భూషణ్ ని పూర్తిగా చెప్పనిస్తే ఫైనాన్సర్స్ అన్న వాక్యం రంగనాధంగార్ని ఉలిక్కిపడేట్టు చేసేది.
ఆ ఫైనాన్సింగ్ కంపెనీయే తనకు అంత అప్పిచ్చిందని అది తీర్చనందుకే కోర్టు తన ఆస్తిపై జప్తువారంటు నిచ్చిందని గుర్తించేవారే.
కాని అవతలి వారు చెప్పిందంతా వినే సహనం చచ్చిపోయిందీ మధ్య.
"నను కిరీటిగారే మీ దగ్గరకు పంపారు."
"దేనికి...."
రంగనాధంగారు ప్రశ్నార్ధకంగా చూశారు.
"సుప్రీంకోర్టు మీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు, వారు రోజుల్లో మీ ఆస్తి జప్తు చేయబడే వివరాలు అన్నీ ఆయన తెలుసుకున్నారు...."
"అయితే"
రంగనాధంగారి భృకుటి విచిత్రంగా ముడిపడింది.
"అదే.... మీకు సహాయం చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని ఎటువంటి అవసరానికైనా తనను కలుసుకోవచ్చని మీకు కబురు చెప్పమన్నారు...... ఇదీ వారి ఫోన్ నంబరు వైజాగ్ లోని వారి బంగళా అడ్రసును అవసరమైతే కలియండి."
గడగడా చెప్పి "శలప్" అంటూ నమస్కారం చేసి వెళ్ళి కారులో కూర్చున్న భూషణ్ ని, చేతిలోని కార్డుని ఆశ్చర్యంతోనూ అర్ధంకానట్టుగానూ చూస్తూ చాలాసేపు ఉండిపోయారు.
ఎవరీ కిరీటి?
తనకు సహాయం చేయటానికి తనంతట తానుగా ముందుకు రావటంలోగల ఔచిత్యమేమిటి?
దీని వెనుక ఏమైనా తను గుర్తించలేని పథకం వుందా?
ప్రమాదం మరో నాలుగు రోజుల దూరంలో వుంది.
కోర్టు ఉత్తర్వును ఆపుచేయాలంటే అయిదు లక్షల రూపాయల్ని నాలుగు రోజుల వ్యవధిలో చెల్లించాలి.
అలా కాకపోతే....
భరింపశక్యం కాని పర్యవసానాన్ని ఎదుర్కోవాలి.
ఎవరైనా కానీ.....
ఆపద్ధర్మంగా ఆదుకోబోయే ఆ పెద్దమనిషిని కలిస్తే పోయిందేముంది.
3
వాల్తేరు అప్ లాండ్స్ లో సిటీకి దూరంగా సముద్రానికి అతి చేరువగా అత్యంతాధునికంగా నిర్మించబడిన పోష్ బంగళా మాలినీ నిలయం.....
కాంపౌండు వాలు మొదలుకుని బంగళావరకు పేర్లు తెలీని వివిధరకాల పూలచెట్లతోనూ పూదోటకు మధ్యగా ఆహ్లాదాన్ని కలిగించే ఫౌంటేన్ తోను బోగన్ విల్లా అల్లుకున్న పోర్టికోతోనూ అద్దాల తలుపులతో అతిరమ్యంగా కనిపించే ఆ భవంతి ఆర్కిటెక్ట్ అద్భుత మేధాశక్తికీ అది కట్టించిన వ్యక్తి కళా హృదయానికీ ప్రతీకలా వుంటుంది.
డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన రంగనాధంగారే ఆ కట్టడ నిర్మాణానికి అమితాశ్చర్యపోయారు.
వచ్చి రెండు గంటలసేపైనా కిరీటి దర్శనం దొరక్కపోవటంతో కొద్దిపాటి విసుగులాంటిది కలిగి డ్రాయింగు హాలునుండి లాన్ లోకి వచ్చి నిలబడ్డారు.
ఓ పదిహేను నిముషాల్లో పియె భూషణ్ వచ్చి డైరెక్టర్సు కాన్ఫరెన్సు ముగించుకుని కిరీటిగారు వస్తున్నారని పదకొండుపావుకు అపాయింటు మెంటిచ్చారని చెప్పేసరికి రంగనాధంగారు వాచీ చూసుకున్నారు. ఇంకా పదినిమిషాల వ్యవధి ఉందన్నమాట.
ఆలోచనల మధ్యనే అయిదు నిముషాలు గడిచింది.
భూషణ్ హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నాడు.
మరో రెండు నిముషాలలో కారుహారన్ వినిపించే సరికి బంగళా అంతటా నిశ్శబ్దం పేరుకుపోయింది.
మెయిన్ గేటు దగ్గర గూర్కా సేల్యూట్ నందుకున్న బెంజ్ రయ్యమంటూ లోపలికి దూసుకువచ్చి పోర్టికోలో ఆగింది.
తెల్లని యూనిఫారంలో నిలబడ్డ నౌకరు వంగి డోర్ తెరవగానే హుందాగా బయటకు వచ్చిన కిరీటి పరిసరాలను గమనించడానికి వ్యవధి లేనట్టుగా ఠీవిగా లోపలికి నడిచాడు.
అంతసేపటి నుండి కిరీటి వయసు మళ్ళినవాడై ఉంటాడని తలపోసిన రంగనాధంగారు గ్రేకలర్ సూట్ లో పాతిక ముప్పైఏళ్ళ మధ్య వయసులో ఉన్నట్టుగా కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు.