Previous Page Next Page 
గోరింటాకు పేజి 5


    ఇవన్నీ వరుసగా చెప్పుకుపోతున్నాడు. చక్రపాణి ముగ్ధుడై ఆలకిస్తున్నాడు. రాజారావు ఎంత గొప్పవాడు అనిపించింది. ఒకసారి చీకట్లో స్నేహితుడి ముఖం వంక గర్వంగా చూడటానికి ప్రయత్నించాడు.

 

    "మరి ఇన్ని గాథలున్నాయి కదా నీలో! అవి అనుక్షణం తలపుకు వచ్చి వేధించవా?"

 

    "తలపుకురావు. ఎప్పుడోగాని... ఇహ పోదాం పద."

 

    తిరిగి దారిలో చక్రపాణి అడిగాడు "నువ్వు మోసపోవటమంటూ ఎప్పుడయినా జరిగిందా?"

 

    "ఎందుకు జరుగదూ? ఈ మధ్య జరిగిన ఒక విషాదకరమైన సంఘటన విను, ఈ ఏడాది కాలేజీ చివరిరోజుల్లో బుర్రకథ చెప్పడానికి వచ్చిందే ఉషారాణి - ఆమె వాళ్ళ ఒక పెద్దగాయం తగిలింది."

 

    "ఏమిటీ! నాకెప్పుడూ చెప్పలేదే?" అన్నాడు చక్రపాణి విస్మయంగా.

 

    "సమయం రాక. ఆనాడు బుర్రకథ చెప్పినప్పుడు కొంచెం పరిచయం కలిగిందా, దార్లో రెండు మూడుసార్లు కలిసినప్పుడు పలకరించాను. బాగానే జవాబులు చెప్పింది. ఒకసారి సినిమాలో తనూ, తన అక్కా (స్వంత అక్క కాదులే) కనిపించారు. కళాసేవ ఎలావున్నదని ప్రశ్నించాను. వెళ్ళేటప్పుడు ముగ్గురం ఒక బండిలోనే వెళ్ళాం. వాళ్ళ ఇంటివరకూ పోయి దిగబెట్టి వచ్చాను. నవ్వుతూ మాట్లాడింది.

 

    కాని ఒకరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అక్క ఉగ్రస్వరూపంతో కూర్చునివుంది. నన్ను కూర్చోమని ఇహ ప్రారంభించింది. చూసుకో, "మేమెవరనుకున్నావ్?" అంది. "ఇలాంటి పైలాపచ్చీసుగాళ్ళని చాలామందిని చూశానంది. ఈ మొగాళ్ళంతా ఇంతే. కాస్త మాట్లాడితే నెత్తికెక్కడానికి ప్రయత్నిస్తారంది." ఉషారాణి అక్కడనే కిటికీ దగ్గర నిల్చుని వుంది. ఆమె భయపడుతూ "ఊరుకో అక్కా! ఆయన అలాంటివారు కారు" అంది. కాని ఈ దెయ్యం వినిపించుకుంటేనా? తిట్లుకూడా ప్రారంభించింది. నాకు కోపం వచ్చి నేనూ ఏదో అరిచాను. ఆమె అమాంతం రెచ్చిపోయి లోపల్నుంచి ఎవర్నో నలుగుర్ని పిలిచింది. నేను నిల్చుని "అక్కరలేదు, గుడ్ బై" అని చెప్పి వచ్చేశాను.

 

    కథంతా చాలా తేలిగ్గా యథాతథంగా చెప్పినట్లు చెప్పాడు రాజారావు.

 

    చక్రపాణి నిట్టూర్చి, "అబ్బా! నీకు భయం వేయలేదా?" అన్నాడు.

 

    "భయం ఎందుకు? అది వాళ్ళఇల్లు. కొట్టిస్తుంది. గెంటిస్తుంది. అంతేగా."

 

    చక్రపాణికి రాజారావంటే ఎక్కడలేని ఆప్యాయత, సానుభూతీ కలిగాయి. ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు అతను? ఎంత నిశ్చింతగా వున్నాడు? ఆ పరిస్థితులలో తనువుంటే...? అని ఊహించుకున్నాడు. సంవత్సరాలతరబడి నిద్రపోయేవాడా?

 

    ఒక్కసారి స్నేహితులందర్నీ స్మరించుకున్నాడు. రాజారావు ఒక్కడేకాదు స్నేహితుడు. రకరకాలవాళ్ళు వున్నారు. అతనికి భవిష్యత్ అంటే భయం వేసింది. కాలం గడిచినకొద్దీ వీళ్ళందరి జీవితాలూ ఎలా తయారవుతాయో! ఎక్కడ కలుసుకున్నవాళ్ళు ఎక్కడ విడిపోయి స్వంత జీవితాలు ఎంతగా సాగిస్తారో!

