Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 5


    "మీ స్థితిగతులు నాకు తెలియనివి కావు అత్తా!" అన్నాడు సానుభూతిగా ఆచారి.

    "వాడిని నీ చేతిక్రిందవేసి వెడదామని తీసుకువచ్చాను. పూజలు, నోములకు కావలసిన నాలుగు మంత్రాలు నేర్పు. ఊరికే తిండి పెట్టడం ఎలాగా అని బాధపడకు నీళ్లు తోడిపెడతాడు, బజారునుండి ఏమయినా తెస్తాడు. నీకెంతో సాయంగా వుంటాడు. ఓ ఏడాది రెండేళ్లు కష్టపడి చెప్పావంటే వాడు నాకో జీవినాధారం అవుతాడు. ఈ గాడాంధ కారంలో మినుకుమినుకుమంటూ నువ్వే కనిపించావురా! ఈ ఉపకారం నువ్వు చేశావంటే చచ్చి నీ కడుపున పుడతాను!"

    "ఈ వయసుకి చదువు మొదలుపెట్టి చెప్పాలంటే కష్టమే! క్రొత్తబట్టకి రంగుపట్టినట్టుగా పాతబట్టకి పట్టదని పెద్ద బాలశిక్షలో ఎప్పుడో చదువుకొన్నాంకదా?" అన్నాడు ఆచారి.

    "మరీ అంత మొద్దబ్బాయ్ ఏం కాదు. కొంచెం శ్రమ తీసుకొని చెబతే ఫలితం ఎక్కడికీ పోదు. ఏమంటే మేం గారాబంచేసి వాడిని ఎందుకూ పనికిరాకుండా చేశాం! ఇప్పుడేముంది గారాబం చేయడానికి.  ఆ మహానుభావుడు బ్రతికున్న రోజుల్లో ఎలా తెస్తున్నాడో, ఏం తింటున్నామో ఇప్పుడు పరిస్థితులు వాడికీ అర్దమౌతున్నాయి. అందుకే నీ చేతికింద పనిచేసి  నాలుగు మంత్రాలు నేర్చుకొందామని  వచ్చాడు. వాడు పేచీపెట్టకుండా నాతో బయలుదేరి వచ్చాడనుకొంటే నువ్వు పేచీపెట్టడం బావ్యంగా లేదు."

    "వాడికి తిండిపెట్టాల్సి వస్తుందని ఇలా అంటున్నానని అనుకోవద్దత్తా! తిండి ప్రశ్న కాదిక్కడ. ఈ విధంగా నీరుణం తీర్చుకొనే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగానే వుంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదన్నారు. వాడు చెప్పింది చదువుకొని నా పేరు నిలబెడితే చాలు."

    "ఏరా, అచ్యుతం? బావ ఏమననాడో విన్నావు కదా. చెప్పింది బుద్దిగా చదువుకొని అప్పజెప్పుతానని చెప్పు" కొడుకు వీపుతట్టి అంది కనకమ్మ.

    నేలచూపులుచూస్తూ తలాడించాడు అచ్యుతం.

    "నీకు మాటలు రావేమోనని అనుకొంటాడురా బావ! చెప్పు."

    "పోనీ సత్తా! చిన్నదానికీ, పెద్దదానికి వాళ్లని విమర్శించకూడదు. వయసొచ్చిన పిల్లలు చిన్న అవమానం కూడా తట్టుకోలేరు. ఇక్కడే వుంటాటుకదా? మాట్లాడక ఎన్నాళ్లుంటాడు?"

    "నువ్వు నా రుణం తీర్చుకొంటున్నా ననుకోకు! వాడితో మనిషిని చేశావంటే నేనే నీ రుణం తీర్చుకోలేని  దాన్ని అవుతాను" కనకమ్మ  రుద్దస్వరంతో అంది.

    నాలుగురోజులుండి కొడుకును ఆ పరిసరాలకు అలవాటుచేసి వెళ్లిపోయిందావిడ.
 
    వారంరోజులు గడిచినా అచ్యుతంలో బెదురుపోలేదు. ఎవరయినా ప్రశ్నిస్తే పెదవి విప్పడు! ఎవరికేసీ కన్నెత్తి సూటిగా చూడడు!



                      *    *    *    *   


   
    ఆరోజు పెరట్లో డాబా మీదికి వెళ్లే మెట్లమీద కూర్చొని గురువుగారు చెప్పిన మంత్రం చదువుకొంటున్నాడు అచ్యుతం.

    తులసి కోటకు కొంచెం దూరంగా మల్లె పందిరికి ఆనుకొని ఏదో నవల చదువుకొంటున్నది శంకరి. అప్పుడప్పుడూ తలెత్తి అతడి అవస్థనంతా గమనిస్తూనే వుంది.

    అతడి నోట మంత్రం సరిగా తిరగడంలేదు. నోట్సులో వ్రాసుకున్న దాన్ని అతి ప్రయాసతో చదువుతున్నాను. సరిగా నోట పలక్క చిర్రెత్తినట్టుగా నెత్తిమీద బరబరా గోక్కుంటున్నాడు. హాయిగా చెట్లమీద ఎగురుతున్న సీతాకోకను ఎవరో హఠాత్తుగా  రెండువేళ్లతో బంధించి నట్టుగా అతడిక్కడ ఈ చదువు పేరుతో  గిలగిల్లాడుతున్నాడనిపించింది. "పాపం!" అనుకొంది శంకరి.

    ఇరవయ్యేళ్ళు వచ్చినా ఇంకా ముఖాన్ని పసి తనం వదల్లేదు! తెల్లగా కోమలంగా వుంటాడు! దేవుడు ఆడపిల్లగా పుట్టించబోయి, చివరి క్షణంలో మనసు మార్చుకొని మగ పిల్లాడిగా పుట్టించాడేమో అనిపిస్తుంది అతడిని చూస్తే.
 
    శంకరి లేచి దగ్గరగా వచ్చింది.

    "తప్పులు చదువుతున్నావు! నేను అనిపించనా మంత్రం?"

    "ఆడపిల్ల! అదీ ఇంచు మించుగా తన వయసున్న ఆడపిల్ల ; తనకు పాఠం చెబుతానంటుంది!" అభిమానంతో అచ్యుతం ముఖం ఎర్రగా కందిపోయింది!

    "శ్లోకాలు , మంత్రాలు  అలా తప్పు  చదవకూడదు. ఎలా పలికితే అలాగే నోటికి పడతాయి! నేను చెబుతాను! సరిగ్గా పలుకు!"

 Previous Page Next Page