Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 6

    "అన్నం అంతా పట్టి చూడాలిటే, ఓ మెతుకు చాలు" అన్నారు వెంకట్రామయ్యగారు.
    "చూడగా నాకూ వారిపై మంచి అభిప్రాయమే కలిగింది" అంది జానకి.
    ఏ అభిప్రాయం చెప్పింది వాసంతి మాత్రమే.
    "అబ్బాయి కూడా వచ్చి చూసివెడితే..." ఆదిలక్ష్మమ్మ మాట పూర్తిచేయనేలేదు వాసంతి అందుకుంది. "నాకు కుదరదు. ఏమిటి వాళ్ళ గొప్ప! ఫ్రెండ్ అమెరికా వెళుతున్నారుట అబ్బాయి అందుకని రాలేదంటారా? మీ మాట ప్రకారము ఒకసారికి వప్పుకున్నాను. అంతే అతగాడొస్తే చెప్పేసేయండి. మా అమ్మాయి యింట్లోలేదు. అమ్మాయి ఫ్రెండ్ ఫారెన్ వెళుతుంటే వాళ్ళింటి కెళ్ళిందని, చెల్లుకి చెల్లు."
    "ఏమిటి చెల్లుకి చెల్లు. యిబ్బందులనేవి ఎవరికైనా వస్తాయి. వాళ్ళ మర్యాదచూడు. పెళ్లివారంటే తినిపోయే వారన్నావు వాళ్లు తిన్నది తక్కువ. నీకు యిచ్చిపోయిందే ఎక్కువ. అబ్బాయి నీకు నచ్చక మేము పెళ్ళికి బలవంతం చేస్తే నీవు గోలచేసినా అర్ధం వుంది. పెళ్లిచూపులకి యింతగోలా? నీకొచ్చింది యిదే మొదటి సంబంధం. ఒక్కో ఆడపిల్లకి పాతిక సంబంధాలొచ్చినా కుదరవు. వాళ్ళకి నువ్వు నచ్చావుకూడాను."
    "నాకేం కాలొంకరా, కన్నొంకరా?" అంది వాసంతి.
    "అన్ని బాగానే వున్నాయి. కాస్త వంకరబుద్ధి తప్ప. అంది ఆదిలక్ష్మమ్మ.
    "విన్నారా నాన్నగారూ! అమ్మేమంటున్నదో!"
    "వింటున్నాను. వింటున్నాను. కాని ఓ చిక్కొచ్చింది వాసూ!"
    "ఏమిటి నాన్నగారూ?"
    "మనం మాటతప్పకూడదు వాసూ! అప్పుడు అమ్మ కాదుకదా ఆ దేవుడుకూడా మనకి వంక పెట్టడు."
    "మాట తప్పటం ఏమిటి?"
    "పెళ్లిచూపులనేవి అబ్బాయి అమ్మాయి  చూసుకునేవి. అబ్బాయి రాలేదు కాబట్టి పెళ్ళిచూపుల తతంగం కానట్లే. కాబట్టి...అబ్బాయి చూడటం అయిన తరువాత గాని ఈ కార్యక్రమం అయినట్లు కాదు. అదీ అయిన తరువాత నీ యిష్టం. అప్పుడు మీ అమ్మ నీ గురించి వంకరగా మాట్లాడుతే నేవూరుకోను." ముందరి కాళ్ళకి బంధంవేసే విధంగా అన్నారు వెంకట్రామయ్యగారు.
    "పెళ్ళి విషయం వచ్చేటప్పటికి మీరంతా ఒకటి. మీ యిష్ట మొచ్చినట్లే కానీండి. మీ దృష్టిలో నేనో మనిషిని కాదు. నాకో మనసూలేదు." అని వాసంతి లోపలికెళ్లిపోయింది. లోలోపల "అతన్ని రాని ముప్పుతిప్పలుపెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను, నా యిష్టమొచ్చినట్లు వుంటాను. నా యిష్టమొచ్చినట్లు మాట్లాడుతాను" అనుకుంది కోపాన్ని దిగమింగుకుని.
    "వాసూకింకా చిన్నతనం వదల్లేదు" అనుకున్నారు వెంకట్రామయ్యగారు. ఇదే మాట ఆదిలక్ష్మమ్మ అనుకుంది, జానకి అనుకుంది.
                                         5
    శ్యామ్ సుందర్ మరోగంట తర్వాత పెళ్ళిచూపుల నిమిత్తం రాబోతున్నాడు. శ్యామ్ తో ఎవరూ రావటంలేదు, తను ఒంటరిగానే వస్తున్నట్లు ముందే కబురు పంపాడు.
    ఆదిలక్ష్మమ్మ పెళ్లిలో పనిపాటలతో ఎంత హైరాను పడతారో అంత హైరాను పడుతున్నది. "వచ్చేది అబ్బాయి ఒక్కడే. నీ కంగారు చూస్తుంటే ఏ పదిమంది తరలివస్తున్నారో పటాటోపంతో అనిపిస్తుంది." అంటూ నవ్వేశారు వెంకట్రామయ్యగారు.
