కానీ అది అంత సులభం కాదు.
ప్రస్తుతం అధికారంలో వున్న ప్రభుత్వాన్ని పడగొట్టటానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ అగ్రరాజ్యం స్విస్ బ్యాంక్ లో వేయటానికి సంసిద్ధత వ్యక్తం చేసిందే తప్ప ఆయుధాలు ఇవ్వడానికి వప్పుకోవటం లేదు. రేపు ఈ విషయం బయటపడితే మిగతా దేశాలమధ్య అభాసుపాలు అవుతామేమో అని ఆ దేశం భయపడుతోంది.
ఒకేసారి తిరుగుబాటు లేవదీయడం రామోన్ హర్సాసే కిష్టంలేదు. ప్రస్తుతం ప్రధానికి దేశంలో చాలా సపోర్టు వుంది. దాన్ని పోగొట్టాలంటే ముందు అలజడి లేవదీయాలి. గెరిల్లా పద్ధతిలో కమెండోలని తయారు చెయ్యాలి.
వారికి ఆయుధాలు కావాలి.
అయితే ఇదంతా లోపాయికారిగా జరగాలి.
ఎన్నాళ్ళో రహస్యంగా ఎంతమందితోనో సంప్రదింపులు జరిపాక అతడికి- ఈ ఆయుధాలు సప్లయ్ చేసే సంస్థ దొరికింది. దాని ప్రతినిధికీ అతడికీ మధ్య అగ్రిమెంటు కుదిరింది. అతడు చూపించిన సాంపిల్స్ చూసి ఆశ్చర్యపోయాడు రామోన్ హర్సాసే! ఆయుధాలు తయారు చేయటంలో ప్రపంచంలో అందరికంటే స్వీడన్ ది పైచేయి. ఆయుధాల క్వాలిటీ దానికంటే గొప్పగా వుంది.
"నేను మీ సంస్థ యజమానిని స్వయంగా కలుసుకోవాలి" నమ్మకం కుదిరాక అన్నాడు హర్సాసే.
"తప్పకుండా" అంటూ భారతదేశానికి తూర్పుగా, బంగాళాఖాతంలో వున్న చిన్న దీవిని మాప్ తో సూచించి, "రండి. మీ కోసం ఎదురుచూస్తూ వుంటాము" అన్నాడు.
"ఈ దీవి భారతదేశపు టూరిస్ట్ లకి ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ హోటల్స్ యాజమాన్యంది కదూ?"
"అవును. పైకి కనపడేది అదే-" ప్రతినిధి నవ్వేడు. "కానీ ఈ దీవికి టూరిస్టులు రారు."
"మరి ఎవరొస్తారు?"
"అనంతానంతస్వామే యజమాని. ఆయనే వస్తారు."
* * *
డిప్యూటీ కమీషనర్ ప్రవల్లిక చెప్పినట్టు- అనంతానంతస్వామి ఆయుధాలు చాలా తీవ్రమైనవి.
భక్తి ఆయన ఆయుధం!
మతం ఆయన వెపన్!!
అతడికి ఆయుధ కర్మాగారం వున్నమాట నిజమే! ఇటు ఒక దేశపు ప్రభుత్వానికి, అటు ఆ దేశపు టెర్రరిస్టులకి కూడా అతడు ఆయుధాలు అమ్ముతాడన్నమాట కూడా నిజమే. కేవలం డబ్బుకోసమే అతడు ఇదంతా చేస్తున్నాడంటే అది అజ్ఞానం. అతడు బంగారు కంచంలో తిని, బంగారు మంచంమీద పడుకోవటానికి వీలైనంత ధనం అతడి కోట్లాది భక్తులే సమకూర్చగలరు. ప్రవల్లిక చెప్పినట్టు కేవలం 'రాజకీయ' వ్యాపారంలోనే అతడు కోట్లు కోట్లు సంపాదించగలడు.
అనంతానంతస్వామి ఆశయం వేరు.
మరో అయిదు సంవత్సరాల్లో భారత రాజ్యాధినేత అవ్వాలని అతడి ఉద్దేశ్యం. దానికి గత ఇరవై ఏళ్ళుగా పథకం వేసి, తన ఆలోచన్లని అమలు జరుపుతూ వచ్చాడు. చాప క్రింద నీరులా తన స్కీమ్స్ సాగిస్తున్నాడు.
