Read more!
 Previous Page Next Page 
కళ్ళు పేజి 4


    ఆమె అలా చెయ్యటానికి ఒకటి రెండు క్షణాలు వ్యవధి తీసుకుని ఉంటే బహుశా ఆమెకి సహాయం లభించే ఉండేది. ఎందుకంటే ఇంకో సందులోంచి మలుపు తిరిగి రోడ్డుమీదకి ఓ ఫియట్ కారు వచ్చింది. ఆ కారును ఆమె తండ్రి జగన్మోహనరావు డ్రైవ్ చేస్తున్నాడు.

 

    అతను త్రాగిన మైకంలో ఉండి ఉండవచ్చు. అంతవరకూ పేకాడి వచ్చిన అలసటతో వుండి ఉండవచ్చు. కాని రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుకు వస్తున్న కూతుర్ని తప్పకుండా గుర్తుపట్టి, కారాపు చేసి ఉండేవాడు.

 

    జగన్మోహనరావు యావరేజ్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నాడు. అంతకుముందు ఓ యువతీ ప్రక్క సందులోకి మళ్ళటం అతను చూసే అవకాశం లేదు. రోడ్డుమీద ఓ ఆజానుబాహుడైన యువకుడు పరిగెత్తుకు రావటం గోచరించింది. అతను దాన్ని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. కొంతదూరం పోయాక దార్లో అడ్డదిడ్డంగా ఆగివున్న మారుతీ కారు కనిపించింది. కనీసం యథాలాపంగానయినా ఆ కారు నంబరు గమనించి ఉంటే పరిస్థితి వేరు విధంగా ఉండి ఉండేది.

 

    "ఎవరో! కేర్ లెస్ గా ఒదిలి వెళ్ళారు" అని విసుక్కుంటూ తన కారుని బాగా లెఫ్ట్ చేసుకొని, ఆగివున్న కారుకి తగలకుండా మార్జిన్ తీసుకుని ముందుకు వెళ్ళాడు.

 

    'మందాకిని ఎంతో ముచ్చటపడితే మారుతీ కారు కొనిచ్చాను.'

 

    ఆమె గురించిన ఊహ మనసుని సోకింది. కారు ముందుకు సాగిపోతోంది.

 

    మందాకిని ఆ సందులోకి మళ్ళాక ఇంకో పొరపాటు చేశానని తెలుసుకుంది. నిర్మానుష్యంగా వుండటమే కాకుండా, బాగా చీకటిగా కూడా వుంది.

 

    చాలాదూరం పరిగెత్తడం వల్ల ఆమెకు విపరీతమైన వగర్పుగా వుంది. అంతవర్షంలో, చలిలోకూడా నాలిక పొడారిపోతూ ఉంది.

 

    ఆ సందు, అక్కడి వాతావరణం చూశాక ఆమెలో భయంమరీ ఎక్కువై పోయింది. ఇహ భరించడం దుస్సహమనిపించింది. ఒక ప్రక్క నుంచి దుఃఖం ముంచుకొస్తుంది.

 

    ఈ సందు ఎంత దూరం పోతుందో తెలీదు. ఎటు కలుస్తుందో తెలీదు. ఏ ఇంట్లోకైనా పోదామా అంటే, దాదాపు అన్నీ ఇనుపగేట్లతో ముయ్యబడి వున్నాయి. వానపడుతూ వుండటం వల్ల అందరూ తలుపులు బిడాయించుకుని పడుకున్నారు.

 

    ఎడమవైపున ఓ ఇల్లు కనిపించింది. ఆ ఇంటికి ప్రహరీగోడ లేకుండా, సింహద్వారం రోడ్డుమీదకుంది. మందాకిని ముందూ వెనకా ఆలోచించకుండా రెండడుగుల్లో దాన్ని చేరుకుని, తలుపులు దబదబ బాదింది.

 

    లోపల్నుంచి ఎటువంటి జవాబూ లేదు.

 

    ఆమె అణువణువూ ఉద్వేగంతో, భాయోత్సాహంతో వొణుకుతోంది. శక్తినంతా కూడదీసుకుని తలుపుల్ని వరుసగా బాదుతూ, "ప్లేజ౧ తలుపులు తియ్యండి. చాలా ప్రమాదంలో వున్నాను" అంది హీనస్వరంతో.

 

    లోపల ఓ స్త్రీ పురుషుడు పూర్తిగా ఒకరిలో ఒకరు ఇమిడి ఉన్నారు. బహుశా భార్యాభర్తలే అయివుండవచ్చును.

 

    "అర్థరాత్రిపూట మనమీ స్థితిలో ఉండగా ఏమిటీ తలుపు తట్టడం?" అతను విసుక్కుంటూ అన్నాడు.

 

    "మనమీస్థితిలో వున్నట్లు వాళ్ళకు తెలియొద్దూ?" ఆమె నవ్వింది.

 

    అతనామెనుంచి విడివడటానికి ప్రయత్నించబోయాడు.