 

                                             * * *

 

    ఇంటర్మీడియెట్ రిజల్ట్సు తెలిశాయి. చక్రపాణి పాస్ అవుతాడని వాళ్ళ ఇంట్లో ఎవరూ అనుకోలేదు. కాని తప్పింది వాళ్ళు. రాజారావుతో పాటు అతనూ పాసయి కూర్చున్నాడు.

 

    ఇహ అతని తండ్రి ఆలోచించాడు. కొడుక్కి తర్వాత ఏం చదువు చెప్పిద్దామా అని.

 

    ఆయన ఎక్కువ చదువుకున్న వ్యక్తికాదు. కాని ప్రపంచజ్ఞానంలో వ్యవహారంలో అతిసునిశితంగా వర్తించగల ప్రజ్ఞాశాలి. అతిపేదరికం నుంచి అష్టకష్టాలూపడి, జీవితంలో జూదమాడి,వ్యాపారంలోకి ఎగబడి, పైకివచ్చిన కష్టజీవి. కొడుకు అతి సున్నితమనస్కుడు కావటం తెలుసు. అందుచేత అతన్ని వ్యాపారంలోకి దించటం ఇష్టంలేదు. కాని ఇతను శ్రద్ధగా చదువుకుంటాడా అంటే ఆ నమ్మకమూ లేదు. అందుకని ఇంటిలో వాళ్ళంతా చుట్టూ వుండగా ఒక రాత్రి ఈ విషయం ముచ్చటించారు.

 

    భోజనాలయాక ఈజీఛైరులో కూలబడి "ఇహ ఏం చేస్తావురా?" అనడిగాడు తండ్రి.

 

    చక్రపాణి గోడకు ఆనుకొని నిలబడ్డాడు. తలయెత్తి "పాలిటిక్స్ చదువుతాను" అన్నాడు.

 

    "ఎందుచేత?"

 

    ఎందుచేతో అతనికి తెలియదు. పాలిటిక్స్ అంటే పెద్దశ్రద్ధలేదు. కాని కారణం లేకుండానే మరి అదే చదవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. తను ఎప్పుడూ అంతే. ఒక వ్యవహారం జరగకముందు దాని బాగోగుల గురించి తర్జన భర్జనలు చేయటం చేతకాదు. గడిచిపోయాక ఫలితంలోని సుఖమో, దుఃఖమో మౌనంగా అనుభవించటమే అలవాటు.

 

    "ఊరికినే చదవాలని వుంది."

 

    "మీ రాజారావు చదువుతా నన్నాడా?"

 

    రాజారావు అంటే ఒకవిధమైన సదభిప్రాయం, అభిమానం వున్నాయి ఆయనకు.

 

    "ఇంకా సరిగ్గా నిశ్చయించుకోలేదు. ఎకనమిక్స్ చదువుతాడేమో?"

 

    "నువ్వూ అదే చదవవచ్చుగా."

 

    "నాకెందుకనో చదవాలని లేదు."

 

    "ఆ బి.ఏ. పాలిటిక్స్ ఈ వూళ్ళోనే వుంటుంది కదరా" అన్నది మంచంమీద కూర్చున్న తల్లి.

 

    చక్రపాణి గుండెల్లో రాయి పడ్డది. నసుగుతూ "ఉహుఁ వుండదు. హైద్రాబాదు పోవాలి" అన్నాడు.

 

    "ఏమిటీ" అంటూ వులిక్కిపడింది తల్లి. "అమ్మో! హైదరాబాదే! అంతదూరమా? ముష్టిచదువు లేకపోతే పోయిందిగాని నువ్వు నా కళ్ళెదుట లేకుండా వుండటం నేను వప్పను."

 

    అతని తాతయ్య దూరంనుంచే "ఏరోయ్ అబ్బిగా! శుభ్రంగా తిని హాయిగా ఇంటిపట్టున పడివుండాలని లేదేమిటి? హోటలుకూడు తిని ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుందామని వుందా? అసలే ఒట్టి అర్భకుడివి" అంటూ గప్ మని చుట్టపొగ వదిలాడు.

 

    చక్రపాణి నీళ్ళు నమిలాడు. "మరి... నేను... అదే చదువుతాను" అన్నాడు కొంచెం ఆగి.

 

    ఇంకేముంది? కాస్సేపటిలో ఆ ఇల్లు హాహాకారాలతోను, అట్టహాసాలతోను నిండిపోయింది. తల్లి వంటింటిలో చాప పరుచుకొని పెద్ద పెట్టున శోకాలు తీయసాగింది. తాతయ్య ఒక క్షణంలో బ్రతిమాలి, మరోక్షణంలో కేకలేసి వెళ్ళిపోతున్నాడు. చెల్లాయి అన్నయ్యను మంచి మాటల్తో లాలించటానికి  ప్రయత్నించి, విఫలురాలై అలిగి ఒక మూలన మూతిముడుచుకుని కూర్చుంది. తండ్రి గంభీరంగా పచార్లు చేయసాగాడు. చక్రపాణి తలవంచుకుని నిలబడ్డాడు.

 Previous Page Next Page