Previous Page Next Page 
కళ్ళు పేజి 5


    అతను లోపలకు వస్తున్నాడు. నేలమీద నుంచి పైన రూఫ్ వరకూ చిందర వందరగా సాగివున్న వాసాల మధ్యనుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కసారి మనిషి జొరబడటానికి కష్టంగా వుంటే అడ్డులను తొలగించుకుంటూ, దారిచేసుకుంటూ ముందుకు జరుగుతున్నాడు. ఆమె కళ్ళప్పగించి చూస్తోన్నది. అప్పుడో సంఘటన జరిగింది. అడ్డును ఛేదించటానికి అటూ ఇటూ కదిలించటంతో పైన పరంజా వూగి, పెద్ద చప్పుడుతో ఇటుక ముక్కలూ, రబ్బిష్, మట్టికలసివున్న పదార్థమంతా పది పదిహేను అడుగుల మేరా క్రిందకు కూలిపోయింది. వాసాలు కూడా కొన్ని కూలిపోతూ నిలబడివున్న అతనిమీద రబ్బిష్ వగైరాలతోబాటు దబదబమని పడిపోవటం స్పష్టంగా చూసింది. తర్వాత తల వెనక్కి త్రిప్పేసుకుంది.

 

    ఒక్క నిమిషం... అంత బరువు మీదపడ్డాక అతనికి తప్పకుండా డేమేజ్ జరిగి వుంటుంది. బహుశా క్రిందపడిపోయి కదల్లేనిస్థితిలో వుండి వుండవచ్చు. శ్లాబ్ అంటే ఎంత కట్టుదిట్టంగా అన్నీ పేరుస్తారో తనకి తెలుసు. తప్పించుకోవాలంటే ఇదే సమయం. ఆమె ఆలశ్యం చెయ్యకుండా ప్రక్కకి జరిగి, మరో దారిగుండా బయటపడటానికి ఎటువైపు సాధ్యమవుతుందో చూసుకుని వాసాలను తప్పించుకుంటూ కదుల్తోంది. అడుగు అడుగునా తరుగుతోంది. దాదాపు బయటకు వచ్చేసింది.

 

    ఇంకో రెండు మూడు గజాలు, తర్వాత బయటపడిపోతుంది.

 

    భుజంమీద ఏదో వ్రాలినట్లు తృళ్ళిపడి తల వెనక్కి త్రిప్పింది.

 

    అతను వెనకనే నిలబడి వున్నాడు. అతని చెయ్యి తన భుజంమీద వుంది.

 

    ఏదో అందామని పెదవి కదపబోయింది. అంతలోనే కళ్ళుమూతలు పడిపోయాయి.


                                      2


    పద్మ నేత్రాలయ.

 

    దేశంలోని అత్యున్నతమైన నేత్ర వైద్యశాలల్లో అది ఒకటి.

 

    అక్కడ ట్రీట్ మెంట్ కోసం దేశంలోని ఇతరరాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా పేషెంట్స్ వస్తూ వుంటారు. పద్మ నేత్రాలయ ఎంతగా ప్రసిద్ధి పొందిందీ అంటే అక్కడ ట్రీట్ మెంట్ కావాలంటే కనీసం మూడు నాలుగు నెలలు ముందుగా ఎపాయింట్ మెంట్ తీసుకోవాలి. అందులో హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణచైతన్యతో ఎగ్జామిన్ చేయించుకోవాలన్నా ఆయన దగ్గర ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఇంకా ఎక్కువకాలం నిరీక్షించాల్సి వచ్చేది.

 

    అలా అని డాక్టర్ కృష్ణచైతన్య అహంభావి కాదు. మనిషి చాలా సౌమ్యుడు కూడా. కాని పేషెంట్స్ రద్దీవల్లా, పెద్దపెద్ద వారి దగ్గర్నుంచి వచ్చే రికమెండేషన్ల వల్లా పని ఒత్తిడి తట్టుకోలేకుండా వున్నాడు. చిన్న చిన్న కేసులన్నీ అసిస్టెంట్స్ కి అప్పజెప్పేవాడు. జటిలమైన కేసులు, ముఖ్యంగా రెటీనాకి సంబంధించిన కేసులూ అతను చేపడుతూ ఉండేవాడు. ముఖ్యంగా రెటీనాల్ డిటాచ్ మెంట్స్ సరిచెయ్యటంలో అతను చాలా ప్రసిద్ధి పొందాడు.

 

    దేశంలో నానాటికీ పెరుగుతూన్న అంధత్వాన్ని గురించి అతడు చాలా వ్యధ చెందుతూ వుండేవాడు. నలభయి ఏళ్ళు దాటాక చాలామందికి కేటరాక్ట్ వస్తూ వుండడం, ఎంతో ఉత్సాహంతో, తాపత్రయంతో దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనేవారికి చూపు మందగించటంచేత వారి పనిపాటులకు ఘోరంగా అడ్డు తగులుతూ వుండటం అతనికి తీరని మనస్తాపం కలిగిస్తూ ఉండేది.