    "మీకంతా ఎగతాళీ, వేళాకోళం. పెళ్లి చూపులంతే సినిమాకి పరుగెత్తినట్లా!" అంది ఆదిలక్ష్మమ్మ.
    రాధాకృష్ణమూర్తి జానకి పిల్లలు ఈపూట యిక్కడే భోజనం. డ్యూటీకూడా లేదేమో ఉదయమే అక్కగారింటికి వచ్చాడు. వచ్చినప్పటినుంచి చూస్తూనే వున్నాడు. అక్కగారి హైరాను. నువ్వు జాలి ఏకకాలంలో కలుగుతున్నాయి. అటు వాసంతి చూడబోతే చిరుబురు లాడుతున్నది. ఇటు అక్కగారి సంగతి యిలా వున్నది, అమాయకంతో కూడిన అతి సంతోషం. "బావగారూ! మా అక్కనేమీ అనటానికి వీలులేదు. అక్క పెళ్ళప్పుడు నాకు నిండా పన్నెండేళ్లు లేకపోయినా మీరు మీవాళ్ళు అక్కని చూడడానికి కనీసం డజనుమంది చొప్పున రెండు డజన్లుసార్లు వచ్చారు. మేమేమన్నా అనుకున్నామా!" అక్క తరపున చేరి అన్నాడు రాధాకృష్ణ.
    "బాగా గుర్తు చేశావురా కృష్ణా! ఈయనగారే నన్ను చూడటానికి నాలుగుసార్లు వచ్చారు. మా అమ్మ ఓసారి చేసిన పిండివంట మరోసారి చేయకుండా..."
    "సరేవోయ్? తాళి కట్టిం తర్వాత ఈ అందం వుంటుందో వుండదో అని తనివితీరా నాలుగుసార్లు వచ్చి చూశాను తప్పా?" వెంకట్రామయ్యగారు లేని మీసాలు సవరించుకుంటూ అన్నారు.
    ఆదిలక్ష్మమ్మ భర్త మాటవిని సిగ్గుపడింది. "సరేలెండి" అంటూ ఏదో పనున్నట్లు లోపలికి వెళ్లిపోయింది.
    "మీసాలు లేకపోయినా చెయ్యి మూతిమీదకే పోతుంది. బావగారికి పూర్వాశ్రమంలో అక్కడేమయినా వుండేవా ఏమిటి అన్నాడు రాధాకృష్ణ.
    "సరేలేవోయ్?" అన్నారు వెంకట్రామయ్యగారు సంతోషం దాచుకుంటూ. ఇల్లంతా సందడిగా వుంటే ఆయనకెంతో ఆనందంగా వుంది.
    "మీరేం డాక్టరండి చెపితేతప్ప తెలుసుకోలేరు" ఎద్దేవా చేసింది జానకి.
    "ఏమిటి. ఏమిటి..., నేను డాక్టరునయితే మాత్రం వ్యాధి కనుక్కోగలనుగాని, మీసాలున్నాయో గడ్డాలున్నాయో కనుక్కోగలనా?"
    అక్కడేవున్న వాసంతి అందుకుంది. "నిక్షేపంగా కనుక్కోవచ్చు.
    "ఎలా!" అన్నాడు రాధాకృష్ణ.
    "నేచెప్పగలను" అంది జానకి.
    "ఎలా!" మరోసారన్నాడు రాధాకృష్ణ.
    "ఎలాగో అలా."
    "అదేం కుదరదు. మీయిరువురు ఒకరుచెప్పింది వేరొకరు చెప్పకుండా కరెక్ట్ గా ఆ మీసాల సంగతి చెప్పండి"
    "అలాగే, ఆడాళ్ళకి మీసాలుండవు మగాళ్ళకుంటాయి కాబట్టి పూర్వశ్రమమయిన మరో ఆశ్రమమయినా మగాళ్ళన్న తర్వాత మీసాలుండాల్సిందే...అంది వాసంతి.
    "మరి నీ సమాధానమేమిటోయ్?" కనుబొమలెగరేసి కళ్ళెగరేసి అర్ధాంగి జానకివైపు చూశాడు రాధాకృష్ణ.
    "ఎక్సరేతియ్యండి, భూతద్దం పెట్టి చూడండి, స్టెతస్కోపు పెట్టిచూడండి"
    "ఇంకానయం ధర్మామీటరు పెట్టి చూడమనలేదు"
    రాధాకృష్ణ మాటలకి అంతా ఘొల్లున నవ్వారు.
    వెంకట్రామయ్యగారు నవ్వాపుకుంటు "వాసుకి పెళ్ళిచూపులేమిటి, మధ్యలో నన్ను నామీసాలుపట్టుకు ఆడిస్తున్నారేమిటర్ర! నేనే దొరికానా! అన్నారు.  

 Previous Page Next Page