 

    "ఉహు" అంది చేతుల్ని అతని చుట్టూ గట్టిగా బిగిస్తూ.

 

    "ఎవరో చూసి వస్తాను."

 

    "ఇలాంటి సమయంలో ఎందుకు రావాలి? చావనీ" అతన్ని మళ్ళీ మాట్లాడనివ్వకుండా చేసింది.

 

    తలుపులు తడుతున్న మందాకిని చేతుల్లో శక్తి నశిస్తోంది. భయంతో విచలితురాలవుతూ, తలత్రిప్పి చూసి కొయ్యబారిపోయింది.

 

    ఆ చీకట్లో సందులోకి మళ్ళుతూ నీడలా ఓ ఆకారం కనిపించింది.

 

    ఒక్కక్షణం...

 

    బ్రతకాలన్న ఆశ తిరిగి తేరుకునేటట్లు చేసింది. ఆ ఇంటి వాళ్ళు తలుపులు తీస్తారన్న నమ్మకం లేదు. తనని వెంటాడుతున్న మనిషి ఎంతయినా తెగించి వున్నట్లున్నాడు. ఇంకో నిముషంలో తనని సులభంగా చేరుకుంటాడు.

 

    ఆమె అక్కడ్నుంచి కదిలి మెరుపులా ముందుకు పోయింది. ఆ వ్యక్తి గమనాన్నిబట్టి అతను పరిగెత్తుతున్నట్లు లేదు. వడివడిగా నడుస్తున్నట్లుంది. బహుశా చీకటిగా ఉండటం దానికి కారణం కావచ్చు. తాను సరిగ్గా ఏ ప్రదేశంలో వున్నదో అతనికి కనిపిస్తూ వుండకపోవచ్చు. ఈ స్థితిలో తానుకూడా పరిగెత్తటం తన ఉనికిని పట్టివ్వటమే అవుతుంది. ఆమె వడివడిగా నడుస్తూ ముందుకు సాగిపోతోంది.

 

    తన వెనక్కి త్రిప్పి చూడాలంటే భయంగా వుంది. అతనో రాక్షసుడిలా వెంటాడుతున్నాడు. ఈ సందుదాటి అవతలి వీథిలోకి వెళ్ళగలిగితే అక్కడెవరయినా మనుషులు తారసపడి సహాయం లభించవచ్చు. కాని ఈలోగా...

 

    ఆమె నడుస్తూనే ధైర్యం తెచ్చుకుని తల వెనక్కి త్రిప్పి చూసింది. అతను చాలా దగ్గర్లో ఉన్నట్లనిపించింది. ఒళ్లంతా గగుర్పొడిచింది. ఈ సందు ఎంత పొడుగుందో తెలియటంలేదు. ఎక్కడయినా రక్షణ దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూసింది. చీకటికి అలవాటు పడటంవల్ల ఆమె కళ్ళు నిశితంగా చూడగలుగుతున్నాయి. ఒక ప్రక్క కొత్తగా కడుతోన్న ఇల్లొకటి కనిపించింది. అంతకుముందు కొన్నిరోజుల క్రితమే శ్లాబ్ పోసినట్లున్నారు, ఇంకా విప్పలేదు. క్రింద పిల్లర్లూ, ఎక్కడికక్కడ కట్టబడిన వెదురు వాసాలూ, చిందరవందరగా వుంది. గత్యంతరం లేక అందులోకి చొరపడింది.

 

    కొత్తగా కనబడుతోన్న ఇల్లంటే అక్కడ వాచ్ మేన్ ఉండి వుండాలి. తనకు అదృష్టముండి అలాంటి మనిషి తారసపడితే? ఆమె ఆతృతగా అటూఇటూ చూసింది. ఎక్కడా మనిషి వున్న సూచన కానరావటంలేదు. ఎక్కడికక్కడ వెదురు వాసాలు అడ్డు వస్తూ ముందుకు నడవటం కష్టంగా ఉంది.

 

    అలా ఓంకార టింకరగా నడుస్తూనే మధ్యలో తలవెనక్కి త్రిప్పి చూసింది. ఇంటి మొదట్లో ఆ ఆకారం ఓ నిముషం తచ్చాడి తర్వాత లోపలకు జొరబడుతూ వుండటం కనిపించింది. ఆమె పాదాలు చచ్చు పడినట్లయిపోయాయి. ఆ చీకట్లో అతను నరరూప రాక్షసుడిలా గోచరిస్తున్నాడు. ఈ శ్లాబ్ క్రిందికి దూరటంవల్ల తాను మళ్ళీ ఇంకో పొరపాటు చేసిందా? ఆమె నిలద్రొక్కుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. కాళ్ళు కదలటానికి నిరాకరిస్తున్నాయి. ఎలాగో శక్తినంతా కూడదీసుకుని పిల్లర్ చాటునుంచి తొంగిచూసింది.

 Previous Page Next Page