ప్రజల గురించీ, వారి బలహీనతల గురించీ అతడికి బాగా తెలుసు. మనిషి భగవంతుని ఎక్కువగా ఎప్పుడు నమ్ముతాడు? సుస్థిరతా భావం పోయినప్పుడు.....! అందుకే అతడు దేశంలో టెర్రరిస్టులకి ఆయుధాలు అమ్ముతాడు. అల్లర్లు జరిపే కొద్దీ ప్రజలకు ప్రభుత్వంమీద నమ్మకం పోతుంది. మరోవైపు ప్రజల్లో 'మతాన్ని' ఇంజెక్ట్ చేస్తాడు. హిందువులు సహనశీలురు వారి సహనాన్ని పోగొట్టాలి.
సోషలిజం కన్నా మతమే తమకు ఎక్కువ భద్రత కలిగిస్తుందన్న భావం వారిలో ఏర్పడుతుంది. సెక్యూలరిజం లాభం లేదన్న అభిప్రాయం కలుగుతుంది.
ఉద్రేకాలు ఆగవు. ప్రభుత్వం కూలిపోతుంది. తమని రక్షించగల భగవత్ స్వరూపుడయిన ఒక మహనీయుడయిన వ్యక్తికోసం ప్రజలు ఆకాశం కేసి చూస్తారు. ఆ వ్యక్తి తను గాక మరెవ్వరు? భారతదేశపు ముగ్గురు సైన్యాధిపతులూ నిశ్చయంగా తన కాళ్ళ దగ్గిరే ప్రణమిల్లి సింహాసనం దగ్గిరకి తీసుకు వెళ్తారు. ఇరాన్ కి భొమేనీ ఎలాగో, భారత దేశానికి తను అలా అవుతాడు.
ఎంత గొప్ప ప్రణాళిక!!
హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, చంఘీజ్ ఖాన్- ఎవరూ ఇంత గొప్ప వ్యూహాన్ని రచించి ఉండరు. దాన్ని అమలు జరపడానికి ఇన్నేళ్ళుగా ఇంత ఓర్పుతో వలపన్ని ఉండరు. అతడు దాన్ని సాధించాడు. ఎక్కడికి వెళ్ళినా లక్షల సంఖ్యలో ప్రజలు దర్శనం కోసం తహతహ!! మొదటి రంగం పూర్తయింది. రెండో రంగం మిగిలింది. అదే ఆఖరిది..! దేశంలో కల్లోలం సృష్టించటం...!!
సజావుగా వెళుతున్న వాహనానికి సడెన్ గా స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బయటకు వచ్చింది. చాలా చిన్న స్పీడ్ బ్రేకర్.
రామోన్ హర్సాసేకీ అనంతానంతస్వామికి మధ్య కలయిక గోల్డెన్ దీవిలో జరిగింది. రామోన్ హర్సాసే ఆ దీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో రహస్యంగా జరుగుతుందీ సమావేశం అనుకున్నాడు. అటువంటిదేమీ లేదు. పూర్తి గార్డ్ ఆఫ్ ఆనర్ తో అతడికి స్వాగతం లభించింది.
"వెల్ కమ్ టు గోల్డెన్ ఐలెండ్" అని స్వాగతం పలికాడు. రెండు గంటలపాటు ఆయుధాల పరీక్ష జరిగింది. సంతృప్తుడయ్యాడు రామోన్. రెండు మిలియన్ డాలర్లకు బేరం కుదిరింది.
స్వామి ఆతిధ్యం స్వీకరిస్తూ, రిలాక్స్ అవుతున్న సమయంలో తనని ఎప్పటి నుంచో వేధిస్తూవున్న ప్రశ్న అడిగాడు రామోన్ హర్సాసే.
"మా దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టవలసివస్తే ప్రభుత్వాధినేతల్ని చంపటమొక్కటే మార్గం. మీరు వేరే విధంగా ఎలా సాధించగలరు స్వామీ దీన్ని?"
