదు. వడివడిగా ముందుకు నడిచాడు.
వీధి అరుగుమీద తల్లి అరచేతికి నుదురు ఆన్చుకుని దిగులుగా కూర్చుని వుంది. తండ్రి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చెల్లెలు హిమసమీర గుమ్మం దగ్గర నిలబడి, తమ్ముడు అందించిన ఇంటి వస్తువులు ఒకటొకటే అందుకుని లోపలికి తీసుకెడుతోంది.
ఇంట్లోని సామాన్లన్నీ వీధిలో చెల్లాచెదురుగా పడి వున్నాయి. అతడు అయోమయంగా అడుగు ముందుకేసాడు. తండ్రి అతడిని చూసి దగ్గరికి వస్తూ "ఏం నాయనా! తెల్లారిందా? మేము బతికి ఉన్నామో, చచ్చామో చూడటానికి వచ్చావా? ఆ రౌడీలకి కాస్త దయాదాక్షిణ్యాలు ఉన్నట్టున్నాయి. మా మీద చేయి చేసుకోకుండా వెళ్ళారు. అంతవరకూ సంతోషం."
"అసలేం జరిగింది నాన్నా?"
"గంట క్రితం ఎవరో పార్టీ కార్యకర్తలు వచ్చి ఇంట్లో సామానులన్నీ బయటికి విసిరెయ్యడం మొదలు పెట్టారు. అమ్మా, చెల్లీ ఏడుస్తూ బతిమాలారు. వాళ్ళు వినలేదు. నాన్నకి బి.పి. పెరిగి పడిపోయాడు. ఎందుకిలా చేస్తున్నారని నేను అడిగితే 'మీ అన్నయ్య నడుగు చెపుతాడు' అన్నారు వాళ్ళు. వీధిలో వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోలేదు" అన్నాడు తమ్ముడు.