సాయంత్రం మిత్రులిద్దరూ కృష్ణానదివైపో, మాచవరంవైపో షికారు పోయేవాళ్ళు. చక్రపాణికి స్నేహితుడంటే గౌరవభావం మెండు. జీవితంలో ఎన్నటికైనా అతనే పైకి వస్తాడనీ, తాను ఎందుకూ పనికిరానివాడు అవుతాడనీ ఒక నమ్మకం.
"రాజారావ్! నువ్వెప్పుడూ ఎవర్నీ ప్రేమించవా?" అని అడిగాడు ఒకరోజున.
రాజారావు మందహాసం చేశాడు. "ప్రేమ మన ఇష్టాఇష్టాలను బట్టి వుంటుందా ఏమిటి! భవిష్యత్ ని గురించి నేను జోస్యం చెప్పలేను" అన్నాడు.
"పోనీ నీకు ప్రేమలో నమ్మిక వుందా?"
"ప్రస్తుతం లేనట్లే లెక్క. ప్రేమంటే ఏమిటో తెలియకుండానే చాలామంది స్త్రీ పురుషులు తమని తాము మోసం చేసుకుంటూ సాహచర్యంలో వుంటారు."
అప్పుడు చక్రపాణి స్నేహితుడి చెయ్యి గట్టిగా పట్టుకుని "మనం నిత్యమూ చూస్తుండే సాహచర్యాన్నే ప్రేమగా ఒప్పుకుంటే ఏం?" అని అడిగాడు.
రాజారావు నవ్వి అన్నాడు: "మనం రోజూ చేస్తున్న పని అదే కదా. ఇలా వంచనలో పడే చాలామంది తాము గొప్పవాళ్ళు అయినామని తలపోస్తూ వుంటారు. ప్రేమించామనుకున్నవాళ్ళలో తాము చాలా గొప్పవాళ్ళమనే ఒక భావన వుంటుంది తెలుసా?"
చక్రపాణి కొంచెం ఆగి సిగ్గుపడుతూ "నేను మాత్రం మాలతిని నిజంగా ప్రేమించాను రాజారావ్" అన్నాడు.
"మాలతినా?"
చక్రపాణి తల ఊపాడు.
"ఇహ జీవితాంతం ఆమెను నీ హృదయంనుంచి తుడిచివేయవా?"
"అంతే ననుకుంటాను."
"ప్రతివాళ్ళలో మొదట ప్రేమ ఇలాగే సున్నితంగా ఉంటుంది. కొంతకాలం పోయాక దీన్ని తలుచుకునే మనుషులు సిగ్గుతో చచ్చిన చావవుతారు. కాని... ఎంత త్రోసివేద్దామనుకున్నా ఈ మొదటి అనుభవం తాలూకు ఛాయలుమాత్రం వాళ్ళ మనసుల్ని స్ఫురిస్తూనే వుంటాయి. అదే విచిత్రం."
అతను స్నేహితుని భుజంపైన చేయివేసి చెప్పసాగాడు: "మరో విశేషంకూడా వుంది. మనుషులు కఠినతరమైన పనులు చేస్తూ అందులోంచి ఏదో ఆనందం బాపుకుందామని ఆలోచిస్తారు. లేదూ ఆశపడతారు. సాధ్యాసాధ్యాల విషయంకూడా తలపోయరు. నిజానికి మాలతి ఎవరు నీకు? ఆమెతో ఒక్కమాట కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఆమెను హృదయంలో ఆరాధిస్తూ వచ్చావు. అది బయటకు వ్యక్తం చేసుకోవటంకూడా నీకు చేతకాలేదు. ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. పైగా పెళ్ళి కూడా అయిపోయింది."
చక్రపాణి నివ్వెరపోయి "పెళ్ళా" అన్నాడు.
"అవును. నాకు నిన్ననే తెలిసింది ఈ విషయం. కాని దాచుకోలేక పోయాను. ఆమె నిన్ను గురించి ఆలోచించనుకూడా ఆలోచించదు. హాయిగా భర్తతో కాపురం చేస్తుంది. కొంతకాలానికి పిల్లల్ని కూడా కంటుంది. ఇహ నువ్వు నీకు అందని ఆ అపురూప వస్తువుని గురించి యోచిస్తూ కుమిలిపోతుంటావు."
చక్రపాణికి కళ్ళనీళ్ళు నిండుకొచ్చాయి. గద్గదిక కంఠంతో అన్నాడు "దేముడు నన్ను ఇంత పిరికివాణ్ణి ఎందుకు చేశాడంటావు? నేనెందుకు ఏమీ చేయలేను?"
"కాదు, నువ్వు చేస్తావు ఒకనాటికి. మేమందరం ముక్కుమీద వేలు వేసుకునేటట్లుగా ప్రవర్తిస్తావు."
"నన్ను మాటల్తో తృప్తిపరుద్దామని చూస్తున్నావా?"
"లేదు, కాని ఎవరు సున్నితమనస్కులో - వారి జీవితమే విచిత్ర ప్రభావాలకు గురి అయేది."
"విచిత్ర ప్రభావం. అందులో కావలసినంత నష్టంకూడా వుంది కదా."
రాజారావు ఏదో చెబుదామనుకున్నాడు. కానీ తమాయించుకుని వూరుకున్నాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఊరిచివరకు వచ్చారు. ఆప్రాంతంలో జనసంచారంకూడా ఏమీలేదు. కనుచీకటి పడసాగింది. ఇద్దరూ అక్కడ ఇసుకరాసి వుంటే దానిమీదకుపోయి చతికిలబడ్డారు. ఆ సమయంలో, ఆ బాధలో చక్రపాణికి మిత్రుణ్ణిగురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. "రాజారావ్!" అన్నాడు మంద్రస్వరంతో.
"ఓయ్!"
"నీ జీవితంలో అనుభవాలు కలవా?"
నిజానికి ఈ ప్రశ్న యెన్నడో రావలసింది కాని చాలారోజుల నుంచి అడుగుదామని వున్నా, అతను నొచ్చుకుంటాడేమోనని ఇంతవరకు అడగటానికి సాహసించలేదు చక్రపాణి.
"అనుభవాలంటే నీ ఉద్దేశం..."
"అదే"
"ఉండొచ్చు."
"మరి నాకెప్పుడూ చెప్పావు కావేం?"
"నిజమైన అనుభవాల్లో చెప్పటానికేమీ వుండదు. అకారణంగా మన అనుభవాలు ఇంకొకరి నెత్తిన రుద్దటానికి ప్రయత్నించటం ఒకరకం ప్రకర్ష. స్వార్థంక్రింద వస్తుంది."
"కాని..." అన్నాడు చక్రపాణి సిగ్గుపడుతూ. "నా కందులోంచి తెల్సుకోవాల్సింది చాలా వుందనిపిస్తుంది."
"విన్నాక తెల్సుకోవాల్సింది ఏమీ లేదని తెలుసుకుంటావు, పైగా అవన్నీ వింటే, నీకు నేనంటే అసహ్యం కలగవచ్చు."
"కలగదు."
"ఎంచేత ?"
"నువ్వు ఏంచేసినా అందంగా వుంటుంది. ఎవ్వరూ అసహ్యపడటానికి ఆస్కారంలేదు."
ఒక్క నిమిషం మౌనంగా గడిచింది. చక్రపాణి చేతిలోకి ఇసుక తీసుకొని క్రిందకు ధారగా వదుల్తూ "ఇంక చెప్పు" అంటూ వేగిరపడ్డాడు.
ఎలా చెబుతాడు ఇలాంటి విషయాలగురించి ఎప్పుడుపడితే అప్పుడు? అయినా స్నేహితుడి కోరిక నిరాకరించలేక రాజారావు చెప్పసాగాడు.
తన చిన్నతనం, దుడుకుతనం, అసభ్యమైన అల్లరి, ఏటిదగ్గర కాపలాకాసి ఆడపిల్లల్ని ఏడిపించటం, చుట్టాలతో విచ్చలవిడి,తండ్రి మరణం, తల్లి నిస్సహాయత, ఎవరిదో పెళ్ళికిపోవటం, పెళ్ళికూతురు చెల్లెలు తనను వెంటాడటం, చీకటి, తన మొండిధైర్యం. ఒకసారి వానలో తడుస్తూ తను ఎలాగో పాకలోకి పోయిపడటం, అక్కడ తనలాగే తల దాచుకునేందుకు వచ్చిన ఒక జవ్వనీ. ఇంట్లోవాళ్ళంతా తన్నొక్కక్కడినీ వుంచి తీర్థయాత్రలకు పోయినప్పుడు వంటరితనం, బాధ, దుఃఖం, మున్సబుగారబ్బాయితో కలిసి దుస్సహవాసాలు...