స్వామి నవ్వాడు. "ప్రపంచపు అతి సంపన్నమైన దేశం ఏది రామోన్ హర్సాసే?"
"నిశ్చయంగా అమెరికా."
"ఇరాన్- ఇరాక్ యుద్ధంలో అమెరికా ఎవర్ని సపోర్ట్ చేస్తుంది?"
"ఇరాక్ ని."
"మరి ఇరాన్ కి ఎందుకు రహస్యంగా ఆయుధాలు అమ్ముతుంది?"
రామోన్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. స్వామి అన్నాడు- "యుద్ధం ఆగిపోతే ఆయుధాలు ఎవరూ కొనరు. అది ఆగకూడదు. అమెరికా లక్ష్యం అదే. ఇరాన్-ఇరాక్ ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి? ఇజ్రాయిల్ ఎందుకు పోరాడుతుంది? మతం! మతం మనల్ని లాజిక్ ఆలోచించనివ్వదు. ప్రపంహంలో తెలివైన వాళ్ళు ఈ బలహీనతనే ఆధారం చేసుకుంటారు. 1980 సెప్టెంబర్ లో ఈ యుద్ధం ప్రారంభమయింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి జేనియర్ పెరజ్ ఏదో అద్భుతం చేసి ఇరాక్-ఇరాన్ ల మధ్య సంధి సాధించకపోతే ఈ యుద్ధం ఈ నెలతో ఎనిమిదవ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. *
_________________________________________________________________
*క్రీస్తుశకం 14వ శతాబ్దంలో బ్రిటన్-ఫ్రాన్స్ ల మధ్య జరిగిన! "నూరేళ్ళ-పోరాటం" తరువాత- ఈ గల్ఫ్ యుద్ధమే చరిత్రలో అతి దీర్ఘమైనది.
"ఎంతో, నాగరికత సాధించాడనుకున్న మనిషి చరిత్రలో ఇన్నాళ్ళు యుద్ధం సాగిందంటే దీనికి కారణం, మూర్ఖపు పట్టుదలకాక మరేమిటి? ఈ రకమైన మత్తునే నేను నా దేశ ప్రజలమీద చల్లబోతున్నాను. మతమే ఆయుధంగా భారతదేశాన్ని నా చేతుల్లోకి తీసుకోబోతున్నాను. నేనే డిక్టేటరుని! నేనే మతాధిపతిని!! నేనే రాజ్యాధినేతని!!!" అతడి నవ్వుకి ఆ దీవి కదిలిపోయింది. ఎంతో కిరాతకుడయిన రామోన్ హర్సాసే ఆ స్వామి నవ్వుని చూసి క్షణకాలం కంపించిపోయాడు. అనంతానంతస్వామి ఫిలిప్పీన్స్ లో పుట్టనందుకు భగవంతుని క్కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతడి ఆలోచన్లను చెదురుస్తూ స్వామి అడిగాడు. "నాతోపాటు పదిరోజులు ఆహ్లాదకరమైన పర్యటన జరపటానికి వస్తావా రామోన్?"
"ఎక్కడికి?"
"భారతదేశానికి, నీకో అద్భుతం చూపిస్తాను."
"ఏమిటి స్వామీ?"
"నాలుగు స్తంభాలమీద నిలబడిన భవంతి నాది. అందులో ఒక స్తంభం నాకు కుడి భుజమయిన ఒక రాజకీయ నాయకుడు. రాముడికి చందమామమీద ఆశ కలిగినట్టు ఆ నాయకుడికి చిన్న ఆశ కలిగింది. దేశపు అతి సౌభాగ్యవంతమైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని. పాపం నాతో ఇన్నాళ్ళు పనిచేసిన నా అనుచరుడు కోర్కెని తీర్చటం నా ధర్మం కదా! పదిరోజుల్లో దాన్ని సాధించబోతున్నాను. పునాది వేశాను. పై కప్పే మిగిలి వున్నది. వస్తే చూపిస్తాను".
"ఎలా స్వామీ?"
"నా దేశ ప్రజలకి సెంటిమెంట్లు ఎక్కువ. వారు నీతిపరులు. దయార్ద్ర హృదయులు. వారి ఈ గుణాల్నే ఉపయోగించుకోబోతున్నాను. చూద్దూగాని రా! ఏ రాష్ట్రంలో ఇప్పటివరకూ ప్రతిపక్షం నుంచి ఏ గొడవలూ లేవో - ఏ రాష్ట్రపు ముఖ్యమంత్రి తన ప్రాణం కన్నా ఎక్కువగా తన రాష్ట్రాన్ని ప్రేమిస్తాడో అటువంటి ముఖ్యమంత్రిని పది రోజులలో పదవి నుంచి దింపి, నా సహచరుడు కోరక కోరక కోరిన చిన్న కోర్కెను తీర్చబోతున్నాను. వస్తావా?"
రామోన్ హర్సాసేలో ఉత్సుకత పెరిగింది.
"వస్తాను స్వామీ!" అన్నాడు.
4
మరుసటిరోజు- పరిశ్రమల మంత్రి సూర్యారావు మీద హత్యాప్రయత్నం వార్త ప్రముఖంగా వచ్చింది. అన్ని పార్టీలవాళ్ళూ దీన్ని ఖండించారు. నికుంజ్ విహారి సంఘటనకి అంత ప్రాముఖ్యత ఎవరూ ఇవ్వలేదు. మంత్రి ప్రాణాపాయాన్నించి తప్పించుకున్నందుకు అందరూ అభినందించారు. టెర్రరిస్టు కార్యకలాపాలు విస్తరిస్తున్నందుకు విచారం వెలిబుచ్చారు.
మంత్రిమీద జరిగిన అఘాయిత్యానికి నగరంలో ఒకరోజు బంద్ జరిగింది. ఆ సాయంత్రం మంత్రి ప్రజల్నుద్దేశించి మాట్లాడారు. వారిని సమాధాన పరచటంలో అల్లర్లు కాలేదు.
పాత కక్షల కారణంగా ఈ హత్యాప్రయత్నం జరిగిందని కొందరు వాదిస్తే, మంత్రివర్గంలో అస్థిరత్వం కలిగించటానికి ఇది చర్య అని కొందరు వాదించారు. అసలు సంగతి తెలిసినవాడు అనంతానంతస్వామి ఒక్కడే.
మంత్రి ప్రాణాలు రక్షించినందుకు ఆఫీసర్స్ మధ్య చిన్న అభినందన సభ లాంటిది జరిగింది. మెయిన్ అట్రాక్షన్ ప్రవల్లిక అయింది. ఏ మాత్రం స్వజన ప్రాణనష్టం జరక్కుండా ఒక టెర్రరిస్టుని ప్రాణాలతో పట్టుకున్నందుకు ఆమెను అందరూ అభినందించారు. ముఖ్యమంత్రి ఆ ఫంక్షన్ కు స్వయంగా హాజరయ్యారు. ప్రవల్లిక డిపార్ట్ మెంట్ కీ - రాష్ట్ర ప్రభుత్వానికీ సంబంధం లేకపోయినా వచ్చి అభినందించారు.
"ఆ దొరికినవాడు ఏం చెపుతున్నాడమ్మా? ఎందుకు చేశారట ఈ హత్యా ప్రయత్నం?"
"నోరు విప్పటం లేదు సార్. కానీ రెండ్రోజుల్లో అతడ్ని నియమించిన వారెవరో చెప్పిస్తాం" ధీమాగా అంది.
"మరీ థర్డు డిగ్రీ ప్రయోగించకండి".
ఆమె ఆయన వేపు గౌరవమూ, భక్తి మిళితమైన చూపు సారించింది. నిండు సభలో మంత్రి ప్రాణాలు తీయటానికి సిద్ధపడ్డ నరరూప రాక్షసుడి మీద కూడా అత్యాచార పద్ధతులు వద్దు అంటున్న మనిషి-
.... సమావేశం ముగిసేసరికి రాత్రి తొమ్మిదయింది. కార్లు వరుసగా వున్నాయి. తన కారు దగ్గరికి వచ్చి, తలుపు తాళం తీసి, లోపల కూర్చుని స్టార్టు చేసింది. రివర్స్ లో వెనక్కి తీసి, ముందుకు సాగించింది.