Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 6


    "రాత్రికి ఆచారి బావ చెబుతాడుగా?"

    "ఏం నీకు చెప్పకూడదా?" శంకరి అతడి కళ్లలోకి సూటిగా చూసింది.

    చప్పున కళ్ళు దించుకొన్నాడు అచ్యుతం.

    "ఎక్కడైనా అభిమానపడొచ్చుగాని అది విద్య విషయంలో పనికిరాదు తెలుసా. ఇలా ఇవ్వు నోట్స్ రాత్రికి ఈ మంత్రం  నువ్వు సరిగా అప్పజెప్పావంటే అన్నయ్య చాలా సంతోషపడతాడు. చెప్పిందే చెప్పాలంటే ఆయనకీ విసుగేస్తుంది కదా? అందుకని, నేను నీకు చిన్న గురవునౌతాను, ఏం?"

    అయిష్టంగానే నోట్ బుక్ అందించాడు అచ్యుతం.

    అందులో వ్రాసింది ఒకసారి తను మౌనంగా చదువుకొని, తరువాత తన మధురమైన కంఠంతో, ప్రతి పదాన్ని ప్రస్పుటంగా పలుకుతూ మంత్రం చదివింది శంకరి. రెండు మూడుసార్లు తన  వెంట  చదివించింది.

    కొద్ది రోజులు గడిచాయి.

    ఇప్పుడు శంకరితో పాఠం చెప్పించుకోడానికి సిగ్గుపడ్డం లేదు అచ్యుతం. ఈ చిన్న గురువుగారి దగ్గర అతడి సంకోచం పూర్తిగా పోయింది.

    కాని, రోజులు గడుస్తున్నకొద్దీ అతడు పాఠం చదువుకుందుకు టైం లేకుండా జయలక్ష్మి పని పురమాయింపులు ఎక్కువయ్యాయి. స్నానాలకి. ఇంట్లోకి పట్టినన్ని నీళ్లు నూతి నుండి తోడి పోయాలి! బజారు పనులన్నీ చేయాలి. దొడ్లో ఆవుకీ, దూడకీ గడ్డి గాదం చూడాలి!  కుడితి తాపాలి! అచ్యుతం ఒక్క నిమిషం విశ్రాంతిగా కనిపించినా కన్ను కుట్టినట్టుగా వెంటనే ఏదో ఒక పని పురమాయిస్తుంది జయలక్ష్మి.

    ఆరోజు, బోజనం వేళ.

    అచ్యుతం పచ్చడి కలిపి, చెయ్యి భగ్గుమన్నట్టుగా నోటితో ఉఫ్ ఉఫ్ మని ఊదుకోసాగాడు.
 
     అతడు విలవిల్లాడినట్టుగా ముఖం పెట్టడం చూసి కంగారుగా దగ్గరికి వచ్చింది శంకరి.

    "చేతికి ఏమైంది, అచ్యుతా?"

    "వేడి అన్నంలో చెయ్యి పెడితే కాలింది!"

    "అన్నం కాలేంత వేడిగా ఏం లేదే?"

    చప్పున దగ్గరికి వచ్చి అతడి చెయ్యందుకు చూసింది శంకరి. "అరచేతిలో ముళ్ళుపోసి రాసినట్టుగా ఈ రక్తం ఏమిటి?"

    "చేంతాడు కొత్తదికాదా? గుచ్చుకొన్నట్టయ్యి....."

    ప్రక్కన ఆచారి  భోంచేస్తున్నాడు. అదేమంత జాలి పడే విషయం కాదన్నట్లుగా, "మీ అన్నయ్య వుండగా ఏం నాజూకులు పడ్డా సరిపోయిందిరా, అబ్బాయ్! ఇప్పుడెలా కుదురుతుంది? శరీరం,  మనసు మొద్దుబారితే తప్ప ఈ ప్రపంచంలో నిలదొక్కుకోలేవు! సరస్వతీ దేవి కటాక్షం నీ మీద  అంతంతగానే వుంది! ఇహ శరీర శ్రమనైనా అలవాటు చేసుకోకపోతే ఎలా?" అన్నాడు.

    ఎందుకో అతడు చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడనిపించింది శంకరికి. "వాళ్లమ్మ చూస్తే ఎంత బాధ పడుతుందో, అన్నయ్యా!"

    "వాళ్ల అమ్మా, నాన్న గారాబం చేసే చెడగొట్టారు  వాడిని! ఇంకా ఇక్కడ కూడా ఎవరు గారాబం చేస్తారు చెప్పు?"

    తనకు వచ్చిన కష్టానికి గురువుగారి కరుణ లేక పోవడంతో అచ్యుతం కళ్లలో నీటి తడి ఛెమక్ మంది! అతడు సరిగా అన్నం కలిపి తినలేక పోవడం చూసి, "స్పూన్ ఇవ్వనా?" అనడిగింది శంకరి.

    "స్పూన్  వద్దుగాని, మజ్జిగ వేయండి!"

    మజ్జిగ అన్నం నాలుగు ముద్దలు గబగబా తిని లేచి పోయాడు అచ్యుతం.

    సాయంత్రం తిరిగి బావిలో చేత వేశాడు అచ్యుతం. రెండు బారలు ఇలా లాగాడో లేదో మరో చెయ్యి వచ్చి పట్టుకొంది తాడుని. ఆ చెయ్యి అచ్యుతానికి సుపరిచితమే! తనకు అన్నం పెట్టి తన మంచి చెడ్డలు చూసే అమృతహస్తం ఇది.

    "మీరెందుకు? నేనే చేదుతాను!"

    "ఇవాళ నుంచి నీళ్లు నేను తోడుతాను! నువ్వు గుమ్మరిస్తే చాలు!"

    "వద్దండీ! నేను చేదుతాను"

    "నీ చేతులు ఇప్పటికే పుళ్లు అయ్యాయి.  నేను తోడుతాను. అసలీపని న్యాయంగా నాదే! నువ్వొచ్చాక నీ మీద పడిందిగాని."

    "ఇవాళ పుళ్ళు అయ్యాయని  పనిమానేస్తే రేపని పువ్వులవుతాయండీ! చదువురానివాడ్ని  కనీసం నాలుగిళ్ళ లోనయినా ఇలాంటి పనులు చేసేందుకు నేర్చుకోకపోతే నేనూ,  మా అమ్మా ఎలా బతుకుతాం?"

    చిన్న పిల్లాడిలా అతడు ఉక్రోషం వ్యక్తంచేస్తూంటే శంకరి నవ్వింది.

                                                          *    *    *    *   
      

 Previous Page Next Page