 

    రిటైర్ అయినవారికి మామూలు కేటరాక్ట్ ఆపరేషన్- అంటే లెన్స్ తొలగించేసి, బయట కళ్ళద్దాలు అమర్చటం ద్వారా చూడగలిగేటట్లు చేయటం ఫరవాలేదు. కాని యాక్టివ్ లైఫ్ లీడ్ చేసేవారికి అంటే డాక్టర్లకు, ఇంజనీర్లకు, చాలా బిజీగా వుండే ఉద్యోగస్థులకు, డ్రైవర్లకు, రైల్వే డ్రైవర్లకు, విమానాలు నడిపే పైలట్లకు ఆ చూపు సరిపోదు. అతను తిరిగి మామూలు మనిషిలా చూడగలగాలంటే తీసేసిన స్థానంలో మళ్ళీ లెన్స్ ఇన్ ప్లాన్ టేషన్ చెయ్యాలి. దీన్ని ఐ.ఓ.ఎల్. ఇన్ ట్రా ఆక్యులర్ లెన్స్ ఇన్ ప్లాన్ టేషన్ అంటారు.

 

    ఈ పద్ధతి వల్ల నూటికి నూరుపాళ్ళు కాకపోయినా నూటికి తొంభయిపాళ్ళు చూపు నిశితంగా వచ్చే అవకాశముంది. కాని మళ్ళీ ఇందులో రెండు టెక్నిక్ లున్నాయి. లెన్స్ ని యాంటీరియర్ ఛాంబర్ లో అమర్చటం, లేకపోతే పౌస్టీరియర్ ఛాంబర్ లో అమర్చటం. రెండిట్లో పోస్టీరియర్ ఛాంబర్ పద్ధతే ఉత్తమమైనది. కాని ఆపరేషన్ చేసే టెక్నిక్ చాలా క్లిష్టతరమైనది. ఏ మాత్రం పొరపాటు వచ్చినా మొత్తం చూపుపోయే ప్రమాదముంది.

 

    పోస్టీరియార్ ఛాంబర్ లో ఆపరేషన్ సక్రమంగా చెయ్యటం స్పెషలిస్టుళు పూర్తిగా సాధించలేకపోతున్నారు. యాంటీరియర్ ఛాంబర్ ఆపరేషన్ వల్ల పేషెంట్ లైట్లు చూసేటప్పుడు వాటిచుట్టూ విష్ణుచక్రాల్లాగానో, త్రికోణాల్లాగానో కిరణాలు కనిపించినా, ముఖ్యంగా రంగురంగుల దీపాలు చూసేటప్పుడు అవి సైజుకి మించి గీతలు గీతలుగా మిరుమిట్లు గొల్పుతూ కనిపించినా- దైనందిన జీవితంలో రాయటం, చదవటం ఇవన్నీ చాలా చక్కగా వుంటాయి- ఆపరేషన్ రిస్క్ అట్టే వుండదు.

 

    ఏదయినా పేషెంట్ కు న్యాయం జరగాలి. దీన్ని గురించి డాక్టర్ కృష్ణచైతన్య సెన్సిటివ్ గా ఆలోచిస్తూ మధనపడుతూ ఉంటాడు.

 

    ఉదయం తొమ్మిది గంటలవేళ పద్మనేత్రాలయ ఔట్ పేషెంట్సు రద్దీతో చాలా బిజీగా ఉంది.

 

    డాక్టర్ కృష్ణచైతన్యే కాకుండా అందులో చాలామంది సీనియర్ డాక్టర్స్ వున్నారు. అసిస్టెంట్సు కూడా ఎంతోమంది వున్నారు.

 

    డాక్టర్ వసంత్ కుమార్ అక్కడ చేరి ఆరునెలలయింది. ఆఫ్ థల్ మాలజీలో ఎం.ఎస్. చెయ్యగానే ఎకాయెకీ ఇక్కడకు వచ్చి చేరాడు. మనిషి స్ఫూరద్రూపి. ఎత్తుగా, బలంగా వుంటాడు. వైద్య విషయంలో చాలా ఆసక్తి. శ్రద్ధవున్న మనిషి. ఇంకా ఇంకా నేర్చుకోవాలన్న కుతూహలముంది.

 

    వసంతకుమార్ దగ్గరకు ఓ పేషెంటు వచ్చాడు. నలభయి అయిదుకు పైగా వయసుంటుంది. అంతకు మూడు నెలలకు ముందుగా ఎపాయింట్ మెంట్ తీసుకున్నాడు. రెండు మూడు రోజులుగా వరుసగా వస్తున్నాడు.

 

    అతనికి ఏడెనిమిది నెలలుగా చూపు సరిగ్గా కనబడటం లేదు. పేపర్ గాని, మరి ఏ ఇతర పుస్తకంగాని చదువుతూంటే అక్షరాలు అలికేసినట్లుగా వుంటున్నాయి. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తోన్న వాహనం తాలూకు లైట్లు కళ్ళలో పడితే, 'ప్యూపుల్' పూర్తిగా కన్ స్ట్రిక్ట్ అయిపోయినట్లుగా అయి, కళ్ళసలు కనబడక అవతలివాహనం దాటిపోయే దాకా తప్పనిసరిగా బ్రేక్ వేసుకుని ఆగిపోవాల్సి వస్తోంది. ఇక్కడకు రాకముందు అయిదారుగురు డాక్టర్సును కన్ సల్ట్ చేశాడు. వాళ్ళు థరోగా, ఎగ్జామిన్ చేసికూడా కేసు సరిగా డయాగ్నైజ్ చెయ్యలేదు. ఒకరు విటమిన్ డెఫీషియన్సీ అని విటమిన్స్ వాడించారు. ఇంకొకరు రెటీనాకు సంబంధించిన హెమరేజ్ అన్నారు. మరొకరు అసలు డిసీజేమీ లేదు, సైకలాజికల్ ఫియరన్నారు.

 Previous Page